Sunday, June 24, 2018

మానవదేహము మరియు ఇంద్రియములు

ఓం నమో భగవతే వాసుదేవాయ


ప్ర: ఈ మానవ దేహమును పాంచభౌతిక మందురు కదా? ఎందువలన?

ఉ: పంచభూతములతోకూడి యుండుటచేత దీనికి ఈ పేరు వచ్చింది.

ప్ర: పంచభూతములన నేవి?

ఉ: ఆకాశము, వాయువు, అగ్ని, జలము , పృథ్వి

ప్ర: ఇవి యెక్కడ నుండి వచ్చినవి?

ఉ: ఇవి ఒక్కొక్క భూతము నుండి ఒక్కక్కటి వచ్చినవి.

ప్ర: అన్నిటికిని మూలాధారమైనది యేది?

ఉ: నిర్వికారాచల పరిపూర్ణ బ్రహ్మము.

ప్ర: పంచభూతములకు, మానవశరీరమునకు గల సంబంధమేమి?

ఉ: పరబ్రహ్మమునుండి అన్ని మహత్తులు పుట్టి వాటి నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృధ్వి, వీటి చేరిక వల్లనే మానవ శరీరము కలుగుచున్నది.   

ప్ర: ఈ పంచభూతముల సంబంధము మానవశరీరమున ఏ రూపమున నున్నది?

ఉ: ఒక్కొక్క భూతమునందును తిరిగి అయిదైదు పంచకములను పేరున ఈ దేహమున ఇమిడి యుండును.   

ప్ర: మొదటిదైన ఆకాశమున నున్న పంచకములు ఏవి?

ఉ: జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము వీటినే ఆకాశ పంచకమందురు. 

ప్ర: వీటిని శరీరమునందేమని పిలుతురు?

ఉ: అంతరింద్రియములని పిలుతురు. 

ప్ర: ఇక వాయు పంచకములు ఏవి?

ఉ: సమాన వాయువు, వ్యానవాయువు , ఉదానవాయువు , ప్రాణవాయువు ,అపానవాయువు .


ప్ర: వీటిని శరీరమునందేమని పిలుతురు?

ఉ: పంచప్రాణములని పిలుతురు.

ప్ర: అగ్ని పంచకములన నెట్టివి?

ఉ: శ్రోత్రము, త్వక్ , చక్షువు, జిహ్వ , ఘ్రాణము . 

ప్ర: వీటిని శరీరమునందేమని పిలుతురు?

ఉ: జ్ఞానేంద్రియములని పిలుతురు.

ప్ర: జల పంచకములన నేమి?
 
ఉ: శబ్ద, స్పర్శ, రూప , రస , గంధాదులు. 

ప్ర: వీటిని శరీరమునందేమని పిలుతురు?

ఉ: పంచ తన్మాత్రలు అందురు.

ప్ర: పృథ్వి  పంచకములన నేమి?

ఉ: వాక్కు, పాణి,పాదము, గుహ్యము, పాయువు.

ప్ర: దేహమునందు వీటి నేమని పిలుతురు?

ఉ: కర్మేంద్రియము లందురు.

ప్ర: ఇట్టి మానవశరీరమును ఒక్కటిగా తలంచక, తిరిగి దీనికి అనేక శరీరములున్నవని వేదాంతులు తెలుపుదురే; అట్లున్నది నిజమేనా?

ఉ: అనేక శరీరములు లేవు కాని, మూడు శరీరములున్నవనుట సత్యము. కాని మరికొందరు నాలుగని కూడా అందురు.

ప్ర: అవి ఏవి? వాటిని యేమని పిలుతురు?

ఉ: స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము అని అందురు. మరికొందరు మహాకారణము కూడా కలదని అందురు.

ప్ర: స్థూలదేహ మనగా నేమి?

ఉ: పై చెప్పిన ఇరువదియైదు  తత్త్వములు కలిపిన దేహమునే  స్థూలదేహమందురు.


ప్ర: ఇక సూక్ష్మ దేహమన నేమి?

