Tuesday, July 10, 2018

మృత్యు రహస్యము

శ్లో||  ఓం త్య్రంబకం, యజామహే | సుగంథిం పుష్టి వర్ధనం
         ఉర్వారుక మివ బంధనాత్‌ | మృత్యోర్ముక్షీయ మామృతాత్‌ ||

మృత్యువు : ఆత్మ పరమాత్మ తత్త్వజ్ఞాన శూన్యతను మృత్యువు అందురు.

మృత్యుజయము :

పరమాత్మ తత్త్వజ్ఞానము వలన శరీర పతనమును తన మరణమనే భావన లేకుండుట. ఇది ఆత్మ విజయము.

ఆత్మహత్య :

ఆత్మహత్య జీవుల యొక్క పరిణామమునకు అవరోధము కలిగించును. ఆత్మహత్య ఫలితమును అనుభవించుటకు జీవుడు అనేక జన్మలను అదనముగా తీసుకొనవలసి యుండును. ఆత్మహత్య వలన కష్టములు తీరకపోగా, అనేక రెట్లు ఎక్కువగా కష్టములననుభవించవలసి వచ్చును. కనుక ఆత్మహత్య చేసుకొనరాదు.

పునర్జన్మ రహస్యము :

మరణించిన వారికి వారు మరల జన్మించే ముందు వారియొక్క రాబోవు జన్మయొక్క రూపురేఖలు తన కల్పనలో గీయబడును. అవి స్వప్నతుల్యముగా, అస్పష్టముగా మెరిసి, పిదప పుట్టబోయే స్థలము,  తల్లిదండ్రులు, ధరించబోవు శరీరముయొక్క చలన చిత్రమువలె పునర్జన్మ యొక్క రూపురేఖలు స్పష్టమగును.

స్వర్గ నరకములు :

పాప పరిమాణము తక్కువగా ఉన్నవారు ముందుగా నరకమును అనుభవించి, తరువాత స్వర్గముననుభవించెదరు. పుణ్య పరిమాణము తక్కువగా ఉన్నవారు ముందుగా స్వర్గమును అనుభవించి తరువాత నరకముననుభవించెదరు. జీవాత్మ స్వర్గ నరకములను సూక్ష్మ మనస్సుతో అనుభవించును. స్థూలానుభవములు సరళముగా ఉండును, సూక్ష్మానుభవములు ప్రబలముగా ఉండును. సూక్ష్మానుభవములు స్థూలానుభవములతో పోల్చినప్పుడు అనేక రెట్లు అధికముగా నుండును.

              స్వర్గ నరకములు వాస్తవము కాదు. అవి చైతన్యానుభూతులు మాత్రమే. అవి ఒక ప్రదేశము వంటివి కాదు. అవి పుణ్యమనస్కుని, లేక పాప మనస్కుని చైతన్య స్థితులు.

మరణములో పరిపూర్ణత :

ఏ జీవి జీవించి ఉండగానే, మరణానుభవమును పొందునో, ఆ జీవి మరణించినా, మరణించినట్లు కాదు. అట్టి జీవి తిరిగి జన్మించదు. అట్టి మరణమే పరిపూర్ణ మరణము. దీనినే 'మరణములో పరిపూర్ణత' అందురు.

మానవుని మరణ బాధకు కారణము :

దక్షయజ్ఞము సందర్భములో శివునికి కోపము కలిగినందున నుదుటినుండి చెమట బిందువులు కారగా, వాటి నుండి వీరభద్రుడు ఉద్భవించెను. అతడు దక్షయజ్ఞము నాశనము చేసెను. శివుని కోపము ఉపశమించగా, ఆ వీరభద్రుడు 'జ్వరము' అనే రూపముతో సంచారము చేయుచుండెను. శివుడు ఆ జ్వరమును సర్వజీవులకు ఈ విధముగా పంచి, వీరభద్రుని జ్వరమునుండి విముక్తి చేసెను.   

