Sunday, July 8, 2018

మంత్ర సిద్ది

నా ప్రయత్నమును మన్నించ ప్రార్ధన.
నేను మీకు అందించు చున్న సమాచారము మీకు తెలిసెనదే . మీరు ఎక్కడొ చదివినదీ విన్నదీ మాత్రమే . కొన్ని ప్రత్యేక వ్యాసములు మరియూ కొందరు ఆధ్యాత్మిక గురువులు తెలియజేసిన విషయాల సేకరణ . మనం ఒకసారి మనకు తెలిసినదానిని జ్ఞాపకం చేసుకొంటున్నాము .(సమాచారములోని కొన్ని విషయములు నిర్జర గారు మరియూ నాగవరపు రవీంద్ర గారలు అందించినవి మిగిలిన వారి పేర్లు గుర్తు లేవు . ఎందరో మహానుభావులు అందరకూ వందనములు  . శ్రీ గురుభ్యోంనమః )

 శ్రీ గురుబ్యోంనమః

 ఓ గాయత్రీ ఉపాసకులు ఈ కింది శ్లోకం నేర్పేవారు. ఇది పరమ గురువుని గురించి బాగా చెపుతోంది. యస్యాం తర్నాది మధ్యం నహి కర చరణం నమ గోత్రం న సూత్రం నో జాతిర్నైవ వర్ణం నభవతి పురుషో నో నపుంసో నచ స్త్రీః నాకారం నొవికారం నహి జని మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి

ఇందులోని అద్భుతమైన రహస్యం గ్రహిస్తే బ్రహ్మవిద్య గోచరిస్తుంది, సాధకుడిని సిద్ధునిగా చేస్తుంది. సమయానుకూలంగా మారే సామాన్య విలువలకూ, చిన్న చిన్న లింగవయోభేదాలు, ఆచార సాంప్రదాయాలు, తరతరాలుగా రావడం తప్ప ఏ ఉపయోగమూ లేని మూఢ విశ్వాసాలకి, పాపపుణ్యాలకి, స్వభావాలకి, స్వ భావాలకి అతీతంగా, 'విశ్వాభావంగా ఆ పరమ గురువు (ది మాష్టర్ ఆఫ్ ది యూనివర్స్) ఉన్నాడు.

ఆయన మనం ఊహించుకున్నట్టు మడి కట్టుకుని పులిహార, పరవాన్నం పంచిపెడుతుంటాడు అనుకోవాలా? కిరీటాలు పెట్టుకుని, ఒళ్ళంతా ఇరవైనాలుగు కేరెట్ల బంగారం వేసుకుని, పది నిమిషాలకోసారి అభయం ప్రదర్సిస్తూ వుంటాడా?

మంత్ర శక్తి ఎలా కలుగుతుంది? కేవలం ఒక మంత్రాన్ని లక్షల సార్లు ఉచ్చరించడం వల్లనే అయితే టేప్ రికార్డర్ లో మంత్రాన్ని ఎల్లప్పుడూ జపం చేసేలా పెడితే సరిపోతుందిగా!? ", అని అడిగాడో శిష్యశిఖామణి.

"అవును. అలా చేస్తే తప్పకుండా మంత్రశక్తి కలుగుతుంది - కాని ఆ టేప్ రికార్డర్ కి !", అన్నారో గురువు గారు.

ప్రార్ధనలు మామూలు మానవభాషలో నిర్మించబడినవి. వాటికంటే దివ్యలోకాలనుండి వినబడిన మంత్రాలు శక్తివంతమైనవిట. అలా విన్న వారిని ద్రష్టలు అంటున్నాం. మంత్రాలు బీజాక్షర నిర్మితాలు. అంటే ఏ అక్షరం ఎక్కడ వుండాలో అలా వున్నవి అన్న మాట. ప్రపంచంలో అనేక మతాలలో ఈ మంత్రాలు, అంటే దివ్య శబ్దాలు వున్నాయి. బుద్ధిజంలో పాళీ భాషలో, హిందూ మతంలో సంస్కృతంలో, క్రైస్తవమతంలో హిబ్రూ, లాటిన్ భాషలలో, ఇస్లాంలో అరబిక్ భాషలో దివ్యశబ్దాలు వున్నాయి, దేవదత్తాలుగా భావించబడుతున్నాయి. అయితే వాటి స్వరూపం, వినియోగం భిన్నంగా వుండొచ్చు. అందుకే మంత్రాన్ని చదువుతున్నప్పుడు ఉచ్చారణ సరిగా వుండడం, తగినంత శ్రద్ధతో చెయ్యడం అవసరం. చాలా మంది పదాలని తుంచిగాని, తొందర తొందరగా గాని, తప్పులతో గాని చేస్తూ వుంటారు. దీనివల్ల తగిన ఫలితాలు త్వరగా రావని శాస్త్రం చెపుతోంది. మంత్రాన్ని గురుముఖంగా నేర్చుకోవలసినదిగా అందుకే చెప్పడం జరిగింది.

