“అశరీరాం వార్తాహారిణి, కర్ణ పిశాచి నమామ్యహం”!!
పూర్వం కృష్ణా జిల్లాలో ఎక్కడో ఒక చిన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెటూరిలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వారికి వ్యవసాయం చేసుకోవడానికి కొన్నిఎకరాల భూములుఉండేవి . ఆ బ్రాహ్మణుడు పాలేర్లని పెట్టుకుని వ్యవసాయం చేస్తుండే వాడు. ఎంతో కొంత వేద పఠనము, జ్యోతిష్యం, ఈ పంచాంగమంతా చూసేవాడు. వాళ్లకి తోచిన సలహాలేవో ఇస్తుండే వాడు. ఆ రోజుల్లో బ్రాహ్మణులకి ఎంతో కొంత వ్యవసాయం చేసుకోవడానికి భూములు ఉండేవి. ఆ బ్రాహ్మణుడి దగ్గర ఒక పాలేరు పని చేస్తుండే వాడు. చాలా మంచి వాడు.
ఒక రోజు ఆ బ్రాహ్మణుడు పొలం పనులన్నీ చూసుకుని ఇంటికి వచ్చిఇంటి బయట ఉన్న ఒక కుక్కి మంచంలో పడుకుని విశ్రమిస్తున్నాడు. కాసేపటికి ఆ పాలేరు పొలం నుంచి వచ్చి అమ్మగారూ! అమ్మగారూ! పని చేసి చేసి పోలంనుంచి అలసిపోయి వచ్చాను. కాస్త మంచి తీర్థం ఇప్పించండి అలాగే మీరు చేసిన గారెలు రెండో మూడో నాకు పెట్టండి అని అడగటం జరిగింది. అప్పుడు ఆ అమ్మగారు వాడికి మంచినీళ్ళిచ్చి, అసలు గారేలేమిటీ? నేను చేయడం ఏమిటీ? ఏం మాట్లాడుతున్నావు నీవు? నేనెప్పుడు గారెలు చేసాను? అని అన్నారు. అమ్మగారూ! మీరు అబద్ధాలు చెప్పుతున్నారు . మీరు మొత్తం 22 గారెలు చేసారు. అందులో రెండు మీరు తిని రెండు మీ పిల్లవాడికి పెట్టారు. ఇంకా మీ దగ్గర 18 గారెలు ఉన్నాయి. 18 ఉన్నాయో లేదో అని కావాలంటే లెక్క చూసుకోండి. నేను నిజం చెప్పుతున్నానో లేదో చూసుకుని చెప్పండి అని ఆ పాలేరు చెప్పటం విని ఆ బ్రాహ్మణుడు ఎంతో ఆశ్చర్య పోయాడు. ఇదేమిటీ వీడు ఇలా వచ్చి ఈవిడ గారెలు చేసింది అని అంటాడు. అసలు సంగతేమిటీ అని కుతూహలంగా జరుగుతున్నదంతా అతను గమనిస్తున్నాడు. అమ్మగారు కూడా తను గారెలు చేసానని వీడికెలా తెలిసింది అని చాలా ఆశ్చర్య పోయారు. తాను చేసిన గారెలు లెక్క పెట్టేసరికి సరిగ్గా పాలేరు చెప్పినట్టే 18 ఉన్నాయి. అవునురా! నీవు చెప్పింది నిజమే. కాని నేను గారెలు చేసానని నీకెలా తెలిసింది? ఏమైనా మంత్రోపాసన చేస్తున్నావా? సంగతేమిటీ ?అని అడిగారు. ఏం లేదమ్మగారూ! నేనేమంత్రం ఉపాసన చేయటంలేదు. రాగానే గారెల వాసన తగిలి గారెలు చేసారని , ఏదో నా నోటికి వచ్చిన సంఖ్య ఏదో నేను చెప్పాను.అంతేనండి అమ్మగారు ఇంకా ఏమి లేదు అని అన్నాడు. అదృష్టం బాగుండి ఆ సంఖ్య సరిగ్గా సరి పోయింది. మంత్రాలు నేనెందుకు చేస్తాను అని చెప్పి తప్పించుకున్నాడు.
