Tuesday, November 27, 2018

అన్నం గురించి ఓ ఉపాఖ్యానం

అన్నం వండేవారు ఏ మనస్సుతో, ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద , దాన్ని తినేవారి మీద కూడా ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వంట చేసేవారు కనీసం దాని రుచిని ఆఘ్రాణించను కూడా ఆఘ్రానించరు. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవెద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల దాన్ని దేవుడు ఆరగించటంవల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది.

వంట చేసేవారు కోపంగా, విసుగ్గా వంట చేస్తే, ఆ వంటకాలకు సరైన రుచి రాకపోగా, దాన్ని భుజించిన వారి మనస్సు కూడా కోపతాపాలకు నిలయమవుతుంది. అందుకే వంట చేసేటప్పుడు ఆ వంట చేసేవారు మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా వంటచేస్తే, దానికి రుచితోపాటు ఆ వంట తిన్నవారి మనస్సులు సంతోషంగా వుంటాయన్నది పూర్వూకుల విశ్వాసం.

లోకంలో మానవులు దాత, అదాత అని రెండు రకాలుగా వుంటారు. ఇతరులకు అన్నం దానం చేసి తాను తినేవాడు దాత. ఇతరులకు దానం చేయకుండా విషపూరితమైన అన్నాన్ని తినేవాడు అదాత. దాతకు కాలంతరాన అన్నం లభిస్తుంది. అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా, అగ్ని నశింపచేస్తాడని తైత్తిరీయబ్రాహ్మణం వివరిస్తుంది.

ఇతరులకు అన్నం పెట్టకుండా తానే తింటే, ఆ అన్నం విషంతో సమానం. దాత, అదాత ఇద్దరూ అన్నసంపాదనకు ప్రయత్నిస్తారు. కాని దాత ఇతరులకు దానం చేయడం కోసం అన్నం సంపాదిస్తాడు. అది ఉత్కృష్టమైనది. అదాత తాను తినడంకోసమే సంపాదిస్తాడు. అతను పాపాత్ముడు అని శ్రుతి పేర్కొంటోంది.

అన్నం దేవతే కాకుండా మృత్యురూపమైంది కూడా. మనం తినే అన్నాని బట్టే మనకు రోగాలు, ముసలితనం లభిస్తాయి. అన్నమే సంతానోత్పత్తికి కారణమని కూడా చెపుతుంది ఆయుర్వేదం. కాబట్టి ఇంత మహిమగల అన్నం ఇతరులకు పెట్టకుండా తాను మాత్రమే తినేవాడు ఒక రకంగా విషాన్ని భుజిస్తున్నట్టే.

యజ్ఞయాగాది క్రతువుల్లొ అగ్నికి ఆహుతి చేసే అన్నం 'మేఘం' అవుతుంది. అన్నమే మేఘం. సూర్యుడు తన కిరణాలచే భూమిమీదున్న నీటిని స్వీకరించి ఔషధులను, అన్నాన్ని సృష్టిస్తున్నాడు. ఆ అన్నంతోనే ప్రాణులన్నీ జీవిస్తున్నాయి. శరీరం బలాన్ని సంపాదిస్తుంది. ఆ బలంతోనే తపస్సు చేయగలుగుతున్నారు.

పరిశుద్ధమైన , ఏకాగ్రమైన మనస్సుగలవారికి తపస్సు సత్ఫలితాలనిస్తుంది. ముందు మేధస్సు, తర్వాత శాంతి, జ్ఞానం, విజ్ఞానం, ఆనందం, పరమానందం లభిస్తాయి.

కాబట్టే ఇన్నింటినీ సమకూర్చే అన్నదానం వల్ల సర్వ వస్తువులనూ దానం చేసిన ఫలితం వస్తుంది.

No comments:

Post a Comment

శివాభిషేకము

 1.గరిక నీటితో శివాభిషేకము చేసిన నష్టమైన ద్రవ్యము తిరిగి పొందగలడు.  2 .నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించ గలదు.  3 .ఆవు పాల అభిషేకం...