మంత్ర శక్తితో బాటు జంటగా రెండు ప్రధానమైన విషయాలున్నాయి అని అనేక మంత్రశాస్త్ర గ్రంధాల సారం. 1. భక్తి : ఇది సాధకుడిని దివ్య శక్తితో అనుసంధానంగా వుంచుతుంది. భక్తి ఒక బీజం లాంటిది. 2. మంత్ర శక్తి: ఇది కొలవడానికి కొలమానంలేదు, ప్రత్యక్షానుభూతి కావాలంటే సిద్ధులు రావాలి. పరోక్షానుభూతి సాధ్యమే! 3. దేవతానుగ్రహం : ఇక్కడ సాధకుడి వ్యక్తిత్వం, పూర్వ జన్మ సంస్కారాలు, ఈ జన్మలో కర్మలు అన్నిటిని బట్టి ఇది వుంటుంది. కొందరు గురు అనుగ్రహంతో దేవతను కూడా మెప్పించగలుగుతారు.

పెద్దలు ఉపదేశం చేసే మంత్రం తత్ సిద్ధిని అందించాలి అంటే మూడింటియందు తప్పని సరిగా విశ్వాసం ఉండి తీరాలి అని శాస్త్రం చెబుతుంది.

మంత్రే తత్ దేవతాయాంచ తదా మంత్రప్రదే గురౌ |
త్రిశు భక్తి సదా కార్యా సాధి ప్రథమ సాధనం ||

మంత్రం యందు భక్తి కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు విశ్వాసం కావాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత అంటే మంత్రం వల్ల తెలిసే వ్యక్తి లేక మంత్రం యొక్క తాత్పర్యము అని అర్థం. క్షీరము అంటే పాలు అని అర్థం కాదు, అది అనువాదం అని అంటారు. తెల్లటి పుష్టి కలిగించే ద్రవాహారం, దానికి పాలు అని పేరు. అంటే క్షీరం అనే శబ్దం ఒక వస్తువును సూచిస్తుంది. ఆ వస్తువు దాని అర్థం అవుతుంది. అట్లా మంత్రం అనగానే ఆయా మంత్రంలోని పదాల అర్థం అని కాదు, ఆ మంత్రం ప్రతిపాదించే దేవతా విశేషం ఏదో ఆ మంత్రానికి అర్థం అవుతుంది. ఆ దేవతా విశేషాన్ని కనిపించేటట్టుగా స్పష్టం అయితే అప్పుడు మంత్ర అర్థం తెలిసినట్లు. అంతే కాని మంత్రంలో పదాల అర్థం మాత్రమే తెలుసు అని అంటే మంత్ర తాత్పర్యం తెలియదు అనే లెక్క. మంత్రం గోచరించాలి అంటే మంత్రాన్ని వినవల్సిన క్రమంలో విని, అనుసంధించే క్రమంలో అనుసంధిస్తేనే ఫలిస్తుంది. మంత్రం పై విశ్వాసం అంటే ఆ మంత్రం యొక్క నియమాలపై విశ్వాసం అని అర్థం. ఎవరో ఎవరికో చెబుతుంటే విని, పుస్తకం చూసి చేస్తే మంత్రం ఫలించదు. ఒక గురు ముఖతః శ్రవణం చేసినప్పుడు మాత్రమే ఫలిస్తుంది. ఇది మంత్రానికి నియమం.

మంత్రాలు రెండు రకాల

ు అవి స్వరం కల్గినవి, స్వరం లేనివి. విష్ణు సహస్ర నామాలలో ఉన్నవి ఎన్నో మంత్రాలు. ఒక్కోటి ఒక్కో ఋషి దర్శించినవి. ఇవన్నీ స్వరం లేనివి కానీ మననం చేస్తే కాపాడేవి, అందుకే అవి మంత్రాలు. గాయత్రి మంతం లాంటివి స్వరం కల్గినవి. ఈ మంత్రాన్ని విశ్వామిత్రుడు అనే మహర్షి దర్షించాడు. దాన్ని తర్వాతి వారికి అందించాడు. విశ్వామిత్రుడు ఆ మంత్రాన్ని ఒక స్వరంతో ఉపాసించాడు. అట్లా స్వరం కల మంత్రాలకి ఒక్కో వేదంలో ఒక్కో స్వరం ఉంటుంది. కానీ ఈ మద్య కాలంలో గాయత్రి మంత్రానికి తోచిన స్వరాలు కల్పిస్తున్నారు. స్వరం మార్చి చదవడం తప్పు. అట్లా చేయడం ఆ మంత్రార్థమైన దేవతని హింసించినట్లు అవుతుంది. అపౌరుషేయం అయిన వేద రాశికి స్వరం మారిస్తే అది శుభం కాదు. విశ్వామిత్రుడు కూడా ఆ మంత్రాన్ని తయారు చేయలేదు. దాన్ని దర్శించి ఇచ్చాడు. మంత్రానికి స్వరమే ప్రాణం అని అంటారు. అట్లా మంత్రాలని పాటించడం అంటే దానికున్న స్వరంతోనే ఉపాసించాలి. మంత్రం యందు భక్తి అంటే ఇది.

