Saturday, October 20, 2018

గురుశబ్దం త్రిమూర్తితత్త్వం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||

గురుశబ్దం త్రిమూర్తితత్త్వం. సృష్టి, స్థితి, లయకారం, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. గురూ అనే శబ్దాన్ని విడదీస్తే ‘గ్ – ఉ – ర్ – ఉ’ అనే అక్షరాలు కనబడుతుంటాయి.వీటిలో ‘గ’ కారం సిద్ధకమైన బ్రహ్మకు, ‘ర’కారం పాపనాశకరమైన శివశాక్తికి సంకేతాలు. ఈ రెండూ పాలస్వభావం కలిగిన ‘విష్ణుశక్తి’తో కలిసినప్పుడే ‘గురు’ అనే పదం ఏర్పడి ‘గురు’తత్త్వం మూర్తీభవిస్తుంది. అందుకే గురువును మనం త్రిమూత్రిస్వరూపంగా భావిస్తూ పూజించుకుంటున్నాం.

‘గురి’ని కల్పించేవాడు గురువు. లక్ష్యసాధనామార్గాన్ని చూపేవాడే గురువు అని స్థూలార్థం. గురువు పరంపరాగత క్రమశిక్షణగలవాడైతే, శిష్యునకు ఉపదేశ మివ్వడానికి అర్హుడనీ, అతడే సద్గురువు అని భావించాలి. శిష్యుడు గురువును గురువుగా ఎన్నుకున్నంత మాత్రానికే, ఆయన వెంటనే గురువు కాజాలడు. ఆయన కూడా అతడిని శిష్యునిగా ఎన్నుకోవాలి. తన గురువును ఎన్నుకునే అధికారం శిష్యునికి ఉన్నట్లే, శిష్యుని ఎంపిక చేసుకునే అధికారం గురువుకు ఉంది. నిదానించి, పరిశీలించి శిష్యార్హతను నిర్ణయిస్తాడు గురువు.

గురువు నడుచుకోవలసిన ప్రవర్తనా నియమావళి అంటూ ఉంటుంది. కానీ, ఏదో ఒకనాడు ఆ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినట్టు కనబడితే, శిష్యులు తమ నిర్ణయాన్ని మార్చుకుని మరో గురువుకై అన్వేషిస్తారు. అటువంటివారు ఉభయభ్రష్టులవుతారు. కావున శిష్యులు తమ హృదయాలను నిష్కల్మషంగా ఉంచుకుని సహజమైన శాంతి, తృప్తి, సహనాన్ని కలిగి ఉండాలి. సత్త్వగుణ సంపన్నుడైన గురుస్థానం శివస్థానంగా ఎంచి తన హృదయాన్ని పరిపూర్ణంగా గురువుకి అంకితమివ్వాలి. అదే శిష్యుని నిజమైన గురుత్వం. అలాగే గురువు కూడ ‘గురుతత్త్వం’ కలిగి ఉండాలి. తనను పరిపూర్ణంగా విశ్వసించిన శిష్యునికి, తాను పరిపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించాలి. అటువంటివారే సద్గురువులుగా భావించబడతారు.

కొంతమంది, గురువులను మూడు విధాలుగా పేర్కొన్నారు.

1. జన్మదాత (తండ్రి), 2. విద్యాగురువు, 3. మోక్షగురువు.
1. ఉపదేశ గురువు, 2. కులగురువు, 3. జగద్గురువు.
1. మాతా, 2. పితా, 3. ఆచార్యుడు.

ఈ ముగ్గురు గురువులలో విద్య నేర్పే గురువు అధికుడు. జీవుని యాత్రలో గురుయాత్ర గొప్పది. విశ్వామిత్రుడు బాలకులైన రామలక్ష్మణులను వెంటబెట్టుకుని వెళ్ళి అనేక అస్త్రవిద్యలను నేర్పి, బల, అతిబల విద్యలలో వారిని ఆరితేరులను గావించి, వారి సాయంతో నిర్విఘ్నంగా యజ్ఞాన్ని పూర్తి చేసి, అడ్డుగా వచ్చిన తాటకి, మారీచ సుబాహులు హతమారునట్లు చేశాడు. అదొక వనయాత్ర, సాహసయాత్ర లేక విజ్ఞానయాత్ర లేక శుభయాత్ర అని అనవచ్చు.

