Tuesday, May 22, 2018

బ్రహ్మర్షి విశ్వామిత్ర మహర్షి జీవిత విశేషాలు

విశ్వామిత్రుడు (Viswamitra) హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి:

● 1) గాయత్రీ మంత్ర సృష్టి కర్త.

● 2) శ్రీరామున కు గురువు.

● 3) హరిశ్చంద్రుని పరీక్షించినవాడు.

● 4) త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు.

● 5) శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.

గౌతమ మహర్షి, అహల్య ల కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడి జీవిత వృత్తాంతాన్ని శ్రీరామచంద్రునికి వినిపిస్తాడు. ఆవిధంగా శతానందుడి చేత వివరింపబడిన విశ్వామిత్రుడి జన్మ వృత్తాంతాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం లోని బాలకాండలో 51-65 సర్గల మధ్య వర్ణించాడు.

వంశ వృత్తాంతం

బ్రహ్మ కుమారుడు కుశుడు. ఆయన పుత్రుడు కుశనాభుడు. ఆయనకు నూరుగురు కుమార్తెలు. ఆ నూరుగురు కుమార్తెలను బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. ఆ తరువాత కుశనాభుడికి పుత్రసంతానం లేకపోవడం వల్ల పుత్రకామేష్టి యాగం చేస్తాడు. తండ్రి అయిన కుశ మహారాజు ప్రత్యక్షమై, అత్యంత పరాక్రమం కలిగి కీర్తిని ఇవ్వగల పుత్రుడుగా గాధి జన్మిస్తాడు అని వరమిస్తాడు. ఆ విధంగా కుశనాభుడికి జన్మించిన గాధి కుమారుడే విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు కుశవంశంలో జన్మించాడు కాబట్టి కౌశికుడు అనే పేరు కూడా ఉంది.

వశిష్ఠుని విందు

విశ్వామిత్రుడు చాలా కాలం రాజ్య పాలన చేశాడు. ఒకరోజు ఒక అక్షౌహిణి సైన్యంతో వేటకై వెళ్ళి, అలసి, వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి చేరుకొంటాడు. కుశల ప్రశ్నలు, అర్ఘ్యపాద్యాదులు అయ్యాక, విశ్వామిత్రుడు సెలవు తీసుకోబోగా, వశిష్ఠ మహర్షి తన ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు "మీ దర్శనం వల్ల, అర్ఘపాద్యాదుల వల్ల ఇప్పటికే సంతుష్టుడనయ్యాను. కాబట్టి సెలవు ఇప్పించవలసింది" అని అంటాడు. కానీ వశిష్ఠుడు ఆతిథ్యం తీసుకోమని బలవంతపెట్టడంతో, విశ్వామిత్రుడు అంగీకరిస్తాడు. వశిష్ఠుడు తన హోమధేనువు, కామధేనువు సంతతికి చెందినదీ అయిన శబల అనే గోవును పిలిచి మహారాజుకు, ఆయన సైన్యానికి వారివారి ఇచ్ఛానుసారం పదార్ధాలు తయారు చేసి, విందు చెయ్యమంటాడు. వశిష్ఠుని ఆజ్ఞ మేరకు శబల సైనికుల ఇష్ఠాలను గ్రహించి, ఆ మేరకు వారికి నచ్చిన పదార్థాలు సృష్టించి, అతిథి సత్కారాలు చేస్తుంది.

శబలను కోరడం, వశిష్ఠుడు నిరాకరించడం అది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్య చకితుడై ఆ శబలను తనకు ఇచ్చి లక్ష గోవులను దానంగా స్వీకరించమంటాడు. లక్ష గోవులు ఇచ్చినా శబలని ఇవ్వడానికి వశిష్ఠుడు అంగీకరించడు.

దానితో విశ్వామిత్రుడు కోపించి "నేను రాజును, రత్నం లాంటి ఈ గోవు నా వద్దే ఉండాలి" అంటాడు. అప్పుడు వశిష్ఠుడు శబల వల్లనే ఆశ్రమంలో హవ్యం (హవిస్సులు), కవ్యం (పితృకార్యాలు) జరుగుతున్నాయి, అసలు ఈ గోవు వల్లే ప్రాణయాత్ర నడుస్తోంది అన్నాడు. పద్నాలుగు వేల ఏనుగులు, ఎనిమిది బంగారు రథాలు, పదకొండు గుర్రాలు, కోటి గోవులు, బంగారం, వెండి బదులుగా ఇస్తాను, శబలను ఇమ్మంటాడు విశ్వామిత్రుడు.. వాటిని కూడా వశిష్ఠుడు నిరాకరించి మౌనం పాటిస్తాడు.

