Monday, November 5, 2018

శ్రీమహాలక్ష్మీ మూర్తి లక్షణం!

కొల్లాపురం వినా న్యత్ర  మహాలక్ష్మీర్యదోచ్యతే!
లక్ష్మీవత్సా తదా కార్యా సర్వాభరణభూషితా!!

దక్షిణాధఃకరే పాత్రమూర్ధ్వే కౌమోదకీం తతః!
వామోర్ధ్వే ఖేటకం చైవ శ్రీఫలం తదధఃకరే!!

బిభ్రతీ మస్తకే లింగం పూజనీయో విభూతయే!!

తా॥ కొల్లాపురమను తావున తప్ప తక్కిన తావులయందు మహాలక్ష్మీ నిర్మాణము చేయదలచినచో ఈ క్రింది విధముగా ఆ విగ్రహముండవలెను.

పూర్వము చెప్పిన విధముగా అన్ని భూషణములతో అలంకరింపబడినదై విగ్రహముండవలెను. క్రింది కుడిచేతియందు పాత్రము, పై కుడిచేతియందు కౌమోదకి అను గద ఉండవలెను. పై ఎడమచేతియందు ఖేటము, క్రింది ఎడమచేతియందు మారేడు పండు ఉండవలెను.

ఆ దేవీవిగ్రహశిరమునందు ఒక లింగము నిర్మించవలెను. ఈ రూపముతోనున్న ఆ శ్రీమహాలక్ష్మిని సంపదలు కోరిన వారలు పూజించవచ్చును.(నృసింహప్రాసాదము-విశ్వకర్మ)

                 గ్రంథాధారం: రూపధ్యానరత్నావళి
                 చిత్రకారులు: శ్రీగణపతిస్థపతిగారు

విశేషవిచారము: ఇక్కడ శ్రీమహాలక్ష్మీదేవి విగ్రహలక్షణము చెప్పేటప్పుడు మొదలు ఒక మాట చెప్పారు. అదేమిటంటే "కొల్లాపురములో తప్ప ఇతర ఏ ప్రదేశంలోనైనా శ్రీమహాలక్ష్మీస్వరూపం ఈ క్రింది విధంగా ఉండాలని". కొల్లాపురంలో శ్రీమహాలక్ష్మిదేవి స్వయంగా వెలసినందువల్ల అక్కడ  పై ప్రమాణముననుసరించి విగ్రహము చేయనక్కరలేదు. ఈ విషయాన్ని మనం బాగా  గుర్తుంచుకోవాలి. ఎందుకంటే బిల్వవృక్షానికి దీక్ష ఎందుకు చేయాలో, ఎక్కడ  చేయాలో, ఎక్కడ చేయకూడదో తర్వాతి పోస్టులో మనం చూడబోతున్నాం.

తర్వాత పై రెండు చేతులలో కౌమోదకి అను గద, ఖేటము అను ఆయుధాలు ఉండాలని, క్రింది రెండు చేతులలో అక్షయపాత్ర, బిల్వఫలం ఉండాలని చెప్పబడింది.
మారేడుపండును "శ్రీఫలం" అని పిలుస్తారు. అనేకులు ఈ ఫలాన్ని "శ్రీమహాలక్ష్మీస్వరూపం"గా భావించి పూజించడం కలదు. ఇది కూడా గుర్తుంచుకోదగిన విషయం.

చివరికి శ్రీమహాలక్ష్మిదేవి శిరస్సునందు "శివలింగము" ఉండాలని, సంపదలు కోరేవారు ఇలాంటి లక్షణాలు కలిగిన శ్రీమహాలక్ష్మిదేవిని ఆరాధించాలని చెప్పబడినది. ఇది ఎవ్వరూ  మరువకూడని విషయం.

శ్రీమహాలక్ష్మిదేవి ఈశ్వరానుగ్రహం చేత ఐశ్వర్యాధిదేవతగా వర్ధిల్లినది. అంతేగాక శిరస్సునందు ఈశ్వర(ఇష్ట)లింగమును ధరించి, నిత్యం ఆరాధించినది. కాబట్టి పైన చెప్పిన ప్రమాణానుసారంగా శ్రీమహాలక్ష్మిదేవిమూర్తి శిరస్సునందు ఖచ్చితంగా "శివలింగం" ఉండాలి. వీరశైవాగమికులు వీరశైవసంబంధిత ఆలయాలలో శిల్పాచార్యులచేత శివేతర దేవతామూర్తులను నిర్మాణము చేయించేటప్పుడు "నుదుటి పైన విభూతిరేఖలు, రుద్రాక్షాభరణాలు, వీరశైవాగమాలలో ఆయా దేవతామూర్తులకు ఆయా స్థానాలలో నిర్దేశించిన విధంగా శివలింగము" ఉండేలా చూసుకోవాలి. వీరశైవాగమోక్త విధానంతో "లింగధారణ" కలిగిన దేవతలను లోకక్షేమం కోసం ఆరాధించాలి. 

#శ్రీశివయోగపీఠం#

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...