ఇక జ్ఞానాన్ని అందించే గురువులు ఐదుగురు – 1. పంచసంస్కార ప్రదాత, 2. బ్రహ్మప్రదాత, 3. ప్రబంధ ప్రదాత, 4. బ్రహ్మార్థప్రదాత, 5. పంచమోప్రాయప్రదాత.

ఇక ఆరు విధాలైన గురువులు: 1. ప్రేరకుడు, 2. సూచకుడు, 3. వాచకుడు, 4. దర్శకుడు, 5. బోధకుడు, 6. శిక్షకుడు.

అనంతరం అష్ట గురువులు:

1. అక్షరాభ్యాసాన్ని చేయించినవారు,
2. గాయత్రీ మంత్రోపదేశాన్ని చేయించినవారు,
3. వేదాధ్యయనం చేయించినవారు,
4. శాస్త్రాభ్యాసం చేయించినవారు,
5. పురాణేతిహాసాలను చెప్పినవారు,
6. మతాచార సంప్రదాయాలను బోధించినవారు,
7. ఇంద్రజాలాది మంత్రబోధకుడు,
8. బ్రహ్మజ్ఞానోపదేశికుడు.

వీరిలో చివరి గురువే (బ్రహ్మజ్ఞానోపదేశికుడు) మోక్షగురువు. మిగిలినవారు సఛ్చీళ జీవనయాత్ర సాగడానికి ఉపయోగపడేవారు.

ఇంకా . బొధగురువు, 2. వేదగురువు, 3. నిషిద్ధగురువు, 4. కామ్యకగురువు, 5. సూచకగురువు, 6. వాచకగురువు, 7. కారణగురువు, 8. విషిత గురువు అంటూ ఎనిమిది మంది గురువులున్నారు.

1. గూఢుడు, 2. దృఢుడు, 3. ప్రీతుడు, 4. మౌని, 5. సకృత్ కామగతుడు అనే పంచవిధ గురువులున్నారు.

ఇలా గురువుల గురించి ఎన్నో అపురూపమయిన విషయాలున్నాయి. ఇక, లోకంలో అనేకావతారాలున్నాయి. కాని, శ్రీదత్తావతారంలో గురు ప్రభావములు, గురు విలక్షణలు గ్రహింపదగినవి. జగద్గురువు అయిన తనకు కూడా ప్రవృత్తిమార్గాన్ని చూపిన గురువులున్నారని శ్రీగురుదత్తాత్రేయుడు భాక్తవరడుడైన ప్రహ్లాదునితో వివరించినట్లుగా మనకు తెలుస్తోంది.

“ప్రహ్లాదా! నా స్మృతిపథంలో ఉన్నవి అవి, అవి రెండే రెండు గురువులు. అవియే, ఎలా ఉండకూడదో చెప్పింది జుంటీగ. ఎలా ఉండాలో చెప్పింది కొండచిలువ. అనగా, జుంటీగ వైరాగ్యాన్ని నేర్పింది. కొండచిలువ సంతుష్టిని నేర్పింది” అని గూఢాతిగూడమైన గురుతత్త్వాన్ని బోధించాదు దత్తాత్రేయులు.

అలాగే, శ్రీకృష్ణపరమాత్మ ఆవిర్భవించిన యాదవ వంశానికి మూలపురుషుడైన “యదువు” అనే మహారాజునకు ఒకప్పుడు శ్రీఅవధూత దత్తస్వామి దర్శనం లభించింది. వారిలో చీకూచిన్తలేని స్థితిని చూసిన యడురాజు, “స్వామీ! అంతర్గతంగా ఏ ధర్మాన్ని ఆశ్రయించి ఉండటం వలన మీకీ స్థితి లభించింది? దయతో నాకు ఉపదేశించండి” అని అభ్యర్థించాడు.

