Monday, June 18, 2018

నాలుగవ ప్రశ్న

            గర్గ్య వంశపు సూర్యుని మనుమడు గార్గ్యుడు నాలుగవ ప్రశ్నను ఇలా అడిగాడు. హే భగవాన్! మానవులలో నిద్రించే ఇంద్రియాలు ఏవి? మెలుకువతో ఉండేవి ఏవి? కలలు కనేది ఎవరు? ఏది సుఖాన్ని అనుభవిస్తుంది? ఇవన్నీ దేనిలో నెలకొని ఉంటాయి లేదా దేని పైన ఆధారపడి సుస్థితమై ఉంటాయి?
            గార్గ్యుని ప్రశ్నలో 5 విభాగాలున్నాయి. ఈ అయిదూ తాత్వికమైన అంశాలతో ముడిపడినవే. పైకి కనిపించినంత సులువైనవి కావీ ప్రశ్నలు. ఇవి లోతైనవి కాబట్టి కొద్దిగా లోతుగా చర్చించాలి. ఆదిమధ్యాంత రహితమైన శాశ్వత సత్యం బ్రహ్మ తత్త్వం మాత్రమే. బ్రహ్మజ్ఞానాన్ని అభిలషిస్తున్న జిజ్ఞాసువు సాధనా చతుష్టయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సాధనా చతుష్టయం అంటే…. ముక్తి మార్గంలో పయనిస్తున్న సమయంలో ఆచరించ దగిన నాలుగు సాధనలను సాధనా చతుష్టయం పేర్కొంటారు. జ్ఞాన మార్గంలో ముక్తి కావాలనుకుంటే అనుభవజ్ఞుడైన ఒక గురువును ఆశ్రయించి అతని పర్యవేక్షణలో సాధనా చతుష్టయాన్ని అనుష్టించాలి. వివేచన లేదా విచక్షణ (Discrimination); వైరాగ్యం (Dispassion);  శట్సంపత్తులు (The six fold qualities of perfection) మరియు ముముక్షత్వము (intense longing for liberation) ఈ నాలుగింటినీ సాధనా చతుష్టయంగా చెపుతారు. వీటిని క్రమశిక్షణతో సాధన చేస్తేనే గాని భగవత్తత్త్వాన్ని సమగ్రంగా అర్ధం చేసుకొని ఆ బాటలో నడవడం కుదరదని పెద్దలు చెపుతారు. సాధనా క్రమంలో ఎన్నో ప్రలోభాలు, అడ్డంకులు ఎదురవవచ్చు. ఆ ప్రలోభాలు, అడ్డంకుల (Distracting factors) యొక్క ఆకర్షణకు లోను కాకుండా పట్టుదలతో ముందుకు సాగినప్పుడే లక్ష్యాన్ని ఛేదించగలం. దానికి అండగా నిలిచేదే సాధనా చతుష్టయ సాధన.
            ఆకలితో ఆహారాన్నన్వేషిస్తూ నడుస్తూ ఉన్నాం. ఎదురుగా ఒక మామిడి చెట్టును చూసాం. ఆ చెట్టుకు బాగా మగ్గిన మామిడి పండు వ్రేళ్ళాడుతూ ఉంది. పండును కోసుకొని తింటే ఆకలి తీరుతుందా లేక ఆ చెట్టుకు ఉన్న ఆకులను లెక్కిస్తూ ఉంటే ఆకలి తీరుతుందా? ఎన్ని ఆకులను లెక్కిస్తూ కూర్చున్నా ఆకలి తీరదు. ఆకలి తీరాలి అంటే ఆ పండును కోసుకొని తినాల్సిందే. అలాగే పుస్తకస్తమైన విజ్ఞానాన్ని ఎంతగా ఆర్జించినా సాధన చేయకుండా ముక్తిని పొందలేము. అయితే సాధన చేయాలి అంటే ముందుగా వాటిని అర్థం చేసుకోవాలి. ఇప్పుడా ప్రయత్నం చేద్దాం.
            వివేచన లేదా విచక్షణ: ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో గుర్తించడమే వివేచన. మనసా వాచా కర్మణా సమర్పణా భావనతో మనల్ని మనం భగవదర్పణ చేసుకోవడం, సమాజ కల్యాణమే భగవదారాధనగా తలచడం, సేవా దృక్ఫథంతో తోటి జీవులకు సేవలందించడం వలన మనలో మంచి చెడుల మధ్య భేదాన్ని గుర్తించగల మానసిక స్థితి ఆవిష్కృత మౌతుంది. దానితో “ఉన్న స్థితి” నుండి “ఉన్నత స్థితి”కి ఎదిగేందుకు అవసరమైన హృదయ కవాటాలు వాటంతట అవే తెరుచు కుంటాయి.  ఈ క్రమంలో మార్పుకు లోను కాని  శాశ్వత సత్యం ఒకవైపు, అశాశ్వత మైన భౌతిక సుఖానికి సంబంధించిన ప్రలోభాలు మరొక వైపు మనసును ఆకర్షిస్తూ తమ వైపుకు లాగుతున్న సమయంలో, శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకుంటూ ఆ మార్గంలో జీవితాన్ని రసమయం చేసుకునేందుకు మనసును సన్నద్ధం చేసేదే విచక్షణ.
