Wednesday, October 31, 2018

శ్రీచక్రార్చన వివరణ

శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రము శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభసాధ్యమైన పని కాదు. అయిననూ పట్టుదలతో శ్రద్ధతో సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో.
మానవ దేహమే శ్రీచక్రము. సాధకుని దేహమే దేవాలయము. మానవ దేహము నవ రంద్రములతో కూడినది.

శ్రీచక్రము తొమ్మిది చక్రముల సమూహము. శరీరంలోని షట్చక్రాలకూ, శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములకు అవినాభావ సంబధము కలదు.
శరీరంలోని తొమ్మిది ధాతువులకు ఇవి ప్రతీకలు. శ్రీచక్రము లోని తొమ్మిది చక్రములను తొమ్మిది ఆవరణములుగా చెప్పెదరు. అందుకే శ్రీచక్రమునకు నవావరణ పూజ చేయుదురు.

నాలుగు శివ చక్రములు, ఐదు శక్తి చక్రములు కలసి మొత్తం తొమ్మిది చక్రములతో శ్రీదేవి విరాజిల్లుతూ వుంటుంది.
తొమ్మిది చక్రములలో విడివిడిగా ఒక్కో దేవత వసిస్తూ వుంటుంది. చివరన బిందువులో కామకామేశ్వరులు నిలయమై వుంటారు.
శివ, శక్తి, చక్రములతో కలసి శివశక్తైక్య రూపిణి లలితాంబిక అయినది.

అర్ధనారీశ్వర తత్వమై, కామ కామేశ్వరుల నిలయమై, సృష్టికి ప్రతి రూపమై వెలుగొందినది ఈ శ్రీచక్రము.

సృష్టికి సూక్ష్మ రూపమే ఈ శ్రీచక్రము. శ్రీ దేవి నిలయమే ఈ శ్రీచక్రము. శ్రీచక్రమే శ్రీదేవి. శ్రీదేవియే శ్రీచక్రము.

శ్రీచక్రము 3 రకములుగా లోకంలో పూజింపబడుచున్నది. ౧. మేరు ప్రస్తారము ౨. కైలాస ప్రస్తారము ౩. భూ ప్రస్తారము.
సప్త కోటి మహా మంత్రములతో సర్వ దేవతా స్వరూపమైన శ్రీచక్రమును విప్పూజించిన యెడల, సర్వ శక్తులూ, జ్ఞానము, మోక్షము ప్రాప్తించునని
మన పూర్వీకులు, ఋషులు విప్వక్కాణించి యున్నారు.
శ్రీచక్రము యొక్క నాలుగు ద్వారాలు నాలుగు వేదాలకు ప్రతీకలు. ఆ ద్వారాలలో గనుక ప్రవేశించి నట్లైతే దేవీ సాక్షాత్కారం లభించినట్లే.

ఈ శ్రీవిద్యను మొదట్లో పరమేశ్వరుడు పరమేశ్వరికి ఉపదేశించెను. పరమేశ్వరుడు జగత్తునందు గల ప్రాణుల కామ్య సిద్దుల కొరకు చతుషష్టి (64) తంత్రములను సృష్టించెను.

కామేశ్వరీ దేవి కోరిక మేరకు చతుర్విధ పురుషార్ధములు ఒక్క మంత్ర తంత్రము వలన కలుగునట్లుగా శ్రీవిద్యా తంత్రమును, శ్రీచక్ర యంత్రమును ఆ పరమేశ్వరుని చే నిర్మింపబడినవి. శ్రీచక్రము అన్ని మంత్ర, యంత్ర, తంత్రములలో కెల్లా గొప్పదని, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు, పరమేశ్వరి యొక్క ప్రతి రూపమని చెప్పుదురు. కాబట్టి అధికారముకల వారికి శ్రీవిద్యా తంత్రము, మిగతా వారికి చతుషష్టి (64) తంత్రములు అని మన ఋషులు నిర్దేశించిరి. ఈ శ్రీవిద్యోపాసన వలన, శ్రీచక్రార్చన వలన ఈశ్వరానుగ్రహం చే ఆత్మ విచారణ యందు ఆసక్తి కలిగి, ఐహిక భోగముల యందు విరక్తి కలుగును. అందువలన బ్రహ్మ జ్ఞానము లభించును. అందుకే దీనిని బ్రహ్మవిద్య అని అన్నారు.

శ్రీవిద్యా మహా మంత్రములు అనునవి మోక్ష సాధనమగు మార్గములుగా చెప్పబడినవి.

ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము కావలయును అనేవారికి ఇవి నిర్దేశింపబడినవి.

Monday, October 29, 2018

థాయిలాండ్లోరామరాజ్యంమీకుతెలుసా?

థాయిలాండ్ లో  రాజ్యాంగ ప్రకారం ఒక రామరాజ్యం ఉంది అని మనలో చాలామందికి తెలియదు. శ్రీరాముని పుత్రుడైన కుశుని వంశంవాడైన "భూమిబల్ అతుల్య తేజ్ " అనే రాజు అక్కడ రాజ్యపాలన చేస్తున్నాడు.

👉#సంక్షిప్తంగా ఇతిహాసాలలో శ్రీరాముని చరిత్ర.

వాల్మీకిమహర్షి రచించిన రామాయణం మనకు మతగ్రంథమే కాదు, చారిత్రక గ్రంథం కూడా. వాల్మీకి మహర్షి బాలకాండ లోని 70,71 &73 సర్గలలో రాముని వివాహాన్ని , తమ్ముల వివాహాలను కూడా వర్ణించడం జరిగింది. దాని సారాంశం ఏమిటంటే -

మిథిలకు రాజు సీరధ్వజుడు. ఆయనకు విదేహరాజు అన్న పేరు కూడా ఉంది. ఆయన భార్య సునేత్ర లేక సునయన. ఆయన పుత్రిక అయిన జానకికి రామునితో వివాహం జరిగింది. జనకుడికి కుశధ్వజుడు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. అతని రాజధాని సాంకశ్యనగరం. అది ఇక్షుమతీనది ఒడ్డున ఉంది. ఈ కుశధ్వజుడు తన పుత్రికలైన ఊర్మిళ , మాండవి , శ్రుతకీర్తులను లక్ష్మణ, భరత, శతృఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించాడు. కేశవదాసు రచించిన రామచంద్రిక అనే గ్రంథం ఆధారంగా (పేజీ 354), సీతారాములకు లవకుశులు ,   ఊర్మిళాలక్ష్మణులకు అంగద చంద్రకేతులు , మాండవీభరతులకు పుష్కరుడు - తక్షుడనే వాళ్ళు , శృతకీర్తిశతృఘ్నులకు సుబాహువు - శతృఘాతకుడనేవాళ్ళు జన్మించారు.

👉శ్రీరామునిసమయంలోనే రాజ్యవిభజన జరిగింది.

పశ్చిమంలో లవునకు లవపురం ( లాహోర్ ) , తూర్పున కుశునకు కుశావతి , తక్షునకు తక్షశిల , అంగదునకు అంగదనగరం , చంద్రకేతునకు చంద్రావతి లను ఇవ్వడం జరిగింది. కుశుడు తన రాజ్యాన్ని తూర్పుదిక్కుగా విస్తరింపజేసాడు. ఒక నాగవంశపు కన్యను వివాహం చేసుకున్నాడు. థాయిలాండ్ లోని రాజులంతా ఆ కుశుని వంశంలోని వారే. ఈ వంశాన్ని #చక్రీ వంశము అంటారు. చక్రి అంటే విష్ణువనే అర్థం కదా! రాముడు విష్ణుభగవానుని అవతారం. అదీగాక, రాజు విష్ణుస్వరూపమే కదా ! అందువలన వీళ్ళు తమ పేర్లచివర #రామ్ అన్న పేరు తగిలించుకుని , వారికి ఒక సంఖ్య ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 9వ రాముడు రాజ్యం చేస్తున్నాడు. అతని పేరే #భూమిబల్అతుల్యతేజ్.

👉థాయిలాండ్ యొక్క అయోథ్య

థాయిలాండ్ రాజధానిని ఆంగ్లంలో Bangkok అని అంటున్నాము కదా ! అయితే ప్రభుత్వరికార్డులలో అధికారిక రాజధాని పేరువింటే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచంలో ని అన్నిదేశాల రాజధాను లలో ఇదే పొడుగైన పేరుగల రాజధాని. అంతేకాదండోయ్ , ఆ పేరు సంస్కృతంలో ఉంది. ఏమిటో మీరే చదవండి - "  క్రుంగదేవ మహానగర
అమరరత్న కోసింద్ర మహింద్రాయుధ్యా మహా తిలక భవ నవరత్న రజధానీపురీ రమ్య ఉత్తమ రాజ నివేశన అమర విమాన అవతార స్థిత శక్రదత్తియ విష్ణుకర్మ ప్రసిద్ధి " .

థాయిభాషలో పైపేరుని రాయడానికి 163 అక్షరాలు వాడారు. ఇంకోవిశేషమేమిటంటే వాళ్ళు రాజధాని పేరుని చెప్పమంటే పలకరు , పాటలా పాడుతారు. కొంతమంది సంక్షిప్తంగా "మహింద్ర అయోధ్య" అని అంటారు. ఇంద్రుడు నిర్మించిన అయోధ్య అని అర్థం. థాయిలాండ్ రాజులందరూ ఈ అయోథ్యలోనే నివసిస్తారు.

👉 థాయిలాండ్ లో నేటికీ రామరాజ్యం ఉంది.

