Wednesday, June 20, 2018

గణపతి శరీరంలోని ప్రతిఅంగము ఒక్కొక్క తత్త్వానికి సంకేతం

‘‘ఆదౌ పూజ్యో గణధిపః’’ అని ఆర్యోక్తి. ఏపూజకైనా ముందుగా గణపతి పూజ చేయడం సంప్రదాయం.

‘‘శుక్లాంబరధరం విష్ణుం
 శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!’’

ఈ శ్లోకం దేవతార్చనా సమయాన ముందుగా గణపతి ప్రార్థనగా స్తుతిస్తూంటాము. గమ్మత్తేంటంటే ఈ శ్లోకాన్ని ఆమూలాగ్రం పరిశీలించినా అందులో ఎక్కడా గణేశుని పేరు ప్రస్తావింపబడలేదు. కాని,శ్వేతవస్తమ్రులను ధరించినవాడు, రక్షకుడు, చంద్రకాంతి వంటి దేహచ్ఛాయ కలవాడు; చతుర్భుజుడు, ప్రసన్న వదనుడైన ఆ దేవదేవుణ్ణి సర్వవిఘ్నముల నాశనమునకై పూజిస్తూన్నాను అనే అర్థమునకు పై శ్లోకం ద్వారా తెలుస్తోంది. కానీ శబ్దార్థరీత్యా ‘ప్రసన్నము’ అనే పదానికి ఏనుగు అనే అర్థం ఉంది. దీనిని బట్టి ‘ప్రసన్న వదనుడు’ అంటే ‘ఏనుగు ముఖం’ కలవాడన్న అర్థాన్ని అన్వయిస్తే ఇది గణేశ స్తుతి అని తెలుస్తుంది. పెద్ద పొట్ట; చేటల్లాంటి చెవులు; చిన్న కళ్ళు; ఏకదంతము మొదలైన వాటిని కల్గి ఉన్న గణపతి కేవలం ఆకారంలోనే కాదు అర్థం చేసుకోవడానిక్కూడా వింత దేవుడేనని పైశ్లోకాన్ని బట్టి చెప్పవచ్చు.

మన భారతీయ భక్తితత్పరతలో వినాయకుడు బహుజన ప్రియమయిన దేవుడు. సమస్త మంత్రములకు ఓంకారం ముందున్నట్లు ప్రతి కార్యానికీ ముందు గణపతి పూజ చేయడం అనాదిగా సదాచారమై వస్తోంది.ముఖ్యంగా భాద్రపద శుద్ధ చవితినాడు అనగా వినాయక చవితి దినమున గణపతిని యధావిధిగా అర్చించి స్వామివారి అనుగ్రహంతో ఏడాది పొడవునా విఘ్నములన్నవి లేకుండా, నీలాపనిందలు పడకుండా సుఖశాంతులతో కూడిన జీవితం గడపాలన్నదే ప్రతి ఒక్కరి కోరిక.
గణపతి ఓ విశిష్ట దేవుడు. ఆయన ప్రభావమును గురించి

 బ్రహ్మణస్పతి సూక్తము; గణపతి అధర్వ శీర్షోపనిషత్; హేరంభోపనిషత్తు; గణపతి సూక్తం మొదలైన వాటిలో విపులంగా తెలియజేయబడింది.

 ఇంకానేమో మనం పూజించే దేవుళ్ళలో ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ప్రీతి పాత్రులవుతారు.

 సూర్య భగవానుడేమో నమస్కారప్రియుడు. శివుడు అభిషేక ప్రియుడు. విష్ణువు అలంకారప్రియుడు. అలాగే గణపతి తర్పణప్రియుడు. చతరావృత్తి తర్పణమనేది గణపతికి అత్యంత ప్రీతిదాయకమైనదిగా పలు పురాణాల్లో చెప్పబడింది.
సర్వదేవతలూ పరబ్రహ్మ యొక్క వివిధ రూపాలయితే వినాయకుడొక్కడే పరబ్రహ్మ స్వరూపమని ఆదిశంకరులవారు అభివర్ణించారు.

‘‘అజం నిర్వికల్పం నిరాకార మేకం- నిరానందమానంద మద్వైత పూర్ణం
కరం నిర్గుణం నిర్విశేషం నిరీహం-పరబ్రహ్మరూపం గణేశం భజేహం!’’’

