శ్రీహరి యోగనిద్రా ముద్రితుడై ఉండగా, ఒకనాడు అతని రెండు చెవుల నుండి ఇద్దరు రాక్షసులు జన్మించారు. వారే మధుకైటభులు. వారిద్దరూ కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమేశ్వరిని ప్రసన్నం చేసుకున్నారు. తమకు మరణం లేని జీవితాన్ని వరంగా ఇమ్మని దేవిని ప్రార్థించారు. 'పుట్టినవానికి మరణం తప్పద'ని, 'కనుక ఆ వరం ఇవ్వడం అసాధ్యమ'ని జగన్మాత చెప్పింది. "అలా అయితే, మేము ఎపుడు మరణించాలని కోరుకుంటామో, అపుడే మాకు మరణం వచ్చేట్లుగా వరమిమ్మ'ని వారు 'అమ్మ'ను ప్రార్థించారు. అమ్మ 'తథాస్తు' అని దీవించి అంతర్థానం అయింది.
'స్వచ్ఛంద మరణం' అనే వరం పొంది యుక్తితో విజయం సాధించామని, తమకు మరణం కావాలని తామే కోరుకోవడం అసంభవం కనుక, తాము మృత్యువును జయించినట్లే అని విఱ్ఱవీగి, మధుకైటభులు విజృంభించ సాగారు. అన్ని లోకాలపై దండయాత్రలు చేస్తూ, వీరవిహారం ప్రారంభించారు. సజ్జనులను బాధిస్తూ, లోకకంటకులై ప్రవర్తించారు.
ఒకనాడు మదుకైటభులు బ్రహ్మపై దండెత్తారు. ప్రళయకాలంలో అంతా జలమయం కాగా, మహావిష్ణువు నాభికమలం నుండి ఆవిర్భవించిన బ్రహ్మను సమీపించి, వరగర్వంతో మధుకైటభులు "బ్రహ్మదేవా! చేతనైతే మాతో యుద్ధం చేయ్యి, లేకపోతే, నీ ఓటమిని అంగీకరించి, మాకు లొంగిపో, ఈ పద్మాన్ని విడచి పారిపో" అని హెచ్చరించారు.
వారితో పోరాడలేని బ్రహ్మ, పద్మనాళంలో దూరి, ఐదువేల సంవత్సరాలు ప్రయాణం చేసి, విష్ణువును చేరుకున్నాడు. యోగనిద్రలో ఉన్న శ్రీమహవిష్ణువును చూచి. నిద్రాదేవిని పరిపరి విధాల ప్రార్థించాడు. విష్ణువునకు మెలకువ వచ్చింది. కన్నులు తెరచిన విష్ణువు సంగతి తెలుసుకునే లోగానే మధుకైటభులు బ్రహ్మను వెంబడిస్తూ అక్కడికి వచ్చారు.
"మీరిద్దరూ మాతో యుద్ధం చేయండి!" అని బ్రహ్మ, విష్ణువులను వత్తిడి చేయసాగారు.
విష్ణువు మధుకైటభులతో యుద్ధానికి తలపడ్డాడు. ఆ ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు ఆలసట తీర్చుకుంటూ వంతులు వారీగా యుద్ధం చేయ సాగారు. ఎన్నాళ్ళు యుద్ధం జరిగినా, విష్ణువు ఆ రాక్షసులను జయించలేక పోయాడు. పైగా తానే అలసిపోవడం గమనించి, వారు సామాన్యులు కారని, తనతో ఇంతకాలం యుద్ధం చేసి చావకుండా బ్రతికినవారు వరప్రభాల గర్వితులని గ్రహించాడు. జగన్మాతను ప్రార్థించాడు. "తల్లీ! సృష్టిస్థితి లయకారిణీ !నీమహిమను గుర్తించలేక, ఈ రాక్షసులను నేనే సంహరింప గలనుకున్నాను. నీఅనుగ్రహం వల్లనే అది సాధ్యమని ఇపుడు తెలుసుకున్నాను. వారిని వధించే ఉపాయం చెప్పి, నన్ను అనుగ్రహించు" అని చేతులు జోడించాడు.