            పుట్టుక, మరణం; ఆకలి, దప్పులు; సుఖము, దుఃఖము ఈ ఆరింటినీ సంసారమనే సముద్రంలో ఉవ్వెత్తున లేచిపడే కెరటాలుగా వ్యవహరిస్తారు. ఇందులో పుట్టుక, మరణం ఈ రెండూ భౌతిక శరీరానికి సంబంధించినవి కాగా ఆకలి, దప్పులు ప్రాణశక్తికి అనుబంధ మైనవి. ఇక సంతోషము లేదా సుఖ్హము, దుఃఖము ఈ రెండూ మానసికమైనవి. కాగా ఈ వాసన లేవీ అంటనిది ఆత్మ.
            వైరాగ్యం: ఏ పనిలో కూడా కాముకత లేకపోవడం వైరాగ్యంగా చెప్పుకుంటాము. ఫలితాన్ని ఆశించకుండా నియతమైన కర్మాచరణయే వైరాగ్యం అంటుంది గీత. "కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన" అన్న భగవద్గీత సూక్తి ప్రకారం కర్మాచరణ యందే మనకు అధికార మున్నది. సమత్వ దృష్టిని సాధించడం వైరాగ్యం వల్ల కలిగే ప్రయోజనం. అలాగని నిష్క్రియాపరత వైరాగ్యంకాదు. నిష్క్రియాపరత దోషమంటున్నది భారతీయ సాహిత్యం. శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం ఎప్పుడూ నిజమైన వైరాగ్యాలు కావు. కర్తవ్యాన్ని విస్మరించి, హిమాలయాలలోనో మరెక్కడో ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వారి కంటే గృహస్థాశ్రమంలో ఫలితాన్ని ఆశించకుండా ధర్మాచరణ చేస్తూ జీవించే వాడే ఉత్తముడని చెపుతుంది భారతీయ తాత్వికత. ఇది నెమ్మదిగా అభ్యసన వల్ల అలవడుతుంది.
            షడ్సంపత్తులు: శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ మరియు సమాధానములు ఈ ఆరింటినీ షడ్సంపత్తులుగా చెపుతారు.
            శమ -- కోరికలను, ఆలోచనలను, ఆశలను తగ్గించుకోవడం శమమని అంటారు. క్రమక్రమంగా వాటిని నిర్మూలించుకోవడం అభ్యసన వల్ల వీలవుతుంది.
            దమ -- ఇంద్రియ నిగ్రహణను దమమని అంటారు. "బలవనింద్రియ గ్రామో విద్వాంస మపికర్షతి" ఇంద్రియాకర్షణ చాలా బలీయమైనది. అది విద్వాంసులను సైతం ఆకర్షిస్తుంది. పతనావస్థకు చేరుస్తుంది. కాబట్టి ఇంద్రియాల పట్ల జాగరూకతతో ఉండాలి అని చెపుతున్నారు.
            ఉపరతి -- ఆసాంతంగా, సంపూర్ణంగా సంతృప్తి చెందిన మానసిక స్థితిని ఉపరతి అంటారు. ఇది వివేచన, వైరాగ్యం, శమ, దమములను అభ్యసించడం వల్ల, సాధన చేయడం వల్ల మనలో అయాచితంగా వెలుగు చూస్తుంది.
            తితిక్ష -- క్షమా తత్త్వం. దీనినే ఓరిమి లేదా ఓర్పు అంటాం. సుఖ దుఃఖాలకు అతీతం.గా స్ఫందించే మనో వృత్తిని తితిక్షగా వ్యవహరిస్తారు.
            శ్రద్ధ -- సత్య సంధత యొక్క అస్థిత్వాన్ని గుర్తించడం ఆవైపు పయనించడం శ్రద్ధగా చెప్పబడుతుంది. ఆ క్రమంలో తనపై తనకు చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం; గురువుపై అచంచల విశ్వాసం; సంకల్పించిన కార్యాన్ని నిర్వర్తించే క్రమంలో ఎదురయ్యే ప్రలోభాలకు, అడ్డంకులకు తలొగ్గని ధీ శక్తి. సడలిపోని నమ్మకంతో కూడిన అలుపెరుగని నిరంతర పోరాట పటిమ…. వీటన్నిటి సమ్మేళనమే శ్రద్ధ.
            సమాధానం -- Fixing the Mind or Focusing the Mind on a fixed Goal దీనినే సమాధానం అంటారు. దీనినే A journey towards the heights of ecstasy గా కూడా చెప్పుకోవచ్చు. ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని చేరే క్రమంలో అంగుళం కూడా ప్రక్కకు జరగని దృష్టిని కలిగి యుండడం వల్ల అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయ గలుగుతాము.  ఇది శమ, దమ, ఉపరతి, తితిక్షలపై పట్టు సాధించడం ద్వారా సిద్ధిస్తుంది.
