Sunday, October 28, 2018

పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం

పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం... పూర్వ జన్మలో మనం చేసిన పాపం, రోగం రూపములో అనుభవములోనికి వస్తుంది, అని శాస్త్ర వచనము. పూర్వ జన్మలో మనము చేసిన పాప పుణ్యములను బట్టి, మన జన్మ వుంటుంది. మన జాతక చక్రం తదనుగుణంగా తయారు అవుతుంది. మన కర్మే, గ్రహాల రూపములో వచ్చి, మనల్ని బాధ పెట్టడమో, లేదా సుఖ పెట్టడమో, జరుగుతుంది. అనవసరంగా గ్రహాలను తిట్టుకొంటాము మనము.
ఆ గ్రహాలు కూడా ఎదో మనిషి రూపములోనో, లేదా రోగాల రూపం లోనో వచ్చి, మనల్ని బాధ పెడుతుంటాయి.

శ్లో|| నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి, అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ ||

అనగా అనుభవించనిచో, కర్మ ఫలము, కోటి బ్రహ్మ కల్పములు గడిచిననూ, నశింపదు. అది శుభమైననూ, అశుభమైననూ, దాని ఫలమును, మనము తప్పక అనుభవింపవలసినదే, అని అర్ధము.

అందుకని పరమాత్ముడి కైననూ తిప్పలు తప్పవు అని అనడంలో అర్ధం ఏమిటంటే, ఎంతటి వాడికైనా, జన్మ తీసుకొంటే, కర్మ అనుభవించ వలసినదే అని అర్ధము.

తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమే.

ప్రాయశ్చిత్తై రపైత్యేనః....... ప్రాయశ్చిత్తముతో పాపములు తొలగి పోవును.

పశ్చాతాపంతో కూడిన ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం చేసుకొంటే, తప్పక పాపం పోవును, అని శాస్త్రం చెప్పినది. పరాశర స్మృతి చెప్పినది.

శ్లో|| ప్రాయో నామ తపః ప్రోక్తం చిత్తం నిశ్చయ ఉచ్యతే, తపోనిశ్చయ సంయుక్తం ప్రాయశ్చిత్తం తదుచ్యతే.||

ప్రాయాస్ అనగా తపస్సు. చిత్తము అనగా నిశ్చయము. నిశ్చయముతో కూడిన తపస్సు చేయడమే ప్రాయశ్చిత్తం అని అన్నారు.

ప్రతి దానికి, ప్రతి మంత్రానికి, ప్రతి కార్యానికి, ప్రతి తప్పుకు శాస్త్రములో ప్రాయశ్చిత్తం చెప్పబడి వున్నది. అది తెలుసుకొనీ, గురువులను అడిగి, లేదా మీ ఇంటి పురోహితుడ్ని అడిగి వెంటనే చెయ్యాలి.

ఎవరి పట్ల అయినా తప్పుగా ప్రవర్తించినావు, వెంటనే “అయ్యా, పొరబాటు అయినది, నన్ను క్షమించండి అని అడుగు.

క్షమించమని అడగ కుండా నేను ప్రాయశ్చిత్తం చేసుకొంటాను, అంటే కుదరదు. పాపం పోదు. ఎవరి పట్ల మనము అగౌరవముగా ప్రవర్తించినామో, వారిని క్షమాపణలు అడిగి తీరాలి. అప్పుడే మనము చేసిన పాపం పోతుంది.

ఒక వేళ క్షమాపణలు అడగ లేని పరిస్థితి, ఆ వ్యక్తి కనిపించలేదు, లేదా ఏదన్నా ప్రాణిని తెలిసో, తెలియకో హింస పెట్టినావు, లేదా చూసుకోకుండా చంపినావు, అప్పుడు మాత్రమే మీ గురువులను అడిగి ప్రాయశ్చిత్తం తెలుసుకొని చేయాలి.

పశ్చాతాపంతో కూడిన ప్రాయశ్చిత్తం గాని, లేక క్షమాపణలు గాని ఎటువంటి పాపము నైననూ కడిగి వేస్తుంది.

సులభమైనది మనస్పూర్తిగా క్షమాపణలు అడగడం.
గురువులు, పెద్దలు లేనప్పుడు, వీలు కానప్పుడు నీకై నీవు ప్రాయశ్చిత్తం విధించుకోవచ్చును.

నీ సుఖాన్ని నీవు త్యాగం చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. ఒక రోజు భోజనం మానేయడం, పది రోజులు ఉపవాసం వుండడం, లేదా మౌన వ్రతాన్ని పాటించడం, నేలపై పరుండడం, ఇలా....

దోషములు పోగొట్టుకొనుటకు ప్రాయశ్చిత్తములున్నవి, అంతే గాని దోషములు చేయుటకు కాదు.

ప్రాయశ్చిత్తం చెప్పబడినది కదా అని పాపములు చేయకూడదు. దానికి నిష్కృతి లేదు. అలాగే పశ్చాతాపం లేకుండా ప్రాయశ్చిత్తం చేసుకున్నా, అది కూడా వ్యర్ధమే. పాపము పోదు.

శ్లో|| ప్రాయశ్చిత్త మకుర్వాణాః పాపేషు నిరతా నరాః, అపశ్చాత్తాపినః కష్టాన్నరకాన్ యాంతి దారుణాన్ ||

పశ్చాతాపంను మించిన ప్రాయశ్చిత్తం లేదు అని పెద్దలు చెప్పుదురు. ఇది వీలుకాని పరిస్థితులలో మాత్రమే, చేయ వలెను. చేసిన తప్పుకు క్షమాపణలు అడగడమే ఉత్తమోత్తమo. దానిని మించినది లేదు.

ప్రాయశ్చిత్తము వలన దోష నిర్మూలన తప్పక జరుగును, అయితే బుద్ధి పూర్వకముగా చేసిన యెడల పాపము పోదు అని చెప్ప బడినది.

శ్లో|| కామాకామకృతం తేషాం మహాపాపం ద్విధాస్మృతమ్ ||

బుద్ధి పూర్వకముగా చేసినది, కోరక చేసినది అని పాపములు రెండు విధములు. తెలియక చేసిన పాపములు, తెలిసి కావాలని చేసిన పాపములు. తెలియక జేసిన పాపములు ప్రాయశ్చిత్తము వలన నిర్మూలనము అగును. కానీ పొగరుతో, తెలిసి తెలిసి కావాలని చేసిన పాపములు ప్రాయశ్చిత్తముతో పోవు అని తెలియవలెను.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...