Tuesday, May 22, 2018

భృగు మహర్షి

భార్గవస గోత్రీకులకు గోత్ర పురుషుడు భృగువు. కానీ, 'భార్గవుడు' అనగానే మనకు భార్గవరాముడు గుర్తుకు రావటం సహజం. 'భార్గవరాముడు' అంటే పరశురాముడు. 'భృగు' శబ్దంలోంచి వచ్చిందే భార్గవుడు. భార్గవరాముడు లేదా పరశురాముడు భృగు వంశంలోని వాడే.

భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రుడైన ప్రజాపతి మరియు సప్తర్షులలో ఒకరు.మొట్టమొదటి జ్యోతిష రచయిత మరియు వేదాల కాలంలో రచించిన భృగు సంహిత కర్త. భృగు మహర్షి బ్రహ్మహృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు.

'భృగు' శబ్దానికి తెలుగులో ప్రథమావిభక్తి ప్రత్యయం అయిన 'వు' చేరటంవల్ల ఆయన పేరు 'భృగువు' అయింది.
భృగువు నవ ప్రజాపతులలో ఒకడు. సప్తర్షులలో ఒకడు.

భృగువు మహర్షి బంధుత్వాలు

భృగు మహర్షి, దక్షప్రజాపతికి అల్లుడు. దక్షుని కుమార్తె ఖ్యాతికి ఆయన భర్త. ఈ దంపతులకు ధాత, విధాత అని ఇద్దరు కుమారులు.
దక్షుని అల్లుడు గనుక, దక్షయజ్ఞం సమయంలో భృగువుకూడా ఉన్నాడని వాయుపురాణం చెప్తోంది.

యజ్ఞాల ప్రస్తావన వచ్చింది కనుక, ఇక్కడ తప్పక చెప్పుకోవాల్సిన విషయం ఒక్కటి ఉంది. యజ్ఞాలలో దేవతలకు సోమరసాన్ని నివేదించే విధానాన్ని భార్గవ వంశమునులే ప్రవేశపెట్టారు.

ఈయనకు పౌలోమ అనే మరో భార్య ద్వారా శుక్రుడు, చ్యవనుడు అనే కుమారులూ ఉన్నారు.

భృగువు కుమారుడైన చ్యవనుడి కుమారుడు ఋచిక. ఆయన కుమారుడు జమదగ్ని. జమదగ్ని కుమారుడు పరుశురాముడు. అంటే భృగువు, పరశురాముడికి ముత్తాత తండ్రి అవుతాడు. 

భృగువు, భరద్వాజ మహర్షులు సమకాలికులని మహాభారతం పేర్కొంటోంది.

భృగువు అతి గొప్పవాడని అంటారు. దీనికి సాక్ష్యంగా వారు, శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా 'నేను ఋషులలో భృగువును' అని చెప్పటాన్ని ఉటంకిస్తారు.

భృగుమహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష్య శాస్త్ర పితామహుడు మరియు ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం భృగుసంహిత దానికొక తర్కాణం. ఈ గ్రంథంలో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిసశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. భృగుమహర్షి ఒక గొప్ప ధర్మశాస్త్రప్రవక్తగా కాత్యాయనుడు పేర్కొన్నాడు.  అయితే, భృగువు సంకలించిన ఈ గ్రంథంలో అత్యధిక భాగం, నలందా విశ్వ విద్యాలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు కాలిపోయింది. 

శ్రీ వేంకటేశ్వరుని కథలో భృగు మహర్షి

 శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమలలో వెలియటానికి వెనుక ఉన్న ఐతిహ్యంలో భృగు మహర్షికి చెప్పుకోదగిన పాత్ర ఉంది.                  ఆ ఐతిహ్యం:

నైమిశారణ్యంలో ఉన్న మునిపుంగవులకు ఒకసారి ఒక పెద్ద సందేహం వచ్చింది. ఉన్నది త్రిమూర్తులే అయినా, వీరిలోనూ సత్వ, తమో, రజో గుణాలకు అతీతులు (త్రిగుణాతీతులు) ఎవ్వరు అనేదే ఈ సందేహం. సందేహం కలిగిన తర్వాత, దాన్ని నివృతి చేసుకోవటం తప్పనిసరి గనుక ఆ విషయం తేల్చవలసిందిగా వారందరూ భృగువు మహార్షిని కోరారు. ఆయన, ఆ పనిమీద బ్రహ్మలోకం చేరాడు. అక్కడ బ్రహ్మదేవుడు తనని పట్టించుకోకపోవటంతో, బ్రహ్మదేవునికి భూలోకంలో ఎక్కడా దేవాలయం కానీ, పూజార్హత కానీ ఉండరాదని శపిస్తాడు. తర్వాత, కైలాసానికి చేరతాడు. అక్కడ, ఆ సమయంలో శివుడు, పార్వతితో ఉంటాడు. రతికాంక్షతో ఉన్న శివుడిని చూసి కోపించిన భృగువు, భూలోకంలో శివుడు లింగాకారంలోనే పూజార్హత పొందుతాడని శపిస్తాడు. తర్వాత మిగిలింది -వైకుంఠం. భృగువు అక్కడికీ చేరుకుంటాడు. ఆ సమయంలో మహావిష్ణువు, శ్రీమహాలక్ష్మితో పాలసముద్రంమీద పవళించి ఉంటాడు. తన రాకను శ్రీమహావిష్ణువు గమనించలేదని ఆగ్రహించిన భృగువు, ఆ కోపంలో మహావిష్ణువును గుండెలమీద తన్నాడు. ఇదే తగిన సమయమని భావిస్తూ, విష్ణువు, భృగువుకు కాలిలో ఉన్న నేత్రాన్ని చిదిమి, భృగువుకు గర్వభంగం చేశాడు. తను నివాసం ఉండే శ్రీ మహావిష్ణువు వక్షస్థలం మీద భృగువు తన్నినా, దాన్ని గుర్తించని విధంగా తన భర్త  భృగువు పాదాలొత్తడం నిరసిస్తూ, ఆమె వెంటనే వైకుంఠంనుంచి పాతాళలోకానికి వెళ్లిపోయింది. అక్కడ కపిల మహర్షి కోరిన మీదట, ఆమె భూలోకానికి వెళ్లి, కరివీరపురం (నేటి కొల్హాపూర్‌)లో నివసించసాగింది. తన భార్య లక్ష్మీదేవి ఇలా వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికోసం అన్వేషిస్తూ, భూలోకం చేరి, ఆమెను కరివీరపురంలో గుర్తించి, ఆమెను ప్రసన్నం చేసుకుని, ఆమె తిరుచానూర్‌లో పద్మావతిగా అవతరించి, తిరిగి, తన వక్షస్థలం చేరే విధంగా చేసుకుంటాడు. ఈ విధంగా శ్రీ వేంకటేశ్వరుడు, భూలోక వైకుంఠమైన తిరుపతికి చేరటంలో భృగువు మనకు గొప్ప సహాయం చేశాడనాలి.


భగవద్గీతలో   భ్రుగు ప్రస్తావన

భగవంతుడు శ్రీకృష్ణుడు ఉపదేశించిన భగవద్గీతలో మహర్షుల గురించి తెలియజేస్తూ ఈ భృగు మహర్షి  ప్రస్తావన కూడా రావడము జరుగుతుంది.

భ్రుగు  పౌత్రుడు అసురులకు గురువు అయిన శుక్రాచార్యులు. ఇదికాక ఇతనికి ఖ్యాతివలన ధాత, విధాత అని ఇరువురు కొడుకులు కలిగిరి. అందు ధాతకు మృకండుఁడు, విధాతకు ప్రాణుఁడును జన్మించిరి. ప్రాణుని కొడుకు వేదశిరుఁడు. వేదశిరుని కొడుకు ఉశేనస్సు. మృకండుని కొడుకు మార్కండేయుఁడు. ఇతని మీసములను దక్షయాగమున వీరభద్రుఁడు పెఱికివేసినట్లు పురాణముల వలన తెలియవచ్చుచున్నది.