            ముముక్షత్వం: సత్యాన్ని అన్వేషిస్తూ, భగవతత్త్వాన్ని అవగాహన చేసుకుంటూ భౌతిక విషయాలు అభాసగా నిశ్చయించుకొని నిత్య సత్య నిరతిశయ పథాన్ని కోరుతూ ఈ జనన మరణ చక్ర బంధనాల నుండి విడిపోవాలన్న అపారమైన, అమితమైన, బలీయమైన కోరిక ముముక్షత్వం. ఇది నాలుగు మార్గాలలో సిద్ధిస్తుంది. మొదటిది.. శ్రవణం. అంటే వినడం (Listening); మననం (Reflecting); నిధి ధ్యాసనం (Meditating); ఆత్మ సాక్షాత్కారం (Direct Realisation)
            శ్రవణం -- వినడం. ఏది వినాలి. దేనినైతే తెలుసుకోవాలో, ఏది తెలుసుకోవడం ద్వారా సకల కల్యాణాలు సిద్ధించగలవో దానినే వినాలి. అదే వేదం. ఈ వినడం 5 రకాలుగా ఉంటుంది. మొదటిది Ignoring Listening. అక్కడే ఉంటాం కాని పట్టించుకోము. ఇష్టం కాని అతిథి వస్తే ఎలా స్పందిస్తామో అలా వింటాం; రెండవది... Pretending Listening వింటున్నట్లుగా నటిస్తాము కాని వినము; మూడవది Selective Listening మన కవసరమైన వాటిని మాత్రమే వింటాం; నాలుగవది Attentive Listening శ్రద్ధగా వింటాం, అర్థం చేసుకుంటాం. ప్రతి అక్షరమూ మనసులో ముద్రిత మౌతుంది; ఇక అయిదవది చివరిదీ Empathic Listening శ్రద్ధగా వింటూ, ఎదుటివారి దృష్టి కోణం నుండి విషయాన్ని గ్రహిస్తూ, పూర్వ నిశ్చితాభిప్రాయాలకు తావు లేకుండా, “ఉన్నది ఉన్నట్లు”గా తీసుకోవడం. ఇక్కడ Attentive Listening లో అక్షరాలకు మాత్రమే పరిమితమౌతాము. కాని Empathic Listening లో ఆంతర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది.
            మననం -- వినడం ద్వారా తెలుసుకున్న విషయాన్ని నిరంతరం మననం చేసుకోవడం ద్వారా క్రొత్త కోణాలను ఆవిష్కరించుకునే ప్రయత్నం జరుగుతుంది. సందేహాలు మనకు తెలియకుండానే నివృత్తమవుతాయి.
            నిధి ధ్యాసనం -- సందేహ రహితమైన విజ్ఞానంపై ధ్యానం చేయడం ద్వారా అనంత మైన భగవచ్చైతన్యం మనసులో ఆవిష్కృత మౌతుంది. అభ్యుదయ మార్గం అవగత మౌతుంది. అఖండమైన, అనంతమైన ఆనందం స్వంతమౌతుంది.
            ఆత్మ సాక్షాత్కారం -- సమాచారానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం విజ్ఞానంగా మనసులో ఆవిష్కృత మౌతుంది. ఆ జ్ఞానం బోధ చేత పరిపుష్టమౌతుంది. దానిని అవగతం చేసుకోవడం ద్వారా స్పష్టత వస్తుంది. స్ఫష్టత ఆత్మ సాక్షాత్కరానికి మార్గం చూపుతుంది.
            ఈ విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకుంటే మాత్రమే తత్త్వాన్ని అర్ధం చేసుకోగలం. తాత్త్విక చింతనలో ఎప్పుడైనా అక్షరాలతో మాత్రమే అంతర్యాన్ని గ్రహించలేము. వివిధ గ్రంథాలను సమన్వయం చేసుకున్నప్పుడే అపరిమితమైన భగవత్తత్త్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలుగుతాము. ఊహించడానికి కూడా రెండవది లేనటువంటి సర్వవ్యాపకమూ, సర్వశక్తి సమన్వితమూ, సకల జ్ఞానమయమూ అయిన శుద్ధ చైతన్య పరమాత్మ తత్త్వాన్ని "యెఱుక" లోకి తెచ్చుకోవాలంటే, దర్శన చేయాలి. అంటే పైన పేర్కొన్న విజ్ఞానాన్ని ఆకళింపు చేసుకొనడం తప్పనిసరి.
