Thursday, November 5, 2020

నారాయణతే నమో నమో...

త్రిమూర్తులకు ప్రతిరూపం నారాయణుడని యజుర్వేదం చెబుతోంది. 


రుగ్వేదం, భాగవతం, భగవద్గీత వంటివీ నారాయణుడే పరమదైవమని కీర్తిస్తున్నాయి.


 నారాయణుడు ఆత్మస్వరూపుడు. సకల జీవుల్లోని ఆత్మకు నారాయణుడికి నిత్య సత్య సంబంధం ఉంటుందని సూర్యోపనిషత్తు వివరిస్తోంది.


 శంకరాచార్యుడి పంచాయతన విధానాన్ని అనుసరించి నారాయణుడే పరబ్రహ్మం.


 యాస్కుడి నిరుక్తం నారాయణుడు అంతటా వ్యాపించి ఉన్నాడని చెబుతోంది. 


రుగ్వేదంలోని దశమ మండలంలో ప్రస్తావించిన పురుష సూక్తంలో శ్రీమన్నారాయణుడి స్వరూప స్వభావ విశేషాలు తెలుస్తాయి.


 ఈ దైవమే పరమ పురుషుడు. 


ఈ సూక్తంలోని రెండో శ్లోకం నుంచి అయిదో శ్లోకం వరకు నారాయణుడి స్వరూపాన్ని వర్ణించారు. 


విశ్వం, విశ్వాంతరాళాల్లో నారాయణుడు అనంతమై, అగణితమై వ్యాపించి ఉన్నాడని, జగత్సంబంధమైన అపూర్వ, దివ్యమైన ఆ రూపాన్ని చూడలేమని అధర్వణ వేదం చెబుతోంది.



నారాయణుడి రూపం వర్ణనకు అతీతమైంది. 


ఇతర శక్తుల ఊహకు సైతం ఆ దైవస్వరూపం అందనిదని భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించాడు


. కావ్య సరణిగా పరమ పురుషుడికి వేయికాళ్లు, వేయిచేతులు ఉన్నాయని పురుష సూక్తంలో చెప్పినా- ఆ స్వరూపం ఇంత టిదని నిర్వచించ లేనిది, అభివ్యక్తీకరణకు అందనిదని ఉపనిషత్తులు తెలియజెబుతున్నాయి.


 నారాయణుడు వేలాది కోట్ల సూర్య నక్షత్రాలకన్నా శక్తిమంతుడు. ఆయన సృజించిన నక్షత్రాలు గ్రహాలు లెక్కించ లేనివని వాజసనేయి సంహిత వివరిస్తోంది. 


అంతరిక్ష పరిశోధకులూ ఇదే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నక్షత్రాలు, గ్రహాలు ఊహకు అంద నంతగా ఉన్నాయని, అందులో ఎన్నో కోట్లు అంతరించి మరెన్నో కోట్ల నక్షత్రాలు ఉద్భవిస్తున్నాయని తేల్చారు. 


తైత్తిరీయ ఆరణ్యకం- అంతరిక్షంలో నిరంతరం ఉద్భవించి నశించే నక్షత్ర రాశులన్నీ పరమ పురుషుడి లోనుంచి జనించి లయమవుతున్నాయని చెబుతోంది. 


నారాయణుణ్ని సంపూర్ణంగా తెలుసుకొన్నవారు ఉన్నారు. కాని, వారు పురుష సూక్తంలో చెప్పినట్లు ఆ పరమ పురుషుడిలో లయమైపోయారు.


 ఆ దీప్తిని మనిషి చర్మ చక్షువులు చూడలేవు. సూర్యుణ్ని మనం సూటిగా చూడలేం. అలాంటి అగణిత సూర్య శక్తులను సృజించే నారాయణుడిలోని వెలుగును మనం తట్టుకోలేం.



మూడు వందల అరవై కల్పాల తరవాత మహా ప్రళయం సంభవిస్తుందంటారు. ఈ అనంత కోటి విశ్వాలన్నీ మహా పురుషుడిలో కలిసిపోతాయట. అప్పుడు ఎక్కడ చూసినా నీరే! ఆ నీటిపై రావి ఆకుపై పడుకొని తన కాలి బొటన వేలిని నోట్లో పెట్టుకొని బ్రహ్మానందం అనుభవించే వట పత్ర శాయి నారాయణుడు.

నారాయణుడు సృజన శీలి.


 ఆయనే రక్షకుడు. నారాయణుడే లోకాలకు తండ్రి. జీవరాశులు, చలనాలు అచలనాలన్నింటికీ ఆయనే కారకుడు.


 ఆధ్యాత్మిక భావంతో ఆయనను చేరడం సులువని భాగవతం చెబుతోంది.


 ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రం భవజలధిని దాటించే సాధనం. నారదుడు నిరంతరం ‘నారాయణ నారాయణ’ అంటూ లోకాలన్నీ తిరుగుతాడట.


 అన్నమాచార్యులు సైతం నారాయణతే నమో నమో అంటూ శిరస్సు వంచి నమస్కరించారు.


----అప్పరుసు రమాకాంతరావు



🍁🍁🍁🍁

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...