అతని మాటలోనున్న ఆర్తిని, వినయాన్ని చూచిన శ్రీ అవధూత ఇలా సమాధానమిచ్చారు.

“యదురాజా! నేను లోకాన్ని విస్తృతంగా పరిశీలించి, ఎందరెందరో గురువుల నుండి రవ్వంత జ్ఞానాన్ని సంపాయించాను. రాజా! నాకు ఇరువది నలుగురు గురువులున్నారు. జాగ్రత్తగా విను. 1. భూమి, 2. వాయువు, 3. ఆకాశము, 4. నీరు, 5. అగ్ని ఇవియే పంచభూతాలు. మరియు – 6.సూర్యుడు, 7. చంద్రుడు, 8. పావురాలు, 9. అజగరము(కొండచిలువ), 10. సముద్రము, 11.మిడత, 12. తుమ్మెద, 13. గజము, 14. మధుహారి (తేనెటీగ), 15. లేడి, 16. చేప, 17. ‘పింగళా’ – అనే వేశ్య, 18. కురరము (లకుముకిపిట్ట), 19. బాలుడు, 20. బాలిక, 21. శరకారుడు, 22. సర్పము, 23. సాలీడు, 24. పురుగు ఇవి నా గురువులు.

వాటి నుండి గ్రహించినది విను.

