నేటి సాంకేతిక శాస్త్రం నిరూపించిన విషయం ఒకసారి అవలోకన చేసుకుందాము. మనకు వర్షం ఎలా పడుతుంది అంటే చిన్నపిల్లవాడు కూడా చెబుతాడు, నదుల్లో, తటాకాలలో, సముద్రాలలో ఉన్న నీరు సూర్యుని ప్రతాపానికి ఆవిరిగా మారి సాంద్రతలో తేడా వలన ఆకాశానికి చేరి మేఘంలా మారి అడ్డుగా ఉన్న కొండల వలన, వాతావరణం వలన నేలపై తిరిగి వర్షంగా అదే నీరు వస్తుంది. ఆ నీరు ఎక్కడ గ్రహింపబడినదో అక్కడే కురవాలన్న కట్టుబడి లేదు. మురికి కాలువలో ఉన్న నీరు కూడా ఆవిరిగా మారి వర్షం పడేటప్పుడు తన మురికిని పోగొట్టుకుని మరల మంచి నీటిగా వర్షిస్తుంది. అదే వాతావరణంలో ఆమ్ల సారాలు ఉంటె ఆమ్లవర్షాలు, ఇతర రకాలుగా పడుతుంది.
మన వాంగ్మయం ఇంచు మించు ఇదే రీతిలో మన పునర్జన్మను వివరిస్తుంది. కాలమనే సూర్యుడు కిందనున్న జీవుల ఆత్మలను ఆ శరీరాల నుండి విడి చేసి ఇతర లోకాలకు పయనింపచేస్తుంది. ఈ జీవుడు చేసుకున్న పాప పుణ్యాల ఫలితంగా యాతనా శరీరం ద్వారా స్వర్గ నరకాలలో సుఖ దుఃఖాలు అనుభవించి వారి కర్మఫలా విశేషం వలన చంద్రుని ఆశ్రయించి మొక్కలు ఇతర ఫలపుష్పాల ద్వారా బీజరూపంలో ఆహారంగా మారి, జీవులు తిన్న ఆ తిండి వలన వీర్యంగా మారి ఆయా జీవుల శరీరం నుండి పునః ఉద్భవిస్తాయి.
గరుడపురాణం, విష్ణుపురాణం ఇత్యాది పురాణాలు ఈ విషయం కూలంకషంగా చర్చించాయి. ముందుగా మనం మాట్లాడుకుంటున్నది జీవాత్మ గురించి. జీవుని విగత శరీరం నుండి జీవాత్మ బయటకు వస్తుంది. ఊర్ధ్వ రంధ్రాల నుండి బయల్వడిన జీవాత్మ ఊర్ద్వ లోకాలకు, అధో రంధ్రాల నుండి విడువడిన ఆత్మ ప్రయాణం అధో లోకాలకు. శరీరానికి కర్మ కాండ జరిగిన పద్ధతి ప్రకారం పదకొండో రోజు సపిండీకరణ ద్వారా అతడికి యాతనా శరీరం ఇవ్వబడుతుంది. ఆ యాతనా శరీరంతో ఆ జీవాత్మ తనకు నిర్దేశించబడిన లోకాలకు ప్రయాణం చేస్తుంది.
ప్రతి మాసికంలో ఇచ్చే తిలధాన్యాలతో బలం పుంజుకుని ప్రయాణం సాగిస్తుంది. సంవత్సర కాలంలో యాత్ర పూర్తి చేసుకుంటుంది. ఈ కాలం అంతా కూడా తన వారితో అనుబంధం వదులుకోలేక వారు పెట్టె పిండాలు స్వీకరిస్తూ వెళ్తూవుంటుంది. యమధర్మరాజు వేసే శిక్షలను అనుభవించేది ఈ యాతనా శరీరమే. శరీర భ్రాంతితో వున్నది కనుక జీవాత్మ అది తానే అనుభవిస్తున్నట్టు భావిస్తుంది. అతడి పాప పుణ్యాల ఖాతా ప్రకారం ఆ యాతన శరీరానికి ఆ శిక్షలు లేదా స్వర్గ భోగాలు లభిస్తాయి. ఒక్కసారి స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరినాక వారికి ఒక రోజు వ్యవధి మనకు సంవత్సర కాలము. వారు పోయిన తిధి నాడు వారికి తద్దినం పెట్టి తర్పణాలు వదులుతాము. అది వారికి భోజనము.
