Saturday, July 29, 2017

🌹🙏గుప్పెడుబియ్యం🌹🙏

శ్రీ కంచి కామ కోటి పీఠాధిపతులలో, నడిచే దైవం గా నిండు నూరు సంవత్సరములు భూమి పై నడయాడిన శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతీ మహారస్వాముల వారి మనోరధం నుండి ఉద్భవించిన విశేష పధకం 'గుప్పెడు బియ్యం'!

1962 వ సంవత్సరంలో చైనాతో యుద్ధం సందర్భంగా, మన సైనికదళాలకు ప్రతి ఇంటినుండి గుప్పెడు బియ్యం తీసి సేకరించి పంపాలన్న స్వామి వారి ఆదేశం ఆ నాటి పరిస్ధితులలో భారత సైనికులలో ఎంతో ధైర్యాన్ని నింపింది!

ప్రతీ దినమూ వంట చేసేటప్పుడు ఒక గుప్పెడు బియ్యం తీసి, వేరేగా ఉంచి, నెల కాగానే అది ధార్మిక సంస్ధల ద్వారా అన్నార్తులకు చేరాలన్నది తదుపరి ఆదేశమైతే, ఇప్పటి మన జగద్గురువులు  శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిచ్చిన ఆదేశమైతే, అవి కంచి మఠం ఆధ్వర్యంలో నడుస్తున్ఙ బాలికల 'సంప్రదాయ' పాఠశాలలకు చేర్చాలన్న మహా సంకల్పం!

ఇక గుప్పెడు బియ్యం అన్న మాట వినగానే, మనలాంటి సామాన్యులకు వచ్చే మొట్టమొదటి ఆలోచన ఏంటంటే, గుప్పెడు బియ్యం ఎంతకాలం అయితే ఒక కేజీ బియ్యం అవుతాయి, కావాలంటే ఓఅయిదు కేజీలు కొనిచ్చేస్తే పోతుందిగా అని! అదే అల్పులకి, మహానుభావులకి ఉన్న ఆంతర్యం!

ఈ విషయంలో మహాస్వాముల వారి ఆంతర్యాన్ని వివరించే చిరు ప్రయత్నం చేస్తాను!

అన్ని దానముల కన్న అన్నదానం మిన్న ! దానం అనేది బలవంతంగానో లేదా అన్యమనస్కంగానో, తప్పని సరిగానో చేయరాదు. భక్తి తో, శ్రద్ధగా, ప్రయత్న పూర్వకంగా, ఆర్తితో, ప్రతిఫలాపేక్ష లేకుండా, కీర్తి కాంక్ష లేకుండా చేసేది అసలైన దానం!

భోజనము వండే సమయంలో ఒక పిడికెడు బియ్యం ప్రక్కన ఉంచి సేకరించాలి అంటే, మనం  అన్నం వండే సమయంలో, మడిగా, శుచిగా, దైవ ధ్యానం చేస్తూ వంట చేయడమన్నది సాంప్రదాయం! ఆ సమయంలో మనసు నిష్కల్మషంగా, నిర్మలంగా సాత్విక భావంతో ఉంటుంది. ఆ సమయంలో  దానం కోసం, వేరేగా ఉంచే ఒక గుప్పెడు బియ్యమైనా, అందులో దైవ శక్తి నిబిడీకృతమై అది మహాప్రసాదమై, మహా సారవంతమై,  శక్తివంతమౌతుంది. సరిగ్గా అటువంటి దానితో వండిన భోజనం తిన్న సైనికుడైనా, అతిధి వంటి అన్నార్తి అయినా శక్తిమంతమవడం వల్ల జాతి శక్తి మంత మౌతుందని మహా స్వాముల వారి ఆదేశానికి అంతర్లీనపు అర్ధం !

శ్రీ విష్ణు పురాణం లో ఈ భోజనం విషయంలో అతిధులకు ఎలా సేవ చేయాలి, గృహస్ధు ఎలా భోజనం చేయాలి అనే అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది.

దత్త్వా తు భక్తం శిష్యేభ్యః క్షుధితేభ్యస్తధాగృహీ!
ప్రశస్తశుద్ధపాత్రే తు భుంజీతా కుపితో నృప!!

గృహస్ధుడు అన్నం శిష్యులకూ, కడకు ఆకలిగా ఉన్నవారికీ పెట్టి, మంచి పరిశుద్ధ పాత్రలో కోపం లేకుండా భోజనం చేయాలి!!

ఈ రోజులలో ఇంటికి వచ్చే అతిధులు అందులోనూ,  అర్హులైన అతిధులకు భోజనం పెట్టే పరిస్ధితులు లేవు!

ఈ సందర్భంగా చాలామంది చేసే ఒక తప్పుని ప్రస్తావిస్తాను.

నేను ఎప్పుడూ దానం చేస్తాను, అందుకే వారి కోసం ఒక బస్తా బియ్యం 'వేరే' గా తెప్పిస్తాను అని గొప్పలకి పోయే వారు, అవి చవకరకం, నాణ్యత లేని బియ్యం తెప్పించి వారు తినడానికి మాత్రం మంచి బియ్యం తెప్పించుకుంటే ఆ 'వేరే' పని  వల్ల  లభించేది పుణ్యమా ! పాపమా! అన్నది గ్రహిస్తే చాలు!