భూమి నుండి – క్షమా, పరోపకారత్వం
వాయువు నుండి – నిస్సంగత్వము, నిర్లేపత్వము
ఆకాశము నుండి – సర్వవ్యాపకతత్త్వం
జలం నుండి – నిర్మలత్వం, మాధుర్యం, స్నిగ్ధత్వం
అగ్ని నుండి – తేజస్సు, ఈశ్వరతత్త్వం
సూర్యుని నుండి – జలగ్రాహి, జలత్యాగియు. లోక బాంధవుడతడు. సర్వలోకాలకు అతడొక్కడే.
చంద్రుని నుండి – వ్రుద్ధిక్షయాల రూపుడు, అట్టివి షడ్భావ వికారాలు దేహానికేకాని, తనకు (ఆత్మకు) కావని చంద్రుడు నేర్పించాడు.
పావురాల జంటనుండి – కామక్రోధాలకు వశమైనచో ‘ఆత్మానురాగం’ కోల్పోతారని గ్రహింపు.
అజగరము నుండి – దైవికంగా లభించినదానికి తృప్తి చెంది, ఆత్మనిష్ఠ కలడైయుంటుంది.
సముద్రం నుండి – తనలో దేన్నీ ఉంచుకోదు. అపవిత్రమైనది కల్మషమైనదియు అనగా అడియోగాతత్త్వం కలది. కామాన్నీ, వికారాన్నీ కూడా తనలో చేరనీయదు. తన మనోభావాన్ని బైటకు పొక్కనీయదు.
మిడత నుండి – మ్రుత్యురూపమైన మోహమనెడి జ్వాలాగ్నికి బలియవడం, సుఖమను తలంపుతో మృత్యురూపం పొందుతుంటుంది.
తేనెటీగ నుండి – ఏ పూవును కూడ బాధించకుండ తను పొందాల్సినదానిని (మధురమును) పొంది జీవిస్తుంది. యోగి కూడ ఎవరిని నొప్పించకుండా భిక్ష గ్రహించి పోషించుకొంటాడు. ప్రతి పుష్పాన్ని వదలక ఉండటమనేది, ముని ప్రతీ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, నేర్పుతో సారాన్ని గ్రహించడం, కానీ, కూడబెట్టిన మధుసంపద రేపటికిని ఉంచుకొంటే అది పరుల సోత్తగునని గ్రహించదు. అందుకే ముని తాను పొందిన భిక్ష మరునాటికని ఉంచుకొనడు. ఉంచుకొన్నా అది పనికిరానిదవుతుంది కదా!
గజం నుండి – తానెంత బలిష్ఠమైనదో, అంట మ్రుత్యురూపమగు మోహంగలది. అనగా స్త్రీలౌల్యం కలది. ఆ మోహంలోపడి తాను ఇతరులకు వశమవుతుంది.
మధుహారి నుండి – ఇతరులు కూడబెట్టుకొనిన వస్తువు (మధువు)ను, లోభం చేత న్యాయాన్యాయాలు లెక్కించక, అపహరించువాడు కడు నీచుడు.
లేడి నుండి – అమాయకత్వంలో సంగీతంమోజుతో వేటగానికి చిక్కుతుంది, ఋష్యశృంగముని సంగీత నాట్యాలకు భ్రమసి మాయ వలలో పడ్డాడు.
చేప నుండి – ‘ఎర’కు (జిహ్వ) చాన్చాల్యంతో ఇంద్రియనిగ్రహం కోల్పోయి గాలానికి చిక్కుతుంటుంది. ‘జిహ్వ’ కానరాని దొంగ కదా!
పింగళ నుండి – ధనాశతో కాలహరణం, భౌతిక వాంఛకు శరీరాన్ని భ్రష్టత్వమొనర్చుకొనుట.
కురరము నుండి – తనకు ప్రియమైనది, ఇతరులకు ప్రియమైనది లెక్కించక పోటీపడుటలో పొందు దుఃఖము.
బాలుడు నుండి – యోగితో సమానుడు. పాప పుణ్యాలు ఎరుగనివాడు. భగవత్ర్పాప్తి వల్ల నిరుద్యముడై ఉంటాడు.
కన్యక నుండి – తనకున్న లేమిని కనబరచకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుకొంటుంది.
శరకారుడు నుండి – ఏకాగ్రతను సాధిస్తాడు.
సర్పము నుండి – ఈ శరీరం క్షణ భంగురమని, తనకంటూ ఒక గృహము ఏర్పరచుకోదు.
సాలెపురుగు నుండి – పరబ్రహ్మతత్త్వం తెలియును. సృష్టిలయములు క్రియస్వరూపి.
పురుగు నుండి – రోదచేస్తున్న తుమ్మెదనే చూస్తూ మనస్సనంతయు ఆ తుమ్మెదవైపు లగ్నమొనర్చినా, కొంతసేపటికి, తాను ఆ తుమ్మెద రూపం పొందుతుంది. అనగా భక్తుడు దేనిపై లగ్నమొనర్చునొ అటుల రూపధారి అవుతాడు. ఉదా|| భరతుడు. (శ్రీరాముని తమ్ముడు).
అలాగే, అనకు ప్రతీ అణువు గురువేయని, తనలోని మనస్సే తనగురువని కూడ చాటాడు అవధూత శ్రీదత్తాత్రేయులు. ఇక, ఆచార్యులు జ్ఞానంతో పాటూ సదనుష్టానాన్ని కలిగివుండాలి. అటువంటి ఆచార్యులకు చక్రవర్తియైనప్పటికీ తలొంచవలసిందే. ఆ రోజుల్లో గురువులకు ఈ క్రింది లక్షణాలు ఉండేవి.

శిష్యవాత్సల్యం
విషయపరిజ్ఞానం
బోధనా కౌశలం
మనస్తత్త్వాన్ని తెలుసుకుని ఉండటం అనే లక్షణం
అందరిపట్ల సమభావాన్ని కలిగి ఉందటం
అయితే, ప్రస్తుత గురువులలో చాలామంది ‘చెవిలో మంత్రం చేతిలో ధనం’ అన్నట్లుగా ఉంటున్నారు. ఇది భవిష్యతరాలకు మంచిది కాదు. శిష్యులు కూడ గురువుల పట్ల భక్తిప్రపత్తులతో మెలగాలి. అప్పుడే మన జీవితానికైన జ్ఞానార్జన లభిస్తుంది.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...