ఈ మద్య కాలంలో గాయత్రి మంత్రం అనగానే ఒక స్త్రీరూపం వేస్తున్నారు. కానీ ఆ మంత్రానికి తాత్పర్యం ఎవరు అనేది ఆ మంత్ర ద్రష్టని అడగాలి. ఆయన చేసిన గాయత్రి మంత్ర ప్రభావంచే ఆయన రాముడినే శిష్యుడిగా పొందాడు. ఇది తాను చేసిన మంత్ర మహిమ. ఆ మంత్రానికి తాత్పర్యం రాముడు అని గుర్తించాడు, తత్ ఫలితంగా శ్రీరామచంద్రుడిని సీతమ్మతో చేర్చి తాని ఆర్జించిన తపో శక్తి స్వామి పాదాలయందు అర్పించాడు. ఇది ఫలితం అని అనుకున్నాడు. అందుకే సీతా రామ కళ్యాణం అయ్యాక ఆయన చరిత్రలో ఎక్కడ కనిపించడు, కారణం ఆ మంత్రానికి తాత్పర్యాన్ని పొంది సిద్ధుడు అయ్యాడు. గాయత్రి మంత్రానికి తాత్పర్యం సూర్య మండలానికి మధ్య ఉండే ధివ్యమైన సౌందర్య రాశి ఒక పురుష స్వరూపం అని తెలుస్తుంది. దాని తాత్పర్యాన్ని సూచిస్తూ ఒక శ్లోకం చెబుతుంటారు.

ధ్యేయః సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణః సరసిజాసనః సన్నివిష్టః
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః భృత శంఖ చక్రః

సూర్యగోళపు మధ్యన ఉండే, విశాలమైన నేత్రాలు కల్గిన, చేతనాచేతనముల లోన, బయట ఉండి నడిపే ధివ్యమంగళ విగ్రహానికి నమస్కరిస్తున్నా అని అర్థం. గాయత్రి మంత్ర అర్థాన్ని ఇలా చెబుతారు. ఇది ఉపనిషత్తులు చెప్పినదాన్నే శ్లోకంగా ఎవరో అందించారు. చాందోగ్యం అనే ఉపనిషత్తు సూర్య మండలానికి మధ్యన ఎవరు ఉన్నారు అని ప్రశ్నవేసుకొని సమాధానంగా "యయేశో అంతరాదిత్యే హిరణ్మయ పురుషః" అని అంటుంది. సూర్యగోళపు మధ్యన ఉండే ఆయన, పాదాలనుండి కేశాల వరకు ప్రకాశవంతమైఅన రూపం కల పురుషుడు అని చెబుతుంది. గాయత్రి మంత్ర అర్థం సూర్యమండలం మధ్యలో ఉండి తేజస్సుకు కారణమేదో అది నాలో ఉండే బుద్దిని కూడా ప్రేరేపించి నన్నూ మంచి మార్గంలో నడుపుగాక. అది పురుషుడిని చెబుతుంది కనక 'యహ' అని ఆ మంత్రంలో ఉంటుంది. స్త్రీ రూపం దాని అర్థం కాదు అనేది గుర్తించాలి. అది జగత్ కారణమైన తత్వాన్ని తెలిపేది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు.

