Sunday, December 15, 2019

తిలలతో తర్పణం..పితృదేవతల ఆరాధనం

మానవ జన్మ పొందిన ప్రతి జీవికి ఋణత్రయ బంధం ముడిపడి వుంటుంది. భగవంతుడు మనకు ప్రసాదించిన బుద్ధి జ్ఞానాల ద్వారా మనం ఋణ త్రయ విముక్తి పొందటానికి చేయవలసిన కర్మను పూర్వులు నిర్దేశించారు.

ఋణ త్రయాలు -1.ఋషి ఋణము, 2. దేవ ఋణము, 3. పితృ ఋణము.

1 ఋషి ఋణము: ఋషుల వల్ల లభించిన జ్ఞానం బ్రహ్మ చర్య పాలన ద్వారా వేదాధ్యయనం, సంధ్యావందనం కర్మలను నిష్ణగా ఆచరించడం ద్వారా మానవులు ఋషి ఋణాన్ని తీర్చుకోగలుగుతారు.

2. దేవ ఋణము: దేవతలకు ఆహారాన్ని అందించడం ద్వారా ఇది తీరుతుంది. యజ్ఞ యాగాది కర్మల నాచరిస్తూ అందు సమర్పించే హవిస్సుల ద్వారా దేవతలకు ఆహారం అందుతుంది. దేవ ఋణ విముక్తికి తోడ్పడుతుంది.

3. పితృ ఋణం: మన శరీరాల జన్మ కారణమైన పితృ దేవతల అనుగ్రహాన్ని కూడా మానవులు పొందాలి. సత్సంతాన రూపంలో కొన్ని దేహాలు సృష్టించబడి సృష్టి కార్యవృద్ధి పొంది పిండోదక దానాలు జరిగితే పితృ దేవతలు తృప్తిపొంది వారు సంతానాన్ని ఆశీర్వదిస్తారు. అప్పుడు పితృ ఋణ విముక్తి కలుగుతుంది.

పితరులు గతించిన అనంతరం వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా వారు ప్రకృతిలో లయించి ఉంటారు. కాబట్టి ఆయా రూపాలలో వున్న పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు, దర్శశ్రాద్ధ తిల తర్పణ రూపంలో తృప్తిపరిస్తే వారివారి కుటుంబాలకు పితృదేవతల ఆశీస్సులు లభించి వారి కుటుంబాలు సుఖ శాంతులతో వర్ధిల్లుతాయి. కావున ప్రతి ఒక్కరు పితృ ఋణ విముక్తుల ఎలా కావాలో చెపుతూ పెద్దలు నిర్దేశించిన కర్మకాండలను విధిగా మనం ఆచరించాలి. ప్రతి నెలా చేయాల్సిన తిల తర్పణం (దర్శ శ్రాద్ధం) సంవత్సర శ్రాద్ధ కర్మలు విధిగా చేయాలని పెద్దలు నిర్దేశించారు.

ప్రతిసంవత్సరం భాద్రపద మాసంలో కృష్ణపక్షం ఆరంభమైన వెంటనే పితృదేవతలందరు భూలోకంలోని తమ తమ సంతతివారు మహాలయ శ్రాద్ధము లేదా తిల తర్పణం చేయుదురని ఆయన్నము లేదా తిలోదకములను తృప్తిగా గ్రహించాలని, భుజించాలని మిక్కిలి ఆశతో వారు భూలోకానికి వచ్చి కార్తీక శుక్ల పక్షం వరకు ఇక్కడ వసిస్తారు.

ఇంతమంది మహానుభావులైన పితృ దేవతలందు భాద్రపద కృష్ణపక్షం ఆరంభంనుంచి ఆమావాస్య వరకు ఆతర్వత ఆశ్వీజ, కార్తీక కృష్ణ పక్షాలలోను ఈ భూలోకంలో వసించుట చేత ఈ భూలోకమే మహానుభావులైన పితృదేవతలకు ఆలయమై భాసించును. ‘యత్కాలానచ్ఛేదేన భూలోకస్య మహాలయత్వమ్ తదచ్ఛేదక కాలస్యాపి మ హాలయత్వం బోద్ధ్వమ్’ అని వాక్యం. మహతామ్+ ఆలయం=మహదాలయః. పితృదేవతలందరు భూలోకంలో వుండుటవలన ఈ భూలోకమే మహాల(ళ)య మగును. దీనివల్ల ఈ కాలానికి మహాల(ళ)య పక్షము అని పేరు. పక్షమనగా పదిహేను రోజులని అర్ధం. ఆ విధంగా ప్రధానంగా భాద్రపద కృష్ణ పాడ్యమి మొదలు అమావాస్య వరకుండే పదిహేను రోజుల కాలమే మహాలయపక్షము. ఈ అమావాస్యకు మహాలయ అమావాస్య అని పేరు.

