Thursday, September 27, 2018

లక్ష్మీదేవికి గుడ్లగూబ ఎలా వాహనమయ్యింది?

మనం లక్ష్మీదేవి చిత్రపటాన్ని చూసినపుడు ఆమెకు గుడ్లగూబ వాహనంగా ఉండటాన్ని చూస్తుంటాం.

దానికి సమాధానంగా పురాణాలలో ఓ కథ కనబడుతోంది. ఒకప్పుడు కౌశికుడు అనే ఒక గొప్ప విష్ణుభక్తుడు ఉండేవాడు. అతడు గొప్ప సంగీత విద్వాంసుడు. సుమధురమైన తన గానమాధుర్యంతో మహావిష్ణువుని ప్రసన్నం చేసుకున్నాడు. స్థూలశరీరాన్ని విడిన తరువాత విష్ణులోకాన్ని చేరుకున్నాడు. శ్రీహరి తన ప్రియభక్తుని స్వాగతించి అతని గౌరవార్థం ఆంతరంగిక సంగీతసభ ఒకటి ఏర్పాటుచేసాడు. ఆ సభలో దేవర్షి నారదునికి ప్రవేశం లభించలేదు. తుంబరునికి సకల మర్యాదలతో స్వాగతం చెప్పారు. తనకు ప్రవేశం లేకపోవడం అటుంచి తన ప్రత్యర్థి అయిన తుంబరునకు స్వాగత సత్కారాలు లభించడం చూచిన నారదుడు మండిపడ్డాడు. అయినా, తమాయించుకుని లక్ష్మీదేవి మందిరంలో నుంచి లోనికి పోవడానికి ప్రయత్నించాడు. అక్కడ కూడా ఆ దేవి చెలికత్తెలు అడ్డుపెట్టారు. దానితో నారదుడు ఆ మహాలక్ష్మిని శపించాడు. అదితెలిసిన వెంటనే లక్ష్మీనారాయణులు నారదుని ముందు ప్రత్యక్షమైయ్యారు. తమను మన్నించమని వేడుకున్నారు. అప్పటికి నారదుని కోపం శాంతించింది. తన తొందరపాటుకు పశ్చాత్తాపం మొదలైంది. శరీరమంతా చెమటలు పట్టాయి.

కీలెరిగి వాత పెట్టడం బాగా తెలిసిన నారాయణుడు చేసిన దానికి సిగ్గు పడుతున్న నారదుని చూచి అన్నాడు - 'నారదా! నీ కోపకారణం నాకు తెలియును. నిజానికి భక్తి జ్ఞానములందు, శీల వర్తనములందు తుంబరుడు నీకన్న కపటి కాడు, గర్విష్టి కాడు. కపట భక్తిని ప్రదర్శించు వారెన్ని తీర్థాలు సేవించినప్పటికి వ్యర్థం. భక్తిశ్రద్ధలతో నన్నుకొలుచువారలకు అవశ్యం వశ్యుడనే. సంగీతం చేత ననుజేరవచ్చునని చాటి చెప్పుటకే కౌశిక తుంబరులను నేను సత్కరించాను. నీ శాపానికేమీ బాధ పడటం లేదు. లోకహితమే జరుగుతుంది. చింతించ వద్దు.' నారదునికి అప్పటికి జ్ఞానోదయమైంది. "ఓ దేవదేవా! నా తప్పులను క్షమించుము. అవివేకివలె ప్రవర్తించాను. నన్ను కాపాడుము. తుంబర కౌశికులవలె సంగీతంలో మేటినైతే ఇంతటి విపరీతం జరిగి ఉండేది కాదు కదా!' అంటూ కట్టెలు తెంచుకుని ప్రవహిస్తున్న కన్నీటి వరద మధ్య నారదుడు నారాయణుని పాదాలమీద పడ్డాడు.

భక్తుని పశ్చాత్తాపం భగవంతుని హృదయాన్ని కరిగించింది. తన దివ్యహస్తాలతో నారదుని పైకి లేపాడు. ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలన్న కుతూహలం నిజంగా ఉంటే తాను చెప్పినట్లు చేయమన్నాడు. ఉత్తరాన మానససరోవరానికి అవతల ఒక పర్వత శిఖరం ఉంది. దాని మీద ఒక దివాంధం ఉంది. ఆ ఉలూకపతికి శుశ్రూష చేసి సంగీతంలో మేటివి కమ్మని దీవించాడు. శ్రీమన్నారాయణునికి కృతజ్ఞతలు ప్రకటిస్తూ చెతులు జోడించిన నారదుడు సెలవుపుచ్చుకున్నాడు. వెంటనే మనోవేగంతో మానససరోవరం చేరుకున్నాడు. కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపిస్తోంది. తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాధుర్యాన్ని పట్టుకుని ఆవలిగిరి శిఖరం చేరాడు. గంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరాసాదులెందరో అక్కడ సంగీతాభ్యాసం చేస్తున్నారు. వారి మధ్య గురుపీఠం మీద దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న 'గానబంధు' నారదుని చూడగానే వినయంతో ఆశనం దిగి ఎదురేగాడు. ఆనందంగా ఆసనం చూపి కుశలప్రశ్నలు వేసాడు. ఏతెంచిన కారణం చెప్పమని ప్రార్థించాడు.