యదాదిత్య గతం తేజః జగత్ భాసయతేఖిలం
యద్ చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజోవిద్దిమామకం

జగత్తుని రక్షించగల సూర్యుడి మధ్య ఉన్న తేజస్సు ఎదైతే ఉందో, ఆహ్లాదాన్నిచ్చే చంద్రుడిలో కాంతిలీడే తేజస్సు ఏదైతే ఉందో అది నాదే అని చెప్పాడు. మంత్రంలో అదిష్టాన మూర్తి ఉండాలి, ఆయన అలౌకికమై ఉండాలి, జగత్ కారణమై ఉండాలి. అప్పుడు సాత్వికం అవుతుంది. లోకంలో ఎన్నో మంత్రాలు ఉండవచ్చు, కానీ ఏది స్వీకరించతగునో వాటినే స్వీకరించాలి. మంత్ర ప్రతిపాద్యమైన దేవత యందు విశ్వాసం అంటే ఇది. దానికి తోడు మంత్రాన్ని ఒక గురువు ద్వారానే పొందాలి. ఈ మంత్రం వీడికి ఫలించుగాక అని గురువు సంకల్పించి ఉపదేశం చేస్తాడు కనక ఆ సంకల్పానికి ఒక శక్తి విశేషం ఉంటుంది. అయితే గురువు ద్వారానే ఎందుకు పొందాలి అంటే ఈ కాలంలో ఎందరో వారికి తోచిన మంత్రాలని వాటికి స్వరాలను కల్పించి చలామని చేస్తున్నారు. అసలు ఏదో, నకిలీ ఏదో కూడా తెలియనంతగా స్థితిలో లోకం సాగుతోంది. ఈ నాడు ఎందరెందరికి గాయత్రి మంతాలు తయారయ్యాయో చూస్తే అర్థం అవుతుంది. అందుకే మంత్రం అనేది పొందాలి అంటే దాన్ని దర్శించినవాడై ఉండాలి. అది మనకు ఫలించాలి అనే వాత్సల్యంతో వారు అందించాలి.
అట్లా మంత్రం, మంత్రం తెలిపే దేవతా విశేషం, మంత్రాన్ని అందించే గురువు ఈ మూడు ఒక చోట చేరితే, ఈ మూడింటిపై విశ్వాసం ఉంటే అది మొదటి మెట్టు అవుతుంది, ఆ మంత్రం అనేది తప్పక ఫలిస్తుంది.

మంత్ర జపం :-

కలియుగంలో భక్తులకు మోక్షాన్ని ప్రసాదించే సాధనంగా జపాన్ని పేర్కొంటారు. అందుకు నిదర్శనంగా మన ఆధ్మాత్మిక గ్రంథాలలో జపం యొక్క విశిష్టత అడుగడుగునా ప్రస్తావనకి వస్తూ ఉంటుంది. అలాంటి జపం గురించి కొన్ని విశేషాలు...

- జపించడం అంటే తనలో తాను స్మరించుకోవడం అన్న అర్థం వస్తుంది. ‘జపం’ అంటే మాటకు- ‘జ’కారో జన్మవిచ్ఛేదః ‘ప’కారః పాపనాశనః... అంటూ ప్రతిపదార్థం చెప్పిన సందర్భాలూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తనకు ఇష్టమైన భగవంతుని నామాన్ని కానీ మంత్రాన్ని కానీ తరచూ స్మరించుకోవడమే జపం.

-  జపం గురించిన ప్రస్తావన అనాదిగా వినిపిస్తూనే ఉంది. వేదాలలో తొలిసారి కనిపించిన

ఈ మాట మనుస్మృతి, పతంజలి యోగసూత్రాలలో కూడా కనిపిస్తుంది. ఇక భగవద్గీతలో శ్రీకృష్ణుడు యజ్ఞాలలో తాను జపయజ్ఞాన్నని స్పష్టంగా పేర్కొంటాడు.
మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ |
యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి స్థావరాణాం హిమాలయః (10.25)

- భారతీయ సంస్కృతి ప్రభావంతో సిక్కు, క్రైస్తవ, బౌద్ధ, జైన మతాలలో సైతం వేర్వేరు రూపాలలో ఈ జపం కనిపిస్తూ ఉంటుంది.

- జపాన్ని మూడు రకాలుగా పేర్కొంటారు. పైకి వినిపించేట్లుగా చేసే జపాన్ని వాచక జపం అంటారు. వినపడీ వినపడనట్లుగా చేసుకునే జపాన్ని ఉపాంశు జపం అంటారు. ఏమాత్రం సద్దు చేయకుండా మనసులోనే సాగిపోయే జపాన్ని మానసిక జపం అంటారు. వీటిలో ఒకదాన్ని మించిన ఫలితం మరో జపం ఇస్తుందని ఉపనిషత్తుల మాట. అంటే మనసులో నిశ్చలంగా సాగిపోయే జపానికే మన పెద్దలు ప్రాముఖ్యతని ఇచ్చారన్నమాట.