ఈ మహాలయ పక్షాలకు పితృ పక్షమని, పెద్దల దినాలు అనే మాట కూడా వాడుకలో వుంది. ఈ పక్షం రోజుల్లో ప్రత్యేకించి ఓకరోజు సద్భ్రాహ్మణులు చెప్పిన రోజున సకుటుంబంగా బంధువులతో కలిసి పితృదేవతలనారాధించి వారిపేర బ్రాహ్మణులకు బియ్యం, తాంబూల దక్షిణలు సమర్పించి వారి ద్వారా పితృ దేవతల ఆశీస్సులు పొందడమనే సదాచారం నేటికీ అమల్లో వుంది. ఈ విధంగా మహాలయ పక్షంలో ఈ బియ్యమిచ్చే కార్యక్రమం ద్వారా పితృ ఋణాన్ని తీర్చుకునే సదవకాశం మనకు కలిసి వస్తున్నది. బియ్యమివ్వడమంటే అపక్వ (ఆమ) పదర్ధాలను బియ్యము, పెసరపప్పు, నిర్దేశించిన కూరగాయలు, తాంబూల దక్షిణ యుక్తంగా పెద్దల పేర భక్తితో బ్రాహ్మణులకు దానం చేయబడే ప్రక్రియ. దీనినిఆమ శ్రాద్ధమని అంటారు.

భాద్రపద కృష్ణ పక్షంలో పితరులనుద్దేశించి శ్రాద్ధ తర్పణాలు చెయ్యబడనిచో ఆశ్వీజ కృష్ణపక్షంలోనైనా చేస్తారేమో అని ఎదురు చూస్తూ చివరకు కార్తీక మాస కృష్ణ పక్షం వరకు నిరీక్షిస్తూ రెండు నెలలు భూలోకంలోనే వుండి పోతారు. అప్పటికి కూడా భూలోకంలోని తమ సంతతి తమకు శ్రాద్ధ, తర్పణాలు చెయ్యకపోతే నిరాశ చెందిన పితృదేవతలందరు తిరిగి పితృ లోకాలకు వెళ్లిపోతారు. వారు నిరాశ చెందితే మనకు వారి ఆశీస్సులెలా అందుతాయి?

కావున మహాలయ పక్షాలలో మన వంశంలో గతించిన పితరులను అందరినీ సామూహికంకగా ‘కారుణ్యపితరులు’గా భావించి ఈ సందర్భంగా స్మరించి ఆరాధించుకోవడం జరుగుతుంది. కావున పితరులను నిరాశపరచకుండా కార్తీకం వరకు సమయముంది కదా అని తాత్సారం చేయకుండా భాద్రపద మాసంలోనే మహాలయపక్షంలోనే మహాలయ శ్రాద్ధ తర్పణాలు అవశ్యం చేసి తీరాలనే పెద్దల ఆదేశాన్ని పాటించడం మన విధి.

1 తర్పణాలు ఎప్పుడాచరించాలి?: దర్శ శ్రాద్ధమనబడే తిల తర్పణాలను ప్రతి నెలా అమావాస్య, సూర్య సంక్రమణము ఆరంభం నాడు, సూర్య చంద్ర గ్రహణ పుణ్య కాలమునందును, మహాలయ పక్షంలోను, ప్రత్యాబ్ధికములు (శ్రాద్ధములు) చేసిన మరుసటి దినము (పరేహణి) తర్పణం చేయుట ధర్మమని పెద్దలు ఆదేశించి వున్నారు.

2. ఎవరు తర్పణం చేయాలి?: 1.తండ్రి గతించిన వారందరు తర్పణం చేయాలి. 2. తండ్రి జీవించివున్నవారు తర్పణములు చేయకూడదు. 3. తల్లి జీవించి తండ్రి గతించినవారు ఆపై మూడు తరముల పితరులను స్మరిస్తః తర్పణం చేయాలి.

3. తర్పణం ఎవరెవరికి చేయాలి?: 1. ఒక్క పరేహణి తర్పణం తప్ప మిగతా అన్ని కాలాలలోని తర్పణాలు పితృ మాతృవర్గ ద్వయ పితరులకు (వారి నాహ్వానించి) తర్పణం చేయాలి. 2. మాతృ/పితృ ప్రత్యాబ్దిక శ్రాద్ధము చేసిన మరుదినము ఉదయమే పితృ వర్గము వారిని మాత్రమే ఆహ్వానించి తర్పణము చేయవలయునని నిర్దేశించబడింది. 3. మాతా మహులు (తల్లియొక్క తండ్రి) జీవించి వున్నచో మాతృవర్గము వారికి తర్పణము చేయవలసిన అవసరం లేదు.
వర్గద్వయమనగా పితృవర్గము (తండ్రి వైపు) వారు. మరియు మాతృవర్గము (తల్లియొక్క తండ్రివైపు) వారు, పితృవర్గంలో (పురుషులు) పితృ(తండ్రి), పితామహ (తాత), ప్రపితామహ (ముత్తాత) తాతకు తండి ఇలా మూడు తరముల వారు. ఈ ముగ్గురిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా దర్భలపై ఆహ్వానించి తర్పణం చేయాలి.

