Tuesday, October 6, 2020

జమ్మిచెట్టుకి ఎందుకంత ప్రాధాన్యత?

దసరా సంబరాలు చివరిరోజుకి చేరుకోగానే అందరికీ గుర్తుకువచ్చేది జమ్మిచెట్టు. దసరా సాయంత్రం వేళ జమ్మికొట్టి, ఆ చెట్టు ఆకులను బంగారంగా భావిస్తూ పెద్దల చేతిలో పెట్టి ఆశీస్సులు తీసుకుంటారు. చెట్లని దైవంగా పూజించి కొలుచుకోవడం హైందవ సంస్కృతిలో తరచూ కనిపించేదే! కానీ ఈ దసరా రోజుకీ జమ్మి చెట్టుకీ మధ్య అనుబంధం ఏమిటి అన్న ప్రశ్నకు చాలా సమాధానాలే కనిపిస్తాయి.

కాస్త జమ్మి గురించి...

జమ్మి భారతీయులకు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే ఈ వృక్షం ఉద్భవించిందన్నది శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకనే రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు. మనం పురాణాలలోనూ, వేదాలలోనూ తరచూ వినే ‘అరణి’ని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది. అందుకే ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ మొదలుకొని వర్షపాతం తక్కువగా ఉండే తెలంగాణ వరకు పొడి ప్రాంతాలలోని ప్రజలకు జమ్మి జీవనాధారంగా నిలుస్తోంది.

పట్నం వాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాలవారికీ జమ్మి అంటే ప్రాణం. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి; దీని వేళ్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి; ఈ చెట్టులోని ప్రతిభాగాన్నీ నాటువైద్యంలో ఔషధాలుగా వాడతారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం. అందుకే వినాయక చవినినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమీపత్రాన్ని కూడా చేర్చారు.

దసరా- జమ్మిచెట్టు

ఏడాదిపాటు అజ్ఞానవాసానికి బయల్దేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమినాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి, తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులకు అపరాజితా దేవి ఆశీస్సులు ఉండబట్టే, వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు. కేవలం పాండవులే కాదు, రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనది చెబుతారు (రామస్య ప్రియదర్శనీ). పైగా జమ్మిచెట్టుని స్త్రీస్వరూపంగా (శక్తిగా) భావిస్తారు. ఆ శక్తి అనుగ్రహం కూడా రాములవారికి లభించబట్టే, ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలుపొందారట.

జమ్మి చెట్టుకి మన పురాణాలలోనూ, జీవితాలలోనూ ఇంతటి సంబంధం ఉండబట్టే దసరానాడున జమ్మిచెట్టుకి పూజలు చేస్తారు. శమీవృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఈ క్రింది శ్లోకాలను చదువకుంటారు-

‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,

అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.’’

‘’శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,

ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ,

కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,

తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''

జమ్మి బంగారం

పూజ ముగిసిన తరువాత జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్నా ఆధ్మాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పైగా కుబేరుడు ఒకనాడు రఘమహారాజుకి భయపడి జమ్మిచెట్లున్న తావున బంగారాన్ని కురిపించాడనే గాథ ఎలాగూ ప్రచారంలో ఉంది. అలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి, జమ్మి కొట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే. పిల్లల మనసులోని ఈ విజయకాంక్షను గ్రహించిన పెద్దలు, వారి మనోకామన నెరవేరాలని తమ దీవెనలను కూడా జతచేస్తారు.

పాలపిట్ట

దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా, వారికి పాలపిట్ట కనిపించిందనీ... అప్పటి నుంచీ వారికి సకల విజయాలూ సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకనే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ బయల్దేరింది.

కొసమెరుపు

జమ్మిచెట్టుకి ఉన్న ప్రాముఖ్యతను గుర్తిస్తూ ‘యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్’ (UAE) భూసారాన్ని పెంచేందుకు ప్రతి ఇంట్లోనూ ఒక జమ్మిచెట్టుని నాటమని సూచిస్తోంది. కానీ మనదగ్గర మాత్రం ఉన్న కాసిని జమ్మి చెట్లూ నాశనం అయిపోతున్నాయి. ఇప్పటి పిల్లలైతే జమ్మి చెట్టుని గుర్తిస్తారో లేదో కూడా అనుమానమే! ఇక పాలపిట్ట సంగతి చెప్పనే అక్కర్లేదు. విజయదశమినాడు పంజరాల్లో పాలపిట్టలను తీసుకుని వచ్చి దర్శనం చేయిస్తున్నారంటే... ఇవి అంతరించిపోయేందుకు ఎంతటి సమీపంలో ఉన్నాయో తెలిసిపోతుంది. జమ్మిచెట్టు, పాలపిట్ట తిరిగి మన జీవితాలలో భాగమైనప్పుడే అసలైన విజయదశమి!

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...