ఉ: జ్ఞానేంద్రియములు అయిదు, శబ్దాదులు అయిదు, ప్రాణాదులు అయిదు , మనస్సు , బుద్ది రెండు. అనగా పదునేడు తత్త్వములు కలిపిన దానిని సూక్ష్మ దేహమందురు. 

ప్ర: దీనికి పేరేమయినా ఉన్నదా? లేక ఊరక సూక్ష్మ దేహమందురా?

ఉ: పేరు లేకేమి? దీనికే తైజసుడని పిలుతురు.

ప్ర: దీని అవస్థ లేమైనను కలవా?

ఉ: దీనికి అవస్థ కలదు. 


ప్ర: ఆ అవస్థకు పేరేమి?

ఉ: స్వప్నావస్థ అందురు.

ప్ర: పైన చెప్పిన స్థూలదేహమునకు మాత్రము అవస్థలు లేవా?

ఉ: లేకేమి!  దానికి కూడను అవస్థ కలదు.

ప్ర: ఆ అవస్థను ఏమని పిలుతురు?

ఉ: దీనిని జాగ్రదవస్థ అందురు.

ప్ర: కారణ దేహమన నేమి?

ఉ: చిత్తము, జ్ఞాతతో కూడుకున్నది.

ప్ర: దీని పేరేమి?

ఉ: ప్రాజ్ఞుడని అందురు.

ప్ర: దీనికి అవస్థ ఏది?

ఉ: నిద్రావస్థ(సుషుప్తి). 

ప్ర: ఇక మహాకారణ మననేమి?

ఉ: ఏ తత్త్వము లేక స్వయము జ్యోతియై, సర్వ సాక్షి అయిన శుద్ధ చైతన్యమునే మహా కారణమందురు.

ప్ర: దీనికి నామము కలదా?

ఉ: హిరణ్యగర్భుడని అందురు.

ప్ర: దీనికి అవస్థ లేమైనను కలవా?

ఉ: అవస్థ లేదు. కనుకనే అక్షరపురుషుడని పిలుతురు.

ప్ర: ఈ స్థూలదేహమున ఏ భూతముల వలన ఏ యే పదార్ధములు పుట్టుచున్నవి సెలవిండు.

ఉ: పృథ్వి వలన అస్థి, చర్మము,మాంసము, నరములు , వెంట్రుకలు పుట్టుచున్నవి.

ప్ర: జలము వలన ఏమి పుట్టుచున్నవి?

ఉ: రక్తము, మూత్రము, జొల్లు, శ్లేష్మము, మెదడు పుట్టుచున్నవి.

ప్ర: అగ్ని వలన ఏమి పుట్టుచున్నవి?

ఉ: ఆకలి, దాహము, నిద్ర, సగమము, నిధానము కలుగుచున్నవి.

ప్ర: వాయువు వలన ఏమి పుట్టుచున్నవి?

ఉ: చలనము, గమనము, తీవ్రము, లజ్జ, భయము కలుగుచున్నవి.

ప్ర: ఆకశము వలన పుట్టున వేమి?

ఉ: కామ, క్రోధ, లోభ, మద, మత్సరములు

ప్ర: మానవున కనేక వ్యసనములున్నవి కదా! ఆ వ్యసనములకు పై చెప్పిన గుణములేమైనా కారణము లగుచున్నవా?

ఉ: ఏమైనా అని సందేహింతు వెందుకు? అసలు కారణమే ఈగుణములు. వ్యసనములు కూడను అనేకములు లేవు! అవి నాలుగు విధములు.

ప్ర: అవి యేవో సెలవిండు?

ఉ: తనువ్యసనము, మనోవ్యసనము, ధనవ్యసనము, స్త్రీవ్యసనము మిగిలినవి యెన్ని వ్యసనములైనను ఈ నాల్గింటిపైనే కలుగుచున్నవి.


పద్నాలుగు లోకములు

ప్ర: మానవుడు మదముతో కన్ను మిన్ను ఎరుగక ప్రవర్తించుచుండునే. ఈ అహంకారము ఆధారమేమి? అవి యెన్ని విధములు?

ఉ:  అవి నాలుగు విధములైనటువంటివి.

