Tuesday, May 22, 2018

శ్రీమదాంజనేయ కల్యాణము

శ్రీ ఆంజనేయ స్వామి అజన్మ బ్రహ్మచారి.. యజ్ఞోపవీతము ధరించే పుట్టినవాడు. ఘోటక బ్రహ్మచారి అయినా వివాహము చేసుకున్నాడు.. వివాహము చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే మిగిలిపోయినాడు.. లోక కల్యాణము కోసము హనుమంతులవారు మొదట తన కల్యాణము చేసుకోవలసి వచ్చింది.. పరాశర సంహితలో ఆసక్తికరమైన ఈ ఉదంతము ఉంది.

ఒకప్పుడు సూర్యదేవుడు , విశ్వకర్మ కూతురైన సంజ్ఞాదేవిని పెళ్ళాడతాడు. అయితే , సంజ్ఞా దేవికి సూర్యుని తాపమును తట్టుకొను శక్తి లేదు..ఖిన్నురాలై , తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది.. కూతురి సమస్యను అర్థము చేసుకున్నదై, ఆమె తల్లి , విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ , సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యునినుండీ బయట పడ్డ ఆ ప్రకాశము , ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు , బ్రహ్మ దేవుని వద్దకు వెళ్ళి , " ఆ కన్య ఎవరు ? " అని అడుగుతాడు. ఇంద్రుడి ఉద్దేశము కనిపెట్టిన బ్రహ్మ ,ఆమెకు కాగల పతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరొకరు కారు అని చెబుతాడు.

బాల హనుమంతుడు తల్లి అంజనా దేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి , ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసము చేస్తాడు. శిక్షణ పూర్తికాగానే గురువు వద్దకు వచ్చి వినమ్రుడై , " గురుదేవా , నా శిక్షణ పూర్తయిందని తమరి అనుజ్ఞ అయినది , నాకు ఇక వెళ్ళుటకు అనుమతినీయండి , మీకు గురు దక్షిణగా ఏమివ్వవలెనో చెప్పండి " అంటాడు. " శివాంశతో పుట్టినవాడవు , ఆంజనేయా , నిన్ను నేనేమని కీర్తించను ? సాగర మథనములో పుట్టిన గరళాన్ని జగద్రక్షణ కోసము మింగిన సాక్షాత్తూ ఆశివుడవే నువ్వు. నువ్వు వాయు దేవుడి పుత్రుడవు కూడా.. అగ్నికి పుత్ర సమానుడవు. మనము గురుశిష్యులమన్నది కేవలము ఔపచారికము మాత్రమే.. అయిననూ , అడిగినావు గనక , విను... విశ్వకర్మ , నాలోని ప్రకాశమును కొంత వేరుపరచినాడు. ఆ నాయొక్క ప్రభ ఇప్పుడు నా కూతురు రూపములో ఉన్నది. నా కాంతి నుండీ పుట్టిన నా కూతురు సువర్చలా దేవిని నీకిచ్చి వివాహము చేయవలెననునది నా కోరిక. ఇదే నువ్వు నాకు ఇవ్వవలసిన గురు దక్షిణ " అంటాడు సూర్యుడు. హనుమంతుడు వినీతుడై సూర్యునికి తలవంచి , రెండు చేతులూ జోడించి నమస్కరించి , " దేవా , నేను బ్రహ్మచర్యమును పాలించవలెనని తీర్మానించుకున్నాను.. అది మీకు తెలిసినదే కదా .. నా జీవన లక్ష్యము అదే. నేనీ వివాహము ఎలా చేసుకోగలను ? " అని అడుగుతాడు.

సూర్యుడు ఉత్తరమిస్తాడు , " సువర్చల దైవాంశ సంభూతురాలు. నేను నీకొక వరమునిస్తాను. నువ్వు ఆమెను పెళ్ళాడిననూ , ప్రాజాపత్య బ్రహ్మచారిగనే మిగిలిపోతావు. నీ ఈ వివాహము కేవలము జగత్కల్యాణము కోసమే తప్ప , నీ వ్రత భంగానికి కాదు. నువ్వు యజ్ఞోపవీతము ధరించియే పుట్టినవాడవు కాబట్టి పుట్టిన క్షణమునుండే నువ్వు బ్రహ్మచారివి. భవిష్యత్తులో , కలియుగానంతరము , ప్రళయానంతరము తరువాత తిరిగి జరగబోయే సృష్టికి నువ్వే బ్రహ్మవవుతావు. నువ్వు బ్రహ్మదేవుని పదవిని అలంకరించిన తరువాత , సువర్చలాదేవి వీణాపాణియైన ఆ వాణి స్థానములో ఉంటుంది.

సందేహ నివృత్తి అయిన హనుమంతుడు , సూర్యుని ఆజ్ఞమేరకు సువర్చలా దేవిని వివాహమాడుతాడు. హనుమంతుని కల్యాణమైన దినము , జ్యేష్ఠ శుద్ధ దశమి.. హనుమ పూజలో అగ్ని సూక్తముతోను , [ పంచామృతములతోను కూడా ] హనుమంతుడికి అభిషేకము [ విగ్రహ శోధన ] చేస్తారు. సువర్చలా పూజనుకూడా తమలపాకులపై సువర్ణ సహిత పుష్పాక్షతలతో చేస్తారు.  భక్తులందరూ ఈ హనుమ కల్యాణ గాథను చదివి తరింతురు గాక || శుభమస్తు ||

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...