            ఇప్పుడు, గార్గ్యుని ప్రశ్నకు పిప్పలాదుడు ఇలా జవాబిస్తున్నాడు. ఓ గార్గ్యా! సూర్యోదయం సమయంలో సూర్య కిరణాలు ఈ జగత్తంతటా  వ్యాప్తి చెందు తున్నాయి. మరి ఆ కిరణాలు సూర్యాస్తమయం సమయంలో ఎక్కడికి పోతున్నాయి? అంటే మళ్ళీ సూర్య మండలంలోనే ఏక మవుతున్నాయి.  తిరిగి ప్రభాత కాలంలో ఆ కిరణాలే సంవ్యాప్తమయి జగత్తును వెలిగిస్తున్నాయి. అలాగే, ఇంద్రియాలన్నీ కూడా ఇంద్రియాలకు అధిదేవత యైన మనస్సులో ఏకీభావాన్ని పొందుతున్నాయి లేదా మనస్సులో ఏకమవుతున్నాయి. ఈ అవస్థనే నిద్రావస్థ అంటాము. ఈ నిద్రావస్థలో ఇంద్రియాలన్నీ సుప్తావస్థలో ఉంటాయి కనుక దేన్నీ చూడలేము, మాట్లాడనూ లేము, విననూ లేము. అంతేకాదు, పంచేంద్రియ జ్ఞానం సమసిపోవడంతో ఏ విధమైన చేష్టలను చేయలేము. కదలిక కూడ లేని నిరామయ స్థితిలో ఉంటాము.       అలా శరీరం నిద్రావస్థలో ఉన్న సమయంలో కూడా మెలుకుని ఉండేవి ఒక్క ప్రాణాగ్నులు మాత్రమే. ఇంద్రియ సమూహం నిద్రావస్థలో ఉన్నా ప్రాణాలు పని చేస్తునే ఉంటాయి.
అపాన వాయువు గార్హపత్యాగ్ని. వ్యాన వాయువు దక్షిణాగ్ని దీనినే అన్వాహార్య వచనాగ్ని అని కూడా అంటారు.  ప్రాణమే ఆహవనీయాగ్ని అంటాడు, పిప్పలుడు. గృహస్థు ప్రతి నిత్యం అగ్నిని ఆరాధించాలి. ఆ కార్యాచరణలో మూడు అగ్నులు ఉపయోగిస్తారు. ఒకటి దక్షిణాగ్ని, దీనిని వేదికకు దక్షిణభాగంలో ఉంచుతారు. పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. రెండవది గార్హపత్యాగ్ని. ఇది వేదికపై ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది. అన్ని కార్యక్రమాలకు ఇందులోనుండి అగ్నిని తీసుకోవడం జరుగుతుంది. మూడవది ఆహవనీయాగ్ని. ఇది దేవతలకు హోమాదికాలు నిర్వహించే సమయంలో ఉపయోగపడుతుంది.
            వ్యానం... హృదయానికి దక్షిణంగా ఉన్న నాడిలో పని చేస్తుంది కాబట్టి దక్షిణాగ్నితో పోల్చబడింది. అపానం నాడీ వ్యవస్థ అధోభాగంలో అన్ని వేళలలో పనిచేస్తుంది కాబట్టి దీనిని గార్హపత్యాగ్నిగా గుర్తిస్తారు. ప్రాణం అపానం నుండి కలుగుతుంది కాబట్టి దానిని ఆహవనీయాగ్నితో పోల్చారు.
            మనిషిలోని ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలనబడే రెండు ఆహుతులను శరీరమంతటా సమానంగా తీసుకు వెళుతుంది కాబట్టి సమాన వాయువును హోతగా చెపుతున్నారు. మనస్సు యొక్క సూచనలు లేదా ఆజ్ఞల కనుగుణంగా ప్రతి క్రియా శరీరంలో జరుగుతుంది కాబట్టి ఈ యజ్ఞానికి యజమాని మనస్సే. ప్రతినిత్యం యజమానిని అంటే మనస్సును బ్రహ్మ తత్త్వ సంయోజనం చేసేది ఉదాన వాయువే కాబట్టి ఉదానమే యజ్ఞఫలం అంటుందీ ఉపనిషత్తు.
            బ్రహ్మము ఆనందమయము. బ్రహ్మము అనేది అత్యున్నత స్థితి. ఆ స్థాయికి తీసుకు వెళ్ళేది అంటే అత్యున్నత ఆనంద స్థితిని సమకూర్చేదిగా చెప్పుకోవాలి. అది "ఉదానం"గా చెపుతుందీ ఉపనిషత్తు. అది ఎలా జరుగుతుంది?
            సాధారణంగా జీవ చైతన్యం మూడు అవస్థలలో పనిచేస్తుంది. జాగ్రదావస్థ, స్వప్నావస్థ మరియు సుషుప్తావస్థగా వాటిని చెపుతారు. ఇవే కాక వీటికతీతంగా "సమాధి"గా పిలువబడే తురీయావస్థ ఉంటుందంటారు, తత్త్వజ్ఞులు. జ్ఞాత (తెలుసుకునే వాడు) జ్ఞానం (తెలుసుకునే సాధనం) ద్వారా జ్ఞేయాన్ని (తెలుసుకో దగిన దానిని) తెలుసుకుంటాడు. పరమాత్మయే తెలుసుకోదగినది అదే జ్ఞేయం అత్యున్నత మైనది. జిజ్ఞాసువే జ్ఞాత మరియు తెలుసుకునే సాధనమే జ్ఞానం.
