Saturday, September 29, 2018

భజగోవిందం సాహిత్యం


భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహితే కాలే 
నహి నహి రక్షతి డుకృణ్ కరణే ||1||

భావం: భజించు గోవిందుడిని భజించు గోవిందుడిని... ఓ బుద్ధిహీనుడా గోవిందుడినే భజించు. మరణసమయం ఆసన్నమైనప్పుడు ఈ (డుకృణ్ కరణే లాంటి ) వ్యాకరణ  సూత్రాలు నిన్ను రక్షించవు గాక రక్షించవు. 


మూఢ జహీహి ధనాగమతృష్ణాం
కురు సద్బుద్ధిం మానస వితృష్ణాం
యల్లభసే నిజకర్మోపాత్తం
విత్తం  తేన వినోదయ చిత్తం ||2||

భావం: ఓ మూర్ఖుడా! ధనసంపాదన ఆశ విడిచిపెట్టు. మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండు. నీ కర్తవ్య కర్మల ద్వారా ఎంత ధనాన్ని సంపాదిస్తావో దానితో సంతోషంగా ఉండు. 



నారీస్తనభర నాభీదేశం

దృష్ట్వా  మాగామోహావేశం

ఏతన్మామ్సావసాది వికారం

మనసి విచంతయ వారం వారం ||3||


భావం: స్త్రీల సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు. అవి నిజంగా మాంసం, కొవ్వు మొదలైన పదార్థములతో కూడినవని నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు.



నళినీ దలగత జలమతి తరలం

తద్వాజ్జీవితమతిశయచపలం 

విద్ధి వ్యాద్యభిమానగ్రస్తం

లోకం శోకహతం చ సమస్తం ||4||


భావం: తామరాకు మీద నీటిబొట్టు ఎంత చెంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది, అల్పమైనది. అంతేకాదు ఈ మానవ జీవితం అంతా రోగాలతోనూ 'నాది' అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని తెలుసుకో.



యావద్విత్తోపార్జన సక్తః

తావన్నిజ పరివారో రక్తః

పశ్చాజీవతి జర్జర దేహే

వార్తాం కోపి న పృచ్చతి గేహే ||5||


భావం: ఎంతవరకు ధన సంపాదన చెయ్యగలుగుతారో అంతవరకే తనవారంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి, ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా వేయరు.



యావత్పవనో నివసతి దేహే

తావత్పృచ్చతి కుశలం గేహే

గతవతి వాయౌ దేహాపాయే

భార్యా బిభ్యతి తస్మిన్కాయే ||6||


భావం: ఎంతవరకైతే ఈ దేహం లో ప్రాణం ఉంటుందో  అంతవరకే ఇంట్లోనివారు క్షేమాన్ని అడుగుతారు. శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే ఆ  చూసి భార్య కూడా భయపడుతుంది.




బాలాస్తావతీ క్రీడాసక్తః

తరుణస్తావత్తరుణీసక్తః |

వృద్ధస్తావాచ్చింతాసక్తః

పరమే బ్రహ్మణి కో పి సక్తః ||7||


భావం: మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనం లో స్త్రీల  పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!!




కా తే కాంతా కస్తే పుత్రః

సంసారో యమతీవ విచిత్రః |

కస్య త్వం కః కుత ఆయాతః

తత్వం చింతయ తదిహ భ్రాతః ||8||


భావం: నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు? ఎవరికి చెందినవాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఓ సోదరా! ఆ తత్వాన్ని ఇక్కడే - ఈ దేహం లో ఉండగానే ఆలోచన చేయి.




సత్సంగత్వే నిస్సంగత్వం

నిస్సంగత్వే నిర్మోహత్వం |

నిర్మోహత్వే నిశ్చలతత్వం

నిశ్చలతత్వే జీవన్ముక్తి: ||9||


భావం: సత్పురుషులతో సాంగత్యం  చేయడం వల్ల  ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి.



వయసి గతే కః కామవికారః

శుష్కే నీరే కః కాసారః |

క్షీణే విత్తే కః పరివారః

జ్ఞాతే తత్వే కః సంసారః ||10||


భావం: వయస్సు మళ్ళిపోతే కామవికారాలుండవు.  నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు.



మా కురు ధన జన యవ్వన గర్వం 

హరతి నిమేషాత్కాలః సర్వం |

మాయామయమిదమఖిలం హిత్వా

బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా  ||11||


భావం: ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యౌవనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిముషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో. ఆత్మానుభూతిని చెందు.



దినయామిన్యౌ సాయం ప్రాతః

శిశిరవసంతవ్ పునరాయాతః |

కాలః క్రీడతి గచ్ఛత్యాయుః 

తదపి న ముంచత్యాశావాయుః  ||12||


భావం: రాత్రింబవళ్ళు, ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి; పోతుంటాయి. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుష్కాలం కూడా అలాగే వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ మానవుడు ఆశ అనే గాలిని మాత్రం వదలడు గాక వదలడు.




