Monday, October 15, 2018

పురాణ కథలు - కుండలినీ సమన్వయం - శ్రీమద్రామాయణం

శ్రీ మద్రామాయణం ఓ గొప్ప కావ్యం మాత్రమే కాదు. అదో మహత్తర యోగ గ్రంథమని కూడా పరిశీలకులు తెలిచెప్పారు.

రామాయణాన్ని గురించి ఎంత చెప్పినా సమయం సరిపోదు. దాన్ని కుదించి చెప్పడానికి కట్టె, కొట్టె, తెచ్చె అనే మూడు మాటల్లో కూడా చెప్పుకొనే వీలుంది. అంతలా అన్నికోణాల్లో అన్ని రకాలుగా ఉన్న విశేష ఇతిహాసం కాబట్టే భారతీయుల నరనరాల్లో ఈ కావ్యకథ ఇతివృత్తం జీర్ణించుకొని ఉంది.

రామాయణాన్ని అలా కథారూపంలో కాక కుండలినీ యోగంతో సమన్వయించి కూడా చెబుతుంటారు. కుండలినీ యోగ చక్రాలకు రామాయణంలోని కాండలకు సమన్వయం చెప్పి రామాయణం అచ్చం యోగరామాయణమే అని ఎందరో పండితులు నిరూపించారు.

కుండలినీ యోగంలో సహస్రారంతో కలిపి చెబితే ఏడు చక్రాలు ఉన్నట్లే రామాయణంలో ఉత్తరకాండతో కలిపి చెబితే ఏడు కాండలవుతాయి. కుండలినిలో మూలాధారం, మణిపూరకం, స్వాధిష్టానం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనే ఏడు చక్రాలుంటాయి. ఏడు చక్రాలకు, ఏడు కాండలకు చక్కటి సమన్వయం కుదురుతుంది.

బాలకాండ మూలాధారం

రామాయణంలోని బాలకాండకు కుండలినిలోని మూలాధార చక్రానికి సమన్వయం చేసి చెబుతారు. కుండలినీ యోగంలో ప్రథమ చక్రమైన మూలాధార చక్రం దగ్గరకు సాధకుడి కుండలినీ శక్తి ఉద్బుద్ధమైనప్పుడు భౌతిక బలం అక్కడ సాధకుడిలో వ్యవస్థీకృతమవుతుంది. బాలకాండలో కూడా భౌతిక బలాల వ్యవస్థీకరణను గురించిన విషయాలే ఉంటాయి. శ్రీరాముడి పుట్టుపూర్వోత్తరాలు, శౌర్యసాహసాలు ఆత్మ సామ్రాజ్యానికి ప్రతీకలు. రావణాసురుడి పుట్టుపూర్వోత్తరాలు, శౌర్యసంపద ఇలాంటివన్నీ అహంకార సామ్రాజ్యానికి ప్రతీకలు. ఇలా రామాయణ కథకు ఒక ఆధారం ఈ కాండలో ఉంది. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే కథ మూలాధారం దగ్గర ఉద్బుద్ధమయ్యే శక్తి లాంటిది.

రెండో చక్రం మణిపూరకం.

ఇది బొడ్డు దగ్గర ఉంటుంది. ఈ చక్రం జలతత్త్వానికి సంబంధించింది. ఇక్కడ కుండలినీ శక్తి ఉద్బుద్ధమైనప్పుడు సాధకుడిలో ఈర్ష్య, అసూయ, రాగం, ద్వేషం, శోకం, మమకారం విజృంభిస్తాయి. జలాలలో ఉండే మొసళ్లు, తిమింగలాల వంటివి ఇవి. వీటిని సాధకుడు దాటి ముందుకు పోవటానికి చాలా కష్టించాలి. అయోధ్యకాండలో కూడా రాగం, ద్వేషం, అసూయ లాంటివాటికి సంబంధించిన మందర ప్రబోధం, కైకేయి వరాలు, దశరథుడి శోకం, దశరథ శ్రీరాముల వియోగం ఇలాంటివన్నీ కనిపిస్తాయి. దశరథాదులు వీటిని దాటి వెళ్లడానికి అసామాన్యమైన కష్టాన్నే అనుభవించారు.

మూడో చక్రం స్వాధిష్టానం.

ఇది అగ్నితత్వానికి సంబంధించినది. శరీరంలోని ఉష్ణోగ్రత సమత్వాన్ని, ఆహారపానీయాదుల జీర్ణశక్తిని ఇదే కట్టుదిట్టం చేస్తుంది. మూడోకాండ అయిన అరణ్యకాండలో విరాధుడు, జఠాయువు, కబంధుడులాంటి రాక్షసుల దహనక్రియలకు సంబంధించిన సన్నివేశాలు, అగ్నిశిఖలాంటి సీతను రావణుడు అపహరించిన సన్నివేశాలు దీనిలో కనిపిస్తాయి.

