Thursday, June 7, 2018

దశ విధ వాయువులు

ప్రాణమంటే జీవులు బ్రతకడానికి కావలసిన చైతన్య శక్తి. ప్రాణమనే  దాన్ని అర్ధం చేసుకోడానికి, ప్రాణ శక్తిని గురించి తెలుసుకుందాం. జ్ఞానేంద్రియాలు బయటనుండి విషయాలని తెస్తే వాటిని గ్రహించాలంటే, అవి మనస్సుతో సంబంధపడి పడి ఉండాలి. గాఢ నిద్రలో ఉన్నపుడు మనస్సు, జ్ఞానేంద్రియాలూ పనిచెయ్యవు. అప్పుడు మనలను జీవింప జేసే శక్తి ఒకటి ఉంటుంది. అది శ్వాస రూపంలో ప్రాణమని చెప్పబడుతుంది. జీవానికి, శరీరానికీ, ప్రాణానికి పరస్పరం సంబంధం ఉంటుంది. ప్రాణం యొక్క చైతన్యశక్తి వల్లనే మనస్సు బాహ్య విషయాలను గ్రహిస్తుంది. శరీరానికి కండర చలనం ద్వారా చైతన్యాన్ని కల్గించేది ఈ ప్రాణమే.  ప్రాణం బ్రహ్మము యొక్క ప్రకాశం చేత ప్రవర్తిస్తుంది. శరీరంలో ఈ ప్రాణశక్తి 5భాగాలుగా విభజించ బడింది. ముఖ్య ప్రాణం, చేసే పనుల భేదాన్ని బట్టి ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానమని  చెబుతారు. 

    

1) ప్రాణము – ఇది ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించిఉన్న శ్వాశకోశాన్ని(respiration ) జ్ఞానేంద్రియాలని నియంత్రిస్తుంది. మన వాక్కును, మ్రింగటాన్ని(deglutition ), శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుదుంది. ఇది శరీరంలో ఊర్ధ్వచలనం కల్గి ఉంటుందని చెప్పబడింది.

2)  అపానము - ఇది నాభి నుండి అరికాళ్ళ వరకు వ్యాప్తిచెంది అధోచలనం కల్గి విసర్జన కార్యకలాపాలకు తోడ్పడుతుంది. ఉదాహరణకు మల మూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు మరియు శిశు జననము మొదలైన వాటిని నిర్వర్తిస్తుంది.

3) సమానము - నాభి నుంచి హృదయం వరకు వ్యాప్తిచెంది, మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్లు చేసి, ఒంటబట్టడానికి సహకరిస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి కల్గుతుంది.

4) ఉదానము - ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి, శరీరాన్ని ఊర్ధ్వ ముఖంగా పయనింప జేయడానికి ఉపకరిస్తుంది. అంటే మనలోనుండి  శబ్దం కలగడానికీ, వాంతులు చేసుకునేటపుడు బహిర్గతమవడానికీ, మన దైనందిత కార్యాల్లో తూలి పడిపోకుండా సమతులనంగా ఉండటానికి దోహదం చేస్తుంది.

5) వ్యానము - ఇది ప్రాణ, అపానాలను కలిపి ఉంచి, శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. నాడీమండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మన ప్రాణమయ కోశంలో సుమారు 72,000  సూక్ష్మ నాడులున్నట్లుగాను, అవిగాక వాటిని నియంత్రించే నాడీ కేంద్రాలూ (చక్రములు) ఉన్నట్లు పెద్దలు చెబుతారు.


హృదయమున ప్రాణము, గుద స్థానమున అపానము, నాభి ప్రదేశమున సమానము, కంఠ మధ్యమునందు ఉదానము, సర్వశరీరము నందు వ్యానము ఉన్నట్లు పంచ ప్రాణముల స్థాన నిర్ణయం చెప్పబడింది. ఈ ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములనే పంచ ప్రాణములు ; నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయము లనెడి పంచ ఉపప్రాణములు కలసి నాడీ మండల మంతా వ్యాపించి, దేహవ్యాపారములకు కారణమవుతోంది. నాగుడను ఉపవాయువు వల్ల కక్కుకొనుట ; కూర్మమను ఉపవాయువు వల్ల కను రెప్పలు విచ్చుట, మూయుట ; కృకర మను ఉపవాయువు వల్ల తుమ్ముట, దగ్గుట ; దేవదత్తమను ఉపవాయువు వల్ల ఆవులింత చెప్పబడ్డాయి. ధనుంజయ మనే  ఉపవాయువు శరీరమంతా వ్యాప్తించి, మరణానంతరం శరీరం లావెక్కడానికి తోడ్పడుతుంది. ఇలా దశవిధ వాయువులు దశేంద్రియ సంబంధము కల్గి, రాగ ద్వేషాది అనుభవాలకు అధోముఖమవు తున్నాయి.

  

మనస్సును సాధనముగా చేసుకొని, దశ విధ వాయువుల చివర నుండేది, కర్తృత్వ భోక్త్రుత్వ గుణములను కల్గి ఉండేది  బుధ్ధి అనే చిద్బిందువు. ఇదే సర్వ కార్య కారణాలకూ ఆశ్రయమై , వాసనలతో ఇంద్రియములతోను స్థూల సూక్ష్మ కారణ శరీరములనే  ఉపాధుల సంబంధం కల్గి, విషయానుసారముగా సంచరిస్తుంటుంది. ఇలా  పంచ ప్రాణములు పంచ కర్మేంద్రియాలు కలసి క్రియాశక్తి బలము కల్గి ఉన్నాయి. పంచ ఉపప్రాణములు పంచ జ్ఞానేంద్రియాలు కలసి జ్ఞాన శక్తి బలం కల్గి ఉన్నాయి. దశవిధ ప్రాణములు; మనస్సు బుధ్ధి చిత్తము అహంకారములనే అంతః కరణ చతుష్టయంతో కలసి ఇచ్ఛాశక్తి బలం కల్గి  సమస్త ఇంద్రియ వ్యాపారాలకూ కారణంగా ఉన్నాయి.


ప్రాణాయామంలో కుంభకం వల్ల శరీరంలో నాడులన్నీ వాయువుచే పూరించబడి, ఈ దశవిధ వాయువుల యొక్క చలనం వేగవంత మవుతుందని తద్వారా హృదయ కమలం వికసిస్తుందనీ చెప్పబడింది. పంచ ప్రాణాలు, పంచ ఉప వాయువులు కలిపి దశవిధ వాయువులుగా చెప్పబడ్డాయి.            

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...