పరతత్త్వమయిన పరబ్రహ్మకు సాకార నిరాకారమనే రెండు లక్షణాలున్నాయి. ఇందులో మనం సాకారాన్ని పట్టుకొని నిరాకారం వేపు సాగిపోవాలి. గణపతి శరీరంలోని ప్రతిఅంగము ఒక్కొక్క తత్త్వానికి సంకేతం. వీటిని మదినుంచుకొని ఏకాగ్ర చిత్తంతో గణపతిని ధ్యానించామంటే నిరాకారం వేపు నిరాటంకంగా సాగిపోవచ్చుననటంలో సందేహం లేదు అంటూ మన రుషిగణం పల్కిన ఆధారాలు చాలా ఉన్నాయి.

ఇకపోతే గణపతికి సంబంధించిన పూజా విధానాలను గురించి కూడా మహత్తరంగానే తెలుపబడింది. గణపతిని విగ్రహంగా పెట్టుకొని పూజించేటప్పుడు బంగారు విగ్రహాన్ని పూజిస్తే ఐశ్వర్యాన్ని, వెండిమూర్తిని పూజించినట్లయితే ఆయుర్‌వృద్ధిని; రాగి ప్రతిమను పూజిస్తే సంకల్ప సిద్ధి కల్గుననీ; శిలావిగ్రహాన్ని పూజిస్తేనేమో మోక్షగతిని పొందుతారని; ఇక మట్టి విగ్రహన్ని ఆరాధించినట్టయితే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడన్నది జ్ఞానసిద్ధుల ఉవాచ. అంతేకాదు ముత్యం, పగడం, స్ఫటికం, తెల్ల జిల్లేడు వేరు మొదలైన వాటితో కూడా వినాయక విగ్రహాలను చేయించి పూజించినవారికి విశేష ఫలితాలు చేకూరుతాయని తెలియజేసే ఆధారాలు ఎన్నేన్నో ఉన్నాయి.

గణపతి అంటే జ్ఞానం; మోక్షం అనే రెండింటినీ ఇవ్వగల్గిన వాడని అర్థం చెప్పబడింది. జ్ఞానం మనిషిని సన్మార్గమున పయనింపజేస్తుంది. మోక్షం మరుజన్మయన్నది లేకుండా చేస్తుంది. ఇలా సుగమమయిన మార్గాన తాను పయనించడానికే మానవుడు ముందుగా ప్రతి కార్యకలాపాల్లో గణపతిని పూజించి తీరుతాడు.

ఆదిశంకరుల విరచిత గణేశ పంచకమనే పంచరత్నాలలో గణపతిని గురించి మహత్తరంగా వివరింపబడింది. ప్రతిదినం గణేశ పంచకం భక్తిశ్రద్ధలతో పఠించినవారికి ఇహపర సుఖములతో పాటు సకల సంపదలు, సిద్ధిబుద్ధులు ఆ గణేశుడే ప్రసాదిస్తాడని కూడా వివరింపబడింది. అంటే గణపతి భక్తజనులకు మోక్షసామ్రాజ్యాన్ని సాధించిపెడతాడు. చంద్రుని శిరోభూషణంగా ధరించి లోకాలను రక్షిస్తూంటాడు. అనాధులకు ఏకైక నాయకుడు. అశుభాలను పోగొట్టే వినాయక దేవునికి నమస్సులు అనే గొప్ప భావార్థముతో శ్లోకంలో చక్కగా వివరించబడింది. విషయం విప్పి చెప్పాలంటే గణేశ పంచకం ఆద్యంతం మహిమాన్వితమైనదని జ్ఞానులు నొక్కి పలికారు. నిజమే, ఇందు సందేహానికి తావే లేదు. పరమాత్మ అనుగ్రహంతో అజ్ఞానాన్ని నివారించుకొని జ్ఞాన, వివేకములను సంపాదించుకోవాలి. జ్ఞానమే పరమాత్మ స్వరూపం. జ్ఞాన సాక్షాత్కారమే మోక్షం. కనుక విఘ్నరాజైన వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోయి వివేక విజ్ఞానాలు ప్రకాశిస్తాయి.

భక్తిశ్రద్ధలతో గణపతి పూజ చేసినవారికి సత్ఫలితాలు అందుతాయి.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...