Monday, May 21, 2018

కురుక్షేత్ర యుద్ధంలో ప్రముఖ వ్యూహాలు


మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఏడు అక్షౌహిణీలు, కౌరవులు పదకొండు అక్షౌహిణీల సైన్యంతో యుద్ధాన్ని ప్రారంభించారు. రోజుకొక వ్యూహం నిర్మించి ఆ ఆకారంలో తమ సైన్యాలను నిలిపేవారు. అందులో కొన్ని ప్రముఖమైన వ్యూహాలు..

1. క్రౌంచారుణ వ్యూహం : పాండవ సేనాని దృష్టద్యుమ్నుడు క్రౌంచపక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.

2. గరుడ వ్యూహం : యుద్ధం మొదలైన మూడవ రోజున భీష్ముడు గరుడపక్షి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించాడు. దీనినే సువర్ణ వ్యూహం అని కూడా అంటారు.

3. శకట వ్యూహం : మహాభారత యుద్ధ పదకొండవ రోజున ద్రోణుడు బండి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించి సైన్యాన్ని నిలిపి తాను కేంద్ర స్థానంలో నిలబడ్డాడు.

4. చక్ర వ్యూహం : పదమూడవ రోజు ద్రోణుడు ఈ వ్యూహాన్ని రచించాడు. దీనినే పద్మవ్యూహం అని కూడా అంటారు. చక్రాకారంలో సైన్యాన్ని నిలుపుతారు. దీనిని చేదించడం అందరికీ సాధ్యం కాదు. అభిమన్యుడు ఈ వ్యూహంలో ప్రవేశించినా బయటకు రాలేక కౌరవుల మోసానికి బలయ్యాడు.

5. మకర వ్యూహం : ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మించి మకరాకారంలో సైన్యాన్ని నిలిపి యుద్ధరంగంలో చెలరేగిపోయి పాండవులకు చాలా నష్టాన్ని కలిగించాడు.

6. బార్హస్పత్య వ్యూహం : పదిహేడవ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహాన్ని పన్నుతాడు.

7. శృంగాటక వ్యూహం: ఎనిమిదవ రోజు భీష్ముని వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని నిర్మించి త్రికోణాకారంలో సైన్యాన్ని నిలుపుతారు.

8. శ్యేన వ్యూహం: ఈ వ్యూహాన్ని కూడా భీష్ముడి మకర వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు డేగ ఆకారంలో నిర్మించాడు. ఐదవరోజు నిర్మించిన ఈ వ్యూహాన్ని డేగ వ్యూహం అని కూడా అంటారు.

9. అర్ధచంద్ర వ్యూహం : మూడవ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహాన్ని నిలుపుతాడు.

10. మండల వ్యూహం : ఏడవ రోజున భీష్ముడు మండలాకారంలో వ్యూహాన్ని రచించి కౌరవ సైన్యాన్ని నిలుపుతాడు.

11. మండలార్ధ వ్యూహం : పన్నెండవ రోజు ద్రోణుడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా ధర్మరాజు మండలార్ధ వ్యూహాన్ని నిర్మించి పాండవ సేనను నిలుపుతాడు.

12. వజ్ర వ్యూహం : ఏడవ రోజున భీష్ముడు కౌరవ సేనను మండల వ్యూహంలో నిర్మించగా ధర్మరాజు పాండవ సేనను వజ్ర వ్యూహంలో రచిస్తాడు.

13. సూచీ ముఖ వ్యూహం : ఆరవరోజు దృష్టద్యుమ్నుడు పాండవ సేనను మకర వ్యూహంలో నడిపింపగా భీష్ముడు కౌరవసేనను క్రౌంచ వ్యూహంలో నిలుపుతాడు. కాని ఈ రెండు వ్యూహాలు భంగపడదంతో అభిమన్యుడు సూచీ ముఖ వ్యూహాన్ని రచించి సూది ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.

14. వ్యాల వ్యూహం : నాలుగవ రోజు భీష్ముడు కౌరవ సేనను చుట్ట చుట్టుకున్న పాములా నిలుపుతాడు. ఇది చాలా కష్టమైన వ్యూహం. ఈ వ్య్హూహం ద్వారా సైన్యాల స్తంభనను అంచనా వెయ్యడం కష్టం.

15. సర్వతోభద్ర వ్యూహం : తొమ్మిదవ రోజు భీష్ముడు సైన్యాన్ని సర్వతోభద్ర వ్యూహంలో నిలిపాడు.

16. మహా వ్యూహం : భీష్ముడు రెండవ రోజు ఈ వ్యూహాన్ని నిర్మించి అజేయుడై శత్రు సైన్యాన్ని హడలగొట్టించాడు.

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...