Wednesday, May 23, 2018

లక్ష్మణునినవ్వుకు కారణం


రావణుడు మరణించిన తరవాత కపి సైన్యంతో విభీషణ,అంగద,సుగ్రీవులతో, సీతా లక్ష్మణులతో అయోధ్య చేరి పట్టాభిషేకం చేసుకుంటూ ఉన్న సందర్భం. పట్టాభిషేకం అట్టహాసంగా జరుతోంది.రాముని పక్కనే సింహాసంకి దగ్గరగా నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. ఆ పరిస్థితులలో లక్ష్మణుడు ఒక సారి చిరునవ్వు దీర్ఘంగా నవ్వేడు.  అందరూ చూశారు.ఆ సందర్భంగా సభలో ఉన్న ఒక్కొకరు ఒకలా అనుకున్నారా నవ్వు చూసి.

ఆనాడు రాముని అడవులపాలు చేసి, భర్తను చంపుకుని,భరతునిచే తిట్లు తిని, నేడు ఆహ్వానం పలుకుతోందని, నా గురించే నవ్వేడా? అనుకుందిట కైక

సుగ్రీవుడు, అన్నను చంపించి రాజ్యాన్ని సంపాదించాడా అని నన్ను చూసినవ్వేడేమో అనుకున్నాడట.

తండ్రి ని చంపించిన పిన తండ్రి పంచ చేరినందుకు ఆక్షేపిస్తున్నాడా అనుకున్నాడట అంగదుడు.

ఇంటి గుట్టు చెప్పి అన్నను చంపుకుని రాజ్యం సంపాదించుకున్నానని ఎగతాళీగా నన్ను చూసినవ్వేడా అనుకున్నాడట విభీషణుడు.

రాముడి బాణాలను తండ్రి వాయుదేవుని అనుగ్రహంతో వక్ర మార్గాన నడిపించానని పరిహాసం చేస్తున్నాడా అని హనుమ అనుకున్నాడట.

బంగారు లేడిని తెమ్మన్ని కోరినందుకు నవ్వుకుంటున్నాడేమో అనుకుందిట సీత.

బంగారు లేడి ఉండదని తెలిసీ భార్య కోరిక తీర్చడానికి బయలుదేరి వెళ్ళి చిక్కులలో పడినందుకు నవ్వుతున్నాడా అని శ్రీరాముడు అనుకున్నాడట.

అందరి మనసుల్లోనూ ఉన్న అనుమానాలను గ్రహించిన రాముడు, తమ్ముడి నవ్వు విశేషార్ధాలకు దారి తీస్తుందని లక్ష్మణుని" ఏందుకు నవ్వేవు సోదరా?" అని అడిగాడు. దానికి లక్ష్మణదేవర "అన్నా!' సీతా రాముల సేవలో ఏమరు పాటు లేకుండేందుకుగాను నిద్రాదేవిని ఒక వరం అడిగాను. నన్ను వనవాస సమయం లో పదునాల్గు సంవత్సరాలూ ఆవహించవద్దని.'

దానికి నిద్రాదేవి అనుగ్రహిస్తూ 'పదునాలుగేళ్ళయిన తరవాత నిన్ను ఆవహిస్తానని' వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆవహించని నిద్రాదేవి ఇప్పుడు ఈ సంతోష సమయంలో నన్ను ఆవహిస్తానని వచ్చింది. నిలబడే ఒక చిన్నకునుకు తీశానన్నయ్యా! నిద్రా దేవి మరచిపోకుండా వచ్చి నన్ను ఆవహించినందుకు నవ్వేను, మరేమీ కాదు" అన్నాడు. దానితో అందరూ తమతమ మనసులలో అనుకున్నది నిజం కాదని అనవసరంగా గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నామనుకుని నవ్వుకున్నారట.

🙏🏻 జై శ్రీమన్నారాయణ 🙏🏻

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...