థాయిలాండ్ లో 1932 లో ప్రజాస్వామ్యం వచ్చింది. ప్రజలు బౌద్ధమతస్తులైనా , రామరాజ్యాన్నే అనుసరిస్తున్నారు. అక్కడి రాజవంశం వారనెవరినీ విమర్శించడం గానీ , వివాదాలలోకి లాగడంగానీ చేయరు. వారంతా పూజనీయులని విశ్వసిస్తారు. రాజవంశంవారి దగ్గర నిటారుగా నిలబడి మాట్లాడరు, వంగి మాట్లాడతారు. ప్రస్తుత రాజుకి ముగ్గురు కూతుళ్ళు. అందులో చివరి కూతురికి హిందూధర్మశాస్త్ర పరిజ్ఞానముంది.

👉 థాయిలాండ్ జాతీయగ్రంథం రామాయణం

థాయిలాండ్ వారు అధికశాతం బౌద్ధులైనా , వారి జాతీయగ్రంథం రామాయణము అని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. థాయిభాషలో దానిని "రామ్ కియేన్ " అని పిలుస్తారు. మన వాల్మీకిరామాయణానికి దగ్గరగా విషయాలన్నీ ఉంటాయి. ఒకసారి 1767లో  రామ్ కియేన్ పాడైపోయినదట. అపుడు రాజైన రామ-1 (1736 -1809) తన స్మరణశక్తితో తిరిగి రామాయణమంతా రచించినాడట. రామాయణం జాతీయగ్రంథంగా వారు ప్రకటించుకున్నారు. మనదేశంలోలాగా దిక్కుమాలిన సెక్యులరిజం లేకపోవటం వారి అదృష్టం.

థాయిలాండ్ లో రామ్ కియేన్ ( రామాయణం) ని అనుసరించి నాటకాలు , తోలుబొమ్మలాటలు ఉన్నాయి. వారి నాటకాలలోని పాత్రలు చూద్దాం -
1. రామ్ ( రాముడు )
2. లక్ ( లక్ష్మణుడు )
3. పాలీ ( వాలి )
4. సుక్రీప్ (సుగ్రీవుడు )
5. ఓన్కోట్ ( అంగదుడు )
6. ఖోంపూన్ ( జాంబవంతుడు )
7. బిపేక్ ( విభీషణుడు )
8. తోతస్ కన్ ( దశకంఠ ) రావణుడు
9. సదాయు ( జటాయు )
10. సుపన్ మచ్ఛా (శూర్పణఖ )
11. మారిత్ ( మారీచుడు )
12. ఇంద్రచిత్ (ఇంద్రజిత్ ) మేఘనాదుడు.

👉 థాయిలాండ్ లో హిందూదేవీదేవతలు

ఇక్కడ బౌద్ధులు అధికసంఖ్యాకులు. హిందువులు అల్పసంఖ్యలో ఉన్నారు. ఇక్కడ బౌద్ధులు కూడా ఈ హిందూ దేవీ దేవతలను పూజిస్తారు.
1. ఈసుఅన్ ( ఈశ్వర్ ) శివుడు
2. నారాయి (నారాయణ్ ) విష్ణువు
3. ఫ్రామ్ ( బ్రహ్మా )
4. ఇన్ ( ఇంద్రుడు )
5. ఆథిత్ ( ఆదిత్య ) సూర్యుడు
6. పాయ్ ( వాయు )

👉 థాయిలాండ్ జాతీయపక్షి గరుత్మంతుడు

గరుడపక్షి చాలా పెద్ద ఆకారంతో ఉంటుంది. ప్రస్తుతం ఈజాతి లుప్తమైపోయిందని భావిస్తున్నారు. ఇంగ్లీషులో ఆశ్చర్యంగా దీనిని బ్రాహ్మణపక్షి ( The Brahmany Kite )  అని పిలుస్తారు. దీని సైంటిఫిక్ నామధేయం "Haliastur Indus". ఫ్రెంచ్ పక్షిశాస్త్రజ్ఞుడు మాథురిన్ జాక్స్ బ్రిసన్ 1760 లో దీనిని చూసి Falco Indus అన్న పేరు పెట్టాడు. ఈయన దక్షిణభారత్ లోని పాండిచెరీ పట్టణం వద్ద కొండలలో దీనిని చూసానని తెలిపాడు. అందువల్ల ఈ పక్షి కల్పన కాదు అని అవగతమౌతోంది. మన పురాణాలలో ఈపక్షిని విష్ణుభగవానుని వాహనంగా పేర్కొన్నారు. థాయిలాండ్ ప్రజలు ఎంతో గౌరవంతో తమ రాజు రాముని అవతారం కనుక , ఆ రాముడు విష్ణువు అవతారమనీ , ఆ విష్ణువు వాహనం కనుక గరుడపక్షిని తమ జాతీయపక్షిగా చేసుకున్నారు. అంతేకాదు థాయిలాండ్ పార్లమెంటు ఎదురుగా గరుడుని బొమ్మ కూడా పెట్టుకున్నారు.

👉 థాయిలాండ్ ఎయిర్ పోర్ట్ పేరు సువర్ణభూమి

మన దౌర్భాగ్యం కొద్దీ మనదేశంలో ముస్లిం ఆక్రమణదారులు మన సంస్కృతిని నాశనం చేసి ముస్లింపేర్లతో మన పట్టణాలనూ , పట్టణాలలోని వీథులనూ మార్చివేసారు. స్వాతంత్రానంతరం పాలకులు సెక్యులరిజం పేరుతో హిందువులతోనూ , హిందూసంస్కృతితోనూ ఆటలాడుకున్నారు. కానీ , థాయిలాండ్ లోని రాజధాని లోని ఎయిర్ పోర్ట్ కు చక్కని సంస్కృతంలోని పేరు "సువర్ణభూమి" అని పెట్టుకున్నారు. వైశాల్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ ఎయిర్ పోర్టు ఇదే. దీని వైశాల్యం 563,000 sq.mt. ఎయిర్ పోర్టు ముందు "సముద్రమంథనం " ని ప్రతిబింబిస్తూ పెద్ద బొమ్మ దేవతలు , రాక్షసులు చేసే క్షీరసాగరమథనాన్ని చూపిస్తుంది. ఈ బొమ్మని కొన్నిరోజులక్రితం నేను షేర్ చేసాను కూడా.

👉 ఈ వ్యాసం ఉద్దేశ్యం

అసలైన సెక్యులరిజం అంటే ఏమిటో మనం థాయిలాండ్ ని చూసైనా నేర్చుకోవాలి. మనసంస్కృతిని మనమే మర్చిపోతే జాతికి మనుగడ ఉండదు అని గ్రహించాలి. మన పిల్లలకు , రాబోయేతరాలకు మనసంస్కృతిని వారసత్వ సంపదగా మనమే అందించాలి.

Sunday, October 28, 2018

దైవదర్శనం తరువాత

మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
అది ఏమిటంటే..!
"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."
మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.
దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.
"అనాయాసేన మరణం"
*******
నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.
"వినా ధైన్యేన జీవనం"
*******
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.
"దేహాంతే తవ సాన్నిధ్యం"
*********
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను
నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.
"దేహిమే పరమేశ్వరం"
*******
ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.
1)అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.
2)ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.
3) నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా
ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.
ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి.
" లోకా సమస్తా సుఖినో భవంతు..!!

పాపం – ప్రాయశ్చిత్తం – పశ్చాతాపం

పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం... పూర్వ జన్మలో మనం చేసిన పాపం, రోగం రూపములో అనుభవములోనికి వస్తుంది, అని శాస్త్ర వచనము. పూర్వ జన్మలో మనము చేసిన పాప పుణ్యములను బట్టి, మన జన్మ వుంటుంది. మన జాతక చక్రం తదనుగుణంగా తయారు అవుతుంది. మన కర్మే, గ్రహాల రూపములో వచ్చి, మనల్ని బాధ పెట్టడమో, లేదా సుఖ పెట్టడమో, జరుగుతుంది. అనవసరంగా గ్రహాలను తిట్టుకొంటాము మనము.
ఆ గ్రహాలు కూడా ఎదో మనిషి రూపములోనో, లేదా రోగాల రూపం లోనో వచ్చి, మనల్ని బాధ పెడుతుంటాయి.

శ్లో|| నా భుక్తం క్షీయతే కర్మ, కల్ప కోటి శతైరపి, అవశ్యమను భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభమ్ ||

అనగా అనుభవించనిచో, కర్మ ఫలము, కోటి బ్రహ్మ కల్పములు గడిచిననూ, నశింపదు. అది శుభమైననూ, అశుభమైననూ, దాని ఫలమును, మనము తప్పక అనుభవింపవలసినదే, అని అర్ధము.

అందుకని పరమాత్ముడి కైననూ తిప్పలు తప్పవు అని అనడంలో అర్ధం ఏమిటంటే, ఎంతటి వాడికైనా, జన్మ తీసుకొంటే, కర్మ అనుభవించ వలసినదే అని అర్ధము.

తెలిసి చేసినా, తెలియక చేసినా పాపం పాపమే.

ప్రాయశ్చిత్తై రపైత్యేనః....... ప్రాయశ్చిత్తముతో పాపములు తొలగి పోవును.

పశ్చాతాపంతో కూడిన ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం చేసుకొంటే, తప్పక పాపం పోవును, అని శాస్త్రం చెప్పినది. పరాశర స్మృతి చెప్పినది.

