Thursday, May 10, 2018

ఆంజనేయస్వామికి వడమాల ఎందుకు?

హనుమంతుని ప్రసన్నం చేసుకునేందుకు 108 వడలతో చేసిన మాలని ఆయన విగ్రహానికి అలంకరించడం తెలిసిందే! మినప్పప్పు, మిరియాలు దట్టించిన ఆ చిట్టి వడలను స్వామివారి మెడలోంచి ఎప్పుడు తీస్తారా అని పిల్లలు ఎదురుచూడటమూ తెలిసిందే! దక్షిణాది రాష్ట్రాలలో అడుగడుగునా కనిపించే ఈ వడమాల వెనక ఓ విశిష్టత ఉందంటున్నారు పెద్దలు.

 హనుమంతుడు చిన్నతనంలో మహా చిలిపివాడన్న విషయం విదితమే! బాలహనుమాన్ సూర్యుడిని మింగిన గాథ, ఆయన బాల్యచేష్టలలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఆ గాథ ప్రకారం - సూర్యుడిని ఎర్రటి పండుగా భావించిన ఆంజనేయుడు దాన్ని తినేందుకు బయల్దేరతాడు. అదే సమయంలో సూర్యగ్రహణానికి కాలం సమీపించడంతో రాహువు కూడా సూర్యుని మింగేందుకు బయల్దేరతాడు. తనకు దారిలో అడ్డువచ్చిన రాహువుని ఒక్క తాపు తన్ని మరీ హనుమంతుడు సూర్యుని మింగబోతాడు. జరుగుతున్నదంతా తెలుసుకున్న ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఆంజనేయుని మీదకు ప్రయోగిస్తాడు. ఆ వజ్రాయుధంతో ఆంజనేయుని దవడ (హను)  గాయపడుతుంది. అప్పటి నుంచి ఆంజనేయునికి హనుమంతుడు అన్న పేరు స్థిరపడిపోయింది. ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు జరిగినదానికి కోపగించుకుని, లోకం నుంచి తన పవనాలను ఉపసంహరించుకుంటాడు. దాంతో దేవతలంతా దిగివచ్చి ఆయనను శాంతింపచేసి, ఆంజనేయునికి సకల వరాలూ అందిస్తారు.

 ఈ కథ మనం తరచూ చెప్పుకొనేదే! ఈ సందర్భంలో ఆంజనేయుని పరాక్రమానికి రాహువు సైతం ముగ్ధుడైపోయాడట. రాహువుకి మినుములు అంటే ప్రీతి. అందుకే రాహుదోషాలు ఉన్నవారు మినుములని దానం చేయాలని సూచిస్తుంటారు. కాబట్టి ఇకమీదట హనుమంతునికి ఎవరైతే మినుములతో చేసిన ప్రసాదాన్ని సమర్పిస్తారో, వారిని తాను కూడా అనుగ్రహిస్తానని రాహువు పేర్కొన్నాడట. రాహువు సర్పాకారంలో ఉంటాడు కాబట్టి... వడలతో చేసిన మాల కూడా సర్పాకారంలోనే ఉండేట్లుగా స్వామివారికి అలంకరిస్తుంటారు. ఇక హైందవ ధర్మంలో 108 సంఖ్యకి ఉన్న ప్రాధాన్యతని కాబట్టి... వీలైనంతవరకూ, 108 వడలతో మాలను రూపొందిస్తుంటారు.

వడమాలకు వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది. ఆంజనేయుడు పుట్టింది శనివారమే అని పురాణాలు పేర్కొంటున్నాయి. ఆ శనివారానికి అధిపతి శనీశ్వరుడే కదా! కాబట్టి శనీశ్వరునికి ఇష్టమైన పదార్థాలను హనుమంతునికి ప్రసాదంగా అందిస్తే... అటు ఆంజనేయుడు, ఇటు శనీశ్వరుడూ ఇద్దరూ అనుగ్రహిస్తారు. నల్లటి పదార్థం ఏదైనా శనీశ్వరునికి ఇష్టమే! కాబట్టి మినుములతో చేసిన వడలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.

వడమాలకి ఓ లౌకికమైన కారణం కూడా కనిపిస్తుంది. ఔషధపరంగా మినుములకి ఉన్న ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. మినుములతో చేసిన ఆహారాన్ని తింటే అంతులేని బలం వస్తుంది. మరి బలానికి మారుపేరైనా హనుమంతుని పేరు చెప్పి ఆ మినపవడలని నలుగురికీ పంచితే... అంతా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటారు కదా!

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...