Saturday, September 29, 2018

చక్ర భ్రమణం

కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం... ఇది ‘యుగచక్రం’.

వర్షకాలం, చలికాలం, ఎండకాలం... ఇది ‘రుతుచక్రం’.

రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు... ఇది ‘కాల చక్రం’.

బాల్యం, కౌమారం, యౌవనం, వార్ధక్యం... ఇది ‘జీవిత చక్రం’.

సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ పరమేశ్వరుడి నిర్దేశానుసారం ‘చక్ర భ్రమణం’ నిరంతరంగా సాగిపోతూనే ఉంటుంది.

రంగులరాట్నంలో కింది నుంచి పైకి, పైనించి కిందికి తిరుగుతున్నట్టే మనిషి జీవితంలో సుఖానుభవాలు, దుఃఖానుభవాలు... ఒకదాని వెంట మరొకటిగా కలుగుతూనే ఉంటాయి.
ఈ సత్యం తెలిసికూడా మనసును మాయపొర కమ్మేయడంతో రాగబంధాలకు లోనైన మనిషి నిరంతరం బాధపడుతుంటాడు.

జీవిత ప్రయాణం అంటే- గమ్యం వైపు గమనం. ఏది గమ్యం అనేదే జటిలమైన ప్రశ్న!
గమ్యాన్ని నిర్దేశించేది కోరిక. ఆ కోరికను ప్రేరేపించేవి మూడు- ధనం, సుఖం, కీర్తి.
ఎంత ధనం కావాలి, ఎంత సుఖాన్ని అనుభవించాలి, ఎంత కీర్తిని మూట కట్టుకోవాలి? ఈ ‘ఎంత’ అనేదానికి ‘అంతు’ ఉందా? చాలామంది విషయంలో లేదు, ఉండదు!

మనిషి జీవితంలో- బాల్యం అమాయకంగాను, కౌమారం జిజ్ఞాసతోను, యౌవనం ఆశలతోనూ గడిచిపోతాయి. వార్ధక్యం వచ్చేసరికే అసలు సమస్య మొదలవుతుంది.

జీవిత చరమాంకంలోనూ కోరిక చావదు. ఇంకా ధనం కావాలి, సుఖాలు కావాలి, కీర్తి ప్రతిష్ఠలు కావాలి. ఇంకా, ఇంకా, ఇంకా... ఈ పరుగును ఎక్కడ ఆపాలో తెలియకపోవడమే దుఃఖానికి హేతువు అవుతుంది.

అలాగని కోరికే లేకుండా జీవించడం సాధ్యమే కాదు. ఆ కోరిక ఎంతవరకు అనే విచక్షణే సుఖదుఃఖాలను నిర్ణయిస్తుంది.

ఉరిశిక్ష పడిన ఓ నేరస్థుడికి శిక్ష అమలుపరచేందుకు తలారి సిద్ధమయ్యాడు. ఉరికొయ్యకు అతడి కాళ్లూచేతుల్ని తాళ్లతో ముడివేసి, పరిసరాలు కనిపించకుండా ముఖానికి నల్లటి ముసుగును కప్పేశాడు. ఇష్టదైవ ప్రార్థన చేసుకోవడానికి ఆ జైలు అధికారి అతడికి ఒక నిమిషం వ్యవధి ఇచ్చాడు. ఆఖరి క్షణాల్లో ఉన్న ఆ నేరస్థుడికి కేవలం తన పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడే ఒక తేలు అతడి పాదానికి అంగుళం దూరంలో కనిపించింది. భయంతో అతడు తన కాలివేళ్లను వెనక్కి తీసుకోవడానికి, తేలుకాటు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు... మరికొద్ది క్షణాల్లో ఉరిశిక్షను అనుభవించబోతున్న అతడికీ ప్రాణాలమీద ఆశే!

మరణించేదాకా జీవించాలనే ఆశను కలిగిఉండటం మనిషి నైజం!

అడవిలో ఒక రుషి తపస్సు చేసుకుంటున్నాడు దీక్షగా. రుషిని గురించి విన్న ఆ దేశ రాజు చూడటానికి వెళ్లాడు. కానీ అంతకు ముందురోజే ఆ రుషి హిమాలయాలకు వెళ్ళిపోయాడని తెలిసి, దర్శన భాగ్యం కలగనందుకు బాధపడిన రాజు, అలౌకిక సంపద కలిగిన రుషి తిరిగి వస్తాడనే నమ్మకంతో అన్ని వసతులతో కూడిన గొప్ప మందిరాన్ని నిర్మించాడు. కొంతకాలం తరవాత తిరిగివచ్చిన ఆ రుషి చెట్టు స్థానంలో వెలసిన మందిరంవైపు చూడగానే అక్కడివాళ్లు- రాజుగారు ప్రత్యేకంగా మీ కోసమే కట్టించారు స్వామీ అని సెలవిచ్చారు. విరాగి అయిన రుషి మందిరంవైపు నిర్వికారంగా చూసి దూరంగా ఉన్న మరో చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకోవడం ఆరంభించాడు! బ్రహ్మజ్ఞానం తప్ప మరే కోరికా లేకపోవడం రుషి నైజం.
ప్రాణంకోసం తపించే మామూలు మనిషి స్థితి నుంచి, ఈ ప్రాణమే శాశ్వతం కాదు అనే పరిపక్వ స్థితికి చేరడమే జ్ఞాన దర్శనం అంటే.

చక్ర భ్రమణంలో తనను తాను తెలుసుకుంటూ, జీవన ప్రస్థానంలో అన్ని దశలనూ దాటుకుంటూ మహాప్రస్థానం వైపు అడుగులు వేసేలోగా- ‘నిగ్రహం, నిర్మోహం, నిరాపేక్షత’ అనే త్రిలక్షణాలను త్రికరణ శుద్ధిగా ఆచరించాలి. అలా చేయగలిగితే అంతర్యామిని చేరుకునే అలౌకికమైన ఆనందం సిద్ధిస్తుంది.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...