శ్లో|| ప్రాయో నామ తపః ప్రోక్తం చిత్తం నిశ్చయ ఉచ్యతే, తపోనిశ్చయ సంయుక్తం ప్రాయశ్చిత్తం తదుచ్యతే.||

ప్రాయాస్ అనగా తపస్సు. చిత్తము అనగా నిశ్చయము. నిశ్చయముతో కూడిన తపస్సు చేయడమే ప్రాయశ్చిత్తం అని అన్నారు.

ప్రతి దానికి, ప్రతి మంత్రానికి, ప్రతి కార్యానికి, ప్రతి తప్పుకు శాస్త్రములో ప్రాయశ్చిత్తం చెప్పబడి వున్నది. అది తెలుసుకొనీ, గురువులను అడిగి, లేదా మీ ఇంటి పురోహితుడ్ని అడిగి వెంటనే చెయ్యాలి.

ఎవరి పట్ల అయినా తప్పుగా ప్రవర్తించినావు, వెంటనే “అయ్యా, పొరబాటు అయినది, నన్ను క్షమించండి అని అడుగు.

క్షమించమని అడగ కుండా నేను ప్రాయశ్చిత్తం చేసుకొంటాను, అంటే కుదరదు. పాపం పోదు. ఎవరి పట్ల మనము అగౌరవముగా ప్రవర్తించినామో, వారిని క్షమాపణలు అడిగి తీరాలి. అప్పుడే మనము చేసిన పాపం పోతుంది.

ఒక వేళ క్షమాపణలు అడగ లేని పరిస్థితి, ఆ వ్యక్తి కనిపించలేదు, లేదా ఏదన్నా ప్రాణిని తెలిసో, తెలియకో హింస పెట్టినావు, లేదా చూసుకోకుండా చంపినావు, అప్పుడు మాత్రమే మీ గురువులను అడిగి ప్రాయశ్చిత్తం తెలుసుకొని చేయాలి.

పశ్చాతాపంతో కూడిన ప్రాయశ్చిత్తం గాని, లేక క్షమాపణలు గాని ఎటువంటి పాపము నైననూ కడిగి వేస్తుంది.

సులభమైనది మనస్పూర్తిగా క్షమాపణలు అడగడం.
గురువులు, పెద్దలు లేనప్పుడు, వీలు కానప్పుడు నీకై నీవు ప్రాయశ్చిత్తం విధించుకోవచ్చును.

నీ సుఖాన్ని నీవు త్యాగం చేసుకోవడమే ప్రాయశ్చిత్తం. ఒక రోజు భోజనం మానేయడం, పది రోజులు ఉపవాసం వుండడం, లేదా మౌన వ్రతాన్ని పాటించడం, నేలపై పరుండడం, ఇలా....

దోషములు పోగొట్టుకొనుటకు ప్రాయశ్చిత్తములున్నవి, అంతే గాని దోషములు చేయుటకు కాదు.

ప్రాయశ్చిత్తం చెప్పబడినది కదా అని పాపములు చేయకూడదు. దానికి నిష్కృతి లేదు. అలాగే పశ్చాతాపం లేకుండా ప్రాయశ్చిత్తం చేసుకున్నా, అది కూడా వ్యర్ధమే. పాపము పోదు.

శ్లో|| ప్రాయశ్చిత్త మకుర్వాణాః పాపేషు నిరతా నరాః, అపశ్చాత్తాపినః కష్టాన్నరకాన్ యాంతి దారుణాన్ ||

పశ్చాతాపంను మించిన ప్రాయశ్చిత్తం లేదు అని పెద్దలు చెప్పుదురు. ఇది వీలుకాని పరిస్థితులలో మాత్రమే, చేయ వలెను. చేసిన తప్పుకు క్షమాపణలు అడగడమే ఉత్తమోత్తమo. దానిని మించినది లేదు.

ప్రాయశ్చిత్తము వలన దోష నిర్మూలన తప్పక జరుగును, అయితే బుద్ధి పూర్వకముగా చేసిన యెడల పాపము పోదు అని చెప్ప బడినది.

శ్లో|| కామాకామకృతం తేషాం మహాపాపం ద్విధాస్మృతమ్ ||

బుద్ధి పూర్వకముగా చేసినది, కోరక చేసినది అని పాపములు రెండు విధములు. తెలియక చేసిన పాపములు, తెలిసి కావాలని చేసిన పాపములు. తెలియక జేసిన పాపములు ప్రాయశ్చిత్తము వలన నిర్మూలనము అగును. కానీ పొగరుతో, తెలిసి తెలిసి కావాలని చేసిన పాపములు ప్రాయశ్చిత్తముతో పోవు అని తెలియవలెను.

ద్వాదశాదిత్యులు

హిందూ పురాణాలలో "అదితి" మరియు
కశ్యపుని యొక్క 12 మంది పుత్రులను
ద్వాదశాదిత్యులు అంటారు. సంవత్సరంలోని పన్నెండు నెలల కాలంలో
సూర్యుడు ఉండే స్థితులను బట్టి ద్వాదశాదిత్యుల పేర్లతో వర్ణించారు:
మహాభాగవతం 12వ స్కంధం చివరిలో ద్వాదశాదిత్యుల వర్ణ ఉంది. ఒక్కొక్క నెలలో సూర్య భగవానుడు ఆయా ఆదిత్యుని నామంతో ఆరాధింపబడుతుంటాడు. ఆదిత్యుని వెంట ఆరుగురు పరిజనులు ఉంటారు. వాఱు కూడా మాసాన్ని బట్టి మారుతుంటారు.

1. ధాత - మాసం: చైత్రం - పరిజనులు: కృతస్థలి (అప్సరస), హేతి (రాక్షసుడు), వాసుకి (నాగువు), రథకృత్తు (యక్షుడు), పులస్త్యుడు (ఋషి), తుంబురుడు (గంధర్వుడు)

2. అర్యముడు - మాసం: వైశాఖం - పరిజనులు: పుంజికస్థలి (అప్సరస), పులహుడు (రాక్షసుడు), ఓజస్సు (నాగువు), ప్రహేతి (యక్షుడు), నారదుడు (ఋషి), కంజనీరుడు (గంధర్వుడు)

3. మిత్రుడు - మాసం: జ్యేష్ఠం - పరిజనులు: మేనక (అప్సరస), పౌరషేయుడు (రాక్షసుడు), తక్షకుడు (నాగువు), రథస్వనుడు (యక్షుడు), అత్రి (ఋషి, హాహా (గంధర్వుడు)

4. వరుణుడు - మాసం: ఆషాఢం - పరిజనులు: రంభ, శుక్రచిత్తు సహజన్యుడు, హూహూ, వసిష్ఠుడు, సృనుడు
13వ శతాబ్దిలోని ఇంద్రుని బొమ్మ

5. ఇంద్రుడు - మాసం: శ్రావణం - పరిజనులు: విశ్వావసువు, శ్రోత, ఏలా పుత్రుడు, అంగిరసు, ప్రమ్లోచ, చర్యుడు

6. వివస్వంతుడు - మాసం: బాధ్రపదం - పరిజనులు: అనుమ్లోద, ఉగ్రసేనుడు, వ్యాఘ్రుడు, అసారణుడు, భృగువు, శంఖపాలుడు

7. అంశుమంతుడు - మాసం: మార్గశిరం - పరిజనులు: కశ్యపుడు, తార్క్ష్యుడు, ఋతసేన, ఊర్వశి, విద్యుచ్ఛత్ర, మహాశంఖులు

8. త్వష్ట - మాసం: ఆశ్వయుజం - పరిజనులు: జమదగ్ని, కంబళాశ్వుడు, తిలోత్తమ, బ్రహ్మపేతుడు, శతజిత్తు, ధృతరాష్ట్రుడు

9. విష్ణువు - మాసం: కార్తీకం - పరిజనులు: అశ్వతరుడు, రంభ, సూర్యవర్చుడు, సత్యజిత్తు, విశ్వామిత్రుడు, మఖాపేతుడు

10. భగుడు - మాసం: పుష్యం - పరిజనులు: స్ఫూర్జుడు, అరిష్టనేమి, ఊర్ణువు, ఆయువు, కర్కోటకుడు, పూర్వజిత్త

11. పూషుడు - మాసం: మాఘం - పరిజనులు: ధనుంజయుడు, వాతుడు, సుషేణుడు, సురుచి, ఘృతావి, గౌతముడు

12. క్రతువు - మాసం: ఫాల్గుణం - పరిజనులు: వర్చుడు, భరద్వాజుడు, పర్జన్యుడు, సేనజిత్తు, విశ్వుడు, ఐరావతుడు

ఇంకా భాగవతంలో శౌనకుడు సూతునకిలా చెప్పాడు - ఈ పన్నెండుగురు ఆదిత్యులును విష్ణువుయొక్క సూర్యరూప విభూతులు. సూర్యుని వెంబడించేవారిలో ఋషులు వేదత్రయాన్ని చదువుతుంటారు. గంధర్వులు గానాన్ని చేస్తుంటారు. అప్సరసలు నాట్యం చేస్తుంటారు. నాగులు సూర్య రథాన్ని చుట్టుముట్టి ఉంటారు. యక్షులు రథయోజన చేస్తారు. రాక్షసులు రథాన్ని వెనుకనైపునుండి తోస్తుంటారు. వాలఖిల్యులనే పేరుగల బ్రహ్మర్షులు అరువదివేలమంది రథం ముందు నిలచి సూర్య భగవానునికి అభిముఖులై త్రయీమూర్తిని ప్రస్తుతిస్తుంటారు.

