ఇడా నాడి :
భౌతిక శరీరంలో, సూక్ష్మ శరీరంలో ప్రాణశక్తిని మోసే వాహకాలే నాడులు. ఈ నాడులన్నీ, శరీరంలో అక్కడక్కడ కలుస్తూంటాయి. వాటిని "చక్రాలు" అంటారు. ఒక విధంగా చెప్పాలంటే, అవి నాడీకూటములు.
ఈ నాడులు యోగాభ్యాసంలో, ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. యోగశాస్త్రాన్ననుసరించి, ప్రాణము...ఎప్పుడైతే "సుషుమ్నా" నాడిలో ప్రవేశిస్తుందో, అప్పుడు "కుండలినీ శక్తి" ప్రచోదనమై, ఊర్థ్వ గమిత్వము చెంది, మోక్షం వైపు దారి తీస్తుంది.
ఇక సూక్ష్మ శరీర పరిభాషలో చెప్పాలంటే, సుషుమ్న నాడి, మోక్షానికి దారి తీసే మార్గము.
ఇడా-పింగళ నాడులు "సుషుమ్న నాడి" చుట్టూ, మెలికలు తిరిగినట్లు తిరుగుతూ...జీవ పరిణామానికి దారితీసేటట్టు చేస్తున్నాయి.
మానవుల దేహములో, ఈ నాడులు , కోట్లాదిగా...స్థూల-సూక్ష్మ దేహములలో...విస్తరించి యున్నాయి.
ఇడా నాడి ..... ప్రాణశక్తి ప్రవాహానాడుల్లో...చాలా ముఖ్యమైనది. సంస్కృతంలో, "ఇడా" అనగా "సౌఖ్యం". నాడి అనగా శక్తి ప్రవాహం. యోగ మార్గంలో, నాడీ ప్రవాహ మార్గాలలో, ఆటంకాలు లేకుండా ఉంటే...ప్రాణ శక్తి...నిరాటంకంగా ప్రవహిస్తుంది. మన నాడులలో నిరంతరం ప్రాణ శక్తి ప్రవాహం నిరంతరం జరగాలి. ప్రాణ ప్రవాహం లేకపోతే...మనిషి...శవంగా మారతాడు. నిరంతర ప్రాణ శక్తి ప్రవాహానికై, మనం నిరంతరం, శాస్త్ర విహిత సాధనలు చేయాలి. ఈ ప్రాణశక్తి నిరంతర ప్రవాహం వలన ఆది-వ్యాదులు రావు. (ఆదులు అనగా మానసిక వ్యాదులు. వ్యాదులు అనగా శారీరక బాధలు). ఈ ప్రాణ శక్తి నిరంతర ప్రవాహం వలన, మన మానసిక-శారీరక ఆరోగ్యాలు బాగుంటాయి. ఈ ఇడా నాడి, మానసిక శక్తికి ప్రతీక. ఈ నాడి షట్చక్రాలను చుడుతూ, వెనుబాము యొక్క ఆమూలాగ్రము చరిస్తూ యుంటుంది. ఇడా-పింగళా నాడుల ఉద్దీపనం, కుండలినీ శక్తి ఉద్దీపనం కూడా.
ఇడా నాడిని "చంద్ర నాడి" అంటారు. పింగళా నాడిని, సూర్య నాడి అంటారు. ఈ ఇడానాడి ప్రవాహం...చంద్రుని శక్తితో అనుసంధానించబడి ఉన్నది. ఈ నాడి "మూలాధార చక్రం" నుండి జనించి, షట్చక్రాలను చుట్టుకుంటూ, వెనుబాము పర్యంతమూ పయనిస్తుంది. ఇడా-పింగళా నాడులు ఒకదానికొకటి ప్రతిబింబాలనుకోవచ్చును. ఈ నాడి మూలాధార చక్రం నుండి ప్రారంభమై ఎడమ ముక్కు రంధ్రం వరకు ప్రవహిస్తుంది.
ఇడా నాడి మానసిక స్థితి గతులను నియంత్రిస్తుంది. ప్రాణశక్తిని నాడీ వ్యవస్థకు పంపిస్తుంది. తత్ఫలితంగా, మనస్సుకు శాంతి, శరీరానికి విశ్రాంతి కలుగుతుంది. యోగశాస్త్ర సిద్ధాంతాల ప్రకారము, మెదడులో గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రముతొను - మెదడు లోని కుడిభాగము నకు ఎడమ నాసాగ్రముతోను సంబంధము కలదు .అనగా సింపతిటిక్, పారా సింపతిటిక్ అండ్ సెంట్రల్ నెర్వస్ సిష్టమ్. ( యోగ సిద్ధాంతాల ప్రకారం - ) మెదడులోని ప్రతీ కణమునకు నాడులు కలుపబడి ఉన్నాయి. ఆనాడులు మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణశక్తిని అందించుచున్నవి.
ఈ నాడీ ప్రభావం వలన, మనకు అంతర్ముఖత్వం వస్తుంది. ఈ నాడి మనలో ఉండే స్త్రీ శక్తితో సంబంధం కలిగి ఉంటుంది. ఇడానాడీ శక్తి, పింగళా నాడీ శక్తిని సంతులితం చేస్తుంది. హఠయోగ సాధనల్లో, ముఖ్యమైనది...ఈ ఇడ-పింగళాలను సమన్వయం చేయడం.
హఠయోగ అభ్యాసాలలో, ముఖ్యమైన "నాడీ శోధన ప్రాణాయామం"...ఈ ఇడా-పింగళల నాడులను సంతులనం చేస్తుంది.
No comments:
Post a Comment