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, కొంతమంది, తమ ఇళ్ళలో చేస్కునే సత్య నారాయణ వ్రతం వాటికి సామగ్రి కొనుగోలు చేసినప్పుడు, ఆ మంటపం బియ్యం చవకరకం ది కొనడం సర్వ సాధారణం!

ఆ బియ్యం తీసుకువెళ్ళేది మనకోసం పూజ చేసి, పురతః హితాన్ని, మొదటగా మన శ్రేయస్సుని, పుర హితాన్ని కోరే స్వచ్ఛమైన మన పురోహితుడే కదా! ఆయన తీస్కెళ్ళే బియ్యాన్ని వండి పెట్టే వారి (పురోహితుల) భార్య,తినే వారి యొక్క మనసు ఖేదము పొందితే మనకి మంచి జరుగుతుందా!

దానము అనగా అర్పణము అని కూడా అర్ధమున్నది.  పితృదేవతలకైనా, అతిధి దేవతలకైనా మనము తినేదే అర్పించాలి. అందుకే శ్రీరాముడు తనకు తన తండ్రి దశరధుని మరణ వార్త వార్త తెలిసినంతనే, ఆ అరణ్యం లో తాను రోజూ తినే పిండి తోనే, ఉండలను చేసి పితృదేవునికి అర్పిస్తాడు.

అలాగే అతిధి దేవతలకి కూడా మనము తినే ఆహారాన్నే అర్పణ చేయాలి. శ్రేష్టమైన దానినే దానం చేయడం వల్ల సంపూర్ణదాన ఫలం కలుగుతుంది.

అందుకే పరమాచార్యుల వారి ఆదేశమేమిటంటే వంట చేసేటప్పుడు ప్రక్కకు తీసే బియ్యం, మనం తినేదే కనుక అదే ఇవ్వమనే పరమాంతర్యం!

కనుక, ఈ దినం నుండే ఎవరికి వారు వంట చేసేటప్పుడు ఒక గుప్పెడు బియ్యాన్ని తీసి మడిగా, వేరేగా ఉంచి అలా సేకరించే మూటలను, జగద్గురువుల ఆదేశం ప్రకారం సంప్రదాయ పాఠశాలలకు లేదా ఏదో విధంగా అవి నిజమైన, అన్నార్తులకు చేరి సద్వినియోగమవ్వాలని, కోరుతూ  నేటినుంచే ఆ దివ్య కార్యక్రమ స్వీకారం చేద్దాము!!

జయ జయ శంకర!
హర హర శంకర!!

Tuesday, July 4, 2017

తొలి ఏకాదశి - విశిష్టత

  ఆషాఢ శుద్ధ ఏకాదశి - తొలి ఏకాదశి. ఈ సంవత్సరం జులై 4 నాడు జరుపుకునే తొలి ఏకాదశి హైందవులకు ఇది మహా పర్వదినం. దీన్ని ‘హరివాసరం’ అని, ‘శయనైకాదశి’ అని పిలుస్తారు. ఈ పర్వదినాన హరినామ సంకీర్తనం ప్రశస్తం కనుక, ఇది హరివాసరమైంది. క్షీరాబ్ధిలో శేషపాన్పు పైన శ్రీమహావిష్ణువు శయనించడం వల్ల, దీన్ని ‘శయనైకాదశి’ అంటారు. ఈరోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు.

సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్ఠమైంది. ఈ పర్వదినాన ‘గోపద్మ వ్రతం’ ఆచరిస్తారు. నేటినుంచి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమికీటకాలు సంచరించే వర్షకాలం ఇది. ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది, ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు.

ఏకాదశి- పదకొండు సంఖ్యకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు, మనసు- వెరసి పదకొండింటి పైనా నియంత్రణ కలిగి వ్రతం ఆచరించాలన్నది ఈ పండుగ సందేశం.

ఏకాదశి వ్రతంలో- రాముడు, కృష్ణుడు, శివుణ్ని స్మరించటం; ఆదిత్యుడికి అర్ఘ్యప్రదానం, ఉపవాసం, గంగాస్నానం, వ్రతకథా శ్రవణం, జాగరణ, గోదాన భూదానాలు ప్రధానమైన అంశాలు. ఇవి పాటిస్తే- అశ్వమేధ యాగఫలం, అరవై సంవత్సరాల తపోఫలం ప్రాప్తిస్తాయని ‘స్మృతి పురాణం’ చెబుతోంది.

ఈ వర్షరుతువు ఆరంభంలో, సరిపడని ఆహారాన్ని త్యజించి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నదీ పండుగ సంకేతమే.

ఆషాఢ మాసాన తొలకరి జల్లులతో నేలతల్లి పులకరిస్తుంది. అన్నదాతల లోగిళ్లలో కోటి ఆశల కాంతులు నింపుతుంది.

ఈ మాసంలోనే బోనాలు, పశుపూజ, శకట ఆరాధనలు చేస్తారు.

ప్రసన్నత, శాంతి, సాత్విక చింతన, దానధర్మాలు, జ్ఞాన పిపాసలకు తొలి ఏకాదశి చక్కని అవకాశాలు కల్పిస్తుంది. భగవన్నామస్మరణ ద్వారా మోక్షాసక్తిని పెంపొందింపజేస్తుంది.
♻🌷♻

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...