మహాభారతం , ఆదిపర్వంలోని శ్లోకాలలో (65-15,16) చెప్పబడిన పేర్లు:
ధాతా మిత్రః ఆర్యమా శక్రో వరుణ స్త్వంశ ఏవచ
భగో వివస్వాన్ పూషా చ, సవితా దశమస్తథా
ఏకాదశస్తథా త్వష్టా, ద్వాదశో విష్ణురుచ్యతే
జఘన్యజస్తు సర్వేషా మాదిత్యానా గుణాధికః
(ధాత, మిత్ర, ఆర్యమ, శక్ర, వరుణ, అంశ, భగ, వివస్వాన్, పూష, సవిత, త్వష్ట, విష్ణువు)

"ఆదిత్యానామహం విష్ణుః" - ఆదిత్యులలో నేను విష్ణువును - అని భగవద్గీతలో (10-21) చెప్పబడింది.🌹

Wednesday, October 24, 2018

ఏది చదివితే ఏమి ఫలితం వస్తుంది ?

నిత్యము భగవాన్ నామస్మరణ వలన ఎన్నో పాపాలు నశించి , మరణ అనంతరం పుణ్య లోకాలు పొందుతాము ...

💠 గణనాయకాష్టకం - అన్ని విజయాలకు !!
💠 శివాష్టకం - శివ అనుగ్రహం !!
💠 ఆదిత్యహృదయం - ఆరోగ్యం , ఉద్యోగం !!
💠శ్రీరాజరాజేశ్వరి అష్టకం - సర్వ వాంచసిద్ది !!
💠 అన్నపూర్ణ అష్టకం - ఆకలి దప్పులకి !!
💠 కాలభైరవ అష్టకం - ఆధ్యాత్మిక జ్ఞానం , అద్భుత జీవనం !!
💠 దుర్గష్టోత్తర శతనామం - భయహరం !!
💠 విశ్వనాథ అష్టకం - విద్య విజయం !!
💠 సుబ్రహ్మణ్యం అష్టకం - సర్పదోష నాశనం , పాప నాశనం !!
💠 హనుమాన్ చాలీసా - శని బాధలు , పిశాచపీడ !!
💠 విష్ణు శతనామ స్తోత్రం - పాప నాశనం , వైకుంఠ ప్రాప్తి !!
💠 శివ అష్టకం - సత్కళత్ర , సత్పురుష ప్రాప్తి !!
💠 భ్రమరాంబిక అష్టకం - సర్వ శుభప్రాప్తి !!
💠 శివషడక్షరి స్తోత్రం - చేయకూడని పాప నాశనం !!
💠 లక్ష్మీనరసింహ స్తోత్రం - ఆపదలో సహాయం , పీడ నాశనం !!
💠 కృష్ణ అష్టకం - కోటి జన్మపాప నాశనం !!
💠 ఉమామహేశ్వర స్తోత్రం - భార్యాభర్తల అన్యోన్యత !!
💠 శ్రీ రామరక్ష స్తోత్రం - హనుమాన్ కటాక్షం !!
💠 లలిత పంచరత్నం - స్త్రీ కీర్తి !!
💠 శ్యామాల దండకం - వాక్శుద్ధి !!
💠 త్రిపుర సుందరి స్తోత్రం - సర్వజ్ఞాన ప్రాప్తి !!
💠 శివ తాండవ స్తోత్రం - రథ గజ తురంగ ప్రాప్తి !!
💠 శని స్తోత్రం - శని పీడ నివారణ !!
💠 మహిషాసుర మర్ధిని స్తోత్రం - శత్రు నాశనం !!
💠 అంగారక ఋణ విమోచన స్తోత్రం - ఋణ బాధకి !!
💠 కార్యవీర్యార్జున స్తోత్రం - నష్ట ద్రవ్యలాభం !!
💠 కనకధార స్తోత్రం - కనకధారయే !!
💠 శ్రీ సూక్తం - ధన లాభం !!
💠 సూర్య కవచం - సామ్రాజ్యంపు సిద్ది !!
💠 సుదర్శన మంత్రం - శత్రు నాశనం !!
💠 విష్ణు సహస్ర నామ స్తోత్రం - ఆశ్వమేధయాగ ఫలం !!
💠 రుద్రకవచం - అఖండ ఐశ్వర్య ప్రాప్తి !!
💠 దక్షిణ కాళీ - శని బాధలు , ఈతిబాధలు !!
💠 భువనేశ్వరి కవచం - మనశ్శాంతి , మానసిక బాధలకు !!
💠 వారాహి స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!
💠 దత్త స్తోత్రం - పిశాచ పీడ నివారణకు !!
💠 లాలిత సహస్రనామం - సర్వార్థ సిద్దికి !!

⭐⭐⭐ పంచరత్నం - 5 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ అష్టకం - 8 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ నవకం - 9 శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ స్తోత్రం - బహు శ్లోకాలతో కూడినది !!
⭐⭐⭐ శత నామ స్తోత్రం - 100 నామాలతో స్తోత్రం !!
⭐⭐⭐ సహస్రనామ స్తోత్రం - 1000 నామాలతో స్తోత్రం !!

పంచపునీతాలు
⭐ వాక్ శుద్ధి
⭐ దేహ శుద్ధి
⭐ భాండ శుద్ధి
⭐ కర్మ శుద్ధి
⭐ మనశ్శుద్ధి

💠 వాక్ శుద్ధి :
వేలకోట్ల ప్రాణాలను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక మనిషికే ఇచ్చాడు .... కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు .... పగ , కసి , ద్వేషంతో సాటి వారిని ప్రత్యక్షంగా కానీ , పరోక్షంగా కానీ నిందించకూడదు .... మంచిగా , నెమ్మదిగా , ఆదరణతో పలకరించాలి .... అమంగళాలు మాట్లాడే వారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి ....

💠 దేహ శుద్ధి :
మన శరీరం దేవుని ఆలయం వంటిది .... దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ , రెండు పూటలా స్నానం చెయ్యాలి .... చిరిగిన , అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు ....

💠 భాండ శుద్ధి :
శరీరానికి కావలసిన శక్తి ఇచ్చేది ఆహారం .... అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి .... స్నానం చేసి , పరిశుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమైనది ....

💠 కర్మ శుద్ధి :
అనుకున్న పనిని మధ్యలో ఆపిన వాడు అధముడు .... అసలు పనినే ప్రారంభించని వాడు అధమాధముడు .... తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తి చేసిన వాడు ఉన్నతుడు ....

💠 మనశ్శుద్ధి :
మనస్సును ఎల్లప్పుడు ధర్మ , న్యాయాల వైపు మళ్ళించాలి .... మనస్సు చంచలమైనది .... ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది .... దాని వల్ల అనేక సమస్యలు వస్తాయి .... దీని వల్ల దుఃఖం చేకూరుతుంది .... కాబట్టి ఎవ్వరికి హాని తలపెట్టని మనస్తత్వం కలిగి ఉండటమే మనఃశుద్ధి ...

⏩ ఆహారంలో భక్తి ప్రవేశిస్తే ప్రసాదమౌతుంది !!
⏩ ఆకలికి భక్తి తోడైతే ఉపవాసమౌతుంది !!
⏩ నీటిలో భక్తి ప్రవేశిస్తే తీర్థమౌతుంది !!
⏩ యాత్రకి భక్తి తోడైతే తీర్థయాత్ర అవుతుంది !!
⏩ సంగీతానికి భక్తి కలిస్తే కీర్తనమౌతుంది !!
⏩ గృహంలో భక్తి ప్రవేశిస్తే దేవాలయమౌతుంది !!
⏩ సహాయంలో భక్తి ప్రవేశిస్తే సేవ అవుతుంది !!
⏩ పనిలో భక్తి ఉంటే పుణ్యకర్మ అవుతుంది !!
⏩ భక్తి ప్రవేశిస్తే మనిషి మనీషి అవుతాడు !!

ఆస్వయుజ పూర్ణిమ–వాల్మీకి జయంతి.

అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది...

సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...

దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ...ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా,

"అమ్మో , నాన్నో" అని అరిచేవాడు ...

చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు...

ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు...

తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు, పూజించేవాడు. ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు.

దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది.నమ్మకమే జీవిత నావకు దిక్చూచి ఈ విశ్వములో రకరకాల మనుషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి. పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారి.

అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?

అవి ఎలా ఉద్భవించాయి ?

అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు.ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు...

ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున.

ఇక్కడ మనము (Valmiki saint)వాల్మీకి మహర్షి,
వాల్మీకి జయంతి---గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం.

మహా పుణ్య కవి , రామాయణాన్ని అందించిన వాల్మీకిమహర్షి కారణజన్ముడు.

వాల్మీకి జీవితం ఎంతో విలక్షణమైనదని, వాల్మీకి తన జీవిత కాలంలో పాపా, పుణ్య కర్మలను ప్రక్షాళన చేశాడు , తన రామాయణ ఇతిహాసం. మానవుడు రచించిన తొలి గ్రంథము , చారిత్రక పురుషుడైన రఘురాముని గురించి ఇతని సమకాలం గురించి చెప్పడమే కాకుండా కథనం మధ్యమంగా ఆనాటి భౌగోళిక విషయాలను క్రోడీకరించాడు.

ఆస్వయుజ పూర్ణిమ – వాల్మీకి జయంతి:

సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కధ. దీనిని "సీతాయాశ్చరితం మహత్" అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకములతో కూడిన రామాయణము భారతదేశము, హిందూ ధర్మముల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకములు, ఆచారములపై అనితరమైన ప్రభావము కలిగియున్నది. రామాయణములో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడినది. తండ్రీకొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని-సేవకులు, మిత్రులు, రాజు-ప్రజలు, భగవంతుడు-భక్తుడు - వీరందరి మధ్య గల సంబంధబాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణములో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయములో రామాయణములోని పాత్రలు ఆదర్శజీవనమునకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును.

