Saturday, June 23, 2018

వేదమంత్రాలన్నింటికీ తల్లి.. గాయత్రి

వేదమంత్రాలన్నింటికీ తల్లి.. గాయత్రి. ఒక్కో పాదంలో ఎనిమిది అక్షరాలు చొప్పున మూడు పాదాల్లో ఇరవై నాలుగు అక్షరాలు ఉండే మంత్రం ఇది. అందుకే దీనిని ‘త్రిపదగాయత్రి’ అంటారు. ఒక్కొక్క పాదం ఒక్కొక్క వేదం తాలూకూ సారం. అధర్వణ వేదానికి వేరే గాయత్రి ఉన్నది. ఆ గాయత్రిని పొందడానికి ప్రత్యేకంగా ఉపనయనము చేసుకోవలసి ఉంటుంది. త్రిపద గాయత్రి ఋగ్యజస్సామ వేదాల సారం. ఎంతటి కష్టకాలంలోనైనా సరే గాయత్రీ మంత్రాన్ని కనీసం పదిసార్లయినా జపించాలి. నిత్యం ముమ్మారు సంధ్యావందనం చేయాలి. ఉదయ సంధ్యలో జీవులన్నీ నిద్రలేచి మనసు ప్రశాంతంగా ఉండి ఏకాగ్రతకు అనువుగా ఉంటుంది. పగలంతా శ్రమ పడిన జీవులు సాయంకాలం ఇల్లు చేరి ప్రశాంతతను పొందుతాయి. సూర్యుడు నడినెత్తిన చేరిన సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ఈ సమయాలలో వరుసగా గాయత్రి, సావిత్రి, సరస్వతీ దేవతలను ధ్యానించాలి. ఉదయం విష్ణుప్రధానమైనది. మధ్యాహ్నం బ్రహ్మస్వరూపిణిగానూ, సాయంత్రం శివస్వరూపిణిగానూ గాయత్రిని ధ్యానించాలి.

ఈ మూడు కలిసి సమిష్టి గాయత్రి. గాయత్రి అన్ని వైదిక మంత్రాల శక్తులనూ కలిగి ఉన్నది. ఇది మిగతా మంత్రములకు శక్తినిస్తుంది. గాయత్రి అనుష్ఠానం చేయకుండా మరి ఏ ఇతర మంత్రాన్ని జపించినా అవి ఫలితాన్నీయవు. సంధ్యావందనంలో గాయత్రీ జపం, అర్ఘ్యత్రయ ప్రదానం ముఖ్యమైనవి. మిగతావన్నీ అంగాలు. లేవలేని స్థితిలో కూడా కనీసం అర్ఘ్యత్రయ ప్రదానం, కనీసం పదిసార్లయినా గాయత్రీ జపం చేయాలి. ఈ రెండే ముఖ్యమైనవి కాబట్టి, మిగతావి వదిలేస్తే కాలక్రమంలో ఈ రెండూ కూడా వదిలేస్తాము. అందుకే సంధ్యావందనం విడువకుండా సకాలంలో చేయాలి. మహాభారత యుద్ధంలో సంధ్యాకాలంలో యుద్ధంలో ఉండవలసి వచ్చిన వీరులు, సకాలంలో మన్నుతో అర్ఘ్యమిచ్చారు. ఎవరికైనా విపరీతమైన జ్వరం వచ్చి సంధ్యావందనం చేయలేకపోతే.. వారికి పరిచర్య చేసేవారు వారి తరఫున సంధ్యావందనం చేసి ఆ జలాన్ని తీర్థంగా ఇవ్వాలి. జనన మరణ చక్రం నుంచి దాటించే శక్తిమంతమైన సాధనం.. గాయత్రీ మంత్రం.
 
             - చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వామి



ఈ రోజు ఏకాదశి - స్వాతీ నక్షత్రం(నృసింహస్వామి జన్మ నక్షత్రం) - గాయత్రీ జయంతి
సందర్భముగా

శ్రీగాయత్రీ మాత విశేషాలు- మంత్రార్థం;

బ్రహ్మ పురాణంలో శ్రీగాయత్రీ మంత్రార్థం ఈ కింది విధంగా చెప్పబడింది.

ఓం - ఓంకారం సర్వమంత్రాలకు మూల మంత్రంగా చెప్పబడింది.

