Sunday, July 8, 2018

మహామాయ

అమ్మా నీవు శుద్ద విద్యా స్వరూపమైన మహామాయవై, మాయాతత్వముతో ఈ ప్రపంచమును భ్రమింపచేయుచున్నావు.
వాణి,లక్ష్మి, పార్వతి ఈ మువ్వురూ అమ్మ చేతనే సృజింపబడి సృష్టి స్థితి లయముల నిర్వహణ నిమిత్తమై బ్రహ్మ, విష్ణు, రుద్రులకు ఇవ్వబడినవారు. అమ్మ వీరికంటే అతీఅమైన స్థానమున ఉన్నది.అందుకే అమ్మకు పరాబట్టారిక అన్న పేరు.అనగా అన్నిటికీ పైన అమ్మ తప్ప ఇక అమ్మ పైన వేరు లేదు.అందరినీ మించిన పరబ్రహ్మ తత్వమే అమ్మ. అదియే 15 అక్షరాల శ్రీవిద్యా మంత్ర రాజ స్వరూపమై మహా మాయగా వెలుగొందుచున్నది.దానికే శుద్ద విద్య అని పేరు.అంతేకాదు ఈ జగత్తు అంతా ఈ మాయకు లోబడే పరిభ్రమించుచున్నది.అందుకే చండీసప్తసతిలో జ్ఞానినామపి చేతాంసి- దేవీ భగవతి హిసా | బలాదాకృష్య మోహాయ - మహామాయా ప్రయచ్చతీ అని చెప్పబడింది. ఆ మహామాయా ప్రభావం ఎంతటిదంటే  దాని నుండి తప్పించుకోవడం మహా జ్ఞానులకైనా సాధ్యం కాదు.ఆ మహా మాయకు ఎంతటివారైనా బలంగా లాగి ఆకర్షించబడి మోహంలో పడిపోవలసిందే. ఈ జగత్తును ఆ మాయా వశం లో ముంచి ఆడించు ఈ మాయాతత్వమే, పరాభట్టారికా జగన్మాత అయిన అమ్మ.అంతేకాని ఈ ముగ్గురు అమ్మలు మూలవిరాట్టు కాదు. వీరు అమ్మ అంశారూపములు మాత్రమే

మహామాయ

*మాయాతీత స్వరూపిణి అమ్మవారు.
మహారూపా మహాపూజ్య మహాపాతకనాశినీ
"మహామాయమహాసత్వామహాశక్తిర్మహారతిః" అని లలితా సహస్రంలో చదువుతూ వుంటాం!*

"మాయ " అంటే ఏమిటి? అసలు?? అమ్మవారు అనేక రూపాలతో అనేక నామాలతో వ్యక్తమైనారు. అలాగే మాయతో కూడ!  మాయాస్వరూపమే అమ్మ!! అసలు మాయ లేకపోతే మనుగడే లేదు! ఏమిటీమాయ ?

*చైతన్యాన్ని కప్పి పుచ్చేదే మాయ ఉన్నదాన్ని మరిపించేదే మాయ!
లేనిదిగా కనిపించేదే మాయ! అసలు ఈ జగత్తే మాయ! మాయలేకపోతే ఈ ప్రపంచమే లేదు! అంతా మిథ్యే!! మిథ్యే మాయ!!*

శ్రీ కృష్ణ జననం ఎలా జరిగింది?
కంసుడు ఎలా మైమరపించబడినాడూ?!
ఆ రోజూ అర్ధరాత్రి ప్రకృతి ఎలా మారింది ?? మథురలో ఏం జరిగింది?!*
కంసుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడూ? దేవకి అష్టమ గర్భం వలన తనకి మరణం తథ్యమనే అశరీరవాణి వాక్కునకు---
కంసుడు దేవకి వసుదేవులు చెరలో పెట్టటం; అష్టమ గర్భానికి ముందు పుట్టిన శిశువుల సహితంచంపటం; చివరకుదేవకిఅష్టమ గర్భం ధరించినదనీ తెలియగానే చెరసాలకి మరింత బందోబస్తుగా తాళాలు బిగిస్తూ కావలి వారిని మార్చిమార్చి పెట్టటం
ఎన్ని ?! ఎన్నెన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు?! అవన్నీ మనకు తెలిసినవే ! ఇపుడు ఆ కథని నేను మీకు చెప్పనవసరంలేదు!!*

అలాగే రామాయణంలో కూడ కౌసల్య రామచంద్రుని ఎంతగా ప్రేమించింది; పట్టాభిషేక వార్త తెలియక ముందు! కేవలం మంథర మాయ మాటలవలన మాయ క్రమ్మి తన వివేకాన్ని కోల్పోయింది!!

*ఇక మహాభారతం తీసుకుంటే ధర్మానికి ప్రతి రూపమైన ధర్మ నందనుడు మాయా జూదంలో ఓడిపోవటమే కాకుండా - గెలవాలనే ప్రలోభంత ధుర్యోధనుని మాయ మాటలలోపడి ద్రౌపదిని సహితం పందెలోపెట్టి పరాజయంపొందాడు!!
ఇదీ మాయా ప్రభావమే!*

నేను కేవలం "మాయని" గూర్చి చెప్పటం కోసం ఆ కధలు ప్రస్తావిస్తూన్నానూ. మహామాయ ముందు మానవ ప్రయత్నాలు ఎంత అల్పమైనవో కదా!

