Saturday, September 29, 2018

హరుని మూడుగా నరికిన హరి

పూర్వం వీతమన్యుడు అనే పేరుగల నిరుపేద బ్రాహ్మణుడుండే వాడు. అతని భార్య ఆత్రేయి. వీరికి ఉపమన్యుడు అనే కుమారుడు ఉన్నాడు. వారు ఎంత దారిద్ర్యం లో ఉన్నారంటే వారి పిల్లాడు పుట్టి బుద్ధెరిగాక పాలు తాగలేదు. కేవలం వరిపిండి కలిపి నీరు తెల్లగాచేసి అవే పాలని అతని తల్లి త్రాగించేది.

ఊహతెలిసినప్పటి నుంచీ అవే త్రాగుతున్నాడు ఆ వరిపిండి నీళ్ళే పాలు అనుకుంటూ వచ్చాడు. అయితే ఒకరోజు తండ్రితో కూడా ఒకచోట భోజనానికి వెళ్ళి స్వచ్ఛమైన పాలతో చేసిన పరవాన్నం తిన్నాడు. పాల రుచి తెలిసింది.

ఇంటికి వచ్చాక తల్లి ఇచ్చిన పిండిపాలు వద్దు అవి అసలు పాలు కావని తనకు అసలు పాలు కావాలని గోలపెట్టాడు.

అతడిని బుజ్జగిస్తూ విరూపాక్షుడు అయిన శంకరుడు ప్రసన్నుడు కానివానికి పాలబువ్వ ఎలా వస్తుంది? ఆయన సంతోషిస్తే పాలబువ్వ వస్తుంది అని చెప్పింది.

అయితే విరూపాక్షుని ప్రార్థిస్తాను ఆయన ఎవరు అని అడిగాడు. దాంతో ఆమె విరూపాక్షుని ఆవిర్భావ కథ చెప్పింది.

పూర్వం శ్రీదాముడనే పేరు గల రాక్షసరాజు ఉండేవాడు. అతడు సర్వలోకాలూ ఆక్రమించి రాజ్యలక్ష్మిని సొంతం చేసుకున్నాడు. విష్ణుమూర్తి కౌస్తుభం  లాగుకోవాలని చూశాడు.

వాడి దుర్బుద్ధి తెలుసుకున్న శ్రీహరి కైలాసానికి వెళ్ళాడు.

శంంభుడు యోగమూర్తిధరుడై ఉన్నాడు. అందువల్ల విష్ణుమూర్తికి కనిపించలేదు. అప్పుడు విష్ణుమూర్తి తనను తానే ఆరాధించుకుంటూ కాలి బొటనవేలిపై నిలిచి వేయిసంవత్సరాలు తపస్సు చేశాడు.

శివుడు సంతోషించి విష్ణువు ముందు ప్రత్యక్షమై సుదర్శన చక్రం ప్రసాదించి రాక్షసుని చంపమన్నాడు.

అది సర్వశ్రేష్ఠమైన చక్రం అని సర్వాయుధాలను విఫలం చేస్తుందని శంభుడు అన్నాడు. దానికి పన్నెండు ఆకులు, ఆరు నాభములు, రెండు ఇరుసులు ఉన్నాయని చాలా వేగవంతమైనదని చెప్పాడు.

పన్నెండు ఆకులలో పన్నెండు రాసులు, మాసాలు, దేవతలు ఉన్నారని చెప్పాడు. కనుక ఈ సుదర్శన చక్రంతో ఆ రాక్షసుని చంపమని చెప్పాడు.

చక్రాన్ని తీసుకున్న శ్రీహరి దాని పనితనం పరీక్షించాలనుకొని శివుని మీదనే ప్రయోగించాడు. అది ఈశ్వరుని మూడు ముక్కలుగా ఖండించింది.

శ్రీహరి తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడు. శంకరుని పాదాలు ఉన్న ఖండముకు వంగి నమస్కరించాడు. అది చూసిన సర్వేశ్వరుడు హరిని పైకి లేవమన్నాడు.

‘‘కేశవా నీవు ప్రాకృతమైన నాశరీరాన్ని ఖండించావు. నా స్వభాన్ని కాదు. దానిని నరకడం కానీ, తగులబెట్టడం కానీ సాధ్యం కాదు. నీవు చేసిన ఈ మూడు భాగాలూ హిరణ్యాక్షుడు, సువర్ణాక్షుడు, విరూపాక్షుడు అవుతాయి. ఈ ముగ్గురూ నరులకు పుణ్యప్రదాయకులు అవుతారు. విచారించక వెళ్ళి రాక్షసుడిని సంహరించు‘‘ అని ఆజ్ఞాపించాడు.

శ్రీహరి వెళ్ళి దైత్యుని శిరస్సు ఖండించాడు. దైత్యసంహారం తరువాత తిరిగి వచ్చిన శ్రీహరి విరూపాక్షుని ఆరాధించి పాలకడలికి తన సుదర్శన చక్రంతో వెళ్ళాడు.

 ఈ కథను తన కుమారునికి చెప్పింది ఆత్రేయి.

అది విన్న ఉపమన్యుడు విరూపాక్షుని సేవించి సకలశాస్త్రాలు అభ్యసించి ధనధాన్యాదులతో జీవించాడు.

ఇది వామనపురాణంలో ఉన్న విరూపాక్ష ఆవిర్భావ వృత్తాంతం.

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...