భూః - నుండి పృధీలోకం,

భువః - నుండి అంతరిక్షము,

స్వః - నుండి స్వర్గ లోకము,

తత్‌ - నుండి తేజస్సు (అంటే అగ్నిదేవత)

సవితుః - సవిత అంటే ఆదిత్యుడు

వరేణ్యం - అన్నవరేణ్యం (అంటే ప్రజాపతి)

భర్గః - సర్వదేవాత్మకమైనది

దేవస్య - దేవుడైనవాడే పురుషుడు (ఈతడినే విష్ణువు అంటారు)

ధీమహి - ఐశ్వర్యం (ఐశ్వర్యమంటే మహేశ్వరుడు)

ధియో - ప్రాణము (ఏదైతే ప్రాణమో అదియే వాయువు)

యః - ఆధ్యాత్మికము

నః - పృథ్వీ

ప్రచోదయాత్‌ - ఈ లోకంలో కోరికలు కలిగి ఉండటమే

ప్రచోదయాత్‌ అవుతోంది.

గాయత్రీ మంత్రంలోని ఇరవై నాలుగు శక్తులు;

1. తత్‌, 2. స, 3. వి, 4. తుః, 5. వ, 6. రే, 7. ణ్యం, 8. భ, 9. ర్గః, 10. దే, 11. వ, 12. స్య, 13. ధీ, 14. మ, 15. హి, 16. ధి, 17. యో, 18. యో, 19. నః, 20. ప్ర, 21. చో, 22. ద, 23. యా, 24. త్‌.

 గాయత్రీ మంతంలోని ఇరవైనలుగురు దేవతలు, వారి చైతన్యశక్తులు ఈ విధంగా వుంటాయి.

1. వినాయకుడు : సఫలత్వశక్తికి అధిపతి ఈయన. అందుకనే ప్రతి కార్యంలోనూ తొలి పూజలు అందుకునేది ఈయనే అన్న విషయం అందరకూ విధితమే. విఘ్ననాయకుడైన వినాయకుడు బుద్ధినీ, జ్ఙానాన్నీ ప్రసాధిస్తాడు.

2. నృసింహ భగవానుడు : పరాక్రమ శక్తికి ఈయన అధిపతి. పురుషార్థ, పరాక్రమ, వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే.

3. విష్ణుదేవుడు : పాలనాశక్తికి అధిష్ఠాత అయిన విష్ణుదేవుడు సకలప్రాణ కోటికి జీవరక్షకుడు. సర్వజీవులనూ రక్షించటం ఈయన పని.

4. శివదేవుడు : సకల జీవులకూ ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కల్యాణ శక్తులనూ ప్రసాదించి అందరనూ రక్షిస్తుంటాడు ఈయన.

5. కృష్ణ భగవానుడు : యోగ శక్తికి అధిష్ఠాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్ఠలను, ఇంకా వైరాగ్య, సత్‌జ్ఞాన, సౌందర్య, సారస్వతాదులను ప్రసాదిస్తాడు.

6. రాధాదేవి : ఈమె ప్రేమశక్తికి అధిష్ఠాత్రి. భక్తులకు నిజమైన ప్రేమ భావాన్ని కలుగజేసి అసూయా ద్వేష భావాలను దూరం చేస్తుంది.

7. లక్ష్మీదేవి : ధనవైభవ శక్తులకు అధినేత్రి అయిన ఈమె సకలలోకానికీ ఐశ్వర్యం, సంపద, పదవి, వైభవం, ధనం, యశస్సులను పుష్కలంగా అందిస్తుంది.

8. అగ్నిదేవుడు : తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం, శక్తి, తేజస్సు శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు.

9. ఇంద్రదేవుడు : రక్షాశకి్తి అధిష్ఠాత అయిన ఇంద్రదేవుడు అనారోగ్యాల నుండి, శతృభయాల నుండి, భూత ప్రేతాదుల నుండి మనలను రక్షిస్తాడు.

10. సరస్వతి : విద్యను ప్రసాదించేది సరస్వతీమాత. ఈవిడ జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని ప్రసాదిస్తుంది.

11. దుర్గాదేవి : దమనశక్తికి అధిష్ఠాత్రి. అన్ని బాధలనూ తొలగించి, శతృవుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది.

12. హనుమంతుడు : నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతులవారు. తన ఉపాసకులకు, భక్తులకు, భక్తి, నిష్ఠ, కర్తవ్య పరాయణతత్వం, బ్రహ్మచర్య పాలనాశక్తి వంటి వాటిని ప్రసాదిస్తాడు.