మదము వలన మానవుడు కన్ను మిన్ను ఎరుగక ప్రవర్తించుచుండును. కులమదము, ధనమదము , యోవనమదము, విద్యామదము ఇంకను

అనేక విధముల మదములు కలవు. కాని అవి అన్నియునూ ఈ నాల్గింటిపైననే అధారపడి యున్నవి.

ప్ర: అన్ని లోకములు మానవునియందే ఉన్నవని అనుభవజ్ఞులు , శాస్త్రములు తెలుపుచున్నవి. ఆ లోకములేవి? అవి ఉండు స్థానములేవి?

ఉ: భూలోకము  (అది మానవుని పాదములయందును)
     భువర్లోకము  (ఇది గుహ్యమందును)
     సువర్లోకము  (ఇది నాభియందును)
     మహర్లోకము ( ఇది హృదయమందును )   
     జనలోకము   ( ఇది కంఠమునందును)
     తపోలోకము  (ఇది భ్రూమధ్య మందును)
     సత్యలోకము ( ఇది లలాటమందును) కలవు. 
ఈ సప్త లోకములు మానవుని అంగములందే ఉన్నవి. వీటిని ఊర్ధ్వలోకములని అందురు.  ఇంకను అధోలోకములు కూడా కలవు.

ప్ర: అవి యేవి? వాటి నిలయము ఎక్కడ?

ఉ: అతలము  (ఇది అరికాళ్ళ యందును)
     వితలము (గోళ్ళ యందును) 
     సుతలము (మడమల యందును)
     తలాతలము (పిక్కల యందును)
     రసాతలము (మోకాళ్ళ యందును)
     మహాతలము (తొడల యందును)
     పాతాళము (పాయువు నందును ) ఉండును.

ప్ర: సర్వలోకములు పంచభూతముల చేరికయైనా ఈ స్థూల దేహమందే యండిన ఇందులో సప్త సముద్రములని అందురు కదా! అవి కూడా ఈ దేహములో చేరియున్నవా? లేక మనస్సులో చేరియున్నవా?

ఉ: లోకము లన్నిటికి దేహమే నిలయమైనప్పుడు  లోకముతోనే కాక ప్రత్యేకించి యెటులుండును? అవియును ఈ దేహముతోటి మిళితమై ఉన్నవి.

1) లవణసముద్రము
2) ఇక్షుసముద్రము
3) సుధాసముద్రము
4) సర్పిసముద్రము 
5) దధిసముద్రము
6) క్షీరసముద్రము 
7) శుద్ధోదకసముద్రము 

అని యేడు సముద్రములు కలవు. అవి లవణసముద్రము మూత్రముగాను, ఇక్షు చెమటగాను, సుధ ఇంద్రియముగాను, సర్పి దోషితముగాను, దధి శ్లేష్మముగాను , క్షీరము జొల్లుగాను , శుద్దొదకము  కన్నీరుగాను ఉన్నవి.

ప్ర: అగ్నులని అందురే అవి ఎన్ని విధములు? వాటి పేర్లేమి?

ఉ: పంచాగ్నులు : కాలాగ్ని, క్షుదాగ్ని, శీతాగ్ని, కోపాగ్ని, జ్ఞానాగ్ని.

ప్ర: ఇవి మానవుని దేహమందు ఏ యే స్థానమందు ఉన్నవి?

ఉ: కాలాగ్ని పాదములయందును, క్షుదాగ్ని నాభియందును, శీతాగ్ని హృదయమందును, కోపాగ్ని నేత్రమందును, జ్ఞానాగ్ని ఆత్మ యందును ఉండును.

ప్ర: నాదములని యందురే, అవియు ఆ స్థూలదేహమందే ఉన్నవా?  ఉండిన అవి ఎన్ని విధములు? వాటి పేర్లేమి?

ఉ: ఇవియును స్థూలదేహమందే ఉన్నవి. అవి దశ విధములు. లలాది ఘోషము, భేరినాదము, చణీనాదము, మృదంగనాదము, ఘంటా నాదము, కళానాదము, కింకిణీనాదము, వేణునాదము, భ్రమరనాదము, ప్రణవనాదము.  .....

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...