ఆ మహారాజు కోపించి శబలను రాజ్యానికి తోలుకొని పొమ్మని తన సైన్యానికి ఆజ్ఞ ఇస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడి సైన్యం శబల మెడలో గొలుసు వేసి, తోలుకొని పోతుండగా శబల ఏడుస్తూ వశిష్ఠ మహర్షిని ఈ విధంగా ప్రశ్నిస్తుంది "నేనేమైనా లోపం చేశానా, నన్ను పరిత్యజిస్తున్నారు? మీరు నన్ను రక్షిస్తారా లేక నన్ను నేను రక్షించుకొనుమంటారా?" వశిష్ఠ మహర్షి దానికి అంగీకారాన్ని తెలుపుతాడు.అప్పుడు శబల ఒక హూంకారం (అంబా నాదం) చేసి, వెంటనే శూలాయుధులైన పహ్లవులు అనే యవనులకు జన్మనిచ్చి వారి ద్వారా విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చేస్తుంది.అది చుసి క్రోధ పరవశుడైన విశ్వామిత్రుడు అనేక శస్త్రాస్త్రాలతో పహ్లవులను సంహరిస్తాడు. దానికి క్రుద్ధ అయిన శబల తన శరీరం నుంచి కాంభోజ వంశీయులను, పొదుగు నుండి పహ్లవులను, యోని స్థానం నుండి యవనులను, గోమయం వచ్చే స్థానం నుండి శకులను, రోమకూపాలనుండి హరీకులను, కిరాతకులను పుట్టించగా వారు విశ్వామిత్రుని సైన్యాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. అది చూసిన విశ్వామిత్రుడి నూరుగురు కుమారులు వశిష్ఠమహర్షిని చంపేందుకు వెళ్తారు. వశిష్ఠ మహర్షి ఒక హుంకారం చేయడంతో నూరుగురు భస్మరాశులై పడిపోతారు. అది
చూసిన విశ్వామిత్రుడు విచారించి, తన దగ్గర ఉన్న శక్తులతో వశిష్ఠుని గెలవజాలనని తెలిసి, రాజ్యానికి తిరిగి వెళ్ళి, మిగిలిన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి, హిమాలాయాలకు వెళ్ళి పరమశివుడి తీవ్రమైన తపస్సు చేస్తాడు.

పరమ శివుడి కోసం తపస్సు

విశ్వామిత్రుడి ఘోర తపస్సుకు మెచ్చి, శివుడు ప్రత్యక్షమై తన కోరికను వెల్లడించమంటాడు. తనకు ధనుర్వేదం లోని సర్వ రహస్యాలు సాంగోపాంగంగా ఇప్పటికిప్పుడు బోధించమని విశ్వామిత్రుడు కోరుతాడు. శివుడు తథాస్తు అని దీవిస్తాడు. ఆ వరాన్ని పొందిన వెంటనే విశ్వామిత్రుడు పౌర్ణమి నాడు సముద్రం పోటెత్తినట్లుగా ఉత్సాహంతో ఉప్పొంగి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు.

వశిష్ఠుని మీద ధనుర్వేద ప్రయోగంవశిష్టుని ఆశ్రమంపై దండెత్తిన విశ్వామిత్రుడు తాను నేర్చిన అస్త్రాలను ఆశ్రమంపై ప్రయోగించగా ఆశ్రమవాసులు కకావికలై ప్రాణభయంతో పరుగులుతీస్తారు. వశిష్ఠ మహర్షి దానిని గమనించి కుటీరం నుండి బయటకు వస్తాడు. విశ్వామిత్రుడు ఆమహర్షిని చూసిన వెంటనే అగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు వశిష్ఠుడు తన బ్రహ్మదండము ను అడ్డు పెడితే ఆ ఆగ్నేయాస్త్రం బ్రహ్మదండంలోకి చేరిపోతుంది.

అది చూసిన విశ్వామిత్రుడికి కోపం వచ్చి తనకు వచ్చిన అస్త్రాలు వరసగా ఒకదాని వెంట మరొకటి ప్రయోగిస్తాడు.
ఐషికాస్త్రం, వారుణాస్త్రం, రౌద్రాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతం, మానవాస్త్రం, ముసలం, గదలు, ధర్మచక్రం, విష్ణుచక్రం, బ్రహ్మపాశం, కాలపాశం, విష్ణుపాశం అనే వివిధ అస్త్రాలు వేసినప్పటికీ వశిష్ఠమహర్షి నిశ్చలుడై ఉంటాడు. చివరకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సన్నద్ధం కాగా సముద్రాలు పోర్లుతాయి, పర్వతాలు బ్రద్దలౌతాయి.