- జపం అంటేనే ప్రార్థనకు క్లుప్తమైన రూపం. కాబట్టి మనకి ఇష్టమైన దేవత గురించిన స్మరణను జపంగా మలచుకోవచ్చు (ఉదా॥ ఓం నమశ్శవాయ). లేదా ఎవరన్నా గురువుగారు దీక్ష ద్వారా ఒసగిన మంత్రాన్ని జపించవచ్చు. అదీ కాదంటే మనసుకి నచ్చిన ఏదన్నా వాక్యాన్ని (ఒం శాంతిః శాంతిః శాంతిః) స్మరించుకోవచ్చు. దీనికి ఫలానా సమయంలో చేయాలన్న కాలనియమం కానీ, ఫలానావారే చేయాలన్న కట్టడి కానీ ఏమీ లేదు. కావల్సిందల్లా నిర్మలమైన మనసు మాత్రమే!

- జపంతో నిరంతరం భగవన్నామ స్మరణ చేయడం వల్ల, పరిపరి విధాలా పరుగులుదీసే ఇంద్రియాలు స్థిమితపడతాయి. మనం ఏ మంత్రాన్నైతే జపిస్తున్నామో అది మన మనసులోకి అంతకంతకూ గాఢంగా చొచ్చుకుపోతుంది. తొలుత బలవంతంగా కనిపించే ఈ ప్రక్రియ ఒక సాధనగా మారిపోతుంది. ఇలా కొన్నాళ్లు సాధన చేసిన పిమ్మట సాధకుడు ‘అజపజపం’ అనే స్థితిని చేరుకుంటాడు. అంటే జపం చేయకున్నా కూడా మనసులోని ఒక భాగంలో నామస్మరణ నిర్విరామంగా సాగిపోతూనే ఉంటుంది.

-  మిగతా జీవుల సంగతేమో కానీ మనిషికి శబ్దానికీ మధ్య గాఢమైన సంబంధం ఉంది. మనిషి శబ్దం ద్వారానే తన భావాలను వ్యక్తపరుస్తాడు. శబ్దాన్ని వినడం ద్వారానే ఎదుట ఏం జరుగుతోందో అవగతం చేసుకుంటాడు. మనిషి వినే మాటకి అనుగుణంగా అతనిలోని మనసు ప్రతిస్పందిస్తుంది. అందుకనేనేమో ఈ సృష్టి యావత్తూ ఓంకారం అనే శబ్దం నుంచి ఉత్పన్నం అయిందన్న వాదనలు హిందూ ధర్మంలో వినిపిస్తుంటాయి. అలాంటి శబ్దాన్ని ఉపాసించడం ద్వారా మనసుని లయం చేసుకోవడమే జపంలోని అంతరార్ధం. అది నిర్విరామంగా సాగినా, జపమాల సాయంతో సాగినా.... మన జీవితాన్ని తరింపచేసే ఒక నామాన్ని, వీలైనప్పుడల్లా కాసేపు తలచుకోమని చెప్పడమే జపసాధనలోని పరమార్థం.

ఏ ఉపాసన, సాధనలోనైనా జపమాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. జపక్రియాల వల్ల కలిగే సమస్త ఫలాలూ మాల మీదే ఆధార పది ఉంటాయి. జప సమయంలో పలికే మంత్రాల సంఖ్యను లెక్కించు కోవడానికి ఈ మాల ఉపయోగపడుతుంది. మాలలు మూడు రకాలు.

కరమాల
వర్ణమాల
మణిమాల
కరమాల

చేతివేల్లను పరస్పరం అతికించి, అరచేతి వైపుకు కొద్దిగా వంచి, వేళ్ళ కణుపుళ మీద నిశ్చిత క్రమంలో జపం చేసుకునే క్రియను ‘కరమాల’ అంటారు. దేవీదేవతలకి కరమాలతో చేసె జపసంఖ్యను లెక్కించడానికి వేర్వేరు రీతులుంటాయి.

జపంలో ప్రయోగించే చేతివేళ్ళకు ఎంతో ప్రాముఖ్యత ఉందని శివాజ్ఞా గ్రంథంలో పేర్కొన్నారు. బొటనవేలు మోక్షదాయిని, చూపుడువేలు శత్రునాశిని, మధ్యవేలు ధనదాయిని. ఇలా ఒక్కో వేలుకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది. బొటనవేలు, మధ్యవేలు – వీటి కలయికతో సమస్త సిద్దూలూ ప్రాప్తిస్తాయి. బొటనవేలుతో జపం చేయటం సిద్ధిదాయకం. మధ్యవేలుతో జపం చేస్తే పాపం పెరుగుతుంది. అందుకని బొటన ఉంగరపు వేళ్ళతో జపం చేసుకోవాలి.

