ప్రపంచంలో ఎక్కువ మంది హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. ఏటా లక్షల సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు భక్తులు. కొండ మీద ఉన్న శ్రీవారికి దర్శించుకొనేందుకు భక్తులు సాధారణంగా నడక మార్గాన, టాక్సీలలో, జీపులలో మరియు బస్సులలో వెళుతుంటారు. చాలా మందికి తెలిసిన దారి అలిపిరి. కానీ ఎంతమందికి తెలుసు అలిపిరి కాకుండా ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయని ??
అలిపిరి - తిరుమల మెట్ల మార్గం !!
తిరుమలలో ఏడు కొండలు ఉన్నాయని తెలుసుకదా ? ఈ ఏడు కొండలు నడకదారి గుండా ప్రయాణిస్తే తిరుమల ఆలయానికి చేరుకోవచ్చు. ఇప్పుడు ఆ మార్గాల గురించే తెలుసుకుంటున్నాం ఇక్కడ.
మీకు తాళ్ళపాక అన్నమాచార్యులు గురించి తెలుసు కదా ? ఆయన గొప్ప వైష్ణవ భక్తుడు మరియు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి, మర్యాద, గౌరవం, ప్రేమ, వాత్సల్యం. ఆయన వ్రాసిన 32 వేల కీర్తనలలో వెవెంకటేశ్వరస్వామి కీర్తనలే ఎక్కువ. అలిపిరి నుండి తిరుమల కొండ ఎక్కిన మొట్టమొదటి భక్తుడు అన్నమాచార్యుల వారే.
అన్నమాచార్య
అలిపిరి నుండి అన్నమాచార్యులు వెళ్లిన దారే మొదటి నుండి గుర్తింపు పొందినది. శ్రీవారి కొండకు చేరుకోవటానికి తక్కువ టైం పట్టే మార్గాలలో ఇది ఒకటి. ఈ దారే కాకుండా తిరుమల చేరుకోవటానికి అనేక దారులు ఉన్నాయి. అయితే సౌకర్యాలు అంతంత్రమాత్రమే.
మొదటి మెట్టు
శ్రీవారికి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి. అలిపిరి అంటే 'ఆదిపడి' అనగా మొదటిమెట్టు అని అర్థం.
అలిపిరి
అలిపిరి మార్గంలో తిరుమల చేరుకోవటానికి గంటన్న సమయం పడుతుంది. దూరం 11- 12 KM లు ఉంటుంది.
రెండవ దారి
తిరుపతి కి 10 KM ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంది. అక్కడికి 5 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. ఈ దారి గుండా మూడు కిలోమీటర్లు నడిస్తే శ్రీవారి ఆలయం చేరుకోవచ్చు. పట్టే సమయం గంట. చంద్రగిరి కోట నిర్మించిన తర్వాత ఈ దారి వెలుగులోకి వచ్చింది.
చంద్రగిరి కి 8 కి.మీ ల దూరంలో శ్రీవారి మెట్టు ఉంది. చంద్రగిరి రాజులు ఈ దారి గుండా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకొనేవారు.
కృష్ణదేవరాయలు చంద్రగిరి దుర్గం లో విడిది చేసి, ఈ మార్గం గుండా శ్రీనివాసుడిని ఏడు సార్లు దర్శించుకున్నాడని స్థానికులు చెబుతారు. ఇప్పటికీ కొండ పైకి కూరగాయలు, పాలు, పెరుగు, పూలు వంటివి ఇదే దారిలో చేరుస్తారు. స్థానికులకు తప్ప ఈ దారి గురించి బాహ్య ప్రపంచానికి తెలీదు.
మూడవ దారి
మూడవ దారి మామండూరు. ఇది తిరుమల కొండకు ఈశాన్యాన కలదు. దీనికి మించిన దారి మరొకటిలేదు అంటారు పూర్వీకులు. కడప, రాజంపేట, కోడూరు, కర్నూలు, ప్రకాశం నుండి వచ్చే భక్తులు ఈ దారి గుండా శ్రీవారి ఆలయం చేరుకుంటారు. విజయనగర రాజులు ఈ దారిలో నడిచే యాత్రికుల కోసం రాతి మెట్లను ఏర్పాటుచేశారు.
నాల్గవ దారి
తిరుమల కొండకు పశ్చిమం వైపున కల్యాణి డ్యాం ... దానికి ఆనుకొని శ్యామలకోన అనే దారి ఉంది. రంగంపేట, భీమవరం వచ్చే భక్తులు ఈ దారిగుండా వెళుతారు.
నాల్గవ దారి
డ్యాం వద్ద నుండి దారి గుండా 3 కిలోమీటర్లు ముందుకు వెళితే ఒక మలుపు వస్తుంది. అక్కడి నుండి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. డ్యాం నుండి తిరుమల మధ్య దూరం : 15 KM.
ఐదవ దారి
కడప బోర్డర్ లో చిత్తూర్ ఎంట్రెన్స్ వద్ద కుక్కలదొడ్డి అనే గ్రామం ఉంది. అక్కడి నుండి తుంబురుతీర్థం --> పాపవినాశనం --> తిరుమల చేరుకోవచ్చు. తుంబురుతీర్థం, పాపవినాశనం మధ్య దూరం 12 KM.
ఆరవ దరి
అవ్వాచారి కొండ/ అవ్వాచారికోన దారి గుండా వెళితే కూడా తిరుమల కొండ చేరుకోవచ్చు. రేణిగుంట సమీపంలో కడప - తిరుపతి రహదారి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం ఉన్నది. ఇక్కడి నుండి లోయలో ఉన్న అవ్వాచారికోన దారి గుండా పడమరవైపుకి వెళితే మోకాళ్ళపర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు.
ఏనుగుల దారి
ఏనుగుల దారి అంటే ఏనుగులు ప్రయాణించిన దారి. పూర్వం చంద్రగిరి శ్రీవారి మెట్టు నుండి అవ్వాచారికోన వరకు దారి ఉండేది. తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు కావలసిన రాతి స్తంభాలను ఏనుగుల గుండా ఈ మార్గానే చేరవేసేవారు.
తలకోన
తలకోన నుండి కూడా తిరుమలకు దారి కలదు. జలపాతం వద్ద నుండి నడుచుకుంటూ జెండాపేటు దారిలోకి వస్తే ... మీరు తిరుమలకు చేరుకున్నట్లే. నడక మార్గం 20 కిలోమీటర్లు.
తిరుమల గురించి మరికొన్ని విషయాలు
తిరుమలలో క్రీ.శ.1387 లో మోకాళ్ళపర్వతం వద్ద మెట్లు నిర్మించారు. విజయనగర రాజులు అలిపిరి - గాలి గోపురం మార్గం 15 వ శతాబ్దంలో వేశారు.
గాలిగోపురం నుండి కిందకు చూస్తే ..
అలిపిరి మెట్లు ఎక్కగానే గోపురం, కుమ్మరి దాసుని సారె, గజేంద్రమొక్షం, గాలిగోపురం వస్తాయి. అలానే ఇంకాస్త ముందుకు వెళితే గాలిగోపురం కనిపిస్తుంది. గాలిగోపురం నుండి కిందకు చూస్తే గోవిందరాజస్వామి, అలివేలుమంగమ్మ దేవాలయాలు , తిరుపతి పరిసరాలు అందంగా కనిపిస్తాయి.
ఆంజనేయస్వామి
గాలిగోపురం లోపలి వెళితే సీతారాముల ఆలయం, హనుమంతుని పెద్ద విగ్రహం, విష్ణుమూర్తి అవతారాలు తారసపడతాయి. దక్షిణంవైపు అడవిలోకి వెళితే ఘంటామండపం, నామాలగవి, అవ్వా చారి కోన కు వెళ్తుంటే అక్కగార్ల గుడి కనిపిస్తాయి. ఆతర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి మందిరం కలదు.
మోకాళ్ళ మిట్ట
మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక సారె పెట్టెలను గమనించవచ్చు. అది దాటితే లక్ష్మీనరసింహ ఆలయం వస్తుంది. అలానే ఇంకాస్త ముందుకు మండపాలను దాటుకుంటూ వెళితే శ్రీవారి ఆలయం కనిపిస్తుంది.
శ్రీవారి మెట్టు
శ్రీవారి మెట్టు శ్రీనివాస మంగాపురం వద్ద కలదు. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీవారు, ఆయన భార్య పద్మావతి ఇక్కడే వివాహం చేసుకొని శ్రీవారి మెట్టు దారిలో కొండ పైకి వెళ్ళి వెలిశారు.
శ్రీవారి మెట్టు
తిరుపతికి శ్రీవారి మెట్టు కు మధ్య దూరం 15 కి.మీ. శ్రీవారి మెట్టు నుండి ఆలయానికి మధ్య 2500 - 2800 మెట్లు ఉన్నాయి. ఇవి ఎక్కటానికి పట్టే సమయం 1-2 గంటలు. ప్రతి 50/100 మెట్లకు నీటి సదుపాయాలు కలవు.
కౌంటర్
శ్రీవారి మెట్టు గుండా వెళితే 1000 వ మెట్టు వద్ద దివ్య దర్శనం టికెట్లు ఇస్తుంటారు. వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్నవి 2000 మెట్ల దగ్గర స్టాంప్ వేసుకుంటే చెల్లుతాయి. 1100 మెట్ల వద్ద శ్రీవారి పాదాలు ఉన్నాయి.
మెట్ల దారిన వెళ్తున్నప్పుడు గుర్తించుకోవాల్సినవి
1. తిరుపతి బస్ స్టాండ్ నుండి ఉచితబస్సు సౌకర్యం ఉంది. మీరు బస్సును అందుకోలేకపోతే జీప్/ కార్ మాట్లాడుకొని వెళ్ళవచ్చు
2. శ్రీవారి మెట్టు కు వెళ్ళే మార్గంలోనే అలిపిరి వస్తుంది. అలిపిరి వద్ద లాకర్ సౌకర్యం ఉంది. శ్రీవారి మెట్టు వద్ద ఆ సౌకర్యం లేదు.
3.మెట్లమార్గం లో తాగునీటి సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. కనుక బాటిల్ తీసుకుపోవాల్సిన అవసరం లేదు. వీలైతే తినుబండారాలను తీసుకొని పోవచ్చు. కొండపైన, ఆలయ పరిసరాలలో ప్లాస్టిక్ వస్తువులు నిషేధం.
వసతి
వసతి ససౌకర్యాలకు తిరుమల లో కొదువలేదు. ఉత్సవాలు, పండుగలు తప్పనిచ్చి మిగితా అన్ని దినాలలో బస దొరుకుతుంది. టిటిడి విశ్రాంతి గదులు, గెస్ట్ హౌస్ లు, సత్రాలు, హోటళ్ళు, లాడ్జీలు లాంటి ఎన్నో వసతులు ఇక్కడ ఉన్నాయి.
గైడ్ తప్పనిసరి
ఈసారి తిరుమలకు వెళ్ళే యాత్రికులు పైన పేర్కొన్న దారుల గుండా వెళ్ళటానికి ప్రయత్నించండి. అయితే వెళ్ళేటప్పుడు గైడ్ లేదా స్థానికుల సహకారం తప్పనిసరి. కొత్త రూట్లు కదా !!
చేరుకోవడం ఎలా ?
అన్ని మార్గాలకు కేంద్ర బిందువు తిరుపతి. కనుక యాత్రికులు తిరుపతి చేరుకొని అక్కడి నుండి ఈ మార్గాలకు చేరుకొని శ్రీవారి ఆలయాన్ని దర్శించండి
No comments:
Post a Comment