Friday, November 30, 2018

ఏం వదిలేయాలి?

మనసును ప్రశాంత స్థితిలో ఉంచడానికి మార్గం ఒకటే ఉంది. కోరికల వల నుంచి దాన్ని బయటకు పడవెయ్యాలి. ప్రపంచ మహాసాగరంలో ఊగిసలాడే పడవ వంటిది మానవ శరీరం. కర్మానుభవాలనే గాలులే ఆ నావను నడుపుతుంటాయి.

దేహమనే పడవకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. ఆ పడవ నడిపే సరంగు నిమిత్తమాత్రుడు. ఈ చిల్లుల పడవను సాక్షిగా నడిపిస్తుంటాడు. ఈ తొమ్మిది రంధ్రాలను చూసుకొంటూ జీవన ప్రయాణం సాగించకపోతే, పడవలోకి నీళ్లు వచ్చేసి, అది మునిగిపోతుంది. అనుభవశాలి అయిన సరంగు పడవను ఆవలి గట్టుకు భద్రంగా చేరుస్తాడు. ఇంద్రియ నిగ్రహంతోటే ఇది సాధ్యం.

పరస్త్రీలను కోరడం మహాపాపం. తెలిసి కూడా కోరికలను వదలకపోతే మనసు పాపపంకిలమైపోతుంది. ఇతరుల్ని తిట్టడం, లేక వారి తిట్లను వినడం రెండూ నిరర్థకమే! నిందించడానికి అలవాటుపడిన నాలుక సాధించుకొనేదేదీ ఉండదు... పోగొట్టుకోవడం తప్ప.

వస్తువుల మీద ఉన్న అభిమానం, దురదృష్టానికి దారి తీస్తుంది. వస్తువును పొంది, తరవాత పోగొట్టుకొంటే అది మహాబాధ కలిగిస్తుంది. వివేకవంతమైన మనసు, తనకేది కావాలో తేల్చుకోగలదు. అశాశ్వతమైన వస్తువులకు అది ఎప్పుడూ దూరంగా ఉంటుంది.

పామునోట సగం శరీరంతో ఇరుక్కొన్న కప్ప, తనను మింగబోతున్న మృత్యువును గ్రహించలేదు. పైగా అది తన ముందున్న కీటకాలను తినాలని తాపత్రయ పడుతుంది. అదే చిత్రం. దీనిని దురాశ కాక మరేమిటని అంటారు?

ఇలాంటి మనసును అదుపులో ఉంచుకోవడం ఎలా? తన ప్రయాణాన్ని ప్రారంభించిన నది, మూలం వదిలి సముద్రం చేరేదాకా, పల్లంవైపుగా సాగుతుంది. వర్షకాలంలో అధికంగా నీరుచేరితే బావిలోని నీరు తీపితనాన్ని కోల్పోతుంది. ఆ బావి నీరే వేసవిలో తియ్యగా మారిపోతుంది.

‘అతిసర్వత్రవర్జయేత్‌’ అన్నారు. అధికం ఎప్పుడూ అనర్థమే! అధికమైన కోరికలతో తామసగుణం పెరిగిపోతుంది. అవి లేకపోతే తామసం నశించి సత్త్వగుణం పెరుగుతుంది. సత్త్వ రజస్తమో గుణాలు మూడూ ప్రకృతి సహజమైనవే!

పవిత్రత, వివేకం, విజ్ఞానం- ఇవన్నీ సత్త్వగుణాలు. ఆందోళన, ఆగ్రహం, అస్తిమతత్వం- ఇవన్నీ రజోగుణాలు. జడత్వం, అజ్ఞానం, భ్రాంతి- ఇవన్నీ తమోగుణాలు.

మనసుకు ఉన్న మొదటి లక్షణం- అన్నీ పొందాలనుకోవడం. పోగొట్టుకోవడానికి అది ఇష్టపడదు. పైగా అవమానకరంగా భావిస్తుంది. వస్తువును పొందే ప్రయత్నం అంతా నిజానికి ఒక యాతన వంటిది. సత్సంగం, సత్సాంగత్యం, సజ్జనమైత్రి... మనసుకు ఎంతో స్తిమితాన్ని ఇస్తాయి.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...