              ఆ జ్వరమును ఏనుగు తలలో తాపమును కలిగించేటట్లుగా, సర్పములకు కుబుసం విడిచేటప్పుడు కలిగే బాధగా, గోవులకు కాలిగిట్టలకు కలిగే బాధగా, గుఱ్ఱములకు డొక్కలో కలిగే బాధగా, జంతువులకు తమ రూపాన్ని తాము చూచుకోలేనట్లుగా, నెమళ్ళకు పింఛాలు చీలి బాధ కలిగేటట్లుగా, కోకిలలకు కళ్ళకు రోగము వచ్చేటట్లుగా, మేకలకు పిచ్చి పట్టేటట్లుగా, చిలుకలకు ఎక్కిళ్ళు వచ్చేటట్లుగా, పులులకు శ్రమ కలిగేటట్లుగా, మానవులకు మరణ భాద కలిగేటట్లుగా విభజించెను.

మరణ సూచకములు :

అరుంధతీ నక్షత్రమును చూచే శక్తిని కన్నులు కోల్పోయినా, కుడివైపు ముక్కు తన జ్ఞానమును కోల్పోయినా, పూర్ణచంద్రుడు మసకగా కనిపించినా, అతడు ఒక సంవత్సర కాలములో మరణించును.

      శరీర కాంతి పెరిగినా, తరిగినా, తెలివి తేటలు పెరిగినా, తరిగినా, అతడు ఆరు మాసములలో మరణించును.

         చంద్రునిలో గాని, సూర్యునిలోగాని పగుళ్ళు కనిపించినా, అతడు వారములోగా మరణించును.

         గుడిలోని సుగంధ ద్రవ్యములు మాంసపు కంపులా అనిపిస్తే అతడు ఆరు రోజులలో మరణించును.

    ముక్కు వాలిపోవుట, చెవి దొప్పలు వంగిపోవుట, దంతములు వివర్ణమగుట, కళ్ళు కాంతి తగ్గిపోవుట, శరీరము నల్లబడుట, మతి తప్పుట జరిగితే అతడు అప్పటికప్పుడు మరణించును.

       అకారణముగా ఎడమ కంటినుండి నీరు కారుట, తలప్రక్కన పొగ లేచినట్లుండుట వలన వెంటనే మరణము సంభవించును.

            యోగి వీటిని గమనించి, ఆత్మనిష్ఠ పూని చెదరక యున్నచో అతడు మృత్యువును జయించును.

మృత్యువుకు ముందస్తు అనుభవము :

శరీరమును నీటిలో తొక్కిపెట్టినట్లు చల్లని నీరు పోస్తున్నట్లు శీతలముగాను, కాని శరీరము వేడెక్కి పోవుచున్నట్లు ఉండును. అస్పష్టమైన శబ్దములు వినిపించును. ముఖములోని కండరములు క్రమముగా నిష్క్రియగా అగును. కళ్ళలో జ్యోతి ఆరిపోయి, చూపు మందగించును. నిశ్వాసము వేగవంతమగును. అందువలన ఏకశ్వాస మొదలగును. స్పర్శ శక్తి తగ్గిపోవును. పగలు రాత్రి భేదము తెలియదు. శరీరము కుచించుకు పోవును. చీకటి గుయ్యారములోనికి ప్రవేశించు చున్నట్లుండును. సూక్ష్మ ప్రాణ వాయువు కుడి ఎడమ నాడులలో ప్రవహించి, చివరకు త్రికూటములో ఆగిపోవును. నిశ్వాస తరువాత ప్రశ్వాస తిరిగి రాకపోయినచో ప్రాణము త్రికూటములో నిలిచి వెలుగును అనుభవించును. ఇది ఇంకా మరణము కాదు. చైతన్యము స్థానాంతరము చెందినప్పుడది మరణము.