అలా ఎవరైతే పిత్రు దేవతలను సంతోష పెడతారో వారిని తృప్తిగా ఆశీర్వదిస్తారు. వారు దేవతల కన్నా మనకు కావలసిన వారు. పితృదేవతలను క్షోభ పెట్టిన వారు వారి ఆగ్రహానికి గురయ్యి బాధలు అనుభవిస్తారు. కొన్ని పర్వదినాలలో వారికి తర్పణాలు వదిలే పద్ధతి మన సాంప్రదాయంలో వుంది. అది వారికి తేనీరు లా/ స్నాక్స్ లా అందే అవకాశం అన్నమాట. ఇక్కడ మనం పెట్టె పిండాలు వారికి ఎలా భోజనాలు అవుతాయి అంటే మనం ఇక్కడ ఆన్ లైన్ లో పంపిన డబ్బు వేరొక దేశంలో వారి కరెంసీలో వారికి అందడం లాంటిది. బ్రహ్మ కపాలం దగ్గర పెట్టిన పిండం ఆ తండ్రికి బ్యాంకు లో ఫిక్సెడ్ డిపాజిట్ లాంటిది. దాని మీద వచ్చే వడ్డీ తో ఆ పితరుల జీవనం గడుస్తుంది అన్నమాట. కానీ అక్కడ పిండం పెట్టినా కూడా సంవత్సరీక శ్రాద్ధం తప్పనిసరి. వారిని ఎంత తృప్తి పరచితే మనకు అంత సౌభాగ్యము, రక్షణ.
ఇలా ఊర్ధ్వలోకాలకు చేరిన పితృదేవతలు పిత్రులోకంలో వసురూపంలో మసలుతారు. తమ పితృదేవతలంటే కేవలం గతించిన మన తల్లిదండ్రుల మాత్రమె కాదు. మూడు తరాల వారి రూపం అక్కడ ఉంటారని చెబుతుంది శాస్త్రం. తండ్రి వసు రూపంలో, తాత గారు రుద్ర, ముత్తాత గారు ఆదిత్యరూపంలో ఉంటారని వారి అందరినీ త్రుప్తి పరచవలసిన బాధ్యతనే మనము పితృఋణం అంటాము. అలాగే ఇటువంటి ప్రక్రియ నిత్యం జరిగేట్టు నువ్వు వారసులను కనాలి, అప్పుడే ఇది నిరాటంకంగా సాగుతుంది. వారందరికీ శాంతి కలిగేట్టు మనం చేసే పిండ ప్రదానం వారిని ఆనంద పరచి మనకు తిరిగి ఆశీర్వాద రూపంలో తిరిగి వస్తుంది. వారు అప్పటికే మరొక జన్మ తీసుకున్నట్టు అయితే వారికి ఆ సమయానికి అదృష్టంగా అందుతుంది. ఒకొక్కసారి మనకు ఒక లాటరీ తగలవచ్చు, లేదా పెద్ద కష్టాలలో ఉన్నప్పుడు ఒక మంచి అదృష్టం ఏదో కలిసి రావచ్చును. అంటే మన పూర్వజన్మలో మన వంశం వారు మనలను ఉద్దేశించి శ్రాద్ధ దానాదులు చేసారని అర్ధం. నువ్వు పుచ్చుకోవడమే కాదు నీకు కూడా ఆ బదులు తీర్చుకోవలసిన విధి ఉన్నది. అందుకు నువ్వు కూడా శ్రాద్ధం, తర్పణం తప్పక వదలాలి. ఇది ధర్మశాస్త్రం నీ మంచి కోసం చెబుతున్నది. నమ్మిక ప్రధానం. నమ్మి చేస్తే తప్పక నీకు పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది.
