భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో మంత్రానికి ఒక విశిష్ట స్థానం ఉంది. పరమాత్మతో ఆత్మానుసంధానానికి, భక్తికి మంత్రం కీలకమైందని యజుర్వేదం చెబుతోంది. మనం దైవానికి చేసుకొనే విన్నపాలు మంత్రంలోని బీజాక్షర శక్తి కారణంగా నేరుగా చేరతాయన్నది పౌరాణికుల భావన. పూర్వ కాలంనుంచీ వైదిక మంత్రాలను మూర్తిలోకి దైవత్వాన్ని ఆవాహన చేసేందుకు ప్రయోగించడం సంప్రదాయం. మూర్తిలోకి అంటే మన హృదయంలోకి అనే భావార్థమూ ఉంది. మంత్రాలు మౌలికంగా ప్రచలిత సంహితాలు. ఏ మంత్రాన్నైనా ఓం అక్షరం చేర్చి ఉచ్చరిస్తే ఆ మంత్ర ధ్వని సత్య వ్యక్తీకరణకు కారణమవుతుందని మంత్రోపనిషత్తు వివరిస్తోంది. మంత్రాలన్నింటికీ భిన్నమై, మానసాన్ని భక్తికి గురిచేసే మంత్రం తారక మంత్రమని రామ రహస్యోపనిషత్తు తెలుపుతోంది. శ్రీరామ నామమే తారకమంత్రం. శుక్ల యజుర్వేదానికి చెందిన అద్వయ తారకోపనిషత్తులో తారక మంత్రం మహత్తు గురించిన సంపూర్ణ వివరణ ఉంది. తొలుత ఈ మంత్రం శివుడు పార్వతికి ఉపదేశించినట్లు చెబుతారు.
‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే’ అన్నదే తారక మంత్రం. కుండలినీ శక్తికి రా అనే బీజాక్షరమే మూలాధారమని స్యావన స్మృతి వెల్లడిస్తోంది. మ అనే బీజాక్షరం సహస్రార చక్రాన్ని చైతన్యపరుస్తుంది. రామ అనే నామాన్ని పలికినంతనే కుండలినీ శక్తి సర్పం ఆకారంలో పడగెత్తి కపాలాన్ని స్పృశించే ప్రయత్నం చేస్తుందని ఈ స్మృతి వివరిస్తోంది. యోగిగా మారే యోగ్యత కోసం మానవుడు సదా ఈ నామాన్ని స్మరిస్తూనే ఉండాలని పార్వతికి శివుడు చెప్పాడంటారు. ధరణిలోని మానవుడి ధన్యత కోసం రెండు మంత్రాలు అమేయమైనవని వసిష్ఠుడు దశరథుడితో అంటాడు. ఒకటి ప్రణవం, మరోటి రామ శబ్దం! అందుకే వసిష్ఠుడు దశరథుడి పెద్ద కుమారుడికి శ్రీరామ అని నామకరణం చేశాడట.
రామ రహస్యోపనిషత్తు అధర్వణ వేదానికి సంబంధించినది. శ్రీరామ అనే పదంలోనే విశ్వాల ఆవిర్భావానికి కారణమైన రహస్యం ఉందని సప్తర్షుల్లో ఒకడైన గౌతముడు తాను రాసిన ధర్మశాస్త్రంలో వివరించాడు. అగస్త్యుడు రామ రహస్యోపనిషత్తును హనుమంతుడికి ఉపదేశించాడంటారు. స్వాయంభువ మన్వంతరంలో మానవులందరి నిజ నామం చివర రామ అని ఉండేదట. అలా ఒకరినొకరు పిలుచుకునేందుకు అనుకోకుండానే రామ నామం పలికేవారు. అందుకే ఆ మన్వంతరంలో నరకంలో పని లేక యముడు సదా నిద్రలోనే ఉండేవాడన్నది కథనం.
కాశీ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి- మానవుడు తనువు చాలించే ముందు అతడి కుడిచెవిలో విశ్వనాథుడు తారకమంత్రం ఉపదేశిస్తాడన్నది ఒక నమ్మకం.
రాముడు తన వంశానికి చెందినవాడని సూర్యుడికి గర్వమట. భూమిపై శ్రీరామనవమి ఉత్సవాలు చూసేందుకు సూరీడు అందుకే ఒకింత కిందికి వస్తాడట. అందువల్లే ఆ సమయంలో ఎండలు మండుతాయన్నది ఒక కవి హృదయం! అష్టాక్షరిలోని రా అక్షరం, పంచాక్షరిలోని మ అక్షరం... ఈ రెండు జీవాక్షరాలూ కలిసి రామ అయిందని పౌరాణికుల వ్యాఖ్య! అలా తారకమంత్రం ఉచ్చరించినంత మాత్రాన శివకేశవులు సంతుష్టులవుతారట..
శ్రీరామకృష్ణ పరమహంస తొలుత నరేంద్రుడికి తారక మంత్రమే ఉపదేశించాడు. ఆ తరవాతే నరేంద్రుడు వివేకానందుడయ్యాడు. కబీరు గురుబోధనతో తారకమంత్రం లభించిన కంచర్ల గోపన్న ‘తారక మంత్రము కోరిన దొరికెను... ధన్యుడనైతిని’ అంటూ (ధన్యాసి రాగం) ఆలపించాడు. ‘రమించు వారెవరురా-రఘోత్తమా నిను వినా’ (సుపోషిణి), ‘మనవిని వినుమా-మరువ సమయమా’ (జయనారాయణి) అంటూ ఆర్ద్రతతో రాముణ్ని స్మరిస్తూ త్యాగయ్య నాదయోగం సాధించాడు. తారక మంత్రంలోని మహత్తు అదే!
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.
No comments:
Post a Comment