నారదుడు గానబంధు వినయానికి, సంగీత పాటవానికి ఆశ్చర్యపోయాడు. తనకు తెలియని ఈ సంగీత వేత్త ఎవరని ఆలోచనలో పడ్డాడు. అతడెవరైతేనేం! తనకు కావలసింది సంగీతవిద్య. ఉలూకపతికి నమస్కరించి జపతపాదులకు సాధ్యంకాని శ్రీహరిని తుంబుర కౌశికులు గానమాధుర్యంతో వశం చేసికొన్నారని, తనకూ అలాంటీ దివ్యగాన విద్యను ప్రసాదించమని వేడుకున్నాడు. గానబంధు, నారదుని ఆంతర్యం గ్రహించి ముందు తానెవరో వివరింప సాగాడు - పూర్వం భువనేశుడనే రాజు ఉండేవాడు. అతడు చాలా జాలి గుండెగలవాడు. ధర్మవర్తనుడు. సంప్రదాయానుసారం ధర్మకార్యాలన్నీ క్రమం తప్పకుండా నిర్వహించాడు. అటువంటి ఉత్తమ పాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. ఎవరైనా గానాలాపన చేస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు చెప్పాడు. భగవంతుని కూడా భక్తిగీతాలతో స్తుతించకూడదని చాటించాడు. ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజాజ్ఞను మరచిపోయి భగవంతుని కీర్తిస్తూ గానం చేసాడు. ఆ గానమాధుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదన్న విషయాన్ని మరచిపోయారు. వెంటనే రాజబటులు వచ్చారు. హరిమిత్రుని రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచించాడు. పాడినవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్య మహాపాపం. మరణశిక్షతో సమానమైనది రాజ్యబషిష్కరణ. ఇలా ఆలోచించి హరిమిత్రుని సంపదనంతా స్వాధీనం చేసికొని రాజ్యం నుండి వెళ్లగొట్టాడు.

కాలచక్రం తిరగడం మానదుకదా! కొంతకాలానికి రాజు మరణించాడు. పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. అలాగే గిట్టినప్రాణి కూడ పుట్టక తప్పదు. నరుడుగా మరణించిన రాజు గుడ్లగూబగా జన్మించాడు. దివాంధజన్మ కాబట్టి రాత్రులందే ఆహారం సంపాదించుకోవాలి. తిండి ఒక సమస్యగా తయారయింది. పురాకృత దోషఫలితం కాబోలు; ఒకసారి నాలుగు రోజులైనా ఆహారం దొరగలేదు. ఆకలి దుర్లభమైపోయింది. చివరికి మరణాన్ని ఆహ్వానించాడు. అతడు పూర్వజన్మలో చేసికొన్న సుకృతం వల్ల మరణ దేవత యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు. ప్రాణం తీయకుండా ఎదురుగా నిలబడ్డ యముని చూచి 'ధర్మరాజా! ఎందుకు ఈవిధంగా నన్ను బాధ పెడుతున్నావు? నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదక్షిణ్యాలు చూపించాలో అంతవరకు చూపించాను. నీవెందుకు నాపై దయ చూపవు?' అన్నాడు భువనేశుడు. దివాంధ స్థితికి యమధర్మరాజు జాలి పడ్డాడు. తాను చేసిన తప్పేమిటో తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు కదా! తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది! అలా ఆలోచించి అసలు విషయం చెప్పాడు.

"దివాంధమా! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసినమాట నిజమే. కాని పరమాత్ముని వేద మంత్రాలతో మాత్రమే స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమపావనమైన సంగీతంతో హరికీర్తన చేసిన హరిమిత్రుని శిక్షించిన పాపం తక్కువైనదియా! ఆ పాప ఫలితం కొండంతయై నీకు లభించిన పుణ్యఫలానికి మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టిపీడిస్తోంది. విష్ణుభక్తులకు చేసిన కీడు నీకీ అవస్థ తెచ్చిపెట్టింది. దీనినుండి బయట పడటం ఎవరికీ సాధ్యం కాదు". సమవర్తి చెప్పింది విన్నాక గాని, దివాంధానికి తాను చేసిన తప్పేమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుని స్తుతించ వచ్చన్న జ్ఞానం కలిగింది. చేసిన తప్పుకు క్షమించి ఎలాగైనా బయటపడే మార్గం చూపించమని ధర్మదేవత పాదాలమీద పడ్డాడు. యముని హృదయం కూడా ద్రవించింది. "ఉలూకరాజా! చేసిన తప్పుకు శిక్ష అనుభవింపక తప్పదు. దీనికి మించిన శిక్ష అనుభవించినచో శిక్షాకాలం తగ్గుతుంది. అంగీకరిస్తే ఆ గుహలోని కేగుము. అందులో నీ గత జన్మ దేహముంది. అందుండి రోజుకు కొంత మాంసాన్ని చీల్చుకుని భక్షించు. అది పూర్తి అయిన తదనంతరం నీకు శుభం కలుగుతుంది" అని దీవించి వెళ్ళాడు.