పితృదేవతలను సంతృప్తి పరచే విధానం మనకు శాస్త్రం బోధించి వుంది. తిలలతో వారిని ఆహ్వానించి తిలతర్పణం తిలలతో కలిసిన పిండి కానీ అన్నం గానీ ఉదకంతో వారికి ఇవ్వాలి. తిలలే ఎందుకు అంటే.. వారికి అందే మధ్యస్థం అది. మనం అమెరికాలో ఉన్న ఒక స్నేహితునికి డబ్బు పంపాలంటే ఇక్కడున్న డబ్బుని మారకం ద్వారా ఆన్ లైన్ లో ఎలా పంపితే వారికి చేరుతుందో ఇప్పటి సాంకేతికత చెప్పినట్టు ఇది సనాతన సాంప్రదాయం. తిలలతో స్వధాకారంతో ఇచ్చిన శ్రాద్ధతర్పణాలు వారికి అందుతాయి. ఎలా అయితే స్వాహాకారంతో ఇచ్చిన హవనం అగ్నిదేవుడు ఒక పోస్ట్ మాస్టర్ లా తీసుకువెళ్లి ఆ ఉపాస్య దేవతలకు అందచేస్తాడో, స్వధాకారంతో చేసిన తర్పణం పితృదేవతలకు అందుతుంది.
ఒకసారి శంతన మహారాజుకు భీష్ముడు పిండ ప్రదానం చెయ్యబోతే శంతన మహారాజు స్వయంగా నీటి నుండి చెయ్యు చాపగా పరమధార్మికుడైన భీష్ముడు శాస్త్రం ఈ విధంగా చెప్పలేదని నీటిలోనే వదిలి ఆయనకు అందేలా చేస్తాడు. శాస్త్రం చెప్పిన విధంగా వదిలిన తర్పణాలు, పిండాలు పితృదేవతలు కర్మభూమి అయిన మన దేశంలో మాత్రమె గ్రహింపగలిగే శక్తి పితృదేవతలకు ఇచ్చాడు. భోగభూముల్లో చేసిన తర్పణాధులు వారు స్వీకరించలేరు. ఏమి కర్మ భూమి మాత్రమె ఎందుకు అంటే ఈ లోకానికి ఉదరం లాంటిది ఈ కర్మ భూమి. ఇక్కడ చేసిన కర్మలు మాత్రమె వారికి చేరుతాయి.
ఆపస్థంభ గృహ్యసూత్రములలో ఆచారకాండలో ఐదు రకాల శ్రాద్ధకాండ వున్నవి...
1) సాపిండీ (పిండ ప్రదానం),
2) సంకల్ప (ఇద్దరు బ్రాహ్మణులకు సంకల్ప పూర్వకంగా పెట్టేది),
3) బ్రాహ్మణ భోజనం (ఒక బ్రాహ్మణునికి తర్పణం సకల్ప సహితంగా),
4) ఉపాదాన (స్వయంపాకం),
5) అశ్రుతశ్రాద్దేషు (చెయ్యలేకపోతున్నా తండ్రీ అని అశ్రువులతో చెప్పుకోవడం) "పంచశ్రద్ధా: ప్రకీర్తితా“.
ఒకదాన్ని కంటే ఒకటి ఒకొక్క మెట్టు తక్కువది. మూడులోకాలలో ఎక్కడున్నా చేరేట్టు ఒక పిండం నీటిలో జలచరా రూపంలో స్వీకరించే విధంగా, అగ్ని రూపం లో స్వధాకారం తో, ఆవుకు ఆహారంగా పెట్టి అందేట్టు మనం శ్రాద్ధ పిండాన్ని పెడతాము. అలాగే వసు, రుద్ర, ఆదిత్య రూపాలలో ఆవాహన చేసిన బ్రాహ్మణులను త్రుప్తాస్థ అని వారికి తృప్తి కలిగేలా శ్రద్ధగా భోజనం పెట్టి వారిని సంతోషపెట్టడం ద్వారా మన పితృదేవతలను ఆనందపెట్టినవారం అవుతాము. ఇక్కడ మనం డి డి తీసి చెప్పిన విధానం పాటిస్తే యెక్కడో ఉన్న మనవారికి డబ్బు నగదు చేరినట్టు ఇక్కడ మనం చేసిన శ్రాద్ధం వారికి ఆహారంలా అంది వారు ఆనందపడి మరల నిన్ను దీవించి నీ కోసం దేవతలతో కూడా పోరాడి నీకోసం మంచి చేస్తారు మన పితృదేవతలు. శ్రాద్ధం తర్పణం ఎవరికోసమో కాదు చేసుకునేది, నీ కోసం నువ్వు చేసుకోవడమే.
ఈ ఋణం తప్పక తీర్చుకోవాలి లేదంటే అటువంటి వారి జీవితం వ్యర్ధం...
|| ఓం నమః శివాయ ||
No comments:
Post a Comment