            జాగ్రదావస్థలో భౌతిక విషయాలు అవగతమౌతాయి. నిత్య నైమిత్తిక కర్మాచరణ, భౌతిక విజయ సాధన, వ్యవహార శైలి, నిర్వహణా దక్షత లాంటి ప్రాపంచిక విషయాలు జాగ్రదావస్థలో జరిగే ప్రక్రియలు.
            జాగ్రదావస్థలో మనలో నెరవేరని కోరికలు, చెలరేగే ఆలోచనలు, వెలుగు చూచే ఆశలు బలీయమై అనుభవాన్ని ఆకాంక్షిస్తూ మనసు పై సంస్కారంగా లేదా ముద్రలుగా ఏర్పడుతాయి. ఈ సంస్కారాలే స్వప్నావస్థలో కలలుగా అనుభవాన్నిస్తాయి.
            ఏ విషయ వాసనా సంస్కారాదులకు లోను కాకుండానిరామయ స్థితిలో మనసు ఉండిపోవడం సుషుప్తావస్థ.  జాగ్రదావస్థలో కలిగే అనుభూతులు కాని స్వప్నావస్థలో కనిపించే కలలు కానీ సుషుప్తావస్థలో అనుభవంలోకి రావు. సంస్కార రహితమైన మనస్సులో స్ఫష్ఠత కరవై అంతర్గత చైతన్యం అచేతనంగా మిగిలి పోతుంది. ఈ స్థితి నిష్క్రియాపరతలో కలిగే జడత్వ స్థితి కాదు.
            కాగా ఈ మూడు స్థితుల కతీతంగా ఉండే అవస్థను "సమాధి" స్థితిగా చెప్పుకుంటాము. సాధకుడు జాగ్రత్, స్వప్న, సుషుప్తావస్థలలో ఏ ఏ అవస్థలో ఉన్నా శుద్ధ చైతన్య తత్త్వగత అనుభూతిని ఆనందాన్ని నిరంతరం పొందుతుంటాడు. ఫలితంపై ఆశలేకుండా నిత్య క్రియా శీలియై సత్యాన్వేషణలో సాగిపోయే సాధకుడు అనంత చైతన్యాన్ని గుర్తిస్తూ ఆ చైతన్యానికి అనుసంధానమవుతూ తాను నిర్వహించే ప్రతి పనిలో అపరిమితానందాన్ని నిరంతరం పొందుతుంటాడు. ఇదే సమాధి స్థితి. ఈ స్థితిలో జడత్వం ఉండదు నిరంతర చేతనత్వమే పరమావధిగా ఉంటుంది. ధ్యానంలో కలిగే ఈ స్థితికి చాలామంది బంధీలవుతారు. కొందరే ఈ స్థితినీ దాటి అపరిమితమైన బ్రహ్మతత్త్వంలో లేదా పరమాత్మలో లీనం అవుతారని చెపుతారు, వేదజ్ఞులు.
            సంస్కారంగా మనస్సుపై బలపడిన "ఆశ" ఆశయంగా మారడం వల్ల సుషుప్తిలో అస్పష్టంగా, తాత్కాలికంగా ఉన్న ఆనంద స్థితి "సమాధి"లో స్ఫష్టతనూ, శాశ్వతత్త్వాన్ని సంతరించుకొని జ్యోతిర్మయమై ఆనందానుభవాన్ని శాశ్వతం చేసుకుంటుంది.
            ఈ కారణాల వల్ల "ఉదానం" యజమానిని అంటే "మనస్సు"ను బ్రహ్మం అంటే నిరతిశయానందానికి లేదా శుద్ధ చైతన్యానికి దగ్గరగా తీసుకు వెళుతుంది లేదా సాక్షాత్కార మౌతుంది అంటుందీ, ఉపనిషత్తు.
            ఇంద్రియాలన్నీ నిద్రావస్థలోకి జారుకున్న సమయంలో వాటి అధిదేవతయైన మనస్సు స్వప్నావస్థలో తనకంటూ ఒక వినూత్న ప్రపంచాన్ని సృష్టించుకొని అనుభవాల నన్నింటినీ పొందుతుంది. అంటే జాగ్రదావస్థలో తాను చూచినవన్నీ చూస్తుంది, విన్నవన్నీ వింటుంది. అన్ని రకాలైన అనుభూతులనూ పొందుతుంది. వివిధ దశలలో, స్థలాలలో తనకు కలిగిన అనుభవాలను మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుంటూ అనుభవిస్తుంది.  అలాగే తానెన్నడు చూడని ప్రదేశాలను చూస్తుంది. విననిదాన్నీ వింటుంది. అనుభవాలనూ పొందుతుంది. ఈ విచిత్రమైన, అద్భుతమైన కలల ప్రపంచంలో పొందే అనుభవాలకు కారణం నిద్రావస్థలో ఇచ్ఛాశక్తి,  తార్కిక శక్తి పనిచేయకపోవడమే. ఈ కలలకు భాష్యాలు ఎవరు ఎలా చెప్పినా ఒక్కటి మాత్రం సత్యం. అంతశ్చేతనలో విషయాలపై పెరిగిన అనురక్తి మరియు దానిని నిజం చేసుకోవాలనే తపన వల్ల మాత్రమే సుప్తచేతనాత్మకమైన మనస్సు భౌతికంగా పొందలేని అనుభవాలను మానసికంగా అనుభవిస్తుంది.
