ఆదిశంకరులు ఈ భువిపై జీవించినది కేవలం 32 సంవత్సరాలే. అయినా ఎన్నో వేల సంవత్సరాలకు సరిపడా ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి అందించి చిరస్మరణీయులయ్యారు. ఒకవైపు బౌద్ధమత వ్యాప్తి, మరొకవైపు శైవులు, వైష్ణవులు తాము గొప్పంటే తాము గొప్పని వాదించుకునే రోజుల్లో ఆదిశంకరులు ఈ నేలపై అవతరించారు. పుట్టింది కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో. ఆసేతు హిమాచలం మూడుసార్లు పర్యటించి, తన బోధలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. భారతదేశంలో శైవులు, వైష్ణవులతో పాటు శాక్తేయులు, గాణాపత్యులు, సూర్యోపాసకులు సైతం ఉండేవారు. వారు ప్రాంతాలవారీగా చీలిపోయి ఒకరిని ఒకరు దూషించుకుంటూ, కొట్లాడుకొంటూ కాలాన్ని వృథాపరచడం చూసి శంకరులు తీవ్రంగా వ్యధ చెందారు.
ఆ తరుణంలోనే శంకరాచార్యులు అద్వైతమతాన్ని స్థాపించారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి సిద్ధాంత భావజాలం వ్యాప్తిచేసి, తనలో ఉన్న దైవాన్ని ముందు దర్శించి, ఎదుటివారిలోనూ దైవాన్ని దర్శించి తరించమనే బోధతో పలువురిని ఆకట్టుకున్నారు. పరమశివుడు, మహావిష్ణువు వేరు కాదు. వివిధ రూపాల్లో కనిపించినా ఇరువురూ ఒక్కరే అని చాటిచెప్పి, 'శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే' అని ప్రబో ధించారు. అజ్ఞానాన్ని పారదోలి వివేకవంతులను చేశారు. సూర్యుణ్ని, గణపతిని, అమ్మవారిని, పరమశివుణ్ని, మహావిష్ణువును ఆరాధ్యదేవతలుగా, ఇష్టదైవాలుగా నమ్మి పూజించే ఎవరినీ నిరాశపరచకుండా, ఏ దైవాన్నీ ద్వేషించకుండా అందర్నీ ఒక పీఠంపైనే కూర్చోబెట్టి పూజ చేయవచ్చని నచ్చజెప్పి పంచాయతన పూజను ప్రోత్సహించారు.
పంచాయతన పూజలో ఇష్టదైవాన్ని పీఠంపై మధ్య భాగాన ప్రతిష్ఠించి పూజిస్తారు. ఉదాహరణకు శ్రీ మహావిష్ణువు ప్రీతి అయినవారు విష్ణువును మధ్యలో ఉంచి మిగతా నాలుగు మూలలా అంబికను, పరమశివుని, సూర్యనారాయణమూర్తిని, గణపతిని ప్రతిష్ఠించి, పూజించమని బోధించారు. శివుడు ఆరాధ్యదైవమైతే మధ్యలో శివుణ్ని, అలాగే గణపతి, అంబిక, సూర్యుణ్ని కూడా ఉంచి పూజించవచ్చని తెలియజేసి అందర్నీ శాంతింపజేశారు. ఆదిశంకరులు దూరదృష్టితో ఈ పంచాయతన పూజను ప్రోత్సహించారు. ఏ దేవతను పూజించినా భక్తి ప్రధానమని, నదులన్నీ చివరకు సాగరాన్ని చేరినట్లు మనం చేసే పూజలూ ఇష్టదైవానికే చెంది భగవంతుడు అందరినీ అనుగ్రహిస్తాడని చెప్పి పలువురి కనులు తెరిపించి జగద్గురువులుగా ప్రసిద్దిచెందారు.
ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం చెప్పడమే కాకుండా పలు దేవతాస్తోత్రాలు రచించారు. తన వాక్చాతుర్యంతో మేధస్సుతో, పెక్కుమంది పండితులతో వాదించి వారిని ఓడించి శిష్యులను చేసుకున్నారు. అద్వైత మతాన్ని దేశవ్యాప్తంచేసి, హిందూ ధర్మాన్ని నిలబెట్టి భారతీయులకు, ఈ విశ్వానికి ఎనలేని సేవ చేశారు. దేశంలో ఎన్నో దేవాలయాలను పునరుద్ధరింపజేసి, పూజాదికాలు సక్రమంగా జరిగేటట్లు ఏర్పాట్లు చేశారు. శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం వంటి మహద్గ్రంథాలను లోకాలకు అందించారు.
ఆది శంకరులు దూరదృష్టితో ఆలోచించి దేశం నలుమూలలా నాలుగు పీఠాలను ఏర్పాటు చేసి, హిందూధర్మం శాశ్వతంగా నిలిచేటట్లు చేశారు. దేశంలో నాలుగు దిక్కులా- ఉత్తరాన హిమాలయాల దగ్గర బదరీనాథ్‌లో, పశ్చిమాన ద్వారకలో, తూర్పున పూరీజగన్నాథ్‌లో, దక్షిణాదిన శృంగేరిలో పీఠాలు నెలకొల్పారు. తన ముఖ్య శిష్యులను పీఠాధిపతులు చేశారు. మానవాళి ధర్మపథంలో నడవడానికి మార్గదర్శకులుగా వ్యవహరించారు. ఇది మానవాళి తరించడానికి ఆదిశంకరులు పెట్టిన భిక్ష!
#ఈశ్వరతత్త్వం
పరమేశ్వరుడు ఎంతో సాత్వికుడు, బోళా శంకరుడు. పిలిస్తే చాలు పలుకుతాడు. ఆర్తిగా ప్రార్ధిస్తే అక్కున చేర్చుకుంటాడు. భక్తులను ఇట్టే కరుణిస్తాడు. ముందూ వెనుకా ఆలోచించకుండా కోరిన వరాలు ఇచ్చేస్తాడు. నిరాడంబరతకు సంకేతంగా నిలిచే శివుడిని చూసినా, ఆయన నివాసమైన మరుభూమిని తలచుకున్నా మనసులో వైరాగ్యభావం జనిస్తుంది. పండితులైనా, పామరులైనా, మూగ జీవులైనా,శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, భక్తే ప్రధానం కానీ ఎటువంటి ఆడంబరాలు అవసరం లేదని చాటిచెప్పిన భక్త సులభుడు ఈశ్వరుడు. అందరిని సమ దృష్టితో చూసే శివుడు అహాన్ని, భేద భావనను సహించడు అని తెలిపే రెండుమూడు కధలు సంక్షిప్తంగా చూద్దాము.
ఒకనాడు శంకరాచార్యులవారు గంగానదిలో స్నానంచేసి వస్తున్నారు. జనం ఎవరికవారే మర్యాదపూర్వకంగా ఇటూ అటూ జరిగి చేతులు మోడ్చుకుని వినయంగా దారి ఇచ్చి నిలబడ్డారు. అందరినీ చిరునవ్వుతో చూస్తూ ప్రసన్న వదనంతో శంకరాచార్యులు ముందుకు నడిచారు. అక్కడి మాసి చిరిగిన బట్టలతో, దుమ్ముతో మలినమైన శరీరంతో, చింపిరి జుట్టుతో చేత కఱ్ఱపట్టుకుని ఒక వ్యక్తి అడ్డంగా నిలబడ్డాడు అతని కళ్ళల్లో నిర్లక్ష్యం. అతనికి తోడు అతని వెంట దుర్గంధం వ్యాపింపచేస్తూ నాల్గు కుక్కలు కూడా ఉన్నాయి. అవి కూడా వాటి యజమాని సరసన తోకాడిస్తూ నిలచిఉన్నాయి.
