Saturday, July 7, 2018

శ్రీ ఆంజనేయ మాహాత్మ్యం

🌸శ్రీ ఆంజనేయ మహాత్మ్యం :-1🌸

🌺శ్రీ ఆంజ నేయ మంత్రోప దేశ లక్షణం🌺

ఒకప్పుడు పరాశర మహర్షిని మైత్రేయుడు ఇలా ప్రశ్నించాడు ”కలి కాలం లో దుఖాలను దూరం చేసేది ,దారిద్రాన్ని పోగొట్టేది ,వ్యాదులనుండి రక్షించేది ,సర్వదా విజయాలను చేకూర్చేది అయిన మంత్రం ఏదైనా వుంటే తెలియ జేయండి ”.దానికి ఆ మహర్షి సంతోషించి ”మైత్రేయా !మంచి ప్రశ్న వేశావు .నీ ద్వారా లోకానికి ఉపయోగ కరమైన మంత్రాన్ని చెప్తాను విను .అది సకల వేద శాస్త్ర ,పురాణాదుల సారమే .వెంటనే ఫలితాన్ని చచ్చేదీ .నేను ఒక సారి సరయు నది దగ్గర వుండగా ,నా తండ్రి వసిష్టుడు నాకు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాన్ని ఉపదేశించాడు .శివ ,వైష్ణవ ,శాక్తేయ ,గాణా పత్య మంత్రాలు వెంటనే సత్ఫలితాలను ఇవ్వవు .వెంటనే ఫలితమిచ్చే మంత్రాలలో లక్ష్మీ నారాయణ విద్య ,భవానీ శంకర విద్యా ,సీతా రామ మహా విద్యా హనుమన్మహా విద్య చాలా ముఖ్యమైనవి .వీటి తరువాత నృసింహ విద్య ,బ్రహ్మాస్త్ర విద్య అస్తార్ణ మారుతీ విద్య .ఎనిమిదవది  సామ్రాజ్య లక్ష్మీ విద్య ,తొమ్మిది  మహా గణపతి విద్య ,పది  సౌర విద్య , పదకొండ వది   దక్షిణ కాళీ విద్య .పన్నెండవ విద్య చింతామణి విద్య .వీటినే ద్వాదశ విద్యలు అంటారు .వీటిలో దక్షిణ కాళికా విద్య ఒక్క రాత్రిలో ఏ ఆచారమూ పాటించక పోయినా ఫలితాన్ని ఇస్తుంది .అస్తార్ణ మారుతీ విద్య ఇంకా తక్కువ సమయం లో ఫలితం చేకూరుస్తుంది .ఇందులో అనులోమ ,ప్రతి లోమం గా యాభై వర్ణాలు వుంటాయి  .బాగా జపిస్తే బ్రహ్మాస్త్ర విద్యా మంచి ఫలితాన్నే ఇస్తుంది .నృసింహ విద్య ఇంతకంటే తక్కువ కాలం లో ఫలిస్తుంది .వీటి అన్నిటికంటే గురువు ద్వారా పొందిన ”పంచ వక్త్ర హనుమాన్ మంత్రం ”శీఘ్రం గా శిద్ధి నిస్తుంది .ఈ జప మహాత్మ్యం వల్లనే అగస్త్యుడు సప్త సముద్రాల నీటిని పుడిసిలి లో పట్టి తాగ గలిగాడు .అర్జునికి,భీమునికి  శత్రువులను జయించే శక్తి ,దీని వల్లే కలిగింది .విభీషణుడు ఈ మంత్రం వల్లే శాశ్వత సంపదను శ్రీ రామానుగ్రహం తో పొందాడు .
హనుమాన్మంత్రం చేత జయం ,గౌరవం ,,రాజ్యం ,జన వశ్యం ,అచంచల భాగ్యం కలుగు తాయి .ధర్మార్ధ ,కామ మోక్షాలు ,ఆపదలను పోగొట్టు కోవటం ,శత్రు జయం ,నిగ్రహానుగ్రహ శక్తి దీని వల్ల సాధ్యమవుతుంది .వాక్సిద్ది ,పుత్ర సంతానం ,అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి .అయితే గురు ముఖతా ఈ మంత్రాన్ని ఉపదేశం పొంది ,గురువును సంతృప్తి పరిచి ధ్యానిస్తే గొప్ప ఫలితం వుంటుంది .పరి శుద్ధ మైన మనసు తో నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని జపించాలి .అన్ని విద్యలకు ఇది ఆధార మైన మంత్రం .పంచ వక్త్ర మహా విద్య గురు కృప వల్ల సామ్రాజ్య సాధనకు తోడ్పడుతుంది .శ్రీ ఆంజనేయ మహాత్మ్యాన్ని,వెయ్యి శిరస్సులున్న ఆది శేషుడు కూడా వందల సంవత్స రాలు చెప్పినా తరగదు .”అని పరాశర మహర్షి మైత్రేయ మునికి శ్రీ ఆంజనేయ  మంత్ర మాహాత్మ్యాన్ని వర్ణించి చెప్పాడు .

🌸🌸🌸

🌸శ్రీ ఆంజనేయ మాహాత్మ్యం-2🌸

 🌺విజయుని చరిత్ర:-🌺

          శ్రీ ఆంజనేయ స్వామి ని అర్చించి తరించిన భక్తుల చరిత్రలను పరాశర మహర్షి ,మైత్రేయునికి తెలిపాడు .అందులో విజయుని  చరిత్ర ను ముందుగా తెలియ జేస్తున్నాను .
         త్రేతాయుగం లో” చంద్ర కోణం” అనే ప్రసిద్ధి చెందిన నగరం  వుంది .దాన్ని విజయుడు అనే మహారాజు పాలిస్తున్నాడు .అతడు బలశాలి ,శత్రు సంహారకుడు ,సమర్ధుడు .యుద్ధ విద్యలో చేయి తిరిగిన వాడు .నాలుగు దిక్కుల లో వున్న రాజ్యాలన్నీ జయించి స్వాధీనం చేసు కోవాలనే బల మైన కోర్కె అతనికి కలిగింది .రాజ్యాన్ని కుమారులకు అప్పగించి,పెద్ద సైన్యం తో  ,జైత్ర యాత్రకు బయల్దేరాడు .కొంత ప్రయాణం చేసిన తరు వాత ”గర్గ మహర్షి ”ఆశ్రమం చేరాడు .సైన్యాన్ని దూరం గా వుంచి ,తానొక్కడే మహర్షిని సందర్శించాడు .భక్తీ తో ఆయనకు నమస్కరించి నిలుచున్నాడు .ఆతని శ్రద్ధ  కు భక్తికి సంతోషించిన గార్గుడు కుశల ప్రశ్న లతో  స్వ్వాగతం పలికి ,ఆతిధ్యం ఇచ్చాడు .
         గర్గముని- రాజైన విజయుడి తో ”రాజా !స్వాగతం .ఎక్కడి నుంచి బయల్దేరావు ?ఎక్కడి దాకా ప్రయాణం ”?అని అడిగాడు .దానికి రాజు విజయుడు వినయం తో ”మహర్షీ !మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే వుంది .ఇంటి నుంచే బయల్దేరాను .సర్వ దిక్కుల లో వుండే రాజ్యాలన్నీ జయిన్చాలనే కాంక్ష తో దిగ్విజయ యాత్రకు బయల్దేరాను .నా దిగ్విజయ యాత్ర సఫలం కావటానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి ,నాకు పని సానుకూలం ఆవటానికి ఇంకా ఏదైనా ఉపాయం వుంటే సెలవివ్వండి ”అని విన్నవించాడు 
           గర్గమహర్షి సంతోషించి ”నీ కోరిక మంచిదే .అయితే ఏ పని కైనా దైవ అనుగ్రహం కావాలి .అప్పుడే ఆ కోరిక నెర వేరుతుంది .సఫల మనో రాదుడవై ”విజయుడు ‘అనే పేరు సార్ధకం చేసుకో .ఎన్నో మంత్రాలున్నాయి .కాని శీఘ్రం గా ఫలసిద్ధి నిచ్చేది మాత్రం ”హనుమన్మంత్రం ”ఒక్కటే .అది భక్తులకు అందు బాటు లో వుంటుంది .యుద్ధం లో జయాన్ని నీకు అందిస్తుంది నేను నీకు ఆ మహా మంత్రాన్ని ఉపదేశిస్తాను .దాన్ని త్రికరణ శుద్ధి గా ,భక్తీ ,శ్రద్ధలతో జపించు .నువ్వు అనుకొన్నది సాధించ గలుగుతావు ”అని చెప్పి ,బీజ సహితం గా ,మంత్ర ,ఉద్ధార ,,న్యాస పూర్వకం గా అష్టాక్షరీ హనుమంమంత్రాన్ని గర్గుడు ,విజయునికి ఉపదేశించాడు .
            గర్గాశ్రమం లోనే విజయ మహారాజు వుండి ,ఆయన సన్నిధి లోనే మంత్రం మీద ,మంత్ర దైవం అయిన ఆంజనేయుని మీద సమాన భావం తో విశ్వాసము ,గౌరవము చూపించి ,108 సార్లు జపించాడు .శ్రీ ఆంజనేయుడు పరమ ప్రీతి చెంది ,సుగ్రీవాదులతో కలిసి అక్కడ ప్రత్యక్షం అయాడు .ఆనంద బాష్పాలు కారుతుండగా ,విజయుడు ,వాయునందనుడికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు .నాలుగు ముఖాలు కల బ్రహ్మ ,ఆరు ముఖాల కుమార స్వామి ,వెయ్యి ముఖాల ఆదిశేషుడు ఆశ్చర్య పడేట్లు ఒకే ఒక ముఖం గల విజయుడు హనుమను పెక్కు విధాల కేర్తించాడు .అనేక స్తోత్రాలు చేసి భక్తిని ప్రకటించుకొన్నాడు .
         హనుమ భగవానుడు సంతృప్తి చెంది ,విజయుని తో ”నీ యడల ప్రసన్నుడిని అయాను నీకు శుభం కలుగు తుంది .ఏదైనా వరం ఇస్తాను కోరుకో” అన్నాడు మనసులో సంతోషించి ,దోసిలి ఒగ్గి వాయుసుతునుకి మళ్ళీ నమస్కరించి ”అతి తక్కువ కాలమ్ లోనే నాకు దర్శనం ఇచ్చి ,నన్ను క్రుతార్దుడిని చేశావు మహా బలవంతా ,ఆంజనేయా !నీ దర్శనమే కోరిక లన్నిటినీ తీరుస్తుంది .అయినా నా మీద ప్రేమతో వరం కోరుకో మన్నావు ,తీరుస్తానని అభయం కూడా ఇచ్చావు .నీ కృప అపారం .నా మనసులో నాలుగు దిశలు జయిన్చాలనే కోరిక వుంది .నీ అనుగ్రహం కావాలి దానిని తీర్చి ,నాకు మేలు చేయి ”అని ప్రార్ధించాడు .
         ఆంజనేయుడు అతని వినయ వచనాలకు సంప్రీతుడై ,వాత్చల్యం తో ”రాజా !నాలుగేమిటి ?పది దిక్కులను జయించి విజయుడు అనే పేరు సార్ధకం చేసుకో .అయితే ,ఈ జన్మలో నీ కోరిక తీరదు .రాబోయే ద్వాపర యుగాంతం లో ఈ కోరిక నెర వేరుతుంది .అప్పుడు నువ్వు స్వర్గాది పతి దేవేంద్రుని కుమారుడి వైజన్మిస్తావు .శ్రీ కృష్ణుని సారధిగా చేసు కోని ,అన్ని దిక్కులను జయిస్తావు .కురు క్షేత్ర సంగ్రామం లో కౌరవులను జయిస్తావు .అప్పుడు నీ రధానికి నేను జెండా పై అధివసించి ,నీ కు విజయం చేకూరుస్తాను .నేను వుండే ఆ జెండాను ”కపిధ్వజం ”అంటారు .నిన్ను ”కపిధ్వజుడు ”అని పిలుస్తారు”అని వరం ప్రదానం చేసి మారుతి అంతర్ధానం అయాడు .హనుమ చెప్పిన మాట విని ,విజయ మహారాజు తన జైత్ర యాత్రను విరమించు కోని ,గర్గ మహాముని ఆశీస్సులను అందుకొని ,ఆయన కు నమస్కరించి ,,మళ్ళీ రాజా దానికి చేరు కొన్నాడు . .
రాజ్యాన్ని ధర్మ సమ్మతంగా ,ప్రజా క్షేమంగా పరిపాలించి ,చివరికి స్వర్గ లోకం చేరాడు .


శ్రీ ఆంజనేయ స్వామి మాహాత్య్మం –3

🌺బ్రహ్మ దేవుని చరిత్రం🌺

బ్రహ్మ దేవుని చరిత్రం
 శ్రీ హనుమానుడు సువర్చలా దేవితో గంధ మాదన పర్వతం మీద సుఖం గా వున్నాడు .శ్రీ రామ మంత్రాన్ని సర్వదా జపిస్తూ ,శ్రీ రామ నామ పానాన్ని అనుభవ సిస్తున్నాడు .అయినా ఒక రోజూ ఆయన కు శ్రీ రామ దర్శనం చేయాలనే కోరిక కలిగింది .అంతే వెంటనే బయల్దేరి గంధ మాదనం నుంచి బయల్దేరి అయోధ్యకు చేరాడు .శ్రీ రాముని సందర్శించి భక్తీ ,వినయం తో నమస్కరించి స్తుతి చేసి ,ఆయన మనస్సును గెలిచాడు .అప్పుడు సీతా రాముడు హనుమను గాదం గా ఆలింగనం చేసుకొన్నాడు .శిరస్సును మూడు సార్లు ముద్దు పెట్టుకొన్నాడు .హనుమ క్షేమ సమాచారాలను అడిగి తెలుసు కొన్నాడు .ఆంజనేయుడు ”రామా !నువ్వు వుండగా ,కులాసా కు ఏమి కొదవ?నీ పై భక్తీ వున్న వాళ్ళందరికీ క్షేమమే నన్ను ఆలింగనం చేసుకొని  నాకు  పరమానందాన్ని కలిగించావు .నాకు ఉక్కిరి బిక్కిరి గా వుంది .మాట రావటం లేదు ”అన్నాడు . .
హనుమ మాటలకు రాఘవుడు సంతోషించి ”హనుమా !సీతా దేవి లంకా లో వున్న కాలమ్ లో చాలా కస్టాలు అనుభవించింది .రావణ సంహారం తర్వాత ,అయోధ్యలో ఉంటున్నా ఆమె ఎందుకో సంతోషం గా కని పించటం లేదు ..నా వ్రేలి ఉంగరాన్ని కావాలని బ్రహ్మ కోరగా ఆయనకు ,ఎవరికి తెలియ కుండా ఇచ్చాను .ఆ ముద్రిక ను చూస్తె కాని జానకి సంతోషిం చదు .నువ్వు బ్రహ్మ లోకానికి వెళ్లి బ్రహాను అడిగి ఆ ముద్రికను తీసుకొని రావాలి ”అన్నాడు …
అతి వేగం గా హనుమ బ్రహ్మను చేరి ,సనకసనందనాదులు స్వాగతం చెప్పగా ,బ్రహ్మ దగ్గరకు తీసుకొని వెళ్ళారు .ఆయన అర్ఘ్య ,పాద్యాదులు ఇచ్చి ,కుశల ప్రశ్నలు వేసి ,ఉచిత ఆసనం పై కూర్చో పెట్టాడు .షోడశోప చారాలు చేసి పూజించాడు .హనుమను వచ్చిన కారణం   అడిగాడు బ్రహ్మ ..హనుమ శ్రీరాముని ఆజ్న ను తెలియ జేశాడు .దానికి బ్రహ్మ దేవుడు ”నా ప్రార్ధన విని శ్రీ రాముడు నాకు ఆ ముద్రిక ను ప్రసాదించాడు .రోజూ నేను దాన్ని పూజిస్తూ,శ్రీ రాముడిని ధ్యానం చేస్తున్నాను .దాన్ని యెట్లా ఇవ్వమంటావు ?”అన్నాడు .దానికి హనుమ ”సృష్టి కర్తా !నా మాట విను .ఆ ఉంగరం మీదే సీతా సాధ్వి ద్రుష్టి నిలిపి వుంది .రోజూ రోజుకు కృశించి పోతోంది .ఆమె ముఖం లో సంతోషం చూసి చాలా కాలమైంది .వెంటనే తీసుకొని రమ్మని శ్రీ రామాజ్న ”అని తెలి పాడు .అయినా చతుర్ముఖ బ్రహ్మ లో మార్పేమీ రాలేదు .
ఇప్పటి వరకు ఎంతో శాంతం గా వున్న హనుమ ఒక్క సారిగా తన తనువును విప రీతం గా పెంచాడు .సత్య లోకం దాటి శరీరం పెరిగి పోయింది .దశ దిశలా ఆక్రమించాడు .బ్రహ్మాండాన్ని బద్దలు చేసేట్లు తయారయాడు .ఆ తేజస్సుకు లోకాలు భస్మం అయేట్లున్నాయి .ప్రళయ కాల మేఘం లాగా విజ్రుమ్భించాడు .ఇరవై చేతులతో ,ఇరవై ఖడ్గాలను ధరించి ,భయంకరమైన ముఖం తో ,తీక్ష్ణ మైన కోరలతో ,మహా సింహం లాంటి విశ్వ  రూపాన్ని ధరించి ,ప్రళయ కాల గర్జన చేశాడు .బ్రహ్మ ,మిగిలిన దేవతలు ,మహర్షులు,ఆశ్చర్యం తో భయ పడి పోయారు .అందరు భక్తీ తో రామ నామం జపించారు .సనకస నందనులు బ్రహ్మ తో రాముని ఉంగరం వెంటనే ఇచ్చేసి ఈ సంక్షోభాన్ని నివారించ మని హితవు చెప్పారు .
అప్పుడు బ్రహ్మ హనుమంతుని భక్తిగా స్తుతించాడు .హను మంతుని విశ్వ రూపాన్ని చూసి విభ్రమం పొందాడు బ్రహ్మ ..బ్రహ్మ ప్రార్ధన విని ,హనుమ తన రూపాన్ని ఉప సంహరించాడు .అప్పుడు బ్రహ్మ ”హనుమా !అదిగో సరస్సు .దానిలో అనేక రామ ముద్రికలున్నాయి .అంతకు పూర్వం వున్న ,అనంత కల్పాలు ,అందులో రామావ తారాలు ,కని పిస్తాయి ..ఆయా అవతారాలలో బ్రహ్మ కు ఇచ్చిన రామ ముద్రికలన్నీ కని పిస్తాయి  .వాటిలో ఏది శ్రీ రాముని ముద్రిక యో పరీక్షించి తీసుకో ”అన్నాడు .
హనుమ సంతోషం లో ఆ సరస్సు లో మునిగాడు .రామ ముద్రికలు అనేకం కని పించాయి .ఏమీ పాలు పోలేదు .వెంటనే భక్తీ గా వాటి చుట్టూ ప్రదక్షిణం చేశాడు .ఆది భౌతిక ,ఆధ్యాత్మిక తాపాలన్నీ తొలగి పోయేట్లు గా ఆ సరస్సు లో స్నానం చేశాడు .ఆనందించాడు .బ్రహ్మకు నమస్కరించి ,సీతా రామ సన్నిధి కి చేరాడు .ఆనందామృత సరస్సు లో మునుక లేసి వచ్చిన ఆన్జనేయుడిని శ్రీ రాముడు సాదరం గా స్వాగతించి ‘హనుమా !నువ్వు తెచ్చిన ఆ ముద్రిక ను ఇవ్వు .దాన్ని సీత కు   ఇచ్చి సంతోషం కలి గిస్తాను ”అన్నాడు .ఆంజనేయుడు  జంకుతూ వెనుక అడుగు వేస్తున్నాడు .భక్తుని అవస్థ ను భగ వంతుడు గ్రహించాడు .”హనుమా !భక్త శేఖరా !ఎందుకు భయం?నీకు నాకు భేదం లేదు కదా .భయం వదిలి పెట్టి బ్రహ్మ లోకం లో నువ్వు చూసిన వింతలు తెలియ జెయ్యి ”అన్నాడు చాలా ప్రేమగా .
రాముని మాటలకు ధైర్యం తెచ్చుకున్న హనుమ ”భగవాన్ ! నీకు నమస్కారం .సత్య లోకం లో చతుర్ముఖ బ్రహ్మ భార్య సరస్వతీ దేవితో ఆనందం గావున్నారు . .అక్కడ  బ్రహ్మర్షులు ,వేదాంతులు ,జిత క్రోదులు వున్నారు .వారి భాగ్యమే భాగ్యం .అక్కడ అమృత సరస్సు వుంది .అక్కడ నీ ముద్రికలు అనేకం గా కన్పించాయి .వాటిని చూసి నమస్కరించి వచ్చేశాను .బ్రహ్మ ముద్రిక ను ఇవ్వ లేను అన్నాడు .నాకు కోపం వచ్చి నా విశ్వ రూపం చూపించాను .ఆ సరస్సులో ఏ ముద్రిక నీదో తెలియలేదు .అందుకే వట్టి చేతులతో తిరిగి వచ్చాను .”అని వివ రించాడు .
శ్రీ రాముడు హనుమ ను చేర బిలిచి ”హనుమా ! నీ సత్య వ్రతం ,సత్య భాషణం లకు మెచ్చాను .నీ మీద ప్రసన్న భావం ఏర్పడింది .వరం కోరుకో ఇస్తాను .ఇది వరకు ఎన్నో అవతారాలు ఎత్తాను .కార్య నిర్వహణం కోసం ఈ అవతారం ఎత్తాను .బ్రహ్మ నాకు భక్తుడు .అందుకని ప్రతి అవతారం లోను ,నా ప్రతినిధి గా ఉండటానికి బ్రహ్మ కు నా ముద్రిక ను ఇస్తుంటాను .దానిని నిశ్చల భక్తి తో పూజిస్తూ సృష్టి కార్యం చేస్తుంటాడు .జానకీ దేవికి నీ మీద పుత్ర వాత్సల్యం తో వుంది .మళ్ళీ వెళ్లి అమృత సరస్సు లోని ముద్రికను ఒక దాన్ని తెచ్చి మీ అమ్మ గారికి ఇవ్వు .”అని చెప్పాడు .
హనుమ వెంటనే బ్రహ్మ లోకం చేరి అన్గులీయ్కాన్ని తీసుకొని వాణీ విభుడికి కృతజ్ఞతా పూర్వక నమస్కారం చేసి శ్రీ రాముని దగ్గరకు వచ్చాడు .దగ్గరకు తీసుకొని ”హనుమా !బ్రహ్మ లోకాన్ని చూసి ,ఆనందించావు .అందు వల్ల రా బోయే యుగాలకు నువ్వు బ్రహ్మ గా వుండే వరం ఇస్తున్నాను .నువ్వు నన్ను పూజించి ,సేవించి ,ఆనందం  చే కూర్చావు .నేను ,సీతాదేవి నీ యందు సదా వాత్సల్యం తో ఉంటాము .నువ్వు లోకాలను సృజిస్తూ ,జగత్తు కు మంగళా న్ని  కలిగిస్తూ శోభిల్ల గలవు .”అని ఆశీర్వ దించాడు .రామాజ్న పొంది ,సెలవు తీసుకొని మళ్ళీ  గంధ మాదనం చేరి రామ మంత్ర జపం తో తరిస్తూ జీవించాడు .ఇప్పుడు బ్రహ్మ చేసిన హనుమ స్తుతి ని వినండి
”ఉస్త్రారూధ సువర్చలాసహచర ,సుగ్రీవ మిత్రామ్జనా –సూనో ,వాయు కుమార ,కేసరి తనూజా ,అక్షాది దైత్య సంహారా
సీతా శోక హరా ,అగ్ని నందన ,సుమిత్రా సంహవ ,ప్రాణదా –శ్రీ బీమాగ్రాజ శంభు పుత్ర ,హనుమాన్ ,పంచాష్య తుభ్యం నమః ”
”ఖడ్గం ,ఖేటక ,భిండి వాల ,పరశుం ,పాశం ,త్రిశూలం ,ద్రుమాన్
చక్రం ,శంఖ ,గదా ,ఫలం ,కుశ ,సుధా కుమ్భాన్ హలం ,పర్వతం
టంకం ,పుస్తక ,కార్ముక అహి ,డమరుం ,నేతాణి ,దివ్యాయుదా
న్యేవం ,వింశతి ,బాహుభి శ్చ  దధతం ,ధ్యాయే హనుమత్ప్రభుం  ”
ఇంకో కధ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను .

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...