            జాగ్రదావస్థలో తాను ప్రత్యక్ష్యంగా అనుభవించేందుకు అవకాశం లేని విషయాలను వినడం ద్వారా చదవడం ద్వారా వాటిని అనుభవించాలనే కోరిక కలగడం ఆ కోరిక సంకల్పంగా మళ్ళీమళ్ళీ మననం కావడం వల్ల మనసులో బలోపేత మవుతుంది. అంతశ్చేతనలో ఆ సంకల్పం రూపు దిద్దుకొనడం వల్ల ఆ విషయాలకు సంబంధించిన అనుభవాలను పదేపదే కోరుకోవడం జరుగుతుంది. అలా కోరుకొనడం సూచనలుగా లేదా ముద్రలుగా అంతర్మనస్సులో నాటుకుపోవడం జరుగుతుంది. తద్వారా ఆ  అంతర్ మనస్సుపై స్పందనలు కలుగుతాయి. ఆ స్పందనల కనుగుణంగా అంతశ్చేతనలో ఏర్పడిన భ్రాంతి స్వప్నంలో దర్శనమిస్తుంది. అందులో వైభవమూ కనిపించవచ్చు, ప్రలోభాలూ ఎదురవవచ్చు, అవమానాలూ కలగవచ్చు. కొన్నిమార్లు వాటిని అధిగమించిన అనుభూతి మరికొన్ని మార్లు దానికి బద్ధమైన అనుభూతి కలగవచ్చు.  ఎన్నో భావనలు, అనుభవాలు, అనుభూతులు, శక్తులు, ప్రాకృతిక సౌందర్యచిత్రణలు ఒకటేమిటి స్వప్నంలో మన సంకల్పానుసారం దేనినైనా దర్శించే అవకాశం ఉంటుంది. క్రొత్త ఆలోచనలు, యోజనా ప్రణాళికలు, కల్పనలు, పరిశోధనలు, కళా ప్రక్రియలు ఇలా ఒకటేమిటి ఏదైనా సాధించ గలగడం స్వప్న ప్రపంచంలో సాధ్యమే. భౌతిక ప్రపంచంలో ఆ కలలను సాకారం చేసుకోవడమూ సాధ్యమే. కాకపోతే ఆ అంతర్గత శక్తులను అర్థం చేసుకోవడం, ఆ వైపు నడవడం ముఖ్యం.
            నిద్ర తమోగుణ ప్రభావం చేత కలుగుతుంది. పూర్వ నిశ్చితాభిప్రాయాల కనుగుణంగా పెల్లుబ్బే కోరికలు, ఆలోచనలు, ఆశలు అంతర్మనస్సులో ఆకృతి దాల్చి స్వప్న లోకంలో దర్శనమిస్తాయి. ఇంద్రియాలు నిద్రావస్థలో ఉండి మనస్సు జాగ్రతమై యున్నప్పుడు ఆ మనస్సు తేజస్వంత మవుతుంది. తేజస్సు లేదా కాంతి కారణంగా మానసిక తమస్సు హరింపబడుతుంది. తమస్సు విడిపోవడం వల్ల మనస్సు స్వప్నావస్థలో ఉండదు. ఇంద్రియాలు నిద్రావస్థలో ఉండి మనస్సు శక్తివంతమైతే లేదా కాంతి వంతమైతే ఆనందం అనుభూత మవుతుంది. అందుకే గాఢ నిద్రలో లభించే అపరిమిత ఆనందం ప్రశాంతతను సమకూరుస్తుంది. నిద్రావస్థలో ఉన్న ఇంద్రియాల యొక్క ఆకర్షణ లేమి చేత మనస్సు ప్రలోభాలకు లోను కాకపోవడమే దీనికి కారణం.
            ఎలాగైతే సాయంత్రం కాగానే పక్షులన్నీ తమతమ గూళ్ళు ఉన్న చెట్లవైపుకు పరుగులు దీస్తాయో అలాగే ఇంద్రియాలన్నీ కూడా మనసుతో సహా జీవాత్మను చేరుకుంటాయి.
            పంచభూతాత్మకమైనది శరీరం. భూమి, నీరు, అగ్ని లేదా తేజస్సు, వాయువు మరియు ఆకాశములను పంచభూతాలు అంటారు. అలాగే, పంచ తన్మాత్రలు అనగా శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధములు  పంచతన్మాత్రలుగా చెప్పుతారు. పంచ భూతాలలో సూక్ష్మ స్థితిలో (Subtle state) ఒక్కొక్క దానిలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు (Essential Characteristics ) ఉంటాయి. వాటినే పంచ తన్మాత్రలుగా వ్యవహరిస్తారు.