శంకరాచార్యులవారి శిష్యులకి ఆగ్రహం వచ్చింది. ఏయ్ ! ఎవరు నువ్వు ? తప్పుకో. పక్కకు జరుగు. కన్పించడంలా ? మా గురువుగార్ని చూసి మహామహులే దారి ఇచ్చారే. నువ్వు మాత్రం కదలకుండా అలా నుంచున్నావ్. ఎంత నిర్లక్ష్యం ? జరుగు జరుగు అన్నారు. చూడబోతే ఛండాలుడు లాగా ఉన్నాడు అని వారు గుణుగుకున్నారు. శంకరాచార్యులవారు అతన్ని చూస్తూ ఆగిపోయారు. అతడిని శిష్యులు పరుషంగా మాట్లాడినందుకు నొచ్చుకుంటున్నట్లుగా నాయనా ! తప్పుకుంటావా ? అని అన్నారు ప్రేమగా. తప్పుకుంటాను. కాని ముందు ఇది చెప్పు. నువ్వు తప్పుకోమన్నది ఆత్మనా ? ఈ శరీరాన్నా ? శరీరమా ? అంటే ఇది అస్వతంత్రమైన ఒక కీలుబొమ్మ. ఆత్మ నా అంటే ఆత్మ అఖండమనీ అద్వితాయమనీ సచ్చిదానంద స్వరూపమనీ. నీవే ఉపన్యాసాలు ఇస్తున్నావుకదా ! నేను బ్రాహ్మణుడనైనా చండాలుడనైనా అందరిలాగా అన్నమయమైన దీన్ని గురించి నీకెందుక ఇంత బేధభావము ? అహంకారం పూర్తిగా నశించనిదే అహం బ్రహ్మాస్మి అని ఎలాబోధిస్తావో నాకు చెప్పు. నువ్వూ నేనూ వేరా ? అదీ చెప్పు అన్నాడు.
శంకరాచార్యుల మదిలో ఆనంద తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ఎక్కడో గ్రామలకి దూరంగా విద్యలకు నాగరికతకూ దూరంగా మురికివాడలలో నివసించే మురికి వానిలాగ కనిపించే ఈతడు మహాజ్ఞాని. ఆత్మవిద్యను అవపోసన పట్టిన పునీతుడు. చండాలుడు అయితే అగుగాక. ఇతడు నాగురుతుల్యుడు అని భావించుకోగానే బ్రహ్మాండమంతా ఒక్కటిగా భాసించి అనంద తత్త్వాన్ని అందించినట్లయ్యింది.
సాక్షాత్తు పరమశివుడే నాలుగు వేదాలతో వచ్చాడని గ్రహించి, భక్తి భావంతో మహాదేవుడిని మనీషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశాడు. శంకరునికి పరమశివుడు ఆయన తదుపరి కర్తవ్యాన్ని ఈవిధంగా వివరించాడు: "వేదవ్యాసుడు క్రమబద్ధీకరించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు భాష్యాలు వ్రాయాలి. ఆ భాష్యాలు, అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను సరిదిద్దేటట్లు ఉండాలి. వాటిని ఇంద్రుడు కూడా పొగిడేటట్లు ఉండాలి. తరువాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి, సంరక్షణకు దేశం నలు మూలలకూ శిష్యులను పంపాలి." ఇలా కర్తవ్యాన్ని బోధించి, ఆ పనులు అయ్యాక, నన్ను చేరుకుంటావు అని చెప్పి, శివుడు అంతర్ధానమయ్యాడు.
పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో కాశీలో వుండి తపస్సు చేసుకోసాగాడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయనని పరీక్ష చేయాలనిపించింది. మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్ళిన ఆయనకుగానీ ఆయన శిష్యులకుగానీ పార్వతీ పరమేశ్వరుల ప్రభావంవల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు. అలా మూడు రోజులయింది. ఈ మూడు రోజులూ వారికి ఏ ఆహారమూ లేదు. అలా ఎందుకు జరుగుతోందో ఆయనకు అర్ధంకాలేదు. సాక్షాత్తూ అన్నపూర్ణ నిలయమైన కాశీలో తమకు ఆహారం దొరకకపోవటమేమిటి ? కాశీవాసులకు ఇహంలో అన్ని సౌఖ్యాలూ వుండి అంత్యకాలంలో మోక్షం లభిస్తుంది. అందుకే వారికి అహంకారం పెరిగి తమకు భిక్ష పెట్టంలేదని కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయనకి ఆలోచన రాలేదు. మూడు తరాలవరకు కాశీవాసులకు ఏమీ దొరకకూడదు అని శపించబోయాడు. అతని మనసులో మాట బయటకు రాకుండానే ఒక పెద్ద ముత్తయిదు రూపంలో పార్వతీ దేవి వచ్చి వారిని భిక్షకు పిలిచి తృప్తిగా భోజనం పెట్టింది. తర్వాత నెమ్మదిగా చివాట్లూ పెట్టింది. మూడు రోజులు అన్నం దొరకకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మరచిపోయావే, అష్టాదశ పురాణాలూ ఎలా రాశావయ్యా అని నిలదీసింది. కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు వూరుకుంటాడా అని నిలదీసింది. ఇంతలో విశ్వేశ్వరుడూ ప్రత్యక్షమయి కాశీలో కోపిష్టులు వుండకూడదని వ్యాసుణ్ణి ఐదు కోసుల దూరంలో గంగకు ఆవలి ఒడ్డున నివసించమని శాసించాడు. వ్యాసుడు పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తే , ‘’వ్యాస నిష్కాసనం ‘’చరిత్ర సృష్టిస్తుందని ఊరడించి, ప్రతి అష్టమి నాడును ,ప్రతి మాస శివరాత్రి నాడును కాశీ ప్రవేశమునకు వ్యాసునికి అనుమతి నిచ్చాడు దయామయుడైన విశ్వేశ్వరుడు.
కాశీలో 'గవ్వలమ్మ' అనే గ్రామదేవత ఉంటుంది. ఈమెకు ఐదు గవ్వలు కలిపి అల్లిన మాలను భక్తులు సమర్పిస్తూ ఉంటారు. ఈమె విశ్వనాధుని సోదరి అని ప్రతీతి.
మడి, ఆచారాలు ఎక్కువగా ఉన్న గవ్వలమ్మ, కాశీ నగరంలో అందరినీ 'తప్పుకోండి, మడి, మడి...' అని ఒకటే విసిగించేదట ! రెండు మూడు మార్లు మందలించి, నచ్చజెప్పబోయిన విశ్వేశ్వరుడి ప్రయత్నం ఫలించకపోవడంతో... కోపించిన స్వామి... ఆమెను మాలపేటలో పడి ఉండమని, విసిరేసారట ! అందుకే, కాశీలో మడి, ఆచారాల పేరుతో ఎవరూ, మితిమీరి వ్యవహరించరాదట !
ఇది శివపురం... కాశీ, కేదార క్షేత్రాలు శివునికి అత్యంత ప్రీతిపాత్రం. అనుక్షణం శివభక్తులు, అదృశ్య దేవతలు, సకల జీవరాశులు జపించే పంచాక్షరీ మంత్రం మార్మ్రోగే కాశీలో... అహాన్ని, కోపాన్ని, భేద భావనలను వీడి, అనుక్షణం అత్యంత అప్రమత్తంగా మెలగాలని, గుర్తుంచుకోవాలి ! భక్తితో చేసే ప్రార్దనే శివానుగ్రహానికి రాచమార్గం !ఓం నమః శివాయ.
No comments:
Post a Comment