రామాయణ మహాకావ్యము ఆరు కాండములు (భాగములు)గా విభజింప బడినది. వాల్మీకి వ్రాసిన రామాయణం రాముని కధకు ప్రధానమైన ఆధారం. ఇంతే గాక విష్ణుపురాణములో రాముడు విష్ణువు యొక్క ఏడవ అవతారము అని చెప్పారు. భాగవతం నవమ స్కంధములో 10, 11 అధ్యాయాలలో రాముని కధ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించిన అనేక గాధలున్నాయి. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.

చరిత్ర :

త్రేతాయుగములో గంగానదీ తీరములో నైమికారణ్యములో అనేకమంది మునులు ఆశ్రమములు నిర్మించుకొని నియమ నిష్టలతో తపస్సు చేస్తూ ఉండేవారు. మునీశ్వరులందరూ బ్రాహ్మణ కుటుంబాలకు చెందివారే. అందులో ఒక ముని పేరు ప్రచస్థాముని .. .. ఇతనికి ఒకకుమారుడు ... పేరు " రత్నాకరుడు "  ఒకరోజూ రత్నాకరుడు ఆడుకుంటూ అడవిలో దారితప్పి ఎటుపోవాలో తెలియ భయము ఏడుస్తూ ఉన్న సమయాన ఆ దారినిపోయిన ఒక వేటగాడు ... ఈ పిల్లవాడిని ఓదార్చి తనవెంట తన నివశిస్తున్న గుడెసె తీసుకు పోయి , తనకు పిల్లలు లేనందున తన కొడుకుగా పెంచుకోసాగెను. ప్రచస్ఠా ముని తన భార్యతోకూడి కుమారుని కొరకు వెదికి దొరక పోయేసరికి , ఏ క్రూరజంతువు తినిఉంటుందని భావించి పుత్రశోఖం తో వెనుదిరిగి తమ ఆశ్రమానికి వెళ్ళిపోయారు.

ఇక్కడ బోయకుటుంబానికి చెందిన వేటగాడు , అతని భార్య తమ సొంత కొడుకు గానే రత్నాకరుడు ని పెంచి పెద్దచేసారు. విలువి్ద్యలో మంచి ప్రావీణ్యము , వేట లో నైపుణ్యము సంపాదించిన రత్నాకరుడు మంచి తెలివైనవాడు . తన వేట నైపుణ్యము తో ఆ అడవి లోని పక్షులకు , జంతువులకు యముడుగా తయారయ్యాడు . యవ్వనము వచ్చిన రత్నాకరునికి బోయ   తల్లిదండ్రులు వారి వంశములోని అమ్మాయిని చూసి పెళ్ళిచేసారు. కొంతకాలానికి ముగ్గురు పిల్లతో రత్నాకరుడి కుటుంబము పెద్దది కావడము వలన తన సంపాదన పెంచుకొనేనిమిత్తము  దారిదోపిడి , దొంగతనము లను వృత్తిగా తీసుకొని అవసరమైన చోట బాటసారులను చంపి ధనాన్నిదోచుకుని తన కుటుంబము హాయిగా బ్రతికేందుకు పాటుపడేవాడు .

ఒకరోజు అడవి దారిలో ఒకచోట కూర్చోని బాటసారులకోసము పొంచి ఉన్న సమయాన ఆ దారిన " నారద మహర్శి " రావడము జరిగింది. నారద ముని సర్వసాదారణ మానవరూపలో ఉన్నందున రత్నాకరుడు దోచుకునే ప్రయత్నము చేయగా ... తన దగ్గర వీణా , రుద్రాక్షలు , కాషాయ వస్త్రాలు తప్ప ఏమీ లేవని తెలిపినా ... వినక చంపివేయదును అని భయపెట్టసాగెను.

అప్పుడు ఓ బోయవాడా ... దొంగతనము , దోపిడీలు, ఇతరులను హించించి హత్యచేయడము పాపము అని హితబోద పలికినా నమ్మలేదు . " నీవు ఇన్ని పాపకార్యములు ఎవరికోసము చేయుచున్నావని అడుగగా" ... తన కుటుంబపోషనకొరకై తెలిసిన విద్య ఇది ఒక్కటే ... పాప పుణ్యాలు నాకు తెలియవు . అప్పుడు నారదముని ఆ బోయవానికి జ్ఞానోదయము కలిగించే ఉపాయము ఆలోచించి ...

" ఓ బోయవాడా నీవు చేయు ఈ పాపాలు నీ కుటుంబ సబ్యులు ఎవరైనా పంచుకుంటారేమో అడిగి తెలుగుకోమని తనతో నారదముని ఆ బోయ ఇంటికివెళ్ళి .. పాపాలు పంచుకుంటారేమో అడుగగా తల్లి దండ్రులు గాని , భార్యా బిడ్డలు గాని అందుకు సమ్మతించగపోగా ... కుటుంబపోషణ ఇంటి యజమాని బాధ్యత అని పాపమో , పుణ్యమో అది తనవరకే గాని , తీసుకున్నా వీలు పడదని , పాప పుణ్యాలు ఒకరినుంది ఇంకొరికి ఇవ్వనూలేము , తీసుకోనూలేము అని వారి నిస్సహాయతను తెలియజేసిరి.

ఆ మాటలు విన్న రత్నాకరుడు పశ్చ్యాత్తాపము చెంది , పాపవిముక్తికై ఉపాయము చెప్పమని నారదుని వేడుకొనెను . అప్పుడు నారదుడు తన నిజ రూపాన్ని బోయవానికి చూపించి భక్తి మార్గానికి " మరా మరా " అనే రెండక్షరాల మంత్రాన్ని బోధించెను . అప్పటినుంది నైమికారణ్యము లో రామ రామ రామ మంత్రము తో కొన్ని సంవత్సరాలు తపస్సు చేయగా తనచుట్టూ మట్టి పుట్టలా కప్పివేయడము జరిగింది. బయట తిరిగే బాటసారులెవరికీ తను  కనబడడము జరుగలేదు. నారద మహర్షి తనకున్న దేవతా శక్తులతో రత్నాకరుని కుటుంబానికి ధన , ధాన్య , అశ్వర్యములను ప్రసాదించెను . నారదమునికి తెలుసు ఈ రత్నాకరుడు కారణజన్ముడని .. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత నారదముని తిరిగి అదే దారిన కావాలనే వచ్చి రత్నాకరుడున్న పుట్టను తెరచి , చిక్కి బక్కై , బయటి ప్రపంచముతో సంబంధము లేని ఆ రత్నాకరుని చెవులో రామ రామ రామ అని పలుకగా కళ్ళు తెరచిన ఆ రత్నాకరుని ఆపాదమస్తం ను తన మృదువైన చేతులతో తడివి పునీతము గావించెను. " ఓ రత్నాకరా నీవు గొప్ప తపశ్సాలివి అయ్యావు . దేవుడు నిన్ను కరుణిచాడు . నీవు మళ్ళీ జన్మించావు ., ఈ పుట్తనుంది పుట్టేవు కావున నీవు  ' వాల్మీకి ' గా పిలువబడుతూ లోక కణ్యానము కోసము మంచి కావ్యాన్ని వ్రాసెదవు అని " దీవించి అదృశ్యమయ్యెను. నాటినుంది వాల్మీకి ఎంతోమంది శెస్యులతో తన జీవితాన్ని గడుపసాగెను.

వాల్మీకి వలస :

అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం (నల్లమల అడవులు) గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ.



{Courtesy with:
Dr.Seshagirirao Vandana - MBBS(Srikakulam),

Saturday, October 20, 2018

గురుశబ్దం త్రిమూర్తితత్త్వం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |
గురురేవ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః ||

గురుశబ్దం త్రిమూర్తితత్త్వం. సృష్టి, స్థితి, లయకారం, అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడు గురువు. గురూ అనే శబ్దాన్ని విడదీస్తే ‘గ్ – ఉ – ర్ – ఉ’ అనే అక్షరాలు కనబడుతుంటాయి.వీటిలో ‘గ’ కారం సిద్ధకమైన బ్రహ్మకు, ‘ర’కారం పాపనాశకరమైన శివశాక్తికి సంకేతాలు. ఈ రెండూ పాలస్వభావం కలిగిన ‘విష్ణుశక్తి’తో కలిసినప్పుడే ‘గురు’ అనే పదం ఏర్పడి ‘గురు’తత్త్వం మూర్తీభవిస్తుంది. అందుకే గురువును మనం త్రిమూత్రిస్వరూపంగా భావిస్తూ పూజించుకుంటున్నాం.

‘గురి’ని కల్పించేవాడు గురువు. లక్ష్యసాధనామార్గాన్ని చూపేవాడే గురువు అని స్థూలార్థం. గురువు పరంపరాగత క్రమశిక్షణగలవాడైతే, శిష్యునకు ఉపదేశ మివ్వడానికి అర్హుడనీ, అతడే సద్గురువు అని భావించాలి. శిష్యుడు గురువును గురువుగా ఎన్నుకున్నంత మాత్రానికే, ఆయన వెంటనే గురువు కాజాలడు. ఆయన కూడా అతడిని శిష్యునిగా ఎన్నుకోవాలి. తన గురువును ఎన్నుకునే అధికారం శిష్యునికి ఉన్నట్లే, శిష్యుని ఎంపిక చేసుకునే అధికారం గురువుకు ఉంది. నిదానించి, పరిశీలించి శిష్యార్హతను నిర్ణయిస్తాడు గురువు.