పితృవర్గంలో (స్ర్తిలు): మాతృ (తల్లి), పితామహి (నానమ్మ), ప్రపితామహి (తండ్రికి నానమ్మ) ఇలా మూడు తరాల వారు పై వరుసలో జీవించి వున్న వారిని వదిలి ఆపై తరము వారిని ఆహ్వానించాలి.

మాతృవర్గంలో (పురుషులు): 1. మాతామహ (తల్లికి తండ్రి), 2. మాతుః పితామహ (తల్లి తండ్రికి తండ్రి), 3. మాతృ ప్రపితామహ (తల్లి తాతకు తండ్రి)-3 తరాలు. మూడు తరాల వారిని వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులుగా ఆహ్వానించి తర్పణం చేయాలి.
మాతృవర్గంలోని స్ర్తిలు: 1. మాతా మహి (తల్లియొక్క తల్లి), 2.మాతుఃపితామహి (తల్లికి అవ్వ), 3. మాతుఃప్రపితామహి (తల్లి అవ్వకు తల్లి) 3 తరాలు.

మానవుడు నేడు ప్రతీ పనికీ ద్రవ్య రూపంలో లాభానే్న వెతుకుతున్నాడు. అలా ద్రవ్య-వస్తు రూపంలో పొందలేని అనేకం భక్తి శ్రద్ధలతో ఈ కర్మ చేయడంవలన మనం పొందవచ్చును.
ప్రతి శ్రాద్ధ కర్మ, తర్పణంరోజున, గతించిన పితరులు, వసు రుద్ర ఆదిత్య స్వరూపులై ప్రకృతిలో అంతర్లీనమైన వున్న పితృదేవులను ఆహ్వానించి, అర్చించి తిల తర్పణలర్పించి అనంతరం వారిని యధా స్థానానికి సాగనంపడం సదాచారం.

భారతీయ సంస్కృతి మనకు ప్రసాదించిన ఉత్కృష్టమైన ఈ కర్మకాండ ఎంతో అమూల్యమైనది. ఈ విధంగానైనా మనం మన పిల్లలు-తండ్రి, తాత, ముత్తాత ఆపై తరంవారు వారి భార్యల (సపత్నీకానాం) పేర్లు తెలుసుకుని గుర్తుంచుకునే అవకాశం కలుగుతుంది.
అట్లే తల్లివైపు మూడు తరాల స్ర్తి పురుషుల పేర్లు గోత్రం కూడా తెలుస్తుంది. ఈ సందర్భంగానైనా మన పూర్వులను స్మరించుకునే అవకాశం కలుగుతుంది. మనంవారికేం చేయగలుగుతాం? మననుండి వారాశించేదేమిటి? కేవలం భక్తితో వారిని స్మరిస్తూ ఆహ్వానించి తిల తర్పణం (నువ్వుల నీళ్లు దర్భలపై వదలడమే కదా! మనకీ జన్మకారుకులైన పితృదేవలతలకు కృతజ్ఞతలర్పించుకోవడం ( ఈ తర్పణాల ద్వారా) మన విద్యుక్త ధర్మం కదా! దీనిద్వారా మన కుటుంబంలో తండ్రి, తల్లివైపు మూడు తరాల వారిని తెలుసుకునే సదవకాశం కలుగుతుంది. ఇది ధర్మంలుప్తం కానంత కాలం నిరంతరం సాగే ప్రక్రియ.

తర్పణం చేయకుంటే ఏమవుతుంది?: తర్పణం అనేది పితృదేవతలకు మన కృతజ్ఞతలు తెలుపుకునే మానసిక యజ్ఞంలాంటిది. లౌకికంగా ఆలోచిస్తే మనకు క్షణ కాలం బస్సులో సీటుఇచ్చిన వాడికి చిన్న సహాయంచేసిన వాడికి ధాంక్సు అంటూ కరిగిపోతూ చెబుతామే! మరి మన శరీర సృష్టికే కారణమైన, మనకు జీవితాన్ని ప్రసాదించిన పితృదేవతలకు కృతజ్ఞతలు తెలుపకపోవడంలో ఎంత స్వార్ధం! ఎంత మూర్ఖం! కాబట్టి ప్రతి ఒక్కరు మన పూర్వులకై ఇలాంటి సత్కర్మలనాచరించి వారిని తృప్తిపరుస్తూ వారి ఋణాన్ని తీర్చుకుని వారి ఆశీస్సులు పొందడం సదా వాంఛనీయం, సర్వ శ్రేయస్కరం!

అన్ని అమావాస్య-సంక్రమణ తర్పణాలు తప్పక చేయాలా?: వీలైనంతవరకు అన్ని అమావాస్యలు (సంవత్సరంలో 12సార్లు) సౌరమానం ప్రకారం సంక్రమణ ఆరంభ దినాలు (సంవత్సరంలో 12 సంక్రమణాలు) మరియు గ్రహణాల, మహాలయ పక్షాల వంటి సందర్భాల్లో తర్పణాలు చేయాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. అలా వీలుకానిపక్షంలో అమావాస్య తర్పణలు తప్పక చేయాలి.సౌరమానులకు సంక్రమణాలు ప్రధానం. ఆమావాస్య తర్పణాలతో బాటు (ఉత్తరాయణ పుణ్యకాలం మకరం) సంవత్సరంలో మేషం, కర్కాటకం (దక్షిణాయన ఆరంభం కర్కాటకం) తుల, మకర సంక్రమణాలు ఈ నాలుగు నెలల్లోనైనా తప్పక తర్పణం చేయాలి. మహాలయ పక్షాలలో విధిగా తర్పణం చేసి తీరాల్సిందే. ఇదంతా ఎంతో కష్టమనుకుని బాధపడుతు చేయడం సరికాదు. మనసారా శ్రద్ధ, భక్తితో మన పితృదేవులకు కృతజ్ఞతలు తెలుపుకునే ఉత్తమ యజ్ఞంలా భావించి చేయాల్సిందే కానీ ఎదో వంతుకు, నలుగురేమైనా అనుకుంటారేమో అని చేయాల్సింది కాదు. అందుకే ‘శ్రద్ధ యా దీయతే ఇతి శ్రాద్ధం’ అన్నారు పెద్దలు.

కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయనవసరం లేదా?: ‘దేవ పితృ కార్యాభ్యాం నప్మ మది తవ్యం’ అంటుంది శాస్త్రం. అంటే ఆయా సందర్భాల్లో ఆచరించాల్సిన దేవ, పితృ కార్యాలను తప్పనిసరిగా విధిగా ఆచరించాలని దీని అర్ధం. అంతేకానీ కాశీ, గయలలో శ్రాద్ధ తర్పణాలు చేస్తే ఇక తర్వాత చేయాల్సిన అవసరం లేదనేది ఎక్కడా చెప్పబడలేదు. ఈ వాదన సరైంది కాదు. ప్రతి అమావాస్య, సంక్రమణం ఇతర విశేష దినాలలో పితృదేవతలు మననుండి ఆశించేది కృతజ్ఞతలే కదా !ఈ శ్రాద్ధ తర్పణాల ద్వారా పితృదేవులకు కృతజ్ఞతలందచేసుకోవడంలో బద్ధకించడం ఘోరమైన అపచారమే కదా! ఈ సదాచారాన్ని మనంపాటించకపోతే మన పితృదేవతలను మనం మరిచిపోవడమే కదా! మనమే మన పూర్వులను మరిచిపోతే మన పిల్లలు, తర్వాతి వారు మన వంశం గురించి ఎలా తెలుసుకోగలుగుతారు? కాబట్టి తీర్ధ విధులు (తీర్థ క్షేత్రాలలో) కావించే శ్రాద్ద తర్పణాలు) వేరు, నిత్యాబ్ధీకాలు, తర్పణాలు వేరు. కావున ఈ కర్మలు ఆచరించడం భారమనుకోవడం భక్తి శ్రద్ధలు లేక విసుగుతో చేయడం క్షమించరాని అపచారమే తప్ప మానవ ధర్మమనిపించుకోదు.

తర్పణము చేయుటకు అశక్తులు-అనర్హులకు ఏమిటి పరిష్కారం?: ఒక వీధిలో ఒక చోట మంటపెట్టి అందులో గుప్పెడు మిరపకాయలు గనక వేస్తే దాని ఘాటు ఆ వీధిలోని వారందరికీ ఎలా చేరుతుందో అదే విధంగా ఆ వీధిలో ఏ కొందరో ధర్మకార్యాలు చేస్తుంటే దాని ప్రభావం-ఏమీ చెయ్యని వారికి కూడ అందుతుందనే వాస్తవం పై ఉదాహరణ వివరిస్తుంది. పూర్వం రాజుల కాలంలో ఋషులు యజ్ఞ యాగాదులు, జప తపాలు చేస్తూ వుంటే (వారిని రాజులు ప్రోత్సహించి, పోషించేవారు) ఆ రాజ్యంలో సుఖ శాంతులు విలసిల్లేవనేది ప్రత్యక్ష సత్యం.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...