            పంచ భూతాల నుండి పంచతన్మాత్రలు ఆవిష్కృతమౌతాయి. శూన్యంలో ముందుగా జనించింది ఆకాశము దాని నుండి వాయువు; వాయువు నుండి అగ్ని; తేజస్సు నుండి నీరు; నీటి నుండి భూమి జనించిందని భాగవతం చెపుతుంది. అందుకే ఆకాశానికి శబ్దము; వాయువునకు శబ్దము మరియు స్పర్శము; అగ్నికి శబ్దము. స్పర్శము మరియు రూపము; నీటికి శబ్దము. స్పర్శము, రూపము  మరియు రస స్వభావము; భూమికి   శబ్దము. స్పర్శము, రూపము, రసము మరియు గంధములు గుణములుగా నిలుస్తాయి.
            ఆకాశం నుండి శబ్దము జనించింది. శబ్దాన్ని దేనినుండైతే గ్రహిస్తామో అది శ్రోతం అంటే చెవులు అంటున్నారు. వాయువు నుండి జనించింది స్పర్శ. ఆ స్పర్శను తెలుసుకునే ఇంద్రియం చర్మం అంటున్నారు. తేజస్సు లేదా అగ్ని నుండి జనించింది రూపం. ఆ రూపాన్ని చూసే ఇంద్రియాన్ని కన్నులు అంటున్నారు. నీరు నుండి రసము ఆవిర్భవించింది.  ఆ రసాన్ని గ్రహించే ఇంద్రియం జిహ్వ లేదా రసనము లేదా నాలుక అంటున్నారు. భూమి నుండి జనించేది గంధము. ఆ గంధాన్ని ఆఘ్రాణించే ఇంద్రియం ముక్కు అంటున్నారు.
చర్మము, కన్నులు, చెవులు, ముక్కు, నాలుక ఈ అయిదింటినీ జ్ఞానేంద్రియాలుగా వ్యవహరిస్తారు. అలాగే నోరు, చేతులు, పాదములు, జననేంద్రియము మరియు గుదము (పాయుః) ఈ అయిదింటినీ  కర్మేంద్రియాలుగా వ్యవహరిస్తారు. పంచభూతాలు మరియు వాటిచే నిర్వహించబడే కర్మలు; జ్ఞానేంద్రియాలు మరియు వాటిచే నిర్వహించబడే కర్మలు; కర్మేంద్రియాలు మరియు వాటిచే నిర్వహించబడే కర్మలు; మనస్సూ మరియు అది ఆలోచించే విషయాలు; బుద్ధి మరియు అది తెలుసుకునే విషయాలు; అహంకారం మరియు అది అహంకరించే విషయాలు; చిత్తము మరియు అది జ్ఞాపక ముంచుకునే విషయాలు; కాంతి మరియు అది ప్రకాశింప చేసే విషయాలు; ప్రాణము మరియు అది ధరించే విషయాలు; ఇవన్నీ కూడా గాఢ నిద్రలో జీవాత్మయందు ప్రతిష్ఠితములై ఉంటాయంటుందీ, ఉపనిషత్తు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో జాగ్రదావస్థలో వ్యగ్రమై (తొందరపాటుతో) ఉండే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు వాటివాటి విషయాలకు దూరంగా ఉంటాయి. అలాగే, మనస్సు, బుద్ధి మరియు చిత్తము కూడా వాటి వృత్తులను, చేష్టలను, తెలివిని విడనాడి ప్రశాంతంగా ఉంటాయి.  చివరకు అహంకారం కూడా గాఢ నిద్రలో ఉపశమిస్తుంది.   
            అవ్యక్తంగా పై ప్రక్రియలన్నీ జీవునిలో ఉపశమించడం చేత జీవుడు "అవిద్యా కార్య కలాపాల" చేత కప్పబడకుండా కేవలం "అవిద్య" చేత మాత్రమే కప్పబడి కారణ శరీరంలో యుంటాడు. అవిద్య అంటే అజ్ఞానం. అవిద్యా కార్య కలాపలు అంటే అజ్ఞానం క్రమ్మడం చేత చేసే అసంబద్ధమైన పనులు. ఇక్కడ అన్నీ ఉపశమించి జీవునిలో అవ్యక్తమై (ప్రకటింప బడక) ఉండడం వల్ల వాటి కార్యకలాపాలు ఏమీ ఉండవు. కాని జీవుడు అజ్ఞానం చేత లేదా మాయా చేత కప్పబడి ఉంటాడు కనుక జీవుడు అవిద్య చేత కప్పబడి ఉన్నాడంటుంది ఉపనిషత్తు. గాఢనిద్రలో చేయవలసిన కార్య కలాపాలు ఏమీ లేకపోవడం వల్ల ప్రశాంతత పొందిన జీవుడు ఆత్మకు దగ్గరగా ఉంటాడని చెపుతుంది. జాగ్రదావస్థలో కార్యక్రమాల నిర్వహణవలన ఆ ప్రశాంతతకు దూరమౌతాడని భావన.
            ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన మరొక్క ముఖ్య విషయం ఏంటంటే... ఈ మూడు అవస్థలలో కూడా (జాగ్రత్, స్వప్న, సుషుప్తి) జీవాత్మ జాగ్రతమై ఉంటుంది.