మృత్యువు ఆసన్న లక్షణములు :

మృత్యువు ఆసన్నమైనప్పుడు, కొన్ని జీవులకు సూక్ష్మ జ్ఞానము లభించును. సూక్ష్మ లోకములకు వెళ్ళేముందు సూక్ష్మాను భూతులు వాటికవే కలుగును. శరీరములోని శక్తులన్నీ ఒకచోటకు చేరి కలసిపోవును. పంచ వాయువుల శక్తులు భృకుటి కేంద్రమునకు చేరుకొనును. రెండు కనుబొమల మధ్య రక

్తవర్ణ కాంతి ప్రకాశించును. నేత్రములు నాశికవైపుకు వాలును. క్రమముగా తలపై కాంతి మండలము ఏర్పడును. శరీరములోని సూక్ష్మాణువులు వేగముగా కంపించును. ఆ అణు సముదాయము ఘనీభవించి, ఆకృతిని పొందును. నరునియొక్క సూక్ష్మ రూపము తయారగును. ఈ సూక్ష్మ రూపము స్థూల శరీరముయొక్క తలపై నిలబడును. ఆ సూక్ష్మ రూపము క్రమముగా స్పష్టతను సంతరించు కొను సమయమునకు మృత్యువు ఆసన్నమగును.

మృత్యు సమయస్థితి :

మృత్యువు ఆసన్నమైనప్పుడు 49 వాయువులు లోపల ప్రవహించును. కళ్ళలో వెలుగు అంతరించును. శబ్దము వినబడదు. ప్రాణ వాయువు నాభికేంద్రమును భేదించి, అపాన వాయువుతో కలియును. శరీరమును వదలుటకు ప్రాణము హడావిడి చేయును. జీవుడు నిస్సహాయునిగా అనాధగా వుండి, మృత్యుమూర్ఛకు లోనగును. పిండము నుండి వదలి వెళ్ళుటకు జీవము పెనుగులాడుచుండును. మరణము శరీరమునకే గాని జీవునికి కాదు.

         సూక్ష్మ శరీరము స్థూల శరీర తాదాత్మ్యతను విడచి, సూక్ష్మ రూపములో నుండును. సూక్ష్మ శరీరమునకు మరణము రాలేదు. స్థూల శరీరమునకే మరణము వచ్చినది.

              నిజానికి మృత్యువనేది జీవుల క్రమ ప్రగతికే గాని, జీవునికి అంతము కాదు. మృత్యువు జీవునికి అంతిమ లక్ష్యము కూడా కాదు.

దేహము నుండి ప్రాణము నిర్గమించు మార్గములు - అక్కడ ఉన్న దేవతలు:

              ప్రాణము పాదములనుండి పోయినప్పుడు అక్కడ విష్ణుదేవు డుండును. అలాగే పిక్కలలో వసువులు, మోకాళ్ళవద్ద సాధ్యులు, జన నేంద్రియములో సూర్యుడు, గుదమందు భూ దేవత, తొడలలో ప్రజాపతి, ప్రక్కలలో మరుత్తు, బొడ్డులో చంద్రుడు, చేతులలో ఇంద్రుడు, రొమ్మువద్ద శివుడు, కంఠములో నరుడనే మహర్షి, చేతులలో ఇంద్రుడు, నోరులో వైశ్వ దేవతలు, చెవులలో దిక్పాలకులు, నాసికలో వాయు దేవుడు, కళ్ళలో అగ్ని దేవుడు, భ్రూమధ్యమందు అశ్వినులు, నొసలలో పితృ దేవతలు, తలలో బ్రహ్మదేవుడు స్థానము చేసుకొని యుందురు.

         హృదయమున ఆవరించిన గాలిని విడచి పెట్టగల యోగి ఆయా దేవతలను పొందగలడు.

మరణమూర్ఛ భగ్నమైనచో ఏమగును ? :

అప్పుడు మరణించిన వానికి తాను మరణించినట్లు తెలియదు. సూక్ష్మ లోకములోనికి ప్రవేశించలేదు. స్థూల శరీరమును వదలుకోలేదు. కాని వదలక తప్పదు. అందువలన జీవుడు కొట్టుమిట్టాడును. అంధకారములో అనాధగా మిలిగిపోయి భయపడుచుండును. తన వారి కొఱకు ఆత్రముగా వెదకుచుండును. స్థూల శరీరము లేనప్పటికిని, అనుభవించవలెననే కోరిక వదలదు. వీలుపడునని లాలసతో వెదకుచుండును. క్రమముగా ఈ పృథివిలో తనవారిని సూక్ష్మ నేత్రములతో చూచును. సూక్ష్మ శ్రోత్రేంద్రియముతో వినును. అందరి మనో భావములను గుర్తించగలుగును. స్థూల ఇంద్రియములు నిర్జీవమై సూక్ష్మ ఇంద్రియములు క్రియాశీలమగును. ఆకలి, దప్పిక, అనుభూతులు జాగృతమై బాధపడుచుండును. కామనలు, వాసనలు, మోహములు కొనసాగును. క్రమముగా సూక్ష్మలోకమునకు అలవాటుపడి, అక్కడున్న సూక్ష్మ దేహములకు ఆకర్షితుడగును. క్రమముగా తాను మరణించెనని గ్రహించి, అప్పుడు రోదించును. దేహము కాలిపోయినను, ఆ దేహము మీద మోహము వీడదు.

మృత్యు మూర్ఛ :

యోగాభ్యాస మార్గములో ఉన్నవారు మృత్యు మూర్ఛకు లోనుకారు. వారియొక్క చేతనను కోల్పోరు. ఎవరైతే మృత్యు మూర్ఛకు లోబడుదురో వారు తిరిగి జన్మించెదరు. సిద్ధయోగికి స్థూల దేహము మరణించదు. జీవము నశించును. అప్పుడు ఆ యోగి శరీరములో ఇతరమైన జీవము ప్రవేశించే అవకాశము ఉండును. సామాన్యుల విషయములో స్థూల శరీరము నశించును. జీవము నశించదు. ఆ జీవము క్రొత్త స్థూల శరీరమును సంపాదించి, పునర్జన్మ నొందును.

         జీవుడు మృత్యుమూర్ఛకు లోనుకాకపోయినచో కాంతి సాగరమును చూచి దానిలో కలసిపోవును. ఆ కాంతిలో విలీనమై, అదే క్షణములో ముక్తుడగును. ఈ విధముగా ముక్తులైనవారు కల్పాంతము వరకు కాంతి  సాగరములో సూక్ష్మముగా ఉనికి గలిగి బ్రహ్మయొక్క తరువాతి కల్పములో,  నూతన సృష్టిలో జన్మించెదరు.

మృత్యు దేవత :

బ్రహ్మ యొక్క ఇంద్రియముల నుండి ఎఱ్ఱని కన్నులు గల ఒక స్త్రీ పుట్టుకొచ్చెను. అదే మృత్యుదేవత. ప్రాణికోటిని సంహరించమని బ్రహ్మ దేవుడు ఆదేశించగా ఆ స్త్రీ ఒప్పుకొనలేదు. బ్రహ్మ బలవంతము చేయగా ఒప్పుకొనినది. అప్పుడు ఆమె విలపించగా వచ్చిన కన్నీటిని బ్రహ్మ తన దోసిటలో పట్టెను. ఆ కన్నీళ్ళే బ్రహ్మ సంకల్పముననుసరించి అనేక వ్యాధి రూపములై మానవులను బాధించునని, కామ క్రోధాలు, బాధలకు తోడ్పడునని, అందువలన వారంతట వారే సమసిపోవుదురని, మృత్యువు కేవలము నిమిత్త మాత్రమేనని, ఆ మృత్యు దేవతకు వరమును ప్రసాదించెను. ఆ మృత్యు దేవత పురుషుని చంపునప్పుడు పురుషుడు గాను, స్త్రీని చంపునప్పుడు స్త్రీ గాను, నపుంసకుని చంపునప్పుడు నపుంసకుడుగాను ఉండునని, అందువలన ఆమెకు ఏ పాపము అంటక, అది ధర్మముగా కూడా ఉండునని బ్రహ్మ ఆమెకు వరమిచ్చెను.

త్రిగుణ స్వభావుల మరణ పర్యవసానము :

సత్వగుణులు మరణించిన తరువాత వారి ప్రేతాత్మ లఘువుగా ఉండును. తమో గుణులు మరణించిన పిదప వారి ప్రేతాత్మ ఘన రూపముగా నుండును. సత్వగుణ ప్రేతాత్మ చంద్రమండలము వైపుకు ఆకర్షింపబడును. తమోగుణ ప్రేతాత్మ భూమివైపుకు ఆకర్షింపబడును. సత్వగుణుని సూక్ష్మ శరీరము జ్యోతిర్బిందు రూపములో ఉండును. సిద్ధయోగి శరీరము విసర్జించిన

ప్పుడు భూమ్యాకర్షణను త్రెంచుకొని, చంద్రమండలము వెలుపలకు వెళ్ళును. శుద్ధ సత్వగుణ ప్రధానుడి సూక్ష్మ శరీరము శుక్ల మార్గములో వెళ్ళును. యోగులు, జీవన్ముక్తులు జ్యోతిర్మయ మార్గమును అనుసరింతురు. సూర్య మండలము దాటి వెళ్ళినవారు తిరిగి భూమండలముపై జన్మించరు. అట్టివారు ఆకాశ గంగతోబాటు తిరుగుచు, విష్ణు పథములోకి ప్రవేశించి, విష్ణు లోకమునకు చేరెదరు. అట్టివారు ఇక్కడ జీవన్ముక్తులైన వారే.

బ్రహ్మలోక మార్గము :

బ్రహ్మోపాసన తత్పరుడైన పురుషుడు తన మరణ సమయములో అతడి ఇంద్రియములు, అంతఃకరణము మూర్ఛనొందును. అవి దేనినీ తెలియజాలవు. అయినను అతడి లింగ శరీరమును తీసుకొని పోవుటకు యమదూతలు వచ్చుటలేదు. అగ్న్యభిమాన దేవత వాని లింగ దేహమును తన లోకమునకు తీసుకొని పోవును. అగ్ని లోకమునుండి దినాభిమాన దేవత తన లోకమునకును, అచ్చటనుండి ఉత్తరాయణ కాలాభిమాన దేవత తన లోకమునకును, అందుండి సంవత్సరాభిమాన దేవత తన లోకమునకును, అక్కడినుండి కాలాభిమాన దేవత తన లోకముకును, అచ్చోటనుండి వాయ్వభిమాన దేవత తన లోకమునకు తరువాత సూర్య దేవత, చంద్ర దేవతలు క్రమముగా అట్లే వారివారి లోకములకు తీసుకొని పోవును. విద్యుదభిమాన దేవత తన లోకమునకు తీసుకొని పోవును. అక్కడ విద్యుదభిమాన దేవత లోకములో హిరణ్యగర్భుని ఆజ్ఞ ప్రకారము వసించే హిరణ్యగర్భ సమాన రూపుడైన ఒక దివ్య పురుషుడు ఈ బ్రహ్మోపాసకుని యొక్క లింగ శరీరమును తోడ్కొని వరుణ లోకమునకు చేర్చును. వరుణ దేవత తోడ ఇంద్రలోకమునకు చేరును. అచ్చటినుండి హిరణ్య గర్భవాసి, ఇంద్ర దేవత లిద్దరూ కలిసి ప్రజాపతి లోకమునకు చేరును. హిరణ్యగర్భ లోకమునకు చేరుటకు వరుణ ఇంద్రులు సమర్ధులు కానందున ఉపాసకుని హిరణ్యగర్భవాసి ఒక్కడే తోడ్కొని బ్రహ్మ లోకమునకు గొనిపోవును. బ్రహ్మ లోకాధిపతి హిరణ్యగర్భుడు. సమష్టి సూక్ష్మ శరీరాభిమాని కూడా హిరణ్యగర్బుడే. అతడికే కార్యరూప బ్రహ్మమని కూడా పేరు. కార్య బ్రహ్మము యొక్క వాస స్థలమునకు బ్రహ్మలోకమని పేరు. ఈ విధముగా ఉపాసకుడు బ్రహ్మ లోకమును చేరును.

మృత్యువు - అమృతము :

మిథ్యా జ్ఞానమే మృత్యువు. నిజ అస్తిత్వమే అమృతము. మార్పు చెందుటకు మృత్యువు అని పేరు. మార్పు చెందక ఒక్క తీరుగా నున్న దానికి అమృతము అని పేరు. ప్రమాదమే మృత్యువు. ప్రమాదమనగా స్వస్వరూపమునుండి దిగజారుట. కనుక ప్రమాదమనగా అజ్ఞానము. స్వస్వరూపమే అమృతము. సత్యమే సహజమై బ్రహ్మాత్మత్వమును మరచుట వలన మృత్యు భయము కలుగుచున్నది. స్వస్వరూపమునుండి జారకుండుటయే మృత్యుంజయము. కొందరు యముడినే మృత్యువు అందురు. ఉపాధులు నశించుచుండగా దేహి నశించక పోయిననూ, తాను నశించుచున్నాడను అజ్ఞానమే మృత్యువు. శరీర విలక్షణుడైన ఆత్మ తానేనను అనుభవమే అమృతము.

              మృత్యువుకే మృత్యువైనది అమృతము. అజ్ఞాని ఒక మృత్యువు నుండి మరొక మృత్యువునకు ప్రయాణించుచుండును. ఆయువు గడుస్తున్న కొద్దీ మృత్యువును సమీపించుట అనగా క్షణక్షణమూ మృత్యువే. అట్టి క్షణక్షణ మృత్యువు సమాప్తమగుట జన్మాంత మృత్యువు. జ్ఞాని ఉపాధికి విలక్షణము గనుక అమృతుడు. ప్రాకృతమైన మనస్సే మృత్యువు. అమనస్కమే అమృతము. బ్రహ్మ జ్ఞానము చేత, లేని మృత్యువు లేకుండా పోవును. అమృతమైన సద్వస్తువే ఉన్నది. అన్యము లేదు. అమృతత్వమే శాశ్వతము.

మరణ కాలములో ఇంద్రియ లయము :

జీవుడు శరీరమును విడచి పెట్టునప్పుడు ఇంద్రియములు వాటి వాటి అధిష్ఠాన దేవతలో లయమగును.  జీవుడు వేరే సూక్ష్మ శరీరమును సంపాదించుకొనును. దీనిని యాతనా శరీరము అందురు. ఈ యాతనా శరీరముతో పితృ లోకములకు, స్వర్గ నరకములకు ప్రయాణమగును. పునర్జన్మ లభించినప్పుడు మరల ఆయా ఇంద్రియములు సమష్ఠి ఇంద్రియములుగా నున్న అధిష్ఠాన దేవతల నుండి వేరై వ్యష్ఠి ఇంద్రియములుగా మారి, స్థూల శరీరమునందు వాటికి సంబంధించిన గోళకములలోనికి చేరి, ఆశ్రయించి, వాటి వాటి పనులు నిర్వర్తించును. కారణ శరీరము జీవుడితోపాటే ఉండును. ముక్తుని విషయములో కారణ శరీరము నశించును. లింగ శరీరము భంగమగును. జీవాత్మ భ్రాంతి విడచి, పరమాత్మగా, శాశ్వతముగా, శాంతముగా నుండును.

గత జన్మ స్మృతులు :

గత జన్మలోని తల్లిదండ్రులు, పుట్టి పెరిగిన ఊళ్ళు, ప్రతి చిన్న విషయము గుర్తున్న సంఘటనలు వినుచున్నాము. అందులో పెద్ద విశేషమేమీ లేదు. ఒక ప్రమాదములో ఆసక్మికముగా మరణించిన వారికి, ఆ షాక్‌ ఎంత తీవ్రముగా ఉంటుంది అంటే ఒక్కోసారి ఆ జన్మ గుర్తులన్నీ చెరగని ముద్రలగును. క్రొత్త జన్మ ఎత్తాక కూడా ఆ గుర్తులు వస్తూ ఉండును. అయితే దీనికీ, ఆధ్యాత్మిక పురోగమనమునకు ఏ విధమైన సంబంధము లేదు. గత జన్మల స్మృతి భగవత్‌ సాక్షాత్కారమునకు దారి తీయవు.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...