కాతే కాంతా ధనగతచింతా

వాతుల కిం తవ నాస్తి నియంతా |

త్రిజగతి సజ్జనసంగాతిరేకా

భవతి భవార్ణవతరణే  ||13||


భావం: ఓరి వెఱ్ఱివాడా! ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటిని, అందరిని నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక.



ద్వాదశమంజరికాభిరశేషః

కథితో వైయాకరణస్యైషః .

ఉపదేశో భూద్విద్యానిపుణైః

శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః  ॥13.అ॥


భావం: ఈ పన్నెండు (2-13) శ్లోకాలు శ్రీ శంకర భగవత్పాదులవారు ఒక వ్యాకరణకర్తకి ఉపదేశంగా ప్రసాదించారు.



జటిలో ముండీ లుంఛితకేశః

కాషాయాంబరబహుకృతవేషః |

పశ్యన్నపి చన పశ్యతి మూఢః

హ్యుదరనిమిత్తం బహుకృతవేషః ||14||


భావం: జడలు కట్టుకొని, గుండు గీయించుకొని, జుట్టు పీకివేసుకొని, కాషాయ వస్త్రాలు ధరించి  వేషాలు వేస్తుంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటికోసమే గాని, వీరు కళ్ళతో చూస్తూ కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు.



అంగం గలితం పలితం ముండం

దశనవిహీనం జాతం తుండం |

వృద్ధో యాతి గృహీత్వా దండం

తదపి న ముంచత్యాశాపిండం ||15||


భావం: శరీరం కృశించిపోయింది, తల నెరసిపోయింది, నోటిలో పళ్ళు ఊడిపోయినవి. ముసలితనం పైబడి కఱ్ఱ చేతికొచ్చింది. ఐనా సరే ఆశల - కోరికల మూట మాత్రం వదిలిపెట్టడు.



అగ్రే వహ్నిః పృష్ఠేభానుః

రాత్రౌ చుబుకసమర్పితజానుః |

కరతలభిక్షస్తరుతలవాసః

తదపి న ముంచత్యాశాపాసః ||16||


భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని,  వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు.



కురుతే గంగాసాగారగమనం

వ్రత పరిపాలన మథవా దానం |

జ్ఞానవిహీనః సర్వమతేన

ముక్తిం న భజతి జన్మశతేన ||17||


భావం: తీర్థయాత్రలు చేయవచ్చు; పూజలు, నోములు, వ్రతాలు చేయవచ్చు; దానధర్మాలు చేయవచ్చు. కాని ఆత్మజ్ఞానము పొందనివాడు నూఱు జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడని సర్వమతముల విశ్వాసం.



సుర మందిర తరు మూల నివాసః

శయ్యా భూతలమజినం వాసః |

సర్వ పరిగ్రహ భోగ త్యాగః

కస్య సుఖం న కరోతి విరాగః ||18||


భావం: దేవాలయాల్లోనూ, చెట్ల మొదళ్ళలోనూ నివసిస్తూ; కటిక నేల మీద నిద్రిస్తూ; చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ; దేనినీ గ్రహించకుండా - ఏమీ కావాలని కోరుకోకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు? తప్పక లభిస్తుంది.



యోగరతో వా భోగరతో వా

సంగరతో వా సంగవిహీనః |

యస్య బ్రహ్మణి రమతే చిత్తం

నందతి నందతి నందత్యేవ ||19||


భావం: ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు; ఈ ప్రపంచంలో అందరితో కలిసి మెలిసి జీవించవచ్చు లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. ముమ్మాటికీ అట్టివారికే ఆనందం.




భగవద్గీతా కించిదధీత

గంగా జలలవ కణికాపీతా |

సకృదపి యేన మురారి సమర్చా

క్రియతే తస్య యమేవ న చర్చ ||20||


భావం: ఎవరైతే భగవద్గీతని కొంచమైనా అధ్యయనం చేస్తారో, గంగా జలాన్ని కొద్దిగా ఐనా తాగుతారో, కొంచమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో అట్టివారికి యమునితో వివాదం ఉండదు.



పునరపి జననం పునరపి మరణం

పునరపి జననీ జఠరే శయనం |

ఇహ సంసార బహు దుస్తారే

కృపయా పారే పాహి మురారే ||21||


భావం: మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం; మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి అక్కడ ఉండడం - ఈ అంతులేని సంసార జనన మరణ చక్రబంధం నుండి తప్పించుకోవడం కష్టమైన పని. కనుక ఓ కృష్ణా! దయచేసి మమ్ములను రక్షించు.



రథ్యా చర్పట విరచిత కంథః

పుణ్యాపుణ్య వివర్జిత పంథః |

యోగి యోగనియోజిత చిత్తో

రమతే బాలోన్మత్తవదేవ ||22||


భావం: దారిలో దొరికే గుడ్డ పీలికలతో తయారైన గోచిని ధరించిన వాడై; ఇది పుణ్యమని, అది పాపమని ఏ మాత్రం ఆలోచించక, నిరంతరం మనసుని యోగమునందే నిలిపిన యోగిపుంగవుడు ఈ లోకంలో బాలునిలాగ, పిచ్చివానిగా ప్రవర్తిస్తూ ఉంటాడు.