            వేదం భౌతిక శరీరాన్ని ఒక పట్టణంగా వర్ణిస్తుంది. ఆ పట్టణంలోకి ప్రవేశించేందుకు నవ (9)ద్వారాలు ఉన్నాయంటుంది. ఆ నవ ద్వారాలను రెండు కన్నులు, రెండు చెవులు, ముక్కు ద్వారాలు రెండు, మల మూత్ర విసర్జనా ద్వారాలు రెండు మరియు నోరు; అని చెపుతుంది.
            మనలోని ముఖ్య ప్రాణము తనను తాను అయిదు (5) విభాగాలుగా విభజించుకొని ఈ తొమ్మిది అంగాల కార్యనిర్వహణను క్రమబద్ధీకరిస్తుంది. తనకు తానుగా "ప్రాణం" ముఖముపై నిలిచి శ్వాస తీసుకోవడం, వినడం, చూడడం లాంటి ప్రక్రియలను బాధ్యతగా నియంత్రిస్తుంది. "సమానం"గా నాభివద్ద నిలిచి జీర్ణక్రియను వ్యవస్థీకరించి శక్తిని శరీరంలోని అన్ని భాగాలకు క్రమపద్ధతిలో సరఫరా చేస్తుంది. "అపానం"గా నాభికి దిగివ నిలిచి విసర్జనాదికాలను సజావుగా జరిగే విధంగా చూస్తుంది. "వ్యానం" గా ఊర్ధ్వ ముఖంగా నడుస్తూ మరణ సమయంలో జీవుల విముక్తికి సహకరిస్తుంది.  ఈ ప్రక్రియలన్నీ ముఖ్యంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు విరామ రహితంగా, క్రమబద్ధంగా జీవుడు శరీరంలో ఉన్నంత వరకూ జరగ వలసినదే. జీవుడు ఏ అవస్థలో (జాగ్రత్, స్వప్న, సుషుప్తులలో) ఉన్నా ప్రాణవాయువు సదా సర్వ కాలం జాగ్రదావస్థలో ఉండి శరీరాన్ని నడిపిస్తుంది.
            చివరగా, పిప్పలాదుడు అంటున్నాడు.... పంచ తన్మాత్రల కాధారమైన వాడు, అనగా చూచే వాడూ, వినేవాడు, స్పర్శననుభవించేవాడు, వాసనలను గ్రహించేవాడు, రుచి చూచే వాడూ, ఆలోచించేవాడూ, తెలుసుకునే వాడూ ఇలా అన్ని ఉపాధులను నిర్వహించే వాడు ఒక్కడే. అతడే జీవాత్మ. అతనే పురుషుడు. అక్షరమైన అనగా వినాశనము లేని ఆత్మ యందు సంప్రతిష్టితుడై ఉన్నాడు. అతడే పరమాత్మకు ప్రతిరూపమైన జీవాత్మగా తెలుసుకోవాలి. అయితే పరమాత్మకు జీవాత్మకు మధ్య భేదం ఏమిటి? అనే సందేహం రావచ్చు. శ్రీ ఆదిశంకరుల వారు చెప్పినట్లుగా జలాశయాలలో సూర్య బింబ ప్రతిబింబాలకు సూర్యునికి ఉన్న సంబంధమే. అంటే మళ్ళీ వారిరువురూ వేరు వేరనే భావన రావచ్చు. కాని అలా కాదు. నాలుగు గోడల మధ్య ఉండే పరిమితమైన శూన్యానికి లేదా ఆకాశానికి మరియు అనంతమైన శూన్యానికి లేదా ఆకాశానికి ఉన్న సంబంధం ఎలాంటిదో జీవాత్మ పరమాత్మల మధ్య సంబంధమూ అలాంటిదే. ఇక భేదమల్లా వ్యాప్తి చెందగలననే "స్మృతి" "తెలివి" లేదా "యెఱుక" పరమాత్మకు ఉంటుంది జీవాత్మ దానిని సాధించాలి. పరమాత్మ నుండే వచ్చినా “మాయా” ఆవరణం క్రమ్మడం చేత ఆ యెఱుకను కోల్పోతున్నాడు జీవాత్మ.
            ఇంకా పిప్పలాదుడు ఇలా చెపుతున్నాడు! అక్షరమైనది, శరీర రహితమైనది, నీడ లేనిది, రంగు లేనిది, స్వచ్ఛమైనది, పరమోత్కృష్టమైనది ఏదో తెలుసుకుంటే ఆ అక్షర మైన పరమోన్నతమైన తత్త్వాన్ని అవగాహన చేసుకోగలుగుతాము. అదే సర్వజ్ఞత్వము, అదే సర్వమూ, అదే పరమ గమ్యము. మనస్సూ, ఇంద్రియాలు, ప్రాణాలు అన్నీ దేనియందు ఉపశమించి ఉంటాయో ఆ తత్త్వాన్ని అర్థం చేసుకోవడమే జీవుని కర్తవ్యం. దానిని సాధించ గలిగితే ఆ సర్వజ్ఞునిలో ఐక్యం కాగలుగుతాము.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...