వర్ణమాల

వర్ణ సమూహంతో కూడినది వర్ణమాల. స్వరాలు, వ్యంజనాలు కలిసిన ఈ సమూహంలో 51 వర్ణాలు ఉంటాయి. మొదటి అక్షరాన్ని సుమేరుగా భావించుకుని మిగిలిన 51 వర్ణాల మీద క్రమంగా మంత్ర గణన చేయాలని వర్ణమాల ఉపయోగనిధి చెబుతుంది. కాని, మామూలు మనిషి ఆచరించ లేనంత జటిలమైన ప్రక్రియ. కనుక ఈ విధానం అంతగా వ్యాప్తి చెందలేదు. ఎక్కువ సంఖ్యగల జపనిధిని నిర్విర్తించటానికి ఈ పద్ధతి అనువనైది కాదు.

మణిమాల

ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువగా వాడుతున్న జపమాల-మణిమాల. తులసిపూసలు, రుద్రాక్షలు, తామరతూళ్ళ గింజలు, ముత్యాలు, పగడాలు, స్పటికపూసలు, బంగారం, వెండిపూసలు, శంఖులు, రాజమణి, వైజయంతి మొదలైనవాటి పూసలను ఒకే సూత్రంలో గుచ్చి, తయారుచేసే మాలను ‘మణిమాల’ అంటారు. వైష్ణవ మంత్రాలకు తులసిపూసల మాల; గణేశ మంత్రానికి ఏనుగు దంతాల మాల; కామాక్షీదేవి మంత్రజపానికి రుద్రాక్షమాల లేక ఎర్రచందనపూసల మాల ఉత్తమమైనవి మంత్ర మహావర్ణ గ్రంథం దేవతాఖండంలోని ప్రథమ ఖండంలో చెప్పబడింది.

సత్కర్మాల ఫలసిద్ధికై పూసలను పుట్టుదారంతో మాలగా గుచ్చుకోవాలి. వైష్ణవీమాలను పద్యసూత్రంతో, శైవీమాలను ఊలుదారంతో పూసమాలను గుచ్చుకోవాలి. ఇతర దేవీదేవతల మంత్రజపానికై నూలు దారంతో మాలను గుచ్చుకోవాలి. ఈ సంగతులన్నీ మంత్రమహార్ణవ గ్రంథంలో పేర్కొన్నారు. మాలతో జపం చేసుకోవడానికి రెండు పూసల మధ్య నుంచి మాలను నడిపించాలి. చూపుడువేలుతో జపమాలను స్పృశించకూడదు. సాధకుడు తన ఎడమచేతితో జపమాలను తాకకూడదు. జపం చేసుకునే మాలను చేతికి చుట్టుకోకూడద

ు. తలమీదగాని, కంఠంలో గానీ ధరించరాదు. జపం పూర్తయిన తర్వాత మాలను పరిశుభ్రమైన చోట భద్రపరచుకోవాలి. మంత్ర మహార్ణవం, మంత్ర మహోదధి మొదలైన గ్రంధాలలో మణిమాల విషయంలో తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తల గురించి తెలిపారు.

జాగ్రత్తలు

జపమాలను అటూ ఇటూ ఊపకూడదు. అలా ఊపితే సాధనఫలం పూర్తిగా దక్కదు. మాలలోని పూసలు విరిగి ఉంటే, దుఃఖం ప్రాప్తిస్తుంది. కనుక కొన్ని పూసలు విరిగి ఉన్న మాలతో జపం చేయకూడదు. జపం చేసేటప్పుడు మాల నుంచి శబ్దం రాకుండా చూసుకోవాలి. అలా శబ్దం వచ్చే మాలతో జపం చేసుకునే సాధకుడు వ్యాధిగ్రస్తుడవుతాడు. జపం చేసుకునే సమయంలో మాల చేతినుంచి జారి కింద పడిపోతే సాధన లేక ఉపాసన పరిపూర్ణం కాదు. జపం చేసుకునే సమయంలో జపమాల దారం తెగిపోతే సాధన – జపాల ఫలం ప్రాప్తించదు. ఇది అరిష్టాన్ని సూచిస్తుంది. కనుక ఈ జాగ్రత్తలన్నిటినీ సాధకుడు పాటిస్తూ జపమాలను ఉపయోగించుకుంటే సత్ఫలితాలను పొందవచ్చు.