కస్త్వం కోహం కుత ఆయాతః

కా మే జనని కో మే తాతః |

ఇతి పరభావయ సర్వమసారం

విశ్వం త్యక్త్వా స్వప్న విచారం ||23||


భావం: నీవెవరు? నేనెవరు? ఎక్కడ నుండి వచ్చాను? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? ఇదీ నువ్వు విచారణ చెయ్యవలసినది. ఈ ప్రపంచం సారహీనమైనది; కేవలం కలలో కనిపించు దృశ్యం లాంటిదే అని దీనిని విడిచిపెట్టు.



త్వయి మయి చాన్యత్రైకో విష్ణు:

వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణు: |

భవ సమచిత్తః  సర్వత్ర త్వం

వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం ||24||



భావం: నీలోను, నాలోను, ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే. సహనం లేనివాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం (మోక్షం) ను పొందగోరితివా! అంతటా - అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండు.



శత్రౌ మిత్రే పుత్రే బంధవ్

మా కురు యత్నం విగ్రహ సంధవ్ |

సర్వస్మిన్నపి పశ్యాత్మానం

సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం ||25||


భావం: శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని,  బంధువు గాని - వీరిపట్ల శత్రుత్వమో, స్నేహమో చేసే యత్నం మానుకో. అందరిలోను ఆత్మను చూస్తూ, భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టు.




కామం క్రోధం లోభం మోహం

త్యక్త్వా త్మానం భావయ కోహం |

ఆత్మజ్ఞాన విహీనా మూడాః

తే పచ్యంతే నరకనిగూడః ||26||


భావం: కోరిక, కోపం, లోభం, భ్రాంతి - వీటన్నిటిని విడిచిపెట్టిన సాధకుడు "ఆ పరమాత్మను నేనే " అనే సత్యాన్ని దర్శిస్తాడు. ఆత్మజ్ఞానం లేనివారు మూఢులు. అట్టివారు ఈ సంసార జనన మరణ చక్రం అనే నరకంలో బంధింపబడి హింసించబడతారు.



గేయం గీతా నామ సహస్రం

ధ్యేయం శ్రీపతి రూపమజస్రం |

నేయం సజ్జన సంగే చిత్తం

దేయం దీనజనాయ చ విత్తం ||27||


భావం: భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి. ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి.


సుఖతః క్రియతే రామాభోగః

పశ్చాద్ధంత శరీరే రోగః |

యద్యపి లోకే మరణం శరణం

తదపి న ముంచతి పాపాచరణం ||28||


భావం: సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా శరీరం రోగాలపాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికి తప్పదు. ఐనా సరే మానవుడు పాప కార్యములను వదలనే వదలడు.



అర్థమనర్థం భావయ నిత్యం

నాస్తితతః సుఖలేశః సత్యం |

పుత్రాదపి ధన భాజాం భీతి:

సర్వత్రైషా విహితా రీతి: ||29||


భావం: డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. ధనవంతునికి తన కుమారిని వల్ల కూడా భయమే. అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే.



ప్రాణాయామం ప్రత్యాహారం

నిత్యానిత్య వివేకవిచారం |

జాప్యసమేత సమాధివిధానం

కుర్వవధానం మహదవధానం ||30||


భావం: క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం; విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం; నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం; జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించు.



గురుచరణా౦బుజ నిర్భర భక్తః

సంసారాదచిరార్భవ ముక్తః |

సేంద్రియమానస నియమాదేవం

ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం ||31||


భావం: గురుచరణ కమలములనే సర్వస్వంగా భావించిన ఓ భక్తుడా! నీ ఇంద్రియాలను, మనసుని నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ చావు పుట్టుకులతో కూడిన సంసార సాగరం నుండి ముక్తుడవై, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందెదవు గాక!



మూఢః కశ్చన వైయాకరణో

డుకృన్కరణాధ్యయన ధురిణః .

శ్రీమచ్ఛమ్కర భగవచ్ఛిష్యై

బోధిత ఆసిచ్ఛోధితకరణః ॥32॥


భావం: వ్యాకరణ నియమాలతో తనను తాను కోల్పోయి మూఢుడైన వ్యాకరణకర్త, శంకర భగవత్పాదులవారి బోధనలతో కడిగివేయబడ్డాడు.



భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే

నామస్మరణాదన్యముపాయం

నహి పశ్యామో భవతరణే ॥33॥


భావం: భజించు గోవిందుని! భజించు గోవిందుని! ఓ మూఢుడా  గోవిందుడినే భజించు. సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది లేదు.

|| ఇతి భజగోవిందం సంపూర్ణం ||

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...