భ్రుగువు  అగ్నిని శపించుట

పులోమ గర్భవతిగా ఉన్నప్పుడు, ఒకనాడు భృగువు "నేను నదీ స్నానానికి వెళ్ళొస్తాను, ఈలోగ నువ్వు నితయాగ్నిహోత్రానికి అవసరమిన సామాగ్రి కూర్చుము" అని చెప్పి వెళ్ళిపోతాడు. హోమగుండంలో అగ్ని వెలిగించి, మిగతా పనులు చేసుకుంటూ ఉంటుంది.

ఆ సమయంలో పులోముడు అను రాక్షసుడు, అక్కడికి వస్తాడు. ఆమెను చూసి కామించి, ఆమె గురించి అగ్నిదేవున్ని అడుగుతాడు. అగ్నిదేవుడు ఇలా ఆలొచించసాగాడు " నేను నిజం చెప్పిన పులోమకి హాని కలుగును, అబద్ధము చెప్పిన నాకు అసత్య దోషము అంటును అని" చివరికి నిజమ చెప్పాలని నిర్ణయానికి వచ్చి, ఆమె భృగు మహర్షి భార్య పులోమ అని చెప్తాడు.

పులోముడు ఆమెను గుర్తిస్తాడు. ఆమెకి పెళ్ళి కాకముందు పులోముడు ఆమెను ప్రేమిస్తాడు కాని పులోమ తిరస్కరిస్తుంది. ఇప్పుడు సమయం వచ్చిందని ఆమెను చెరబట్టాలనుకుంటాడు. అప్పుడు పులోముడు పేద్ద వరాహంగా మారి ఆమెను తన భుజాలపై వేసుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆమెకు ప్రసవం జరిగి మగ పిల్లవాడు పుడతాడు. అతనే చ్యవన, శక్తివంతమైన పిల్లవాడు. కోపంతో పులోమున్ని చూడగానె, మంటలలో పులోముడు కాలిపోతాడు. అప్పుడు పులోమ ఆ పిల్లవాని తీసుకొని ఆశ్రమానికి పోయి జరిగిందంతా భృగువు కి చెప్తుంది.

భృగువు కోపంతో నీ గురించి ఎవరు చెప్పారు అని అడుగుతాడు. అగ్నిదేవుడు చెప్పాడు అని పులోమ చెప్తుంది. అగ్నిదేవుడు నేను అబద్ధం చెప్పిన పాపం చుట్టుకుంటుందని నిజం చెప్పను అంటాడు. అప్పుడు భృగువు " ఇక నుండి నువ్వు సర్వభక్షకునివి అగుదువు" అని శపిస్తాడు.

అప్పుడు అగ్నిదేవుడు "నేను సర్వభక్షకున్ని అయిన, దేవతలకు హవిస్సులు ఎల తెసుకెళ్ళలి" అని, తన మటలను ఆపివేస్తాడు. ఇక హోమాలు, దేవతలకు హవిస్సులు లేకపోవడంతో బ్రహ్మదేవుడు అగ్ని దగ్గరికి వస్తాడు.

బ్రహ్మదేవుడు "ఓ అగ్నిదేవా, భృగువు శాపం ప్రకారం నువ్వు సర్వభక్షకునివే, కానీ నీ పవిత్రత పోలేదు కావున నువ్వు ఎప్పటిలాగే దేవతలకు హవిస్సులు చేరవేస్తూండు" అని చెప్తాడు. అందుకు అగ్నిదేవుడు అంగీకరిస్తాడు

భార్గవస గోత్రీకుల ప్రవర

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు !
భార్గవ , చ్యవన, ఆప్లువాన, ఔరవ, జామదగ్ని పంచాఋషేయ ప్రవరాన్విత భార్గవస  గోత్రః, ఆపస్తంభ సూత్రః, యజుశ్శాఖాధ్యాయీ, ------ శర్మా౦ అహంభో అభివాదయే ! 

1 comment:

  1. పై ప్రవర శ్రీవత్స గోత్రం గదా, భార్గవస అంటున్నారే ఈ?

    ReplyDelete

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...