Monday, October 15, 2018

ఏది స్వర్గం....? ఏది నరకం......?

ఒక శిష్యుడికి ఏది స్వర్గం? ఏది నరకం? అన్న విషయమై ఎప్పుడూ సందేహంగానే ఉండేది. తన సందేహం గురించి గురువుగారిని ఎప్పుడు అడిగినా కూడా ఆయన ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవారు. చివరికి ఓ రోజు ‘గురువుగారూ! మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే!’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు. దానికి గురువుగారు ‘సరే! నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తేలిపోతుంది’ అన్నారు.

శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు... ఇలా ఒకటీ రెండూ కాదు... మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం! ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకనేం! ఒక అయిదు అడుగుల గరిటె వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిటె కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతోంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటెను చేజిక్కించుకున్నా, దాంతో ఆహారాన్ని నోటి దాకా తెచ్చుకునేసరికి అందులోని పదార్థాలు నేలపాలై పోతున్నాయి.

 శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. అందులోనూ ఇదే పరిస్థితి. గది మధ్యలో పెద్ద బల్ల. ఆ బల్ల చుట్టూ అయిదేసి అడుగుల దూరంలో జనం. ఆ జనాలందరికీ ఒకటే గరిటె. కానీ వాళ్లంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. వారి ఆకలి తీరినట్లే ఉంది. గదిలో ఎలాంటి కొట్లాటలూ లేవు. ఎలాంటి హడావుడీ లేదు. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూసిన శిష్యుడికి, ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటెనీ ఒకరి తరువాత ఒకరు అందుకుంటున్నారు. దాంతో ఆహారాన్ని నింపుకుని అవతలివారికి పెడుతున్నారు. గరిటె తమదాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు.

తనకు కనిపించిన రెండు దృశ్యాలనూ తల్చుకుంటూ శిష్యుడు తన కళ్లని తెరిచాడు. కంటి ఎదురుగా గురువుగారు ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ‘ఇప్పుడు అర్థం అయ్యిందా స్వర్గానికీ, నరకానికీ ఉన్న తేడా ఏమిటో!’ అన్నారు గురువుగారు. శిష్యుడు తలవంచుకున్నాడు.


‘నీకు కనిపించిన రెండు దృశ్యాలలోనూ పరిస్థితి ఒక్కటే! కానీ ఒకదానిలో మనిషి తాను సుఖపడటం లేదు, ఎదుటివాడికీ అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఎంతసేపూ తన కడుపే నిండాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి నరకమే ఏర్పడుతుంది. మనిషి సంఘజీవి అని తెలుసుకుని, ఒకరికొకరు సాయపడినప్పుడు.... ఎదుటివాడి ఆకలీ తీరుతుంది, మన కడుపూ నిండుతుంది. స్వర్గం, నరకం ఎక్కడో కాదు... మన దృక్పథాలలోనే ఉన్నాయని ఇప్పటికైనా బోధపడిందా!’ అన్నారు గురువుగారు.

" లోకా సమస్తా🚩 సుఖినో భవంతు..!! "

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...