Wednesday, September 26, 2018

ఎవరితో ఎలా మాట్లాడాలి ?

ఇప్పుడు మనం కొన్ని వేల రూపయలు ధారపోసి కమ్యునికేషన్ స్కిల్స్ అని నేర్చుకుంటున్నాం. పురాణ గ్రంధాలలో వీటి గురించి చక్కగా వివరించారు. ఈ స్కిల్స్ అనేవి మనం హనుమంతుడిని నుండి నేర్చుకోవచ్చు.

మాట్లాడే విద్యకి ఉన్న గొప్పదనం ఆదికావ్యం వాల్మీకి రామాయణంలోనే కనబడుతుంది. హనుమంతుడు అంటే రామభజన చేసేవాడని సామాన్యుల భావన. కాని వాల్మీకి రామాయణంలో హనుమంతుడు కేవలం భజన పరుడుకాదు. వేదత్రయాన్ని అధ్యయనం చేసినవాడు. కార్యదీక్షా పరుడు, ఉత్తమ మంత్రి, దూత, నేత, అనుచరుడు, సేవకుడు. ఏ స్థానంలో ఉంటే ఆ ధర్మాన్ని సక్రమంగా, ఆదర్శవంతముగా నిర్వహించిన వాడు.

ఎలా మాట్లాడాలి??

👉 శాస్త్రానుసారం ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతాడు పవనకుమారుడు. అది ఎలాగన్నది కిష్కింధ కాండలో మొదటిసారి హనుమంతుడు, రాముడిని కలిసినపుడు, రాముని నోట పలికించాడు వాల్మికీ మహర్షి.

ఎలా మాట్లాడాలంటే..

👉 విషయం స్పష్టముగా ఉండాలి
👉 వాక్యంలో దోషాలు ఉండకూడదు.
👉 ముఖము, కన్నులు, నుదురు, కనుబొమ్మలు..ఏ అవయవంలోనూ వికార చేష్టలు ఉండకూడదు.
👉 విషయంతో సంబంధంలేని మాటలు మాట్లాడకూడదు.
👉 సందిగ్ధంగా ఉంచకూడదు.
👉 మాటలను ఆపి ఆపి మాట్లాడకూడదు
👉 మాట మనసులోనుండి రావాలి
👉 మధ్యమ స్వరంతో మాట్లాడాలి

ఇలా హనుమ మాట్లాడినట్లు అభ్యాసం చేయగలిగితే, ఎవరైన, ఏ రంగంలోనైనా, ఎక్కడైన రాణించగలరు.

ఎవరితో ఎంత మట్లాడాలి ??

ఎవరితో ఎంత మాట్లాడాలి, ఏం మాట్లాడొచ్చు, ఏం మాట్లాడకూడదు అనేది ప్రతీరోజు మనం చూసే ప్రధాన అంశం. నీతులు, నియమాలు ఒక వాక్యంలో చెప్పి వదిలేస్తే హృదయానికి హత్తుకోవు. విషయం అర్ధం అయ్యేలా స్పష్టముగా చెప్పాలి.

దూతగా...

మధ్యవర్తిగా వెళ్ళినపుడు ఎలా మట్లాడాలి అనేది హనుమంతుడు రామదూతగా అశోకవనంలో సీతమ్మ తల్లితో మాట్లాడిన తీరు గమనించాలి.

అశోకవనంలో ప్రాణత్యాగానికి పాల్పడుతున్న సీతను చూసాడు హనుమ. ముందుగా ఆమె చేత ఆ ప్రయత్నాన్ని విరమింపచేయాలి, రాముడు రాబోతున్న వార్త తెలపాలి, అంతకుమించి తాను రామ దూత అని నమ్మించాలి. ఏ విధముగా సంభాషించాలి అని అలోచించి “ దశరధుడు అనే మహారాజు అయోధ్యకు రాజు....అని విషయాన్ని చెప్పడం మొదలు పెట్టాడు చెట్టు మీద కూర్చునే, రాముడి పేరు తప్ప మరొకరి పేరు తెలియని లంకలో దశరధమహారజు పేరు వినబడిందంటే, తన ఆత్మీయులు ఎవరో వచ్చారని అర్ధమై ఆత్మహత్యా ప్రయత్నం మానేసింది సీత. అప్పుడు పవనకుమారుడు సీత ఎదురుగా వచ్చి, రాముడు వానర సైన్యంతో సీతను విడిపించడానికి వస్తున్నడనే విషయాని సీతమ్మకి తెలియచేస్తాడు. తాను చేసిన సాహసాలు ఒక్కటి కూడ చెప్పడు.

రాముడు వచ్చేవరకు సీత జీవించి ఉండేలా చేయాలి, అందుకు ఏం చేయాలి? రాముడు రాబోతున్న వార్త చెబితే చాలు, తన సాహసాల గురించిన ప్రస్తావన అవసరంలేదు. అందుకే హనుమ అవసరం మేరకు మాత్రమే మాట్లాడాడు.

స్నేహితులతో...

సీతను చూసి, రావణుడిని హెచ్చరించి, లంకా దహనం చేసి తిరిగి తన కోసం ఎదురు చూస్తున్న వానరసేనను కలుస్తాడు హనుమ. సీతను చూసాను అనే మాట మాత్రమే చెప్పి వారి మనసులను కుదుట పరుస్తాడు. ప్రాణాలు కుదుటపడ్డ వానరులు, అసలు ఎలా సముద్రాన్ని దాటగలిగావు, సీతమ్మను ఎలా కనిపెట్టావు అని అడిగారు.

ప్రభువుతో...

సీతమ్మ చెప్పిన, చిత్రకూటంలో జరిగిన ఒక సంఘటనను హనుమ రాముడితో చెప్పాడు. (తాను సీతను చూసాననే దానికి ఆనవాలుగా). తరువాత అసలక్కడ సీతమ్మ ఎలా ఉంది, రావణుడి గురించి వివరంగా తెలిపాడు.

ముఖ్యమైన విషయం ముందే చెప్పేయాలి. అంతేగాని టి.వి సీరియల్ లా సాగదీయకూడదు. అవసరమైన విషయం ముందు చెప్పేసి, తరువాత విషయాలు నెమ్మదిగ చెప్పాలి.

ఇలా ప్రత్తి ఒక్క పురాణం నుండి మనం నేర్చుకోవలసింది, నేర్చుకుని ఆచరించవలసిన అంశాలు చాల ఉంటాయి. కనీసం మనం ఒక్కదాని ఆచారణలో పెడితే, దాని ఫలితాలకు తిరుగుండదు.

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...