Monday, November 5, 2018

కుండలిని జాగృతి లో వివిధ అవస్థలు - వైజ్ఞానిక విశ్లేషణ (1)

కుండలినీ శక్తి జాగృతమైన సమయంలో మూలాధార చక్రం వద్ద ఒక ప్రత్యేకమైన దురద వంటి ఉద్రేకము కలుగుతూ ఉంటుంది. అందువల్ల సాధకుడు కుండలినీ పీఠం "మూలాధారం" వద్ద ఉన్నదని భావించవచ్చును. యోగి తన శరీరంలోని ప్రతి కోశిక యందును, ఒక విచిత్రమైన విద్యుత్ స్పందనను అనుభవిస్తాడు. జాగరూకుడైన యోగి తన శరీరంలో జరిగే సూక్ష్మమైన అంతర్గత మార్పులన్నీ ఈ రకమైన అనుభవాలుగా పరిశీలనలోకి వస్తాయి.
      కుండలినీ శక్తి జాగృతి సమయంలో కోశికలు అన్నిటియందు ప్రవహించే విద్యుత్ ప్రవాహం నాలుగు రకాలుగా ఉంటుంది. అవి 1. పిప్పిలకము 2. దర్దూరము 3.  సర్పము 4. విహంగము.

1. పిప్పిలకము :
 సంస్కృతంలో పిప్పిలక మనగా చీమ.  కుండలిని జాగృతి తొలి అవస్థలో కొన్నిసార్లు సాధకుడు తన శరీరంలో వందలాది, వేలాది చీమలు పైకెగ బ్రాకుతున్నట్లు  అనుభూతి చెందడం జరుగుతుంది.  తన శరీరములో పైకి ఎగబ్రాకే చీమల దాడికి గురయ్యానా... అని వ్యాకుల పడడం జరుగుతుంది. కొంతమంది సాధకులు అయితే లేనటువంటి ఆ చీమలను శరీరము నుండి దులిపి వేయడానికి ప్రయత్నిస్తారు.  కానీ వెంటనే అతడు నాడీమండలంలో కలిగే ప్రేరణగా గ్రహిస్తాడు. అయితే వాస్తవంగా లేనటువంటి చీమలు అవి పైకి ప్రాకి ఉన్నట్లుగా కలిగే అనుభూతి ఎందుకు కలగాలి ? అనే ప్రశ్న మన మనస్సులో ఉదయించును.
      శాస్త్రీయముగా దీనికి కారణం సుస్పష్టం. శరీరమునందలి కోసి కలలో సూక్ష్మమైన విద్యుత్ తరంగాలు ఏకీకృతమై ఒక్కసారి సంచలనాలు సృష్టిస్తాయి. ఈ సంచలనాలే  క్రింద నుంచి  పైకి,  అసంఖ్యాకమైన చీమలు ప్రాకుతున్నట్లుగా అనుభూతి కలిగిస్తాయి. చాలామంది యోగ సాధకులకు.... కుండలినీ శక్తి జాగృతి దశలో ఈ రకమైన అనుభూతి మొదటి అవస్థ. ఇటువంటి ప్రేరణ పూరితమైన అనుభవాన్ని శాంతింప చేయాలంటే సాధన కొనసాగించడం ద్వారా ఈ అవస్థను దాటి ముందుకు పోవచ్చు.

     కుండలిని జాగృతం సమయంలో శరీర క్రింది భాగంలో ప్రాకే అనుభూతి మన శరీరమందలి మూలాధారము, ప్రభావితమైందని చెప్పుకోవచ్చును. అంతేకాక మూలాధారము మన మోకాళ్ళకు క్రింద నున్న  శరీర భాగం పై పూర్తి ఆధీనము కలిగి ఉన్నది. ఆసక్తి గల వ్యక్తులు  "కుండలినీ విజ్ఞాన శాస్త్రము" నందు ఈ విషయమును పరిశోధించాలి. శరీరంలోని ఏదైనా భాగంలో రక్త ప్రవాహం తక్కువగా గానీ, ఆగి... ఆగి... ప్రవహిస్తున్నప్పుడు గాని ఈ రకమైన అనుభూతి కలుగును. అందుచే సాధకునికి కలిగే చీమలు ప్రాకే అనుభూతి రక్తప్రవాహం లోపం వలన కలుగుతుందా ? లేక ఆ భాగంలో గల నాడీ మండలపు నియంత్రణ లే
సడలినందువల్ల కలిగినదా..... అనే ఈ విషయము పరిశోధనాంశం. కుండలిని జాగృతం అయినప్పుడు కలిగే ఈ అనుభూతి నాడీ సంబంధమైనదేనని  చాలా మంది యోగుల అభిప్రాయము. ఎందుచేతననగా ప్రారంభ దశలో సాధకుని రక్త ప్రసరణ
 సామాన్యంగా గాని... అంతకన్నా  హెచ్చుగా గానీ ... ఉండును. కుండలిని జాగృత సమయంలో మొదటి యోగ చక్రం ప్రేరేపించబడినప్పుడు సాధకుని ముఖం మరింత తేజస్సుగానూ మరింత రక్తప్రసరణతో కూడినది గానూ ఉండును. మామూలు కంటే హెచ్చు స్థాయిలో రక్తప్రసరణ జరుగుతున్నదని మనకు తద్వారా తెలియచున్నది. అందుచేత కుండలిని జాగృత తొలి దశ అయిన పిప్పిలకావస్థలో  కలిగే ప్రేరణ నాడీమండల సంబంధమైనదని రక్త ప్రసరణ లోపం వల్ల కలిగినది కాదని మనకు అర్థం అగును. ప్రతి కోసికలోనూ, ముఖ్యముగా శరీరపు క్రింది భాగములో ఉద్భవించే విద్యుత్ సంచలనాలే, చీమలు పైకెగబ్రాకుతున్న అనుభూతికి కారణము. అయితే దీనికి నిరంతర సాధన అవసరము.

1 comment:

  1. పై విశ్లేషణ చక్కగా వివరించారు. ఇది వాస్తవం. కుండలిని జాగృతి సమయములో ఇంకా ఎన్నో అనుభూతులు గమనించవచ్చును. అయితే సాధన కొనసాగించాలి. ధన్యవాదములు. సాయిబాబా, రేయికి మాస్టర్.

    ReplyDelete

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...