"ఓ మహర్షీ! ఆ దురదృష్టవంతుడను నేనే! ఆ తరువాత నేనొక రోజున నా శవం వద్ద కూర్చొని ఉండగా, దివ్య తేజస్వియైన ఒక బ్రాహ్మణుడు రథంలో పోతూ నా ముందున్న శవమును చూచి రథాన్ని నిలిపాడు. దగ్గరకొచ్చి చూసి, 'ఇది భువనేశుని కాయము వలెనున్నది. ఇందేల పడియున్నది? దీనిని యీ పక్షి భక్షించుటేమి?" అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అప్పటికి నేను ఆ విప్రుని గుర్తించాను. అతడు నా చేత బహిష్కరింపబడిన హరిమిత్రుడు. వెంటనే అతని పాదములపైబడి ప్రార్థించాను. తప్పుకు క్షమించమని అడిగాను. దుఃఖాశ్రువులు నేల రాలుతుండగా యమధర్మరాజు తెలియజెప్పిన విషయమంతా వివరించాను. హరిమిత్రుడది విని చలించిపోయాడు. తన అంతరంగ భావమునకనుగుణంగా ఇలా పలికాడు. 'నీ బాధలు చూస్తుంటే నాకెంతో విచారం కలిగింది. నీవు నాయెడల చూపిన కాఠిన్యం నేను ఆరోజునే మరచాను. నీవనుభవించిన బాధలిక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అన్నది లేకుండునుగాక! గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువు గాక!' అంటూ అతడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికేగాడు. వాని దీవనలు ఫలించి నేనిట్లున్నాను" అంటూ గానబంధు తన కథనంతా వివరించాడు.

ఆ తరువాత నారదుడు గానబంధు విద్వాంసుని శిష్యుడయ్యాడు. తొలిరోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతో గాని, తామసంతో కాని అది పట్టుబడదన్నాడు. కళ కోసం జీవితాన్ని అర్పించాలి అన్నాడు. కష్టపడి నిరంతరం సాధనచేస్తే ఎవరైనా అపురూపమయిన ఈ కళలో ఆధిక్యం సాధించవచ్చన్నాడు. గౌరవ భావం మొహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకొని ఆలకించాడు నారదుడు. ఆ సాధన అలా వేయేళ్లు గడిచాయి. కఠోరమైనదీక్షతో నారదుడు 3,60.006 రాగాలలో మంచి ప్రావీణ్యం గడించాడు. సహపాఠులంతా పొగిడేస్తుంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదనే గర్వంతో ఉబ్బిపోయాడు. అమితానందంతో గురువును జేరి కృతజ్ఞతలు చెల్లించాడు. గురుదక్షిణ చెల్లిస్తాను. ఏమికావాలో సెలవిమ్మన్నాడు. ఎంతటి కోరికైనా సంశయింప వద్దన్నాడు.

శిష్యుని పలుకులు విన్న ఆ గురువు ఎంతగానో సంతోషించాడు. 'ఓ మహర్షీ! దేవర్షులైన మిమ్ము నేనేమి కోరగలను! దివాంధమునకు వలసిన అవసరములేమి ఉంటాయి? శిష్యుడవైనందున ఏదో ఒకటి కోరుకొనక తప్పదు. ఈ ధరాతలం నిలిచి ఉండునంత వరకు సంగీతకళతోపాటు నేను సహితం లోకంలో గుర్తుండేలా వరము ప్రసాదింపుము' అని మనసులోని మాట బయట పెట్టాడు. నారదుడు విశాలంగా నవ్వాడు. 'గురువర్యా! ఇది మరీ చిన్న కోరిక. ఈ చిరుకోరిక మీకున్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్య కోటి వలన భూతలమున సంగీతకళ నిలిచియున్నంత వరకు మీ కీర్తికి చ్యుతి లేదు. మీరు చేసిన ఈ మహోపకారమునకు గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షము, వారి సేవాభాగ్యమును, శాశ్వత సన్నిధానమును ప్రసాధిస్తున్నాను. ప్రళయం సంభవించినవేళ శ్రీ మహావిష్ణువునకు గరుత్మంతునివలె శ్రీమహాలక్ష్మికి నీవు వాహనమై తరియింతువు గాక!' అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరమును సమర్పించి సెలవు తీసుకొన్నాడు. ఆ విధంగా గానబంధు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనమైంది.

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...