13. పృథ్వీదేవి (భూమాత) : ధారణాశక్తికి అధినేత్రి ఈవిడ. సకల ప్రాణకోటికి క్షమాశీలత్వాన్ని, ధైర్యాన్నీ, దృఢత్వాన్నీ, నిరంతరత్వాన్నీ ప్రసాదిస్తుంది.

14. సూర్యదేవుడు : ప్రాణశక్తికి అధిపతి అయిన ఈయన ఆరోగ్యాన్నీ, సుదీర్ఘజీవనాన్నీ, ప్రాణశక్తినీ, వికాసాన్నీ, తేజస్సునూ ప్రసాదిస్తాడు.

15. శ్రీరాముడు : ధర్మం, మర్యాద, శీలం, సౌమ్యత, మైత్రి, ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక అయిన మర్యాదాశక్తికి అధిష్ఠాత ఈయన.

16. సీతాదేవి : తపశ్శక్తికి అధిష్ఠాత్రీ దేవి సీతామాత. నిర్వికారంగా, పవిత్రభావంతో సాత్వికంగా, వివిధ అనన్య భావాలతో తన భక్తులను తపోనిష్ఠునులుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రతి ఒక్కరినీ ప్రేరేపించేదీమె.

17. చంద్రదేవుడు : శాంతి శక్తికి అధిష్ఠాత. చింత, శోకం, క్రోధం, మోహం, లోభం వంటి మానసిక వికారాలు కలుగుతుంది. వాటిని అణిచివేసి శాంతిని ప్రసాదిస్తాడు ఈయన.

18. యమదేవుడు : కాలశక్త్యాధిష్ఠాత ఈయన. మృత్యువుకు భయపడకుండా సకల జనులను సమాయత్తం చేసే పురుషుడు, స్ఫూర్తి జాగరూకతలను ప్రసాదిస్తాడు.

19. బ్రహ్మదేవుడు : సకల సృష్టికి అధిష్ఠాత అయిన ఈయన సకల జనులకు శక్తిని ప్రసాదిస్తాడు.

20. వరుణదేవుడు : భావుకత్వాన్ని, కోమలత్వాన్ని, దయాళు త్వాన్ని, ప్రసన్నతను, హృదయంలో ప్రాడుర్బవింప చేసి ఆనం దాన్ని అందిస్తాడు.

21. నారాయణుడు : ఆదర్శశక్తికి అధిష్ఠాత అయిన నారాయణుడు దివ్య గుణాలను, ధర్మ స్వభావ నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు.

22. హయగ్రీవ భగవానుడు : సాహసశక్తికి అధిష్ఠాత ఈయన. ఉత్సాహాన్నీ, సాహసాన్నీ, వీరత్వాన్ని, శౌర్యాన్ని ప్రసాదిస్తాడు.

23. హంస దేవత : వివేక శక్తికి అధిష్ఠాత్ర ఈమె. హంస యొక్క క్షీరవీరవివేక జగత్‌ ప్రసిద్ధమైనది. సత సద్వివేకాన్నీ, సత్సంగతినీ, యశస్సంతోషాది గుణాలనూ ఈదేవత ప్రసాదిస్తుంది.

24. తులసీదేవి : సేవాశక్తికి అథిష్ఠాత్రి. సత్‌ కార్యాలలో ప్రేర

ణ, ప్రాణిమాత్రులను సేవింఆలన్న ప్రవృత్తి, ఆత్మశాంతి, పరదుఃఖ నివారణ వంటి ఫలాలను ఈ దేవత ప్రసాదిస్తుంది.

 శ్రీ గాయత్రీదేవి మహత్మ్యం;

వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రీ మంత్రమేనన్న విషయం అందరకూ తెలిసినదే. గాయత్రీ మహామంత్రానికి వ్యాఖ్యానరూపంలో ఈ మహాకార్య రచన జరిగిందని అంటారు.

ఓమ్‌ భూర్భువ స్వః

ఓమ్‌త త్సవితుర్వరేణ్యమ్‌

భర్గో దేవస్య ధీమహి

ధియో యోనః ప్రచోదయాత్‌

ఇదే గాయత్రీ మూలమంత్రం. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు.

త్రికాలాలోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం, సంకల్పబలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రీ దేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షరసత్యం.


హిందూధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ, వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగువేదాలలో గాయత్రీతో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెబుతాడు. ప్రతినిత్యం నియమనిష్ఠలతో గాయత్రిని చేయలేని వారు గాయత్రీమంత్రాన్ని త్రికాలాలలోనూ పదిసార్లు చొప్పున జపిస్తే చాలా మంచిది. ఏ పనిలో ఉన్నప్పటికీ (కార్యాలయంలో ఉన్నప్పటికీ) చేస్తున్న పనిని కాసేపు ఆపి, కాళ్ళకు ఉండే పాదరక్షలను వదిలి పెట్టి ఈ మంత్ర జపం చేయవచ్చు.

గాయత్రీని జపం చేస్తే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. గాయత్రీ మంత్రంతో పాటుగా ప్రతి ఒక్కరూ ‘ఓం నమో గాయత్రీ మాత్రే’ అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే తప్పక సత్ఫలితాలను పొందుతారు. శ్రీగాయత్రీ మాత అనుగ్రహం తప్పక లభిస్తుంది.

బ్రాహ్మీ ముహూర్తకాలంలో ప్రకృతిని చేతనాశక్తి పరుచుకుంటున్నవేళ, నిర్మల నదీ తరంగాలు వేదనాదంలా తరంగించే వేళ అపూర్వ తేజోవిరాజితుడైన మునిసత్తముని కంఠంలో నుండి వెలువడిన సుస్వర మంత్రఝరి, సృష్టి ఉత్పత్తి, వర్తన, పోషనలను నిర్దేశించే అద్భుత చంధోతరంగం గాయత్రీమంత్రం. ఆ ఋషి సత్తముడు మరెవరో కాదు. సృష్టికి ప్రతిసృష్టి చేసిన అపూర్వ తపోబల సంపన్నుడు విశ్వామిత్ర మహర్షి. ఆ మహాఋషి తపశ్శక్తిలోంచి వెలువడిన మంత్రం గాయత్రీ మంత్రం.

గాయత్రి అంటే...

ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది. వెంటనే విధాత వద్దకు వెళ్లి గాయత్రీ తత్వాన్ని తెలుపమని వేడుకోగా, ‘నా స్ఫురణమాత్రంగా ఏ చైతన్యశక్తి ఉత్పన్నమయిందో, దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు. దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు. నానుండి అగ్ని, అగ్ని నుండి వాయువు, వాయువు నుండి ఓంకారం, ఓంకారంతో హృతి, హృతితో వ్యాహృతి, వ్యాహృతితో గాయత్రి, గాయత్రితో సావిత్రి, సావిత్రితో వేదాలు, వేదాలతో సమస్త క్రియలు ప్రవర్తితమవుతున్నాయి’ అని బ్రహ్మ తెలియజేశాడు.

అన్ని వేదాలసారం శ్రీ గాయత్రీ మంత్రం

సహస్ర పరమాం దేవీం శతమధ్యాం దశావరాం

సహస్ర నేత్రాం గాయత్రీం శరణ మహం ప్రపద్యే

గాయత్రి మంత్రం అన్యమంత్రాలలోకెల్లా శ్రేష్ఠమైనది. ‘న గాయత్య్రా నరం మంత్రం న మాతుః పరదైవతమ్‌’ అంటే, - తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం లేదు.

‘గయాన్‌ త్రాయతే ఇది గాయత్రీ’ - శంకరుని భాష్యం ప్రకారం ప్రాణాన్ని రక్షించేది గాయత్రి. గాయత్రి అంటే ఒక స్వతంత్రమైన దేవి, దేవతకాదు. పరబ్రహ్మ, పరమాత్మల క్రియాభాగం గాయత్రి. బ్రహ్మయే గాయత్రి, గాయత్రే బ్రహ్మమని శతపధ బ్రాహ్మణం చెబుతోంది.

పరమశివుడు బ్రహ్మానందంతో తన ఢమరుకంతో చేసిన 24 ధ్వనులే శ్రీగాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు. ఈ 24 అక్షరాలు 24 దైవిక శక్తులకు ప్రతీకలు. వీటికి 24 పేర్లు ఉన్నాయి. వీటిలో 12 వైదిక మార్గాలు కాగా, 12 తాంత్రిక మార్గాలు. ఈ 24 అక్షరాలు నివాసం ఉండే 24 దైవశక్తులు ఆయా పేర్లతో పూజింపబడతాయి.

--------సేకరణ సూర్య పత్రిక   -- సి.యస్‌. రామకృష్ణ  గారికి నమస్కారములు

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...