ఆ పాలేరేదో దేవతని ఉపాసన చేస్తున్నాడని ఆ బ్రాహ్మణుడు గ్రహించాడు. అతనికి అదేదో తెలుసుకోవాలి అని కుతూహలం కలిగింది. దానితో ఆ పాలేరు వెంట పడి నానా విధాలుగా ప్రశ్నించాడు. ఏరా! నాకా మంత్రం చెప్తావా లేదా నేను కూడా ఉపాసన చేస్తాను అని అంటే అయ్యగారూ! మంత్రమూ లేదు తంత్రమూ లేదు ఊరికే చెప్పాను అని అన్నాడు .లేదు! లేదు! నేను నమ్మను. నీవు ఏదో ఒకటి ఖచ్చితంగా సాధన చేస్తున్నావు నాకు చెప్పాల్సిందే అని ఇరవై నాలుగు గంటలు అతని వెనక పడడం మొదలు పెట్టాడు. ఆ పాలేరుకి విసుగు పుట్టి చివరకి నేను ఒక కర్ణ పిశాచి అనే చిన్న దేవతను ఉపాసన చేసి నా అధీనంలో పెట్టుకున్నాను. నేనేమైనా ప్రశ్నలు అడిగితే ఆ పిశాచం నా చెవిలో జవాబులు చెప్తుంది. సరే! మీరు ఇంత ప్రాధేయ పడుతున్నారు కదా! ఆ దేవతని నేను అడుగుతాను. అయినా మీరు బ్రాహ్మణులు. మీకు ఈ చిన్న దేవత కర్ణ పిశాచి ఎందుకండీ? ఏం చెప్పినా కూడా మీరు వినటం లేదు కాబట్టి నేను కనుక్కుని చెప్తాను అని చెప్పి ఆ పాలేరు వెళ్లి పోయాడు.
ఆ మర్నాడు పాలేరు రాగానే ఆ బ్రాహ్మణుడు పరిగెత్తుకుని వచ్చి ఏం నాయనా! ఏమంటున్నది మీ దేవత? అనగా అయ్యా! నేను కర్ణ పిశాచాన్ని అడిగాను. అయితే ఆ కర్ణ పిశాచి ఇలా అన్నది, మీ దొర గారు పిచ్చి వాడు. అతను మనస్సు లోపలే ప్రతి నిత్యం పగలనక రాత్రనక గాయత్రి మంత్రం జపిస్తూ ఉంటాడు కదా అటువంటి గాయత్రి మహా మంత్రం చదువుతున్న అతని దగ్గరకి నేనెలా రాగలను? నన్ను ఆయన ఎలా ఉపాసన చేస్తాడు? నా మంత్రాలు ఎలా చదువుతాడు? ఆయన దగ్గరకి నేను రాలేకుండా ఉన్నాను. ఆయనకి నేనెంతో దూరంలో ఉంటున్నాను. మరి ఎందుకు మీ పిచ్చి బ్రాహ్మణుడు అంత మంచి మంత్రంతో గాయత్రి మాతని ఉపాసన చేస్తూ నాలాంటి క్షుద్రదేవతని గురించి ఆలోచిస్తున్నాడు పిచ్చా వెర్రా అని ఆవిడ వారించింది. అలా కాదు కూడదు అని అనుకుంటే. నన్ను ఉపాసన చేయాలి అని అనుకుంటే మాత్రం కొన్ని పద్ధతులు పాటించాలి తప్పదు. ముందు వారింటిలో ఉన్న ఆ దేవుని పటాలు, విగ్రహాలు అన్నీ అవతల పారేయాలి. నేను గాయత్రి మంత్రం చదవనని ఆయన ప్రతిజ్ఞ చేయాలి. పొరబాటున కూడా గాయత్రి మంత్రం చదవకూడదు. అలా చేస్తానని కనక ఆయన ఒప్పుకుంటే అప్పుడే నేను అతని వశమవుతాను. అంత వరకు నేను అతని దగ్గరకి రాలేను.
అతనికి కొన్ని గజాల దూరంలో కూడా నేను నిలబడ లేక పోతున్నాను. అంత శక్తివంతమైనది ఆ గాయత్రి మంత్రం అని నీవు వెళ్లి ఆ పిచ్చి బ్రాహ్మణుడికి చెప్పు అని ఆ కర్ణ పిశాచి చెప్పింది అని ఆ పాలేరు చెప్పాడు. అది విని ఆ బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్య పోయాడు. బాబోయ్! గాయత్రి మంత్రానికి ఇంత శక్తి ఉంటుందా? నాకేమీ తెలియదు. వీడు కర్ణ పిశాచిని చెవిలో పెట్టుకుని అన్నీ చెప్తుంటే ఆహా! ఓహో! అని ఏదో అనుకున్నాను. గాయత్రి మంత్రాన్ని చదువుతున్న నా దగ్గరకే ఈ కర్ణ పిశాచి రాలేక పోయినప్పుడు ఇటువంటి చిన్న చిన్న క్షుద్ర దేవతల ఉపాసన చేయటం నాకు తగదు అని లెంపలేసుకుని నాకు నీ కర్ణ పిశాచి మంత్రం అక్ఖర్లేదు. నేను హాయిగా నా గాయత్రి మంత్రాన్నే చేసుకుంటాను అని ఆ పాలేరుకి చెప్పటం జరిగింది. ఇది వాస్తవంగా జరిగిన కథ.
