ఈరోజు మంచిమాట మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడి వుంటాయి. అవి...
1. అర్ధ దోషం
2. నిమిత్త దోషం
3. స్ధాన దోషం
4. గుణ దోషం
5. సంస్కార దోషం
ఈ ఐదు దోషాలను గుర్తించి ఆహారం స్వీకరించాలి. లేకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని మన పెద్దలు చెపుతూ ఉంటారు.
అర్ధ దోషం
ఒక సాధువు తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు తన శిష్యునికి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ధనంతో ఉన్న మూటను ఇవ్వడం చూసాడు. భోజనానంతరం సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు. ఆ గదిలోనే శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది. ఆ మూటలో నుండి కొంత డబ్బు తీసుకుని తన సంచిలో దాచేశాడు. తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడు ఆ సాధువు. తన శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకు ఆ దుర్బుధ్ధి కలిగిందని, రాత్రి ఆహారం జీర్ణమయి ప్రొద్దునే మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు. వెంటనే తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. శిష్యుడు తలవంచుకొని "నన్ను క్షమించండి స్వామి! ఇది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు" అన్నాడు.
ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో తయారు చేసిన ఆహారం భుజించడమే "అర్ధదోషం". మనం న్యాయంగా సంపాదించినదానితోనే ఆహారం తయారు చేసుకుని భుజించడం ఉత్తమం.
నిమిత్త దోషం
మనం తినే ఆహారాన్ని వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి సత్యశీలత కలిగి దయ, ప్రేమ వంటి మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.
వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాకకూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు వంటివి పడకూడదు.
అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైనవారి చేతివంట భుజిస్తే వారి దుష్ట గుణాలు భుజించిన వారికి కూడా కలుగుతాయి.
భీష్ముడు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో కొట్టబడి యుధ్ధం ముగిసే వరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది, శ్రీకృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి విషయాలను బోధిస్తున్నాడు. అప్పుడు ద్రౌపదికి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేకపోయాడు? అని అనుకొన్నది.
ఆమె ఆలోచనలను గ్రహించిన భీష్ముడు అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వున్నాను. నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులుగా ఆహారం తీసుకోనందున, పాత రక్తం బిందువులుగా బయటికిపోయి నేను ఇప్పుడు పవిత్రుడినైనాను. నా బుద్ధి వికసించి మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు.
చెడ్డ గుణములు వున్నవారు ఇచ్చినది తినినందువలన మనిషిలోని మంచి గుణములు నశించి "నిమిత్త దోషం" ఏర్పడుతుంది.
స్ధాన దోషం
ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంటచేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంట కూడా పాడైపోతుంది. యుద్ధరంగం, కోర్టులు, రచ్చబండలు వున్న ప్రదేశాల్లో వండిన వంటలు అంత మంచివి కావు.
దుర్యోధనుడు ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీకృష్ణుని విందు భోజనానికి పిలిచాడు. కానీ కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది. తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి, ఆనంద సంభ్రమాలతో తొందరపాటుపడి అరటిపండు తొక్కవలిచి పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే తీసుకొని ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్య వైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, విదురా! నేను ఆప్యాయతతో కూడిన ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధాభక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను అని అన్నాడు. మనం ఆహారం వడ్డించినప్పుడు కూడా ప్రేమతో వడ్డించాలి.
గుణ దోషం
మనం వండే ఆహారం సాత్వికమైనదిగా వుండాలి. సాత్విక ఆహారం ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని లౌకిక మాయలో పడేసి స్వార్ధాన్ని పెంచుతుంది.
సంస్కార దోషం
ఆహారం వండేవారి సంస్కారాన్నిబట్టి దోషం ఏర్పడుతుంది. సంస్కారవంతుల చేతివంట ఆరోగ్యాన్ని ఇస్తే, సంస్కారహీనుల చేతివంట లేని రోగాన్ని తెచ్చిపెడుతుంది.
No comments:
Post a Comment