కూపస్తటాక ముద్యానం!
మండపం చ ప్రపా తథా!
జలదానమన్నదానం!
అశ్వత్థారోపణం తథా!
పుత్రశ్చేతి చ సంతానం!
సప్త వేదవిదో విదు!
స్కాంద పురాణంలోని పైన చెప్పిన శ్లోకంలో సప్తసంతానం అంటే ఏమిటో వివరంగా ఉంది.
1. కూపం. ప్రతి ఊరికీ ఊరుమ్మడి బావి ఉండాలి. అవి తాగునీటి అవసరాన్ని తీరుస్తాయి. ఆ బావిలో నీటిని వాడుకునే హక్కు అందరికీ సమానంగా ఉండాలి. కాబట్టి బావి మొదటి సంతానం
2. తటాకం: ప్రతి ఊళ్ళోనూ చెరువు ఉండాలి. అవి కేవలం పశుపక్ష్యాదుల అవసరాలకోసం, అలాగే సాగు కోసం ఉపయోగపడేవిగా ఉండాలి. చెరువుని రెండో సంతానం అన్నారందుకే!
3. ఉద్యానం: ప్రతి ఊళ్ళొనూ కనీసం ఒకటైనా పార్కిఉ ఉండాలి. వాహ్యాళి కోసం మాత్రమే కాదు, పచ్చదనం కోసం కూడా ఉద్యానం కావాలి. దానిని మూడో సంతానంగా చెప్పారు.
4. మండపం: ప్రతి ఊరికీ ఒక మండపం ఉండాలి. అంటే టౌన్ హాలు లాంటిదన్నమాట. పెళ్ళిళ్లనుండి తద్దినాలవరకూ ఊళ్ళో మండపం అవసరం ఉంది. ఊరుమ్మడి అంశాల చర్చలక్కూడా ఒక సభామండపం కావాలి కద! అందుకని మండపాన్ని నాలుగో సంతానంగా చెప్పారు.
5. జలదాన మన్నదానం: చలివేంద్రాల్లో దాహార్తితో పాటు మజ్జిగ కలిసిన రాగి జావ గానీ, అంబకళం అంటే మజ్జిగ కలిసిన జొన్న జావ గానీ కుండలో పోసి ఉంచాలి. అన్నార్తిని కూడా అవి తీర్చేవిగా ఉండాలి. అలాంటి చలివేంద్రాన్ని ఐదో సంతానం అన్నారు.
6. అశ్వత్థారోపణం: అంటే రావి చెట్టును మొలకెత్తించటం, ప్రతి ఊళ్ళొనూ ఒకటైనా రావి, తెల్లమద్ది, మర్రి, వేప, చింత లాంటి మహా వృక్షం ఊళ్ళో ఉండాలి. చెట్టుని ఆరవ పుత్రుడు అంటుందీ శ్లోకం.
7. పుత్రుడు: ఏడవ సంతానంగా పుత్రుణ్ణి పేర్కొందీ శ్లోకం. నిజమైన పుత్రుడు ఆఖర్న వచ్చాడు. నుయ్యి, చెరువు మొక్క వగైరా నిజపుత్రుడికన్నా ఎక్కువ పుత్రసమానం అని దీని బావం
ఏడుగురు కొడుకులూ సమృద్ధిగా ఊళ్ళో ఉంటే ఏ వూరైనా రాజధానికన్నా గొప్పదే!
చెరువులు పూడ్చి, మొక్కలు నరికి, పార్కులు ఆక్రమించి, చలివేంద్రాలను బూటకం చేసి, ఊరుమ్మడి సభామందిరాలను కూలగొట్టి, ఖరీదైన భవనాలు కట్టే విధంగా ఎవరు పాలించినా ఏడుగురు బిడ్డల తండ్రి కాలేడని దీని భావం.
రాజు సంతాన వంతుడు కావాలి, ఎంత సంతాన వంతుడైతే అంత గొప్పగా పాలించినట్టు... అని అర్ధం చేసుకోవాలి.
ఈ ఏడుగురు కొడుకుల్లో ఏ బిడ్డ ఏడ్చినా లోపం తండ్రిదే!
No comments:
Post a Comment