నాలుగో చక్రం అనాహతం.

రామాయణంలో నాలుగోకాండ కిష్కంధకాండ. అనాహత చక్రం వాయుతత్వానికి సంబంధించినది. ఈ చక్రానికి స్థానం హృదయం. ఈ చక్రం దగ్గరకు కుండలినీ శక్తి ఉద్బుద్ధమైనప్పుడు సాధకుడిలో వాత్సల్యం, స్నేహం, భక్తి లాంటి ఆత్మగుణాలు ఉత్తేజితమౌతాయి. కిష్కంధకాండలో శ్రీరాముడు సుగ్రీవహనుమంతాదులతో కలిసే సన్నివేశాలు, వారి స్నేహంతో రాముడు ముందుకు వెళ్లే సంఘటనలు ఉన్నాయి. ఈ కాండ రామాయణానికి హృదయంలా అంటే కేంద్రస్థానంలా ఉంటుంది.
ఉత్తర కాండే సహస్రారం

విశుద్ది చక్రం

ఆ తర్వాత కనిపించే సుందరకాండ కంఠప్రదేశం లాంటిది. కంఠం శబ్ద ఉత్పత్తికి స్థానం. విశుద్ధిచక్రం ఆకాశతత్వానికి సంబంధించినది. ఆకాశమనేది శబ్ద గుణకం. కంఠంలో ఉద్భవించే శబ్దం మెదడుకు (బుద్ధికి), హృదయానికి (ఆత్మ) అనుసంధానంగా ఉంటుంది. బుద్ధి సీతకు ప్రతీక అయితే హృదయం రాముడికి ప్రతీక. ఈ ఇద్దరి మధ్యన కంఠస్థానంలా హనుమంతుడు సంధానకర్తగా కనిపించే సన్నివేశం అయిదో కాండ అయిన సుందరకాండలో ఉంది. హనుమంతుడి ఆకాశగమనం కూడా ఇక్కడే వర్ణితమైంది.

*ఇక ఆజ్ఞాచక్రం ఆరోది.

ఈ చక్రానికి స్థానం నుదురు భాగం. ఇది మనస్తత్వానికి సంబంధించినది. ఇక్కడే జ్ఞాననేత్రం ఉందంటారు. రామాయణంలో ఆరోకాండ అయిన యుద్ధకాండలో అహంకార సామ్రాజ్యానికి సంబంధించిన మనస్సు అనే రావణాసురుడు ఆత్మ సామ్రాజ్యానికి సంబంధించిన ఆత్మ అనే రాముడిలోకి లీనం కావడం, బుద్ధి అనే సీతను జ్ఞానం అనే అగ్నిలో పరీక్షించటంగా సమన్వియించుకొంటే రామాయణం కుండలినీ యోగ సదృశ్యమని అర్థమవుతుంది.

**ఏడో చక్రం సహస్రారం.

ఈ చక్రస్థానం బ్రహ్మరంధ్ర ప్రాంతం. బ్రహ్మరంద్ర స్థానం ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఈ విషయాన్ని రామాయణంతో సమన్వయిస్తే ఏడో కాండ ఉత్తరకాండ. ఈ కాండను కొంతమంది లెక్కలోకి తీసుకోరు. అందుకనే రామాయణం ఆరు కాండలేనని అంటారు. అలాగే చక్రాలలో సహస్రారాన్ని లెక్కించకుండా షట్చక్రాలను మాత్రమే కొంతమంది చెబుతుంటారు. ఇలా కుండలినీ యోగంతో రామాయణ మహాకావ్యాన్ని సమన్వయించి చెప్పటం కనిపిస్తుంది.

నాద బిందు కళలు - నిర్వికల్ప సమాధి : సాధకుడు ఎడతెగని నిష్ట తో సాధనలో ఉన్నప్పుడు ...కుండలినీ శక్తి మేల్కొని ...అనాహత చక్రం చైతన్య వంతమైతే దశవిధ నాదాలు అనుభూతానికి వస్తాయి. క్రమేణా దీర్ఘ ఘంటానాదం అనుభూతం అవుతుంది. నిరంతరం ఓంకార నాదం అనుభూతికి వస్తుంది. కుండలినీ శక్తి "ఆజ్ఞా" చక్రంలో స్థిరపడితే రకరకాల కాంతులు వెదజల్లును. కొంత కాలానికి శతకోటి సూర్య ప్రభా సమానమైన ఆత్మ చైతన్యం...అనుభూతికి వస్తుంది. ఈ రక రకాల కాంతులను చిత్కళలు అంటారు. కూటస్థ చైతన్యమునే బిందువు అంటారు. ఇవన్నీ లయం కావలసిందే. అప్పుడు నిర్వికల్ప సమాధి సిద్ధించును.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...