బ్రహ్మాస్త్రాన్ని సంధించి వశిష్ఠుడి మీద ప్రయోగిస్తాడు. అప్పుడు బ్రహ్మాస్త్రం కూడా వశిష్ఠుడి బ్రహ్మదండం లోకి చేరి పోతుంది.

 అది చూసిన విశ్వామిత్రుడు చింతించి, బ్రహ్మణ బలాన్ని క్షత్రియ బలం తో జయించడం జరగదని భావించి, తాను కూడా బ్రహ్మర్షి కావాలని భావిస్తాడు.

దక్షిణ తీరాన బ్రహ్మ గురించి తపస్సు

భార్యాసమేతంగా దక్షిణ తీరానికి వెళ్ళి బ్రహ్మ గురించి వెయ్యి సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేస్తాడు. ఆసమయంలోనే విశ్వామిత్రుడికి హనిషేంద్రుడు, మధుస్సందుడు, ధృఢనేత్రుడు, మహారథుడు అనే నలుగురు కుమారులు జన్మిస్తారు. చతుర్ముఖబ్రహ్మ ఆ తపస్సుతో ప్రీతి చెంది, "విశ్వామిత్రా నువ్వు రాజర్షి వి అయ్యావు" అని దీవించి అంతర్ధానమౌతాడు. విశ్వామిత్రుడు దానితో ప్రీతి చెందలేదు. "ఎప్పటికి నేను ఋషిని అవుతాను? ఎప్పటికి మహర్షి అవుతాను? ఎప్పటికి బ్రహ్మర్షిని అవుతాను?" అని చింతిస్తాడు.

త్రిశంకు స్వర్గం

ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజుకు ఒక విచిత్రమైన ఆలోచన కలుగుతుంది. తన పూర్వ వంశీయుల వలె కాక, తాను సశరీరంగా స్వర్గానికి చేరుకోవాలి అనే కోరిక పుడుతుంది. కులగురువులైన వశిష్ఠుడికి తన కోరిక విన్నవిస్తాడు. బొందితో స్వర్గానికి వెళ్ళడానికి తనచేత ఏదైనా యాగం చేయించుమని కోరగా అది కూడని పని, ధర్మశాస్త్ర విరుద్దమని వశిష్ఠుడు వారిస్తాడు.

అంతట వశిష్ఠుని నూరుగురు కొడుకుల వద్దకు వెళ్ళి తన ఇచ్ఛను ప్రకటిస్తాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం కూడని పని అని వశిష్టుని కుమారులు కూడా బోధిస్తారు. మీ వల్ల ఆ కార్యం కాకపోతే నేను వేరే గురువుని చూసుకొంటాను అని త్రిశంకుడు వశిష్ఠుడి కుమారులతో అంటాడు.

ఆ మాట విన్న వశిష్ఠకుమారులు కోపించి ఛండాలుడివి కమ్మని త్రిశంకుని శపిస్తారు. మరునాటి ఉదయానికి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఇనుప గొలుసులు గా మారిపోయి త్రిశంకుడు ఛండాలుడుగా మారిపోతాడు.

ఛండాలుడి గా మారిన త్రిశంకుడు దేశద్రిమ్మరిలా తిరుగుతూ దక్షిణ తీరంలో
తపస్సు ముగించిన విశ్వామిత్రుడి కంటపడి, తన వృత్తాంతాన్నంతా విశదీకరిస్తాడు. త్రిశంకుడి కథ విని సంతోషపడిన విశ్వామిత్రుడు వశిష్ఠుడు చెయ్యలేని పనిని తాను చెయ్యాలనే కోరికతో త్రిశంకుడికి అభయం ఇచ్చి,

తాను యాగం నిర్వహించి త్రిశంకుడిని సశరీరంగా ఛండాలావతారంతో స్వర్గానికి పంపుతానని చెబుతాడు. విశ్వామిత్రుడు తన కుమారులను పిలిచి సమస్త భూగోళంలో ఉన్న బ్రహ్మణులను యజ్ఞానికి అహ్వానించమంటాడు. వశిష్ఠుడి కుమారులు మరియు మహోదయుడు అనే  బ్రాహ్మణుడు యజ్ఞానికి రామన్నారని, మహోదయుడైతే క్షత్రియుడు చేయించే యజ్ఞంలో ఛండాలుడు హవిస్సులు ఇస్తే దేవతలు తీసుకోరని చెప్పాడనీ విశ్వామిత్రుని కుమారులు తండ్రికి విన్నవిస్తారు.