కుడిచేతిని గౌముఖి (ఆవుముఖం వంటి సంచి)లో పెట్టుకుని జపం చేసుకోవాలి. గౌముఖి లేకపోతే శుభ్రమైన వస్తంతో కుడిచేతిని కప్పి ఉంచాలి. తలమీద చేతిని గాని, బట్టను గాని ఉంచకూడదు. చూపుడు వేలును వేరుగా ఉంచి జపం చేసుకోవాలి. మనిమాలను ఉంగరం వేలుమీద పెట్టి, బొటనవేలితో స్పృశిస్తూ మధ్యవేలు మీదుగా ఆ మాలను తిప్పాలి. సుమేరును అతిక్రమించకూడదు. ఒక మాలజపం పూర్తయిన తరవాత మళ్ళి తిప్పే సమయంలో సుమేరు దగ్గర నుంచి మాలను వ్యతిరేక దిశలో తిప్పి జపం చేసుకోవాలి. జపం చేసుకునే సమయంలో అటూ ఇటూ కదలటం, కునిపాట్లు పడటం, మాట్లాడటం, మాలను చేతిలోంచి కింద పడేయటం ఇవన్నీ చేయకూడదు. మధ్యలో మాట్లాడాల్సివస్తే భగవంతుణ్ణి స్మరించుకుని జపాన్ని మళ్ళీ మొదలుపెట్టాలి. ఇంట్లోని ఏకాంతప్రదేశం, గోవులకు సమీపంగా ఉన్న చోటు, పవిత్రమైన అడవి, తోట, తీర్తస్థలం, నదీతీరం, దేవాలయం ఇవన్నీ జపం చేసుకోవడానికి ఉత్తమమైన ప్రదేశాలు.

ప్రాతఃకాలంలో అయితే చేతిని తిన్నగా, వేళ్ళు పైకి ఉండేట్లుగా, హృదయానికి సమీపంలో ఉంచుకుని జపం చేసుకోవాలి. సాయం సమయంలో అయితే కుడిమోకాలును నిలబెట్టి, చేతిని కిందవైపు ఉండేట్లుగా వెనక్కి తిప్పి, ముక్కుకు సమీపంలో ఉంచి జపం చేసుకోవాలి. మధ్యాహ్న వేళ అయితే చేతివేళ్లు పైకి ఉండేట్లు చేతిని నిలువుగా నాభికి సమీపంలో ఉంచి జపం చేసుకోవాలి. మంత్రాన్ని మెల్ల మెల్లగా నోటితో పలుకుతూ చేసె జపాన్ని ‘వాచిక జపం’ అని అంటారు. ఇతరుల చెవికి వినపడనంత మెల్లగా మంత్రాన్ని పలుకుటూ చేసే జపం ‘సుపాంశు జపం’. నాలుక, పెదవులను కదల్చకుండా చేసే జపాన్ని ‘మానసిక జపం’ అని అంటారు. మనసులోనే చేసుకునే జపవిధానం కనుక ఇది ఉత్తమమైనదిగా భావింపబడుతోంది. జిహ్వ-పెదవులు కదల్చకుండా మనసులోనే జపించటం జరుగుతుంది. కనుక ఈ జపవిధానంలో స్వర, లయాదుల దోషాల ప్రసక్తి ఉండదు.

శుద్ధి చేసిన తరువాతే మణిమాలను ఉపయోగించాలి. మణిమాలను శుద్ధి చేసే విధానం – తొమ్మిది తమలపాకులను గాని, రావి ఆకులను గానీ తీసుకొచ్చి, ఎనిమిది ఆకులతో అష్టదళాకృతిని తాయారుచేసుకోవాలి. తొమ్మిదో ఆకును అష్టాదళాకృతి మధ్యలో పెట్టి, దానిమీద మాలను ఉంచి పవిత్రపరచాలి.

ఊం, అం, ఆం, ఇం ఈం, ఉం, ఋం, లుం, ల్రుం, ఎం, ఏం ఓం, ఔం, అం, అః, కం, ఖం, గం, ఘం, డం, చం, ఛం, జం, ఇ’ం, టం, ఠం, డం, ణం, తం, థం, దం, ధం, నం, పం, ఫం బం, భం మం, యం, రం, లం, వం, శం, షం, సం, హం, క్షం – ఈ మంత్రాలను జపిస్తూ పంచగవ్యాలతొ మాలను అభిషేకించాలి. దాని తరవాత దిగువ ఇచ్చిన మంత్రాన్ని ఉచ్చరిస్తూ గంగాజలంతొ మాలకు స్నానం చెయించాలి.

మంత్రం: –
ఓం సద్యోజాతం ప్రపధాని సద్యోజాతాయ వై నమోనమః|
భవే భవే మాటి భవే భవస్య మం భావోబ్దవాయ నమః||

దిగువ మంత్రంతో మాలకు గంధం అలది, చందనాడులను దానిపై చల్లాలి.

మంత్రం:-
ఓం వామదేవాయ నమో, జ్యేష్టాయ నమః, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమః, కలివికరణాయ నమో!
బల వికారణాయ నమః, బలాయ నమో, బల ప్రథమనాయ నమః, సర్వభూత దమనాయ నమో, నమో మనోనమనాయ నమః, గంధ సమర్పయామి||

ఆ తరవాత కింది మంత్రంతో మాలకు సాంబ్రాణి, అగరబత్తీలు మొదలైన సుగంధద్రవ్యాలతో ధూపం వేయాలి.