గురువు నడుచుకోవలసిన ప్రవర్తనా నియమావళి అంటూ ఉంటుంది. కానీ, ఏదో ఒకనాడు ఆ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించినట్టు కనబడితే, శిష్యులు తమ నిర్ణయాన్ని మార్చుకుని మరో గురువుకై అన్వేషిస్తారు. అటువంటివారు ఉభయభ్రష్టులవుతారు. కావున శిష్యులు తమ హృదయాలను నిష్కల్మషంగా ఉంచుకుని సహజమైన శాంతి, తృప్తి, సహనాన్ని కలిగి ఉండాలి. సత్త్వగుణ సంపన్నుడైన గురుస్థానం శివస్థానంగా ఎంచి తన హృదయాన్ని పరిపూర్ణంగా గురువుకి అంకితమివ్వాలి. అదే శిష్యుని నిజమైన గురుత్వం. అలాగే గురువు కూడ ‘గురుతత్త్వం’ కలిగి ఉండాలి. తనను పరిపూర్ణంగా విశ్వసించిన శిష్యునికి, తాను పరిపూర్ణంగా ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించాలి. అటువంటివారే సద్గురువులుగా భావించబడతారు.

కొంతమంది, గురువులను మూడు విధాలుగా పేర్కొన్నారు.

1. జన్మదాత (తండ్రి), 2. విద్యాగురువు, 3. మోక్షగురువు.
1. ఉపదేశ గురువు, 2. కులగురువు, 3. జగద్గురువు.
1. మాతా, 2. పితా, 3. ఆచార్యుడు.

ఈ ముగ్గురు గురువులలో విద్య నేర్పే గురువు అధికుడు. జీవుని యాత్రలో గురుయాత్ర గొప్పది. విశ్వామిత్రుడు బాలకులైన రామలక్ష్మణులను వెంటబెట్టుకుని వెళ్ళి అనేక అస్త్రవిద్యలను నేర్పి, బల, అతిబల విద్యలలో వారిని ఆరితేరులను గావించి, వారి సాయంతో నిర్విఘ్నంగా యజ్ఞాన్ని పూర్తి చేసి, అడ్డుగా వచ్చిన తాటకి, మారీచ సుబాహులు హతమారునట్లు చేశాడు. అదొక వనయాత్ర, సాహసయాత్ర లేక విజ్ఞానయాత్ర లేక శుభయాత్ర అని అనవచ్చు.

ఇక జ్ఞానాన్ని అందించే గురువులు ఐదుగురు – 1. పంచసంస్కార ప్రదాత, 2. బ్రహ్మప్రదాత, 3. ప్రబంధ ప్రదాత, 4. బ్రహ్మార్థప్రదాత, 5. పంచమోప్రాయప్రదాత.

ఇక ఆరు విధాలైన గురువులు: 1. ప్రేరకుడు, 2. సూచకుడు, 3. వాచకుడు, 4. దర్శకుడు, 5. బోధకుడు, 6. శిక్షకుడు.

అనంతరం అష్ట గురువులు:

1. అక్షరాభ్యాసాన్ని చేయించినవారు,
2. గాయత్రీ మంత్రోపదేశాన్ని చేయించినవారు,
3. వేదాధ్యయనం చేయించినవారు,
4. శాస్త్రాభ్యాసం చేయించినవారు,
5. పురాణేతిహాసాలను చెప్పినవారు,
6. మతాచార సంప్రదాయాలను బోధించినవారు,
7. ఇంద్రజాలాది మంత్రబోధకుడు,
8. బ్రహ్మజ్ఞానోపదేశికుడు.

వీరిలో చివరి గురువే (బ్రహ్మజ్ఞానోపదేశికుడు) మోక్షగురువు. మిగిలినవారు సఛ్చీళ జీవనయాత్ర సాగడానికి ఉపయోగపడేవారు.

ఇంకా . బొధగురువు, 2. వేదగురువు, 3. నిషిద్ధగురువు, 4. కామ్యకగురువు, 5. సూచకగురువు, 6. వాచకగురువు, 7. కారణగురువు, 8. విషిత గురువు అంటూ ఎనిమిది మంది గురువులున్నారు.

1. గూఢుడు, 2. దృఢుడు, 3. ప్రీతుడు, 4. మౌని, 5. సకృత్ కామగతుడు అనే పంచవిధ గురువులున్నారు.

ఇలా గురువుల గురించి ఎన్నో అపురూపమయిన విషయాలున్నాయి. ఇక, లోకంలో అనేకావతారాలున్నాయి. కాని, శ్రీదత్తావతారంలో గురు ప్రభావములు, గురు విలక్షణలు గ్రహింపదగినవి. జగద్గురువు అయిన తనకు కూడా ప్రవృత్తిమార్గాన్ని చూపిన గురువులున్నారని శ్రీగురుదత్తాత్రేయుడు భాక్తవరడుడైన ప్రహ్లాదునితో వివరించినట్లుగా మనకు తెలుస్తోంది.

“ప్రహ్లాదా! నా స్మృతిపథంలో ఉన్నవి అవి, అవి రెండే రెండు గురువులు. అవియే, ఎలా ఉండకూడదో చెప్పింది జుంటీగ. ఎలా ఉండాలో చెప్పింది కొండచిలువ. అనగా, జుంటీగ వైరాగ్యాన్ని నేర్పింది. కొండచిలువ సంతుష్టిని నేర్పింది” అని గూఢాతిగూడమైన గురుతత్త్వాన్ని బోధించాదు దత్తాత్రేయులు.

అలాగే, శ్రీకృష్ణపరమాత్మ ఆవిర్భవించిన యాదవ వంశానికి మూలపురుషుడైన “యదువు” అనే మహారాజునకు ఒకప్పుడు శ్రీఅవధూత దత్తస్వామి దర్శనం లభించింది. వారిలో చీకూచిన్తలేని స్థితిని చూసిన యడురాజు, “స్వామీ! అంతర్గతంగా ఏ ధర్మాన్ని ఆశ్రయించి ఉండటం వలన మీకీ స్థితి లభించింది? దయతో నాకు ఉపదేశించండి” అని అభ్యర్థించాడు.

అతని మాటలోనున్న ఆర్తిని, వినయాన్ని చూచిన శ్రీ అవధూత ఇలా సమాధానమిచ్చారు.

“యదురాజా! నేను లోకాన్ని విస్తృతంగా పరిశీలించి, ఎందరెందరో గురువుల నుండి రవ్వంత జ్ఞానాన్ని సంపాయించాను. రాజా! నాకు ఇరువది నలుగురు గురువులున్నారు. జాగ్రత్తగా విను. 1. భూమి, 2. వాయువు, 3. ఆకాశము, 4. నీరు, 5. అగ్ని ఇవియే పంచభూతాలు. మరియు – 6.సూర్యుడు, 7. చంద్రుడు, 8. పావురాలు, 9. అజగరము(కొండచిలువ), 10. సముద్రము, 11.మిడత, 12. తుమ్మెద, 13. గజము, 14. మధుహారి (తేనెటీగ), 15. లేడి, 16. చేప, 17. ‘పింగళా’ – అనే వేశ్య, 18. కురరము (లకుముకిపిట్ట), 19. బాలుడు, 20. బాలిక, 21. శరకారుడు, 22. సర్పము, 23. సాలీడు, 24. పురుగు ఇవి నా గురువులు.

వాటి నుండి గ్రహించినది విను.