ఇది విన్న విశ్వామిత్రుడు క్రోధావేశంతో వశిష్ఠుని నూరుగురు కుమారులను భస్మరాసి అవుతారనీ, 700 జన్మలు శవమాంసాన్ని తింటూ బ్రతుకుతారనీ, ఆ తరువాత ముష్టికులుగా పుట్టి కుక్కమాంసం తింటూ బ్రతుకుతారనీ శపిస్తాడు. మహోదయుడు నిషాదుడిగా హీనమైన బ్రతుకు బ్రతుకుతాడనికూడా శపిస్తాడు. యాగంలో హవిస్సులు సమర్పిస్తుంటే హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రారు.

అది గమనించిన విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపుతాడు. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో గురుపుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గ ప్రవేశం లేదని, వచ్చిన దారినే పొమ్మని త్రిశంకుడిని భూలోకానికి నెట్టేస్తాడు. అలా నెట్టి వేయబడ్డ త్రిశంకుడు తలక్రిందులుగా పడిపోతూ, విశ్వామిత్రా! రక్షించు అని ఆర్తనాదం చేస్తాడు.

అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గమధ్యంలో ఆపి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి (స్వర్గాన్ని, నక్షత్రమండలాన్ని) చేయనారంభిస్తాడు. దీనిని గమనించిన దేవతలు విశ్వామిత్రుడితో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయడం తగదని వారిస్తారు. వారి అభ్యర్థన మేరకు త్రిశంకు ఉండే స్వర్గాన్ని నక్షత్రమండలా

నికి ఆవల సృష్టించి, త్రిశంకుడు తలక్రిందులుగా ఆ త్రిశంకు స్వర్గం లో ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు.

అంబరీషుడి అశ్వమేథం - శునశ్శేఫుడికి విశ్వామిత్రుడి మంత్రాలు:

త్రిశంకుడిని ఆవిధంగా త్రిశంకు స్వర్గానికి పంపిన తరువాత విశ్వామిత్రుడు తపస్సుచేసుకోవడం కోసమని పశ్చిమ దిక్కు కు చేరుకొంటాడు. ఆ సమయంలోనే ఇక్ష్వాకు వంశానికి చెందిన అంబరీషుడు అనే మహారాజు అయోధ్య ను పరిపాలన చేస్తూ అశ్వమేథ యాగం లోని భాగంగా అశ్వాన్ని విడిచి పెడతాడు.

ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరిస్తాడు.యాగం నిర్వహించే ఋత్విక్కులు అశ్వాన్ని వెతికి బలి ఇవ్వపోతే ప్రతికూలమైన చర్యలు జరుగుతాయి అనిచెప్పి దాని నివృత్తి కోసం అశ్వం తో సమానమైన పశువును తీసుకొని వచ్చి, అశ్వాన్ని పెట్టవలసిన స్థానం లో యూప స్తంభము నకు కట్టి ఉంచి బలి ఇవ్వాలని సూచిస్తారు.అశ్వంతో సమానమైన పశువు ని వెతికే పని మీద అంబరీషుడు తన రథం మీద వెళ్ళుతుండగా భార్యా సమేతంగా ఋచీకుడు అనే ఋషి భృతుంగ పర్వతం మీద కనిపిస్తాడు.

ఆ ఋషి కి తన కథచెప్పి యాగ సమాప్తి కొరకు సహాయం రూపం గా ఋషి కుమారుడిని అర్థిస్తాడు. మొదటి సంతానం పూర్వ కర్మ సుకృతం వల్ల జన్మిస్తుంది కనుక తన మొదటి సంతానాన్ని ఇవ్వ లేననీ, మిగిలిన సంతానం విషయమ్ లో తన భార్యను కనుక్కోవలసినదనీ ఋషి చెబుతాడు. చివరి సంతానం మైన శునేకుడిని ఇవ్వడానికి తల్లి నిరాకరిస్తుంది.

ఇక ఆమధ్య సంతానమైన శునశ్శేఫుడి ని అంబరీష మహారాజుకి దానమిచ్చేస్తాడు ఋచీకుడు. అంబరీషుడు ఆ ఋషికి మణులు,
మాణిక్యాలు, బంగారం, పది లక్షల గోవులు ప్రతిగా దానమిస్తాడు.
అంబరీషుడు శునశ్శేఫుడిని రథం ఎక్కించుకొని అశ్వమేథం చేసే స్థలానికి బయలు దేరుతాడు.

మార్గమధ్యంలో బడలిక తీర్చుకోవడానికి ఒక ప్రదేశం లో ఆగితే అక్కడ శునశ్శేఫుడికి విశ్వామిత్రుడు తపస్సు చేసుకొనే ఆశ్రమం కనిపిస్తుంది. శునశ్శేఫుడు విశ్వామిత్రుడి వద్ద కు వెళ్ళి తన కథంతా విన్న వించుకొని తనకు బ్రతికి ఉండవలెనని కోరిక ఉన్నదని, ఎంతో గొప్ప తపస్సు చేయాలనే తపన ఉన్నదని చెప్పగా విశ్వామిత్రుడు తన కుమారులను యాగం కోసం బలి గా వెళ్ళమంటాడు.

అది విన్న విశ్వామిత్రుడి కుమారులు "నాన్నా! నువ్వు చెప్పినది కుక్క మాంసం తిన మన్నట్లుంది, ఏవరినో రక్షించడం కోసం కుమారులను బలి ఇస్తావా?" అంటారు. విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడై కుమారులను వెయ్యి సంవత్సరాలు వశిష్ఠ కుమారులకు పట్టిన గతే పట్టు గాక (కుక్క మాంసం తినేవాళ్ళు గా అవుదురు గాక) అని శపిస్తాడు. (వరుసకు విశ్వామిత్రుడు శునశ్శేఫుడికి మేనమామ అవుతాడు పరశురాముడు జన్మవృత్తాంతం చూడండి).

అలా కుమారులను శపించాక విశ్వామిత్రుడు శునశ్శేఫుడి వైపు తిరిగి "శునశ్శేఫా! నీకు నేను అభయం ఇస్తునాను, నిన్ను తీసుకొని పోయి యూప స్తంభానికి కట్టేస్టారు, ఎర్రటి బట్ట కడతారు,రక్త చందనం పూస్తారు, నీవు కలత చెందకు, అశ్వమేథ యాగం వైష్ణవ యాగం కాబట్టి ఇంద్రుడు ప్రీతి చెందేటట్లు నేను నీకు రెండు మంత్రాలు ఉపదేశిస్తున్నాను, వేరే చింతన లేకుండా ఈ రెండు మంత్రాలను మనస్సులో మననం చేసుకో, యాగం సమాప్తి అవడానికి మునుపే ఇంద్రుడు వచ్చి యాగం తోసంతృప్తి చెందాను ,యాగానికి కోటి రెట్ల ఫలాన్ని ఇస్తున్నాను అని చెబుతాడు." అని అంటాడు.

ఇది విన్న శునశ్శేఫుడు ఏంతో ఆనందంతో అంబరీష మహారాజు రథం ఎక్కి యాగానికి చేరు కొంటాడు.యాగం లో శునస్సేఫుడిని యూపస్తంభానికి కట్టేస్తారు. అయినా శునశ్శేఫుడు కలత చెందక విశ్వామిత్రుడు ఉపదేశించిన రెండు మంత్రాలు బాగా మననం చేసు కొంటూఉంటాడు. దీనితో ప్రీతి చెందిన ఇంద్రుడు యాగ సమాప్తికి మునుపే వచ్చి యాగం తో సంతృప్తి పొందాను అని చెబుతాడు. అంతే కాకుండా శునశ్శేఫునికి దీర్ఘాయువు ఇవ్వడంతో శునశ్శేఫుడు యూప స్తంభం నుండి విడుదలై స్వేచ్చగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళి పోతాడు.

మేనకా విశ్వామిత్రుల క్రీడలు

ఆవిధంగా శునశ్శేఫుడిని పంపించేశాక మళ్లీ పశ్చిమ తీరంలోని పుష్కర క్షేత్రం లో తపస్సు మొదలు పెట్టబోతాడు. ఆసమయం లో మేనక పుష్కరక్షేత్రం లో స్నానం చేయడానికి వస్తుంది. మేనకను చూసి కాముకుడై విశ్వామిత్రుడు మేనక తో రమించడం ప్రారంభిస్తాడు. ఒకటి రెండు రోజులలో రతి క్రీడ ముగించి తపస్సు ప్రారంభిద్దాం అనుకొంటాడు కాని అది పది సంవత్సరాలకు చేరుకొంటుంది. ఇలా ఉండగా ఒక రోజు విశ్వామిత్రుడికి పది సంవత్సరాలు అయిపోయాయి అని స్ఫురణలోకి వస్తుంది. ఇది దేవతల పని అని గ్రహించి, కామక్రోధాలకు వశుడునైయ్యాను అని భావించి పశ్చిమ తీరం నుండి మరల బయలు దేరి ఉత్తరాన హిమాలయా లకు చేరుకొంటాడు. మేనక,తనకు విశ్వామిత్రుడికి జన్మించిన ఆడుబిడ్డను మేనక అక్కడే విడిచి వెళ్ళి పోతుంది. అప్పుడు ఆ బిడ్డను పక్షులు తమ రెక్కల సహాయం తో నీడ కల్పించి రక్షిస్తాయి. ఆ మార్గంలో శిష్యులతో వెళ్ళుతున్న కణ్వ మహర్షి ఆ బాలిక ను చూసి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్లి, పెంచుతాడు కణ్వుడు ఆ బిడ్డకు శకుంతల అని నామకరణం చేసి పెంచి పెద్దచేస్తాడు. శకుంతల దుష్యంతుని వివాహము చేసుకొని తద్వారా భరతుని కి జన్మనిస్తుంది. ఈ భరతుని పేరు మీదగానే భారత దేశానికి భరతఖండమని పేరువచ్చిందని ప్రతీతి.
శకుంతల జన్మించిన కణ్వాశ్రమ ప్రాంతము భారతదేశములో వివిధ ప్రాంతాలలో ఉన్నదని చెపుతున్నప్పటికీ, రూఢిగా తెలియడంలేదు.

ఉత్తర తీరంలో తపస్సు - మహర్షి అవడం

ఉత్తర తీరానికి వెళ్ళి,అత్తగారైన సత్యవతి కౌశికి నది రూపం లో ఉండగా అక్కడ ఘోరాతి ఘోర మైన తపస్సు చేయనారంభించాడు.( పరశురాముడి జన్మ వృత్తాంతం చూడండి). వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసేటప్పటికి ఆ తపస్సుకి ప్రీతి చెంది చతుర్ముఖ బ్రహ్మ వచ్చి "విశ్వామిత్రా! నీ తపస్సుకి మెచ్చాను. నువ్వు మహర్షి వి అయ్యావు" అని అంటాడు. విశ్వామిత్రుడు బాధ పడక, ఆనందించక బ్రహ్మతో తాను జితేంద్రియుడిని అయ్యానా అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానం గా బ్రహ్మ ఇంకా జితేంద్రుడివి కాలేదు ఇంకా తపస్సు చేయ వలసి ఉంది అని చెప్పి అంతర్ధానం అవుతాడు.బ్రహ్మ అదృశ్యమై పోయాక మళ్ళీ ఘోరాతి ఘోరమైన తపస్సు చేయడం ఆరంభిస్తాడు. గ్రీష్మ ఋతువు లో పంచాగ్ని హోత్రం మధ్య నిలబడి, శిశిర ఋతువు లో నీళ్ళలో నిలబడి చేస్తున్న తపస్సుకు ఇంద్రుడు కంగారు పడి, పరీక్ష కోసంరంభ ను విశ్వామిత్రుడి వద్దకు పంపిస్తాడు. రంభ సంకోచిస్తుంటే ఇంద్రుడు తాను, వసంతుడు, మన్మథుడు ఆమె వెంట వస్తామని చెబుతారు. రంభ విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేరుకోగా, ఆశ్రమమంతావసంత ఋతువు లా మారిపోయింది. ఆశ్రమం అంతా వసంత ఋతువు లా మారిపోవడం తో విశ్వామిత్రుడికి సందేహం వచ్చి ఇది అంతా ఇంద్రుడి మాయ అని గ్రహించి, రంభ తనను ప్రలోభ పెట్టడానికి వచ్చి నట్లు గ్రహించి, ఆమె పదివేల సంవత్సరాలు పాషాణ రూపంగా మారిపోయేటట్లు శపిస్తాడు. ఆ తరువాత క్రోధ వశుడనైనాను అని భావించి,రంభ తో బ్రాహ్మణోత్తముడు ఆవిడను ఉద్ధరించగలడు అని శాపవిమోచనం చెప్పి తూర్పు తీరానికి తపస్సు చేసు కోవడానికి వెళ్ళి పోతాడు.

బ్రహ్మర్షి అవడం

విశ్వామిత్రుని బ్రహ్మర్షిగా ప్రకటిస్తున్న బ్రహ్మ మరియు ఇతర దేవతలు
విశ్వామిత్రుడు తూర్పు దిక్కుకు వెళ్ళి మౌనంతో కామక్రోధాలను నిగ్రహిస్తు బ్రహ్మాండమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ మారు తపస్సులో కుంభకం అనే ప్రక్రియను ఉపయోగించి శ్వాస తీసుకోవడం విడిచి పెట్టడం మానేస్తాడు. ఆవిధంగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే శరీరం కాష్ఠం క్రింద (ఒక పుల్ల లా) మారిపోయింది. ఆ కాష్ఠాన్ని నిలబెట్టు కోవడం కోసం ఒకరోజు ఇంత అన్నం తినడం కోసం కూర్చొండగా ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్ష అడుగు తాడు. విశ్వామిత్రుడు అది గ్రహించి ఇంద్రుడుకి తాను తిన బోయే అన్నాన్ని (కబలం)ఇచ్చేస్తాడు.మళ్లీ కుంభకం అనే తపస్సు చేయనారంభిస్తాడు. అప్పుడు ఆయన బ్రహ్మ స్థానం నుండి పొగ వచ్చి లోకాలను కప్పేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి కౌశికా! బ్రహ్మర్షీ! అని పిలిస్తే సంతోషించి, బ్రహ్మ ను ఒకకోరిక కోరుతాడు. వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది
అంటాడు. అప్పుడు దేవతలు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడి మనోగతాన్ని వ్యక్తం చేస్తారు. వశిష్ఠుడు విశ్వామిత్రుడి కోరిక మేరకు బ్రహ్మర్షి అని పిలిస్తే విశ్వామిత్రుడు సంతోషించి వశిష్ఠుని కి అర్ఘ్యపాద్యాలు ఇస్తాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతాడు.

అయితే... వశిష్ఠుడు విశ్వామిత్రుడిలో మార్పును గ్రహించేందుకు పరీక్ష పెడతాడు. "బ్రహ్మర్షీ" అని పిలిపించుకునేందుకు తహతహలాడడం చూసి, ఇంకా అతనిలో కొంత అహం ఉందని గుర్తిస్తాడు. దీంతో తొలుత అతన్ని "రావయ్య పిలుస్తాను" అని ఆహ్వానిస్తాడు. దగ్గరకు రాగానే "ఇక్కడికెందుకొచ్చావ్? వెళ్లు" అంటూ గద్గద స్వరంతో దూరంగా వెళ్లమంటాడు. దీంతో  విశ్వామిత్రుడు సౌమ్యంగా ఆయనకు నమస్కరించి వెళ్తుండగా... మళ్లీ "అదేంటి...? వచ్చిన పని ముగించకుండా వెళ్లిపోతున్నావ్?" అనడంతో విశ్వామిత్రడు మళ్లీ నమస్కరించి ముందుకు రావడం... వశిష్టుల వారు చీదరించుకోవడం జరిగింది. అలా నాలుగైదు మార్లు జరిగాక... విశ్వామిత్రుడిలో పూర్తిగా కోపం పోయిందని, ఆయన బ్రహ్మర్షిగా అర్హుడని భావించాక "బ్రహ్మర్షీ" అని పిలుస్తాడు.

వారసత్వం (విశ్వామిత్ర గణ గోత్ర ప్రవరలు)

హిందూ వర్ణవ్యవస్థ లో విశ్వామిత్ర , కౌశిక గోత్రాలకు చెందినవారు విశ్వామిత్రుడు తమ వంశానికి ఆది పురుషునిగా భావిస్తారు. విశ్వామిత్ర గోత్రజులు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు తమ మూలపూరుషునిగా భావిస్తారు. వీరిలో చకిత విశ్వామిత్ర గోత్రము అనే ఉపశాఖ కలదు. ఈ ఉపశాఖకు చెందినవారు విశ్వామిత్రుని ఆశ్చర్యమునుండి ఉద్భవించినారని వారి నమ్మకం.

అయితే ఇది కేవలం ప్రధానశాఖ నుండి ఉద్భవించిన ఒక చీలిక వర్గమే అన్నది మరింత సమంజసమైన తర్కము. అలానే, కామకాయన విశ్వామిత్ర అనే గోత్రము దక్షిణ భారతదేశము లో కనిపిస్తుంది.

