Thursday, June 14, 2018

కుమారారామం

పంచారామాలలో 'కుమారారామం'ఒకటి. తారకాసుర సంహారం అనంతరం ఈ ప్రదేశంలో పడిన శివలింగ భాగాన్ని కుమారస్వామి ప్రతిష్టించిన కారణంగా ఈ ప్రాంతం కుమారేశ్వరంగా మారింది. అయితే ఆ తరువాత బౌద్ధుల ప్రాబల్యం కారణంగా ఇది కుమారారామంగా ప్రచారంలోకి వచ్చింది. కాలక్రమంలో అంటే 11 వ శతాబ్దంలో స్వామివారికి చాళుక్య భీముడు ఆలయాన్ని నిర్మించిన కారణంగా ఇక్కడి స్వామిని కుమార భీమేశ్వరుడిగా పిలవడం మొదలుపెట్టారు.

యోగ లింగంగా శివుడు వెలసిన ఈ క్షేత్రం సామర్లకోటలో అంతర్భాగంగా కనిపిస్తుంది. ఇక స్వామివారు 'కుమార భీమేశ్వరుడు'గా ప్రసిద్ధిచెందగా, అమ్మవారు 'బాలా త్రిపురసుందరి'గా పూజలు అందుకుంటోంది. విశాలమైన ప్రాకారాలతో ... నాలుగు ద్వారాలతో ... కోనేటి జలాలతో ... చాళుక్యుల శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించాగానే మనసుకి ఎంతో ఆహ్లాదం ... ఆనందం కలుగుతాయి. దేవాలయం లోపలి ప్రాకారంలో వినాయకుడు ... కాల భైరవుడు ... వీరభద్రుడు ... మహాకాళి ... శనేశ్వరుడు ... నవగ్రహాలు కొలువుదీరు కనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎడమవైపున బాలాత్రిపురసుందరి అమ్మవారు ... కుడి వైపున ఊయల మంటపం కనిపిస్తాయి.

ఇక గర్భగుడిలో రెండో అంతస్తు వరకూ పెరిగిన 14 అడుగుల భీమేశ్వరుడి శివలింగం నయనానందాన్ని కలిగిస్తుంటుంది. నిర్మాణ సమయంలోనే ఈ శివలింగం అంతకంతకు పెరిగిపోతుండటం గమనించి శిల్పులు శివలింగం పైభాగాన శీల కొట్టారనే కథ స్థానికంగా వినిపిస్తూ వుంటుంది. స్వామివారికి ఎదురుగా ఆరు అడుగుల ఎత్తులో నందీశ్వరుడు కూర్చుని ఉంటాడు.

ఇక చైత్ర ... వైశాఖ మాసాల్లో సూర్య కిరణాలు ఉదయం వేళలో స్వామివారి పాదాలను ... సాయంత్రం సమయంలో అమ్మవారి పాదాలను తాకడం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటారు. శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి రోజున భీమేశ్వరస్వామికి ... బాలాత్రిపురసుందరికి వైభవంగా వివాహ మహోత్సవం జరిపిస్తారు. అయిదు రోజులపాటు జరిగే ఈ వేడుకల్లో స్వామివారిని నందివాహనంపై ... అమ్మవారిని సింహవాహనంపై ఊరేగిస్తారు. ఈ కల్యాణాన్ని తిలకించడానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వస్తుంటారు. ఇక కార్తీక మాసంలో కూడా ఇక్కడ పూజలు ... అభిషేకాలు ... ఉత్సవాలు విరివిగా జరుగుతూ వుంటాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తులు పునీతులవుతుంటారు.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...