Wednesday, June 20, 2018

ఆసనం

ఆధ్యాత్మిక సాధనలో ప్రతి అంశమూ ప్రధానమైందే. అది చిన్నదా పెద్దదా అన్నది సమస్యే కాదు. ఎంత గొప్ప గమ్యమైనా వేసే ప్రతి అడుగూ దూరాన్ని తగ్గించేదే. ప్రతి అడుగూ గమ్యాన్ని చేరువ చేసేదే. అష్టాంగయోగంలో ప్రతి అంగమూ, అంగంలోని ప్రతి అంశమూ చిట్టచివరి అంకమైన సమాధి స్థితిని సిద్ధింపజేసే ప్రయత్నంలో అవసరమైందే. అనుకూలించేదే. యమనియమ అంగాలను సాధాన చేశాక తదుపరి అంగం ఆసనం. మృగచర్మం, దర్భచాప, వస్త్రం లాంటివి ఏర్పరచుకున్న తరవాత సాధకుడి ఆసన భంగిమ, ఆసనస్థితి మరింత ముఖ్యమైనవి.
విషయం ఏదైనా ప్రతి పనికి, ప్రతి సాధనకు ఒక భంగిమ అవసరమవుతుంది. అలాగే ధ్యానసాధనకూ. నిజానికి కొన్ని భంగిమలే మనం ఎన్నుకున్న అంశానికి తగిన అనుకూలతను, అవగాహనను కలిగిస్తాయి. అసలు అలా సహకరించే భంగిమల్నే మనం ఎన్నుకోవాలి. మన ధ్యానసాధనకు అత్యంత ఉపయుక్తమైనది పద్మాసనం. వెన్నుపూస నిటారుగా నిలిపేందుకైనా, అలా నిలబెట్టిన మేరుదండం (వెన్నుపూస) ఎక్కువసేపు నిలిచేందుకైనా ఈ ఆసనం తగినది.
భుజాలను పక్కలకు విరిచి, వదులుగా వదిలేసి, ఛాతీని విస్తరించి ముందుకు పొంగించి, అదే సమయంలో శరీరాన్ని వదులుగా, భారరహితంగా వదిలేసి, శరీరస్పృహను పూర్తిగా విస్మరించే ప్రయత్నానికి పద్మాసనం అన్నివిధాలా అనుకూలమైనది. కుడికాలును ఎడమ తొడమీద, ఎడమ కాలును కుడితొడమీద ఉంచుకుని అరచేతులను కలిపి ఒళ్లో పెట్టుకున్న ఆ భంగిమ సాధకుడి చుట్టూ ఒక ఆధ్యాత్మిక వలయాన్ని నిర్మించినట్లుగా ఉంటుంది. దుష్టశక్తుల్ని ప్రవేశించనివ్వని రక్షణవలయం అది. సాధకుణ్ని శక్తిసమన్వితం చేసే శక్తిమంతమైన ఆరా అది. ఆధ్యాత్మిక భావజాలానికి, సాధనల సంకలనానికి పరిమితమై ఉన్న ఆ స్వయం నిర్మిత వలయం సాధకుడి ధ్యాన సాధనకు ఒక కవచంలా పనిచేస్తుంది.

సాధనతో పరిణతి పెరిగేకొద్దీ అంతరిక్షం నుంచి పొందే చైతన్య కిరణాలను, చిత్‌శక్తి తరంగాలను మన వెన్నుపూసలోని చక్రాలే స్వీకరించి నిక్షిప్తం చేస్తాయంటారు. కుండలినీ శక్తి చలనంలో, ఊర్ధ్వగతి చోదకంలో యాంటెనాలా పనిచేసే వెన్నుపూస నిటారుగా లేకపోతే దివ్యచైతన్య తరంగాలను ఆకర్షించటంలో అది విఫలమవుతుంది. వెన్నుపూస అలా నిలబడాలంటే పద్మాసనాన్ని మించిన ఆసనం లేదు. వజ్రాసనం, సిద్ధాసనం కొంతమేరకు అలా పనిచేసినా అవికూడా పద్మాసనం తరవాతివే. అందువల్లే సాధన ప్రారంభదశ నుంచే గురువులు తమ శిష్యులకు పద్మాసనంతోనే శిక్షణ మొదలుపెడతారు. తదనంతర కాలంలో వయోభారంవల్లో, అనారోగ్యంవల్లో, ధ్యానపారవశ్యంలోనో ఆసనాలు, భంగిమలు మారిపోయినా సాధకుడు ఒక స్థాయి వచ్చేవరకు పద్మాసనాన్ని అనుసరించక తప్పదు.

ఆలయాల్లో చిత్రపటాల్లో దేవతల విగ్రహాలు చతుర్భుజులైనా, అష్టభుజులైనా ఆ భంగిమలు పిరమిడ్‌ ఆకారంలో ఒక వలయానికి లోబడినట్లుగా ఉంటాయి. ఆ విధానం అత్యున్నత స్థితికి, స్థాయికి సంకేతం. ఉత్కృష్టతకు పరాకాష్ఠ.
పద్మాసనంలోని శరీర భంగిమ, చేతుల అమరిక సహజంగానే సాధకుణ్ని ధ్యాన స్థితిలోకి తీసుకువెళతాయి. ఎక్కడా బిగువు ఏర్పడని దేహం, పూర్తిస్థాయిలో సడలించిఉన్న దేహం, దేహ స్పృహ నుంచి విడివడే దిశగా తనకుతాను సిద్ధమవుతుంది. కలిసిఉన్న హస్తాల్లోని సూక్ష్మనాడులు మెదడు ఎడమవైపున ఉండే ఆధ్యాత్మిక కేంద్రానికి అనుసంధానమై లౌకిక స్పృహనుంచి విడివడేలా చేస్తాయి. సహజంగానే ఖేచరీ ముద్ర ఏర్పడే అవకాశమూ ఉంటుంది. నిజానికి ఇదంతా పద్మాసనాన్ని వేసినంత మాత్రాన జరిగేపని కాదు. ఎంతో సాధన కావాలి. అది ఎన్ని సంవత్సరాలో ఎవరూ చెప్పలేరు. అది మన ఆర్తిమీదా,  భగవంతుడి అనుగ్రహం మీదా ఆధారపడి ఉంటుంది. కాకపోతే స్థిర మానసంతో పనిచేసే సాధనలో మొదటి అడుగు ఆసనమే. అది పద్మాసనమే అయిఉండాలి. పద్మాసనాన్ని సాధనచేసి సాధనకు ఉపకరణగా మనం ఎంచుకుంటే మాయా తివాచీలా అది మనల్ని పరంధామానికి చేర్చే అవకాశం ఉంది!

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...