జగన్మాత ప్రత్యక్షమై, "మహావిష్ణువు!ఈ రాక్షసులు నా వల్ల స్వచ్చంద మరణాన్ని వరంగా పొందారు, తమంతట తాము మరణిచాలని వారు కోరుకుంటేగాని, వారికి మరణంరాదు. కనుక,నీవు వారిని యుధ్దానికి ఆహ్వానించు.
"మీ పరాక్రమానికి మెచ్చాను. మీ కొక వరం ఇస్తాను. కోరుకోండి" అని వారిని అడుగు. ఆ తరువాత కథ నేను నడిపిస్తాను" అని అభయ మిచ్చింది.
జగన్మాత ఆదేశాన్ని శిరసా వహించి, శ్రీమహావిష్ణువు మధుకైటభులను
పిలిచి, 'వరం కోరుకో" మన్నాడు. 'వరగర్వంతో ఆ రాక్షసులు విష్ణువును హేళన చేశారు. "మాచేతిలో ఓటమిని పొందిన నువ్వు మాకు వరమిచ్చే దేమిటి?మేమే నీకోరిక వరాన్ని అనుగ్రహిస్తాం. కోరుకో" అని ప్రగల్భంగా పలికారు. " అలా అయితే, నాచేతిలో మీరిద్దరూ మరణించేట్లుగా వరమివ్వండి "ని విష్ణువు అడిగాడు.
అప్పుడు మధుకైటభులు తమ తొందరపాటుకు చింతించినా, 'సరే' అనక
తప్పలేదు. "అలాగే నీ చేతిలో మరిణిస్తాం. వరమిస్తున్నాం కాని, ఈ సముద్ర జలంపై యుద్ధం ఎలా సాగుతుంది? ఎక్కడైనా భూమిని చూపించు. భూమిపై యుద్ధంచేసి మమ్ములను సంహరించు' ' అన్నారు. ఈ వంకతో తప్పించు కుందామని వాళ్ళ దురాలోచన.
అపుడు విష్ణువు తన తొడను పెంచి, సముద్రజలంపై విస్తరింప చేసి, తన ఊరువునే భూమిగా చూపి, మధుకైటభులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు.
మధుకైటభుల శరీరాలలోని మేదస్సు ఆ ప్రదేశమంతా వ్యాపించడం వల్ల "మేదిని" అని, విష్ణువు ఊరుభాగం చేత పరివ్యాప్తమైనందువల్ల "ఉర్వి" అని భూమికి పేర్లు వచ్చాయి. రాక్షసుల రక్తమాంసాదులతో నిండినందువల్ల భూమికి ఆనాటి నుండి "అభక్ష్య" అనే పేరు కూడా వచ్చింది.
జగన్మాత అనుగ్రహంతో స్వచ్ఛంద మరణం వరంగా పొంది కూడా, సత్ర్పవర్తన లేక, వరబల గర్వితులై దురాగతాలు చేసి లోకకంటకులైన మధుకైటభులు అహంకారముతో విఱ్ఱవీగి, తమ మరణాన్ని తామే కోరితెచ్చుకున్న వారయ్యారు.
శ్రీమహావిష్ణువు కూడ మొదట- తానే ఆరాక్షసులను సంహరించ గలనని భావించి, విఫలుడై , తరువాత పరాశక్తి ప్రభావాన్ని గుర్తించి, ఆమె అనుగ్రహంతో కృతార్థుడు కాగలిగాడు.
సర్వజగద్రక్షుకుడైన విష్ణువునకు కూడా అలసట కలగడం, ఆ ఇద్దరు రాక్షసులనూ వధించ లేకపోవడం జగన్మాత మాయా విలాసం తప్ప వేఱు కాదని వివరిస్తూ, సూతుడుశౌనకాది మునులకు ఈ వృత్తాంతాన్ని వినిపించాడు.
మధుకైటభులను సంహరించినది మహావిష్ణువే అయినా సంహరింప చేసినది దేవియే కనుక, ఆ జగన్మాతకు "మధుకైటభమర్దని" అనే పేరు వచ్చింది.
No comments:
Post a Comment