మంత్రం:-
ఓం అధోరేభ్యో థ ధౌరేభ్యో ధోరధోరతరేభ్యః|
సర్వైభ్య సర్వశవైభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః||

తరువాత దిగువనిచ్చిన తత్పురుష పఠిస్తూ చందనం, కుంకుమపూవ్వులతో మాలకు లేపనం చేయాలి.

మంత్రం:-
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్|

మాలలోని ప్రతిపూస మీ ఈశాన మంత్రాన్ని జపించాలి.

ఈశాన మంత్రం: –
ఓం ఈశాన్యః సర్వ విద్యానమీశ్వరః సర్వభూతానాం!
బ్రహ్మాదిపతి బ్రహ్మణో ధి పతిప్రహ్మశివో మే అస్తుసదాశివోమ్||

తరవాత మణిమాల సుమేరు పూసను క్రమంగా ఈశాన, అఘోర మంత్రాలను పదిసార్లు చదువుతూ శుద్ధి చేయాలి. ఇలా శుద్ధి చేసిన తరవాత పంచోపచారాలతో మాలను పూజించాలి. గంధం, ధూపం, దీపం, పుష్పాలు, నైవేద్యం…వీటిని సమర్పించటానికి పంచోపచారాలు అంటారు.

గంధార్పణ మంత్రం:-
పరమానందసౌరభ్యపరిపూర్ణ దివాంతరమ్|
గృహాణ పరమం గంధం కృపయా పరమేశ్వర||

పుష్పారణ మంత్రం:-
తురీయం తుగుణసంపన్నం నానగుణమనోహరమ్|
ఆనంద సౌరభ పుష్పం గృహ్యతామిదత్తమమ్||

ధూప మంత్రం:-
వనస్పతిరసో దివ్యో గంధాఢ్యః సుమన

ోహరః|
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపో యాం ప్రతిగృహ్యతామ్||

దీపదర్శన మంత్రం:-
సుప్రకాశో మహాద్వీపః సర్వతస్తి మిరాపః|
సవాహ్మభ్యంతర జ్యోతిర్దీపో యం ప్రతిగుహ్యాతామ్||

నైవేద్యార్పణ మంత్రం:-
సత్పాత్రసిద్ధం సుహాబివధానేక భక్షణమ్|
నివేదయామి దేవేశ సానుగాయ గృహాణ తత్||

ఆ తరవాత మాలను ఇలా ప్రార్థించాలి –
ఓం మహామాయే మహామాలే సర్వశక్తి స్వరూపిణీ|
చతువైర్గస్త్వయిన్యస్త స్త్రస్మాన్మే సిద్ధిదా భవ||
అవిఘ్నం కురుమాలే త్వం గృహణామ దక్షిణే కరే|
జపకాలే ఛ సిద్ధ్యర్ధ ప్రసది మమ సిద్ధయే||

పై విధంగా ప్రార్థించి మాలగ్రహన్ మంత్రదేవత సూర్య భగవానుడిని ధ్యానిస్తూ హృదయానికి సమీపంలో ఉండేట్లుగా మాలను పట్టుకుని, మంత్రంలోని అక్షరాలను స్మరిస్తూ ఆ రోజు మధ్య వరకు జపం చేసుకోవాలి. జపం ముగిశాక ఓంకారాన్ని ఉచ్చరించాలి. లేకపోతే 108 సార్లు జపం చేసి, 108 ఆహుతులతో హోమం చేయాలి. మరో మంత్రాన్ని ఈ మాల మీద జపించకూడదు. మాలను సురక్షితమైన స్థానంలో సగౌరవంగా భద్రపరుస్తూ కింది మంత్రాన్ని ఉచ్చరించాలి.

ఓం త్వం మాలే సర్వేదేవానాం సర్వాసిద్ధిపరదా మతా| తేన సత్యేన మే సిద్ధి దేహి మాతర్నమో స్తుతే||

మాల సూత్రం (దారము) పాతదైపోతే, మళ్ళీ కొత్తదారంతో గుచ్చుకుని 100 సార్లు జపం చేయాలి.

ఈ విధంగా మాలను పవిత్ర పరచిన తరవాత పైన చెప్పిన విధంగా మంత్రజపం చేయడం వల్ల సంపూర్ణ ఫలితం దక్కుతుంది. సాధన, ఉపాసన తప్పనిసరిగా సఫలమవుతాయి.

(సమాచారములో విషయములు ఎందరో మహానుభావులు అందరకూ వందనములు. శ్రీ గురుభ్యోంనమః )

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...