అసలు విషయానికి వస్తే........
జ్యోతిషవిద్యలో అనేక విధానములున్నవి. గణిత, ఫలిత, పరిహారభాగాలను ఔపోశన పట్టి చెప్పేది ఒక విధానం. మంత్రప్రయోగం ద్వారా దేవతా వశీకరణం చేసుకొని గణితంతో సంబంధం లేకుండా చెప్పేది ఒక విధానం. ఈ మంత్రవిధానములో మహామంత్రములు,క్షుద్ర మంత్రములు కలవు. వీటిలో ఎక్కువమంది అభ్యాసం చేసేది కర్ణపిశాచినీ విద్య. తమిళ నాడు,కేరళ,ఒరిస్సా లలో ఈ విద్య ఉంది.
కొండనాలుక కొంత కత్తిరించి తరువాత ఉపదేశం ఇస్తారు. జీవితాంతం కొన్ని నియమాలు పాటించాలి. 40 రోజులు నిష్టగా రాత్రిళ్ళు పిప్పలాదఋషి కృతమైన కర్ణపిశాచినీ మంత్రాన్ని లక్ష జపించాలి. తరువాత విభీతకి సమిధలతో హోమం చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. ప్రతిరోజూ దేవతకు తాను తినేఆహారంలోంచి కొంత నైవేద్యం పెట్టాలి.అప్పుడు ఆ కర్ణపిశాచి చెవిలో అన్నీ విషయాలు చెబుతుంది.
ఇటువంటి మంత్రవిద్యలు అనేక రకములు ఉన్నవి. స్వప్నేశ్వరి, స్వప్నవారాహి, వటయక్షిని, ఉన్మత్తభైరవం, ఉచ్చిష్టగణపతి ఇత్యాది.
K.P System ఆద్యుడు ప్రొఫెసర్ కే.యస్. కృష్ణ మూర్తి గారు ఉచ్చిష్టగణపతి ఉపాసకుడు. జరగబోయే విషయాలు నిమిషాలు సెకండ్లతో సహా సరిగ్గా చెప్పగలిగేవాడు.ఈయన విమానంలో శ్రీలంకకు పోతున్నప్పుడు విమానం ఎన్ని గంటలకు శ్రీలంకకు చేరుతుందో చెప్పమని విమానంలో ప్రయాణం చేస్తున్నవారు అడిగారు. కృష్ణమూర్తిగారు ఒక టైము చెప్పాడు. వాళ్లు ఎగతాళి చేసి,విమానం సరియైన సమయానికే ప్రయాణం చేస్తోంది. మీరు చెప్పినది తప్పు అన్నారు. కాని కొద్దిసేపటికే ఏదో వాతావరణ కారణాలవల్ల ఆలస్యమై సరిగ్గా కృష్ణమూర్తిగారు చెప్పిన సమయానికి ఎయిర్ పోర్టులో దిగింది. ఇటువంటివి అనేకం ఆయన మంత్రసిద్ధి మరియు జ్యోతిషజ్ఞానం వల్ల చెప్ప గలిగాడు.
బీ.వీ.రామన్ గారు కూడా చిన్నప్పుడు కర్ణపిశాచినీ సాధన కొంతకాలం చేసినట్లు ఆయన జీవితకథలో రాసుకున్నారు. ఈసంగతి తెలిసి ఆయన తాతగారైన ప్రొఫెసర్ సూర్యనారాయణరావు గారు మందలించి ఆ సాధనను ఆపించారు. మహామంత్రమైన గాయత్రిని నిత్యము జపించే వారికి ఇటువంటి క్షుద్రమంత్రముల అవసరం ఉండదు. అందువల్ల తర్వాత ఆయన గాయత్రిని మాత్రమె జపించేవారు.
క్షుద్రమంత్రములు త్వరగా సిద్దిస్తాయి. కాని వాటివల్ల తరువాత హాని కలుగుతుంది. సాత్వికములైన మహా మంత్రములు త్వరగా సిద్దించవు. కాని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాయి. హాని కలిగించవు. స్వల్ప ప్రయోజనముల కోసం అటువంటి క్షుద్ర మంత్రముల జోలికి పోవటం మంచిది కాదు. కాని అట్టి విద్యలు ఉన్న మాట వాస్తవమే.
Chittiboynaramesh
ReplyDelete