కౌశిక గోత్రజులు రాజర్షి కౌశికుడు తమ మూలపురుషుడని అంగీకరిస్తారు. విశ్వామిత్రుని ప్రతినామమే కౌశికుడు. 96 మరాఠా వంశాలలో 11 రాజవంశాలు కౌశిక గోత్రానికే చెందినవి. ప్రసిద్ధి చెందిన ఛత్రపతి శివాజీ వంశము, రాష్ట్రకూట వంశములు కౌశిక గోత్రానికి చెందినవేనని భావిస్తారు. మరాఠా వంశాలలో రెండు వంశాలు విశ్వామిత్ర గోత్రానికి చెందినవి.
విశ్వామిత్ర , కౌశిక గోత్రాలకు చెందినవారు ఉత్తరాదిన క్షత్రీయులలో ఎక్కువగాను, దక్షిణాదిన బ్రాహ్మణులలో ఎక్కువగా కనిపిస్తారు. సూర్యవంశమునకు చెందిన బైష్ రాజపుట్ వంశము నకు కౌశిక గోత్రము కలదు.

సంస్కృతిలో విశ్వామిత్రుడు

విశ్వామిత్రుడు భారతీయ సంస్కృతికి గాయత్రీ మంత్రంతో పాటు, భారతీయ భాషలకు త్రిశంకు స్వర్గం అన్న పదాన్ని కూడా అందించాడు. అటుఇటు కాక నట్టనడుమ కొట్టుమిట్టాడే పరిస్థితిని త్రిశంకు స్వర్గమనటం నేటికీ పరిపాటే.

" బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసా స్మ సు తోషితాః |
బ్రాహ్మణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక " ||

ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్నుబ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితో.......నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము,వషట్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు( ఓంకారము, వషట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు, అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు.
అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు. ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు.
బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు.

నీతి మనం తెలుసుకోవలసినది

◆ ఎంత నియమ నిష్ఠలతో సాధన తపస్సు చేసినా కామం క్రోధం ద్వేషం అంతః కరణం లో ఉంటే సాధన వ్యర్ధం అవుతుంది.

◆ ఒక కుండ నిండా అమృతం నింపి అందుకు కామము క్రోధము ఇత్యాది రంధ్రాలు పెట్టిన ఆ అమృతం అందులోనుండి కారిపోతుంది వ్యర్థమైపొతుంది.ఈ ప్రక్రియ కి కుండకి కానీ అమృతానికి కానీ ఎలాంటి బాధ్యత ఉండదు.
అలాగే మనలో ఉన్న కామము క్రోధము ఎవరో మనల్ని గుర్తించాలి అని ఎవరో మనల్ని విలువ చేసి మర్యాదలు చేయాలని అనుకుంటూ చేసిన కాస్త సాధన ఫలం వ్యర్థం చేసుకోకూడదు...

ఎవరి కర్మ వారిదే ఎవరి గమ్యం వారిదే ... ఒక ఇంట్లో పుట్టినా ఒక ఊరిలో పెరిగినా ఒక గురు వద్ద విద్యాభ్యాసం చేసినా ఎవరి కర్మని అనుసరించి మరియు వారి అంతః కరణ శుద్ధిని అనుసరించి వారికి ఫలితం ఉంటుందనేది సత్యం.

నేడు మానవులు సత్యం మరచి ఇతర మనుషుల యొక్క చేష్టల వల్ల ప్రభావితులు అయ్యి...
అనవసరమైన మానసిక చింత లో ఉండటం లాభం లేనిది అని తెలుస్తున్నది....

ఉత్తమమైన నీతి ఏమిటంటే మనము, మన ఉన్నతి కేవలం మన సాధన తపస్సు మరియు మన పవిత్రత వల్ల మాత్రమే కలుగుతుంది కానీ ఇతరుల వల్ల మనకి మంచి జరుతుందేమో కానీ చేడు మాత్రం ఒక 10శాతం మాత్రమే జరుగుతుంది మిగతా 90 శాతం మన వల్ల మనకే...

ప్రపంచం.మారాలంటే మనం మారాలి....

ఆదిశంకరులు ఒక చోట ఇలా సెలవిచ్చారు " ఏ మానవుడు ఆశకి లోబడి ఉంటాడో అతడు ప్రపంచానికి వశుడై కష్టాల పాలు అవుతాడు అలాగే ఎ మానవుడికి ఆశ లోబడి ఉంటుందో ఆతడికి లోకమే వశమై ఉంటుంది "

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...