భూమి నుండి – క్షమా, పరోపకారత్వం
వాయువు నుండి – నిస్సంగత్వము, నిర్లేపత్వము
ఆకాశము నుండి – సర్వవ్యాపకతత్త్వం
జలం నుండి – నిర్మలత్వం, మాధుర్యం, స్నిగ్ధత్వం
అగ్ని నుండి – తేజస్సు, ఈశ్వరతత్త్వం
సూర్యుని నుండి – జలగ్రాహి, జలత్యాగియు. లోక బాంధవుడతడు. సర్వలోకాలకు అతడొక్కడే.
చంద్రుని నుండి – వ్రుద్ధిక్షయాల రూపుడు, అట్టివి షడ్భావ వికారాలు దేహానికేకాని, తనకు (ఆత్మకు) కావని చంద్రుడు నేర్పించాడు.
పావురాల జంటనుండి – కామక్రోధాలకు వశమైనచో ‘ఆత్మానురాగం’ కోల్పోతారని గ్రహింపు.
అజగరము నుండి – దైవికంగా లభించినదానికి తృప్తి చెంది, ఆత్మనిష్ఠ కలడైయుంటుంది.
సముద్రం నుండి – తనలో దేన్నీ ఉంచుకోదు. అపవిత్రమైనది కల్మషమైనదియు అనగా అడియోగాతత్త్వం కలది. కామాన్నీ, వికారాన్నీ కూడా తనలో చేరనీయదు. తన మనోభావాన్ని బైటకు పొక్కనీయదు.
మిడత నుండి – మ్రుత్యురూపమైన మోహమనెడి జ్వాలాగ్నికి బలియవడం, సుఖమను తలంపుతో మృత్యురూపం పొందుతుంటుంది.
తేనెటీగ నుండి – ఏ పూవును కూడ బాధించకుండ తను పొందాల్సినదానిని (మధురమును) పొంది జీవిస్తుంది. యోగి కూడ ఎవరిని నొప్పించకుండా భిక్ష గ్రహించి పోషించుకొంటాడు. ప్రతి పుష్పాన్ని వదలక ఉండటమనేది, ముని ప్రతీ శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, నేర్పుతో సారాన్ని గ్రహించడం, కానీ, కూడబెట్టిన మధుసంపద రేపటికిని ఉంచుకొంటే అది పరుల సోత్తగునని గ్రహించదు. అందుకే ముని తాను పొందిన భిక్ష మరునాటికని ఉంచుకొనడు. ఉంచుకొన్నా అది పనికిరానిదవుతుంది కదా!
గజం నుండి – తానెంత బలిష్ఠమైనదో, అంట మ్రుత్యురూపమగు మోహంగలది. అనగా స్త్రీలౌల్యం కలది. ఆ మోహంలోపడి తాను ఇతరులకు వశమవుతుంది.
మధుహారి నుండి – ఇతరులు కూడబెట్టుకొనిన వస్తువు (మధువు)ను, లోభం చేత న్యాయాన్యాయాలు లెక్కించక, అపహరించువాడు కడు నీచుడు.
లేడి నుండి – అమాయకత్వంలో సంగీతంమోజుతో వేటగానికి చిక్కుతుంది, ఋష్యశృంగముని సంగీత నాట్యాలకు భ్రమసి మాయ వలలో పడ్డాడు.
చేప నుండి – ‘ఎర’కు (జిహ్వ) చాన్చాల్యంతో ఇంద్రియనిగ్రహం కోల్పోయి గాలానికి చిక్కుతుంటుంది. ‘జిహ్వ’ కానరాని దొంగ కదా!
పింగళ నుండి – ధనాశతో కాలహరణం, భౌతిక వాంఛకు శరీరాన్ని భ్రష్టత్వమొనర్చుకొనుట.
కురరము నుండి – తనకు ప్రియమైనది, ఇతరులకు ప్రియమైనది లెక్కించక పోటీపడుటలో పొందు దుఃఖము.
బాలుడు నుండి – యోగితో సమానుడు. పాప పుణ్యాలు ఎరుగనివాడు. భగవత్ర్పాప్తి వల్ల నిరుద్యముడై ఉంటాడు.
కన్యక నుండి – తనకున్న లేమిని కనబరచకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడుకొంటుంది.
శరకారుడు నుండి – ఏకాగ్రతను సాధిస్తాడు.
సర్పము నుండి – ఈ శరీరం క్షణ భంగురమని, తనకంటూ ఒక గృహము ఏర్పరచుకోదు.
సాలెపురుగు నుండి – పరబ్రహ్మతత్త్వం తెలియును. సృష్టిలయములు క్రియస్వరూపి.
పురుగు నుండి – రోదచేస్తున్న తుమ్మెదనే చూస్తూ మనస్సనంతయు ఆ తుమ్మెదవైపు లగ్నమొనర్చినా, కొంతసేపటికి, తాను ఆ తుమ్మెద రూపం పొందుతుంది. అనగా భక్తుడు దేనిపై లగ్నమొనర్చునొ అటుల రూపధారి అవుతాడు. ఉదా|| భరతుడు. (శ్రీరాముని తమ్ముడు).
అలాగే, అనకు ప్రతీ అణువు గురువేయని, తనలోని మనస్సే తనగురువని కూడ చాటాడు అవధూత శ్రీదత్తాత్రేయులు. ఇక, ఆచార్యులు జ్ఞానంతో పాటూ సదనుష్టానాన్ని కలిగివుండాలి. అటువంటి ఆచార్యులకు చక్రవర్తియైనప్పటికీ తలొంచవలసిందే. ఆ రోజుల్లో గురువులకు ఈ క్రింది లక్షణాలు ఉండేవి.

శిష్యవాత్సల్యం
విషయపరిజ్ఞానం
బోధనా కౌశలం
మనస్తత్త్వాన్ని తెలుసుకుని ఉండటం అనే లక్షణం
అందరిపట్ల సమభావాన్ని కలిగి ఉందటం
అయితే, ప్రస్తుత గురువులలో చాలామంది ‘చెవిలో మంత్రం చేతిలో ధనం’ అన్నట్లుగా ఉంటున్నారు. ఇది భవిష్యతరాలకు మంచిది కాదు. శిష్యులు కూడ గురువుల పట్ల భక్తిప్రపత్తులతో మెలగాలి. అప్పుడే మన జీవితానికైన జ్ఞానార్జన లభిస్తుంది.

Thursday, October 18, 2018

Duserra - Dasha Hara

Dasha Hara is a Sanskrit word which means removal of ten bad qualities within you....

Ahankara (Ego)
Amaanavta (Cruelty)
Anyaaya (Injustice)
Kama vasana (Lust)
Krodha (Anger)
Lobha (Greed)
Mada (Over Pride)
Matsara (Jealousy)
Moha (Attachment)
Swartha (Selfishness)

Hence, also known as 'Vijaydashami' signifying 'Vijaya' over these ten bad qualities. All those who have these 10 qualities is only Ravana. One who fight these inner qualities becomes Lord Rama

Wednesday, October 17, 2018

మంత్రపుష్పం ఎందుకు చదువుతారంటే

దేవాలయంలో పూజ చేసేటప్పుడు మంత్రపుష్పం చదువుతారు కదా.. ఆ పరమాత్మ సర్వత్రా వున్నాడని చెప్పటమే ఆ మంత్రపుష్పం ఉద్దేశ్యం. మన లోపల, బయట కూడా వ్యాపించి వున్న ఆ దేవదేవుడు మన శరీరంలో ఏ రూపంలో వున్నాడో చెబుతుంది మంత్రపుష్పం.

‘‘మన శరీరంలో ముకుళించుకుని వున్న కమలంలో నాభి పైభాగంలో హృదయ కమలం వుంది. దానికి మొట్టమొదటి భాగాన అగ్నిశిఖలో పసుపు రంగుతో వడ్ల గింజ మొనలా దేవదేవుడు అణు రూపంలో వున్నాడని వర్ణించబడింది’’

చేతిలో పుష్పాలని తీసుకుని మంత్రపుష్పం పూర్తయిన తర్వాత, ఆ పుష్పాలని భగవంతునికి సమర్పించి, నమస్కరించి, ఆ పుష్పాలని మన శిరస్సు మీద వేసుకుంటే ఆ దైవశక్తి మనలోకి ప్రవేశిస్తుందిట.

మనలోనే వున్న పరమాత్మ ఉనికిని తెలియజేసి నేను, పరమాత్మ ఒక్కటే అనే అద్వైత భావం కలిగించే మంత్రపుష్పాన్ని ఈసారి విన్నప్పుడు కళ్ళు మూసుకుని మీలోని ఆ పరమాత్మని దర్శనం చేసుకోండి

ఇంకొక వర్ణన:

మంత్రపుష్పం

మంత్రం అంటే పాముకాటు లేదా తేలుకాటు నివారణకు ఉచ్చరించే పదాలు కావు. క్షుద్రశక్తులు ఉన్నాయని, వాటి నివారణకూ కొన్ని మంత్రాలున్నాయని కొందరు నమ్ముతారు. మరికొందరు నమ్మబలుకుతారు. నిజానికి మంత్రం అనేది పవిత్రమైన ఉచ్చారణ. అది భావగర్భితమైన అక్షరమని శ్రీరామానుజులు వెల్లడించారు.
మంత్రాక్షరాల ఉచ్చారణ వల్ల, పరిసరాల్లో నిర్వచనానికి అందనంతగా ప్రకంపనలు కలుగుతాయని అధర్వ వేదం చెబుతోంది. ‘మన్‌’ అంటే మానసికం, ‘త్ర’ అంటే సాధనం అని వేదవిజ్ఞానం వివరిస్తోంది. విస్తృత అర్థంలో, మంత్రం అనేది మానసిక సాధనం. మంత్రాలన్నీ వేదాల్లోని భాగాలు. యజుర్వేదంలోని వేలాది మంత్రాల సమాహారమే మంత్రపుష్పం!
యజుర్వేదానికి చెందిన తైత్తరీయ ఆరణ్యకంలో మంత్రపుష్పం వివరాలున్నాయి. సర్వసామాన్యంగా యజ్ఞయాగాల సమయంలో మంత్రపుష్పాన్ని చదువుతారు. జీవజాలానికి జలం ఎంత అవసరమో, అది ఎంత పవిత్రమైందో మంత్రం విశదీకరిస్తుంది. నీరు సర్వవ్యాపకమైన మూలకమని మంత్రంలో ఉంది. జలం భగవంతుడితో సమానం. అది జీవరాశులన్నింటినీ పునీతం చేస్తుందంటోంది మంత్రపుష్పం!
నీరు ఇహానికి, పరానికి సంబంధించింది. నదులన్నీ సముద్రంలో కలిసినట్లు, భూమిపై జలాలన్నీ పారమార్థిక జలాల్లో విలీనమవుతాయి. వాటి పరిపూర్ణ జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుందన్నది మంత్రపుష్ప సారాంశం.
పరమ పురుషుడే మంత్రపుష్పాన్ని తొలుత ఉచ్చరించాడంటారు. అలా వ్యక్తమైన మంత్రాన్ని సమస్త ప్రాణికోటికి అందించేందుకు ఇంద్రుడు అన్ని వైపులా వ్యాపింపజేశాడట. మోక్షమార్గానికి మంత్రపుష్పాన్ని మించింది లేదని యజుర్వేదం వెల్లడిస్తోంది. అన్ని శుభాల్నీ కలగజేసే శ్రీమన్నారాయణుడికి నమస్కారం అనే శ్లోకపాదం మంత్రపుష్పంలో కనిపిస్తుంది. నారాయణుడే విశ్వానికి జీవనాధారమని, ఆయన మంగళకరుడు, నాశరహితుడని మంత్రపుష్పంలోని మూడో శ్లోకం చెబుతుంది. చీకటివెలుగులు సూర్యుడి వల్ల సంభవిస్తాయి. ఆ సూర్యుణ్ని సృష్టించింది శ్రీమన్నారాయణుడే! అందుకే ‘దైవం పరంజ్యోతి’ అంటారు. ఆయనే పరబ్రహ్మ. ధ్యానం, అది చేసేవాడు- రెండూ నారాయణుడే అని మంత్రపుష్ప సారాంశం.
సూర్య కుటుంబం వంటి సౌర వ్యవస్థలు కోటానుకోట్లు ఉన్నాయని, వాటన్నింటి సమ్మేళనమే బ్రహ్మాండమని, అందులో మన జగత్తు చాలా స్వల్పమైనదని మంత్రపుష్పం తెలియజేస్తుంది. మనిషి తానే శక్తిమంతుడినని భావిస్తాడు. అతడి కంటే భూమి గొప్పది. భూమి కంటే సూర్యకుటుంబం మరెంతో పెద్దది. అలాంటి కుటుంబాలే కోట్లలో ఉన్నాయంటే... బ్రహ్మాండంలో మనిషి స్థానమెంత? పరమాత్మ ముందు మన స్థాయి ఏపాటిదో మంత్రపుష్పం స్పష్టం చేస్తుంది. ఇది తెలుసుకొంటే, మనిషిలోని అహంభావం అంతరిస్తుంది. అహం తొలగిన అందరికీ శ్రీమన్నారాయణుడు భవబంధాల నుంచి విముక్తి కలిగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.
మంత్రపుష్పం ప్రకారం- జఠరాగ్ని మధ్య సూక్ష్మమైన అగ్నిశిఖ పైకి ఎగసి ఉంటుంది. దాని నీలి జ్వాల మధ్య, ఉరుములోని వెలుగురేఖలా అణువుతో సమానంగా మెరుపు ఉంటుంది. అగ్నికి నీరు, నీటికి అగ్ని పరస్పర ఆశ్రయాలు. ఉదజని, ప్రాణవాయువుల కలయికే జలమని విజ్ఞానశాస్త్రమూ వెల్లడిస్తోంది. మానవాళికి సంతోషాన్ని కలగజేసే చంద్రుడే జలస్థానానికి అధిపతి. ఆయన సముద్ర మథనం సందర్భంలో ఉద్భవించాడు. అందుకే జలం చంద్రుడి స్థానం. జలం పుట్టడానికి మేఘమే కారణం. ఆ మేఘాలు నదికి స్థానాలని మంత్రాలు వివరిస్తున్నాయి.
పడవకు నీటికి ఉన్నట్లే, దైవానికి-మనిషికి మధ్య అన్యోన్యత ఉండాలి. సర్వ విద్యలకు, అన్ని జ్ఞానాలకు దేవదేవుడే అధిపతి. ఆకాశం నుంచి పడిన నీరు సముద్రానికి చేరుతుంది. అదేవిధంగా, భక్తులు ఏ దైవానికి నమస్కరించినా, అది కేశవుడికే చెందుతుందని మంత్రం చెబుతోంది. పరబ్రహ్మమే గొప్పవాడని, జగదానంద కారకుడైన ఆ దైవాన్ని స్మరిస్తే అన్ని బంధాల నుంచీ విముక్తి లభిస్తుందని వివరిస్తుంది మంత్రపుష్పం.

Tuesday, October 16, 2018

అమ్మను ఎలా ఆరాధించాలో చెప్పిన ఆది శంకరులు

జగద్గురువులు , శ్రీ ఆదిశంకరాచార్యులవారు మనలను ఉద్దరించడానికి అమ్మను ఎలా ఆరాధించాలో ఆయన తనకోసమని చెప్పుకుంటూ మనకు & మనని మనం ఉన్నతస్థితికి ఎదగడానికి చెబుతున్నారు*

సౌందర్యలహరి శ్లోకం

జపో జల్పః శిల్పం - సకలమపి ముద్రావిరచనా
గతిః ప్రాదక్షిణ్య-క్రమణ మశనాద్యాహుతివిధిః |
ప్రణామః సంవేశః - సుఖమఖిలమాత్మార్పణదృశా
సపర్యా పర్యాయ-స్తవ భవతు యన్మే విలసితమ్ || 27 ||

జ్ఞానయోగాభ్యాసనా సారము - ఆత్మార్పణమే దేవికి సముచితమైన అర్చన- ఏది చేసినా అంతా భగవతి పూజయే అని కవి విన్నవించుకొంటున్నాడు - "నా మాటలే మంత్రాలు, చేసే పనులన్నీ ఆవాహనాది ఉపచారాలు. నా నడకే ప్రదక్షిణం. నేను తినడమే నైవేద్యము. నిద్రించుటయే ప్రణామము. నా సమస్త కార్యములు నీకు పూజగా అవుగాక."

భావము:
అమ్మా...ఈ మహా సాగర సదృశ సంసార వ్యవహారాలలో పడి నీ జప ధ్యాన అర్చనాదికాలు మరచినా నీవు కినుక వహించి నా రక్షణభారాన్ని మరువవద్దు.చంటిబిడ్డ చేయు ఏ చేష్టకైనా తల్లి సంతోషించినట్టు నిస్సారమైన సంసారమందు సుఖం కోసం వెంపర్లాడుతూ నేను చేయు ఈ కర్మలన్నీ ,ఆత్మార్పణ దృష్టితో నీకై నేను చేయు నీ ఆరాధనలుగా నీవు స్వీకరించి నన్ను తరింపచేయి తల్లీ. అవి ఎటుల అనిన నా నోటితో పలుకు నా సంభాషణలన్నీ నీ మంత్రజపముగా భావించు.( అ కారము నుండి క్ష కారము వరకు ఉన్న వర్ణములన్నీ నీ మాతృకా బీజాక్షరములే కదా !) నేను హస్తములు కదుపుతూ చ్రయు సమస్త విన్యాసములను ముద్రలతో కూడిన నీ న్యాసములుగా అన్వయించుకో,స్థిరముగానుండక నేను చేయు సమస్త సంచార గమనమును,నీకై నేను ఆచరించు ప్రదక్షిణ విధిగా తలంచు.ఇక క్షుత్ పిపాసల ( ఆకలి దప్పిక) చేత నే స్వీకరించు సమస్త అన్న పానీయాదులు నాలో ఉన్న జఠరాగ్ని అను హోమగుండములో నీకై నేను సమర్పించు హవిర్భాగములుగా గ్రహించు.శ్రమచేత అలసి నిద్రావశుడనై పరుండు నా స్థితిని నీకు నేను చేయు సాష్టాంగ దండప్రణామముగా అందుకో..ఇటుల నేనుచేయు సకల కార్య కరణ చేష్టితములన్నియు నీ ఆరాధనా సపర్యలుగా స్వీకరించి నన్ను అనుగ్రహించు తల్లీ...భావనామాత్ర సంతుష్టా వందనం.

అమ్మా, భగవతీ! ఆత్మార్పణ దృష్టితో నేను చేసే సల్లాపం నీ మంత్ర జపంగాను, నా హస్త విన్యాసమంతా నీ అర్చనలో ముద్రా రచనగాను, నా స్వేచ్ఛాగమనం నీకు గావించే ప్రదక్షిణగాను, నా భోజనాదులు నీకు ఆహుతిగాను, నా శయనక్రియ నీకు ప్రణామంగాను, నా సుఖ లాలసాలన్నీ నీ పూజా విలసనముగాను అగుగాక! అలా అయ్యేట్లు నువ్వు నన్ను కరుణించు తల్లీ అని భావం.

ఈ శ్లోకములో జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు ఆత్మార్పణ దృష్టి అంటే ఏమిటో మనకు తెలియ జేస్తున్నారు. అత్భుతమైన శ్లోకము ఇది. రోజుకు ఒక్కసారైనా చదువుకోవడం మంచిది.

ముందరి కాళ్ళకు బంధం వేశారు జగద్గురువులు ఇక్కడ. ఆత్మార్పణ అని. ఆత్మార్పణ లేకుండా వూరికే మాటలు చెబితే లాభం లేదు అని. జగద్గురువులు చెప్పారు కదా అని పూజాదులు, అనుష్ఠానం లేకుండా, మానేసి, యోగం అనే పేరుతో అందరూ పైకి మాటలు చెబుతూ తప్పించు కొంటున్నారు. ఇది తగదని భావన రావాలి. నిజంగా అలా ఆత్మార్పణ దృష్టి కలిగి యుండాలి. మనం చేసే ప్రతి క్రియలోను, ప్రతి చేష్ట లోను ఆ బుద్ధి రావాలి, ఆ సమర్పణ రావాలి, అప్పడు అది అంతర్యాగము అవుతుంది. ప్రతి క్షణం, ప్రతి క్రియ లోను అమ్మా....అమ్మా అని కలవరించాలి, పలువరించాలి, కోటకలాడలి. అసలు ఆ స్పృహ కలగాలి. ఆ స్పృహ తో చేయాలి అప్పుడే అది ఆత్మ నివేదన అవుతుంది.
తల్లీ, నిదుర లేచి నప్పటి నుంచి ఏవేవో పనికి మాలిన మాటలు ఎన్నో మాట్లాడుతూ వుంటాను. నీ జపం చేయడానికి మాత్రం సమయం దొరకదు. మిగతా అనవసరమైