Sunday, May 13, 2018

దశ మహావిద్యలంటే ఏవి?

1. కాళీ
2. తార
3. త్రిపుర సుందరి
4. ధూమావతి
5. భువనేశ్వరి
6. భైరవి
7. ఛిన్నమస్త
8. మాతంగి
9. బగళాముఖి
10. కమలాత్మిక

అనేక దశాబ్దాల పాటు వీటి పేర్లు చెప్పుకోవడం కూడా వాటి ఆవాహనే అని భావించారు. వీటి సౌమ్యతరమైన రూపాలని, అర్ధాలని, అంతరార్ధాలని తెలుగు వారికి అందించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. రమణ మహర్షి వంటి మహానుభావుల సమక్షంలో దశ మహా విద్యల సాధన చేసి అందులో ఉన్న శక్తి కేవలం గ్రంధాలుగా కాక నిజంగా చూపించిన వారు శ్రీ కావ్యకంఠ వాశిష్ట గణపతి ముని. వారు వ్రాసిన ఉమా సహస్రాన్ని అమ్మ వారికి అంకితం చేసినప్పుడు అన్నారుట, " అమ్మా ! ఈ రచన నీకు నచ్చినట్లయితే నాకు తెలియజెయ్యి. ఏ భాగం నీకు నచ్చక పోతే ఆ భాగాన్ని నేను అగ్నికి ఆహుతి చేస్తాను " అని. అలా ఆయన ఆ మహా గ్రంధాన్ని చదవడం మొదలు పెట్టే సరికి, ఆ అమ్మ వారు కరుణాసముద్రయై ప్రతి పద్యానికో మెరుపు ఆకాశంలో చూపించిదిట. అంతటి దివ్య శక్తిని దర్శనీయంగా చూడడానికి ఎంత తపస్సు చేయాలో అనిపిస్తుంది. మరి ఈ దశ మహావిద్యలు దేన్ని సూచిస్తాయి అని సందేహం వస్తుంది. వీటి చిత్రాలు, విగ్రహాలు కూడా అన్నీ సౌమ్యం గా ఉండవు. ఉదాహరణకి కాళీ విగ్రహం ఎప్పుడూ ముండ మాలతో, ఖడ్గంతో భయంకరంగానే ఉంటుంది. వీటిలో కోమలత్వం ఏది అనిపిస్తుంది. మరి ఈ కాళికే తెనాలి రామలింగడికి విద్యని, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. వెర్రి వాడైన కాళి దాసుకి కవిత్వాన్నిచ్చింది. అమ్మ తలుచుకుంటే లోటేముంది. అమ్మ ఒక సారి కోపంగా ఉంటుంది. ఒక సారి సంతోషంగా ఉంటుంది. బాగా అల్లరి చేస్తే ఒకటి పీకుతుంది కూడా. అమ్మ చేతి దెబ్బలు తినకుండా పెరిగిన వారెవ్వరు? ప్రేమ అనేది ఒక అపురూపమైన తత్వం. తిట్టుకున్న, కొట్టుకున్నా ప్రేమతో ఉంటే అవి అద్భుతంగానే ఉంటాయి.

ఈ దశ మహా విద్యల తత్వాన్ని చూస్తే, అవి ఇలా సూచిస్తాయి.

కాళీ, ఛిన్నమస్త - కాల పరిణామము
తార, మాతంగి - వాక్కు, వ్యక్తావ్యక్తము
త్రిపుర సుందరి, కమల - ఆనందము, సౌందర్యము
భువనేశ్వరి, ధూమావతి - అంతరాళము, అతీత పరబ్రహ్మ శక్తి
భైరవి, బగళాముఖి - శక్తి, గతి, స్థితి కాలం మనకి అనిపించేదే కాక అమరత్వాన్ని చూపే అనంత బయొలాజికల్ క్లాక్ లో నడిచే సమయం అన్నమాట. ఇక్కడ కాలభైరవుడు మార్గం చూపగలడు. అంతరాళం కూడా శూన్యమే కాదు, అది అంతులేని ప్రేమ వ్యక్త ప్రపంచంగా ఆవిర్భవించిని శక్తి. ఇది అర్ధం కావాలంటే శ్రీ కృష్ణుడు దారి చూపవలసిందే. వాక్కు అంటే కేవలం మాట కాదు, శూన్యంలో కూడా ప్రయాణించగల మనో తరంగ విశ్వసృష్టి స్పందన. దీన్ని తారా దేవి తెలియజేయ గలదు. ఇలా ప్రతి తత్వం ఆ తత్వపు మూల స్వరూపంలో ఆద్యా శక్తులుగా ఉపాసించడమే దశ మహా విద్యల స్వరూపం. అందుకే వీటిలో ఒక మౌలిక భావ సముదాయం ఉపాసనగా ఉంటుంది. సాధరణంగా వీటిని ఉపాసించే వారు వీటి విసృత పరిధిని జ్ఞాపకంలో పెట్టుకుని ఉంటారు. పట్టు పంచ కట్టుకుంటేనే పవిత్రత, తలస్నానం చేస్తేనే మనిషి అని కాకుండా (అంటే లేకపోతే కాదని కాదు సుమా) ఇంకొంచెం విభిన్నంగా బ్రహ్మత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. ఇది అర్ధం కావాలంటే ఇంకో ఉదాహరణ హిమాలయాల్లో ఉండే యోగులని చూస్తే, వాళ్ళు రోజూ ఏ విధంగా పూజ చేస్తూ ఉండి ఉంటారు? మానస సరోవర ప్రాంతాల్లో ఉండే సాధకులు, శంభలగా టిబెట్లో పిలవబడే, షాంగ్రీలా అని చైనాలో కొలవబడే, శంభల గ్రామం అని భవిష్యపురాణంలో చెప్పబడిన ప్రాంతాలలో యోగులు ఎలా ఉంటారు? అక్కడ 'పవిత్రత ' తాలూకు నిర్వచనం ఏమిటి. వాళ్ళ భోజనపు అలవాట్లేమిటి? వస్త్రధారణ ఏమిటి, అసలు దాని ప్రాశస్త్యం వాళ్ళ దృష్టిలో ఏమిటి? నిజంగా శివపార్వతులు మనకి కనిపిస్తే వాళ్ళు ఏ బట్టల్లో ఉండి ఉంటారు? కళాంజలి చీర కట్టుకుని, కుమార్ జ్యూవలర్స్ వారి వడ్ఢాణాలు పెట్టుకుని ఉంటుందా అమ్మవారు ? ఇలాంటి వేల ప్రశ్నల జవాబులు కలిపితే కానీ బ్రహ్మత్వ స్వరూపం తాలూకు స్వరూపం ఆవగింజంత అర్ధం కాదు.

వేల పర్వతాలంతకన్నా ఎక్కువ వేదాలు. అవి అర్ధం కావేమోనని వాటి సారం ఉపనిషత్తులు. వాటి సారం అనుభవేక సారం కావాలని ఉపాసనలు. ఉపాసనా సిద్ధికి ఉపదేశాలు, మంత్రాలు. అప్పటికి అర్ధం కావేమోనని భజనలు, ప్రార్ధనలు. అవీ రావేమో నని పండగలు, పబ్బాలు. ఇంకెంత చెప్తారు ఋషులు?

దృశ్యం సర్వమనాత్మా స్యాద్ దృగేవాత్మా వివేకినః
ఆత్మా నాత్మా వివేకోయం కధితో గ్రంధ కోఠిభిః
(ఆత్మా నాత్మ వివేకము - శ్రీ ఆది శంకరులు)

ఈ విశ్వంలో మనకి కనిపించే ఈ సమస్త పదార్ధాలూ అనాత్మయే! అంటే ఆత్మ కానివే. వీటిని చూసే వాడు మాత్రమే ఆత్మ. అంటే బ్రహ్మ అని అర్ధం. ఆ బ్రహ్మత్వాన్ని నిరాకార రూపంగా సాధన చేయగల వారు యోగ శాస్త్రాన్ని (పతంజలి) అవలంబించి ఆ దివ్యశక్తిని అనుభవేకవేద్యం కావించుకున్నారు. అలా కాక నిరాకారము సర్వాకార స్వరూపం కనుక, ఆ శక్తి యోగులకి, ద్రష్టలకు దేవతామూర్తిగా - గాయత్రి వంటి బ్రహ్మ స్వరూపిణిగా అగుపించినపుడు ఆమె రూపాన్ని, మంత్ర స్వరూపాన్ని వారు మనకి అందించారు. అందుకే మంత్ర జపం చేసే ముందు కొందరు అంగన్యాస కరన్యాసాలు చేస్తారు. అందులో అర్ధం తమలో ఆ మంత్రాన్ని దాన్న తత్వాన్ని విలీనం చేసుకోవడమే! మంత్రంలో ఒకటిగా, ఆ శక్తిలో ఒకటిగా తమ

చేతులలో (కర్మ పరికరములు కరములు కనుక), వేళ్ళలో ఆ శక్తి స్వరూపాలను ఆవాహన చేస్తున్నాము. దాన్ని కరన్యాసము అని అంటున్నాము.

ఓం తత్సవితు బ్రహ్మాత్మనే అంగుష్ఠాభ్యాం నమః
వరేణ్యం విష్ణ్వాత్మనే తర్జనీభ్యాం నమః
భర్గో దేవశ్య రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః
ధీయోయోన జ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః
ప్రచోదయాత్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...