*సాక్షాత్తు నారాయణుడు భూమి పై అవతరించటానికి మహామాయ ఎంతగానో సహకరించినది! ఆమె నారాయణ సహోదరికదా!!
వ్రేపల్లెలో యశోద గర్భాన మహామాయ ఉధ్భవించింది! (ఆడశిశువు) ఆ సంగతి ఆమెతో సహా అచ్చట ఎవ్వరికీ తెలియదు!*
ఇచ్చట దేవకి గర్భాన పరమాత్మ ఉద్భవించాడు!! ఇక్కడ ఈ విషయమూ ఎవ్వరికీ తెలియదు! ఒక్క వసుదేవునికి తప్ప!

*ఈ విషయం ఇంత గోప్యంగ ----
ఇలా వుంచటం ఎవరికి సాధ్యమౌతుంది??*
ఒక్క మహామాయకుతప్ప! మానవ ప్రయత్నాలనన్నింటినీ క్షణంలో మటు మాయం చేసింది అమ్మ!! ఆ రోజు అందరూ కంసునితో సహా అందరూ నిద్రపోయారు! మొత్తం అందరినీ మహామాయ తన వశం చేసుకుంది!! అంతే!!

*మాయ అమ్మవారి స్వరూపం! వ్యక్తంకాకుండా మభ్యపెడుతూవుంటుంది! నిద్రా స్వరూపం మాయ! నిద్రాదేవి !
దుర్గాసప్తశతిలో రాత్రి సూక్తం అందరికీ పరిచయమే కదా! అది తెలియక పోయినా నిద్ర అందరికీ సర్వ ప్రాణికోటికీ తెలిసినదే కదా !*

*గర్భస్థ శిశువు రక్షణార్ధం మాయ ఒక పొరలాగా కప్పబడి వుంటుంది. !
ప్రకృతిలో జడత్వం మాయలక్షణం!
త్రిగుణాల్లో తమోగుణ లక్షణం మాయ!
అంధకారం మాయ! అజ్ఞానం మాయ!
మాయను జయించాలనుకోవటం మూర్ఖత్వం!*

*ఒక్క సారి మన పురాణాలలో కూడ ....
ఎంతటి మునులైనా ఋషులైనా రాజర్షలైనా ఎంతటి తపస్సంపన్నులై వారి వారి కర్మాను బంధాలని బట్టి మాయకు లొంగని వారెవరూ లేరు!  ఆ కధలూ అందరికీ తెలిసినవే !!*

ఇక్కడ ఒక చిన్న కిటుకుంది- మాయని జయించాలనుకోవటం కాదు! మాయకు వశమైనపుడు అది అమ్మ అనుగ్రహం అని గుర్తించాలి! ఓ అమ్మ ఏదో మాయచేసింది! మాయలో పడ్డాను! అని ఆ అమ్మయొక్క మాయా స్వరూపాన్ని తలంపుకు తెచ్చుకోవాలి!
ఆ మహా మాయకు నమస్కరించుకోవాలి!
మాయలో పడినపుడు ఇది ఎలాగుర్తుంటుందీ అని అనుకోవచ్చు!
నిజమే ! గుర్తుండదు! కానీ గురువు యొక్క అనుగ్రహం చేత ఇది గుర్తుకు వస్తుంది! ఇది మాయ అనే స్ఫురణ కలుగుతుంది ! దీనికీ ఎంతో సాధన కావాలి!


శివశక్త్యాత్మకమైన 'హ్రీం' మంత్రాక్షరాలన్నింటికి తలమానిక మైనది.

 పరమేశ్వరికి అత్యంత ప్రియమైన బీజమిది. జగత్ అంతయూ ఆమె హిరణ్య గర్భంలో ఇమిడినట్లే, తంత్ర మంత్రం సూక్ష్మాలన్నీ హ్రీం బీజంలోనే ఉన్నాయి. ఇది త్రిపుటలకు అధిష్టానం. అండ పిండ బ్రహ్మాండాలకి ఆశ్రయం.

లలితా త్రిశతి నామాలు, పంచదశి మంత్రాన్ని ఆశ్రయించి చెప్పబడినవి. ఈ పంచదశి మంత్రం పరాశక్తి యొక్క విశిష్ట రూపం. ఈ పంచదశి మంత్రం మూడు ఖండాలుగా ఉంది.

మొదటిదైన వాగ్భవ ఖండములోని  5 బీజాలలో చివరి బీజం హ్రీం.  రెండవదైన కామరాజ ఖండములోని ఆరు బీజాలలో చివరి బీజం హ్రీం. మూడవదైన శక్తి ఖండములోని నాలుగు బీజాలలో చివరి బీజం హ్రీం. అక్షరానికి 20 నామాల చొప్పున పంచదశి మంత్రంలోని 15 అక్షరాలకు మొత్తం 300 నామాలు చెప్పబడినవి. అవే లలితా త్రిశతి.

త్రిశతి నామాలకి పంచదశి మహా మంత్రానికి (శ్రీవిద్య) అవినాభావ సంబంధం ఉంది. హ్రీంకారం పంచదశి మంత్రానికి హృదయంగా భావించే బీజం. జీవన గమనం సమస్యలు లేకుండా నడుచుటకు అందరి హృదయాలలో ఆకాశ దీపశిఖవలె విరాజిల్లుటకు పరాశక్తి బ్రహ్మ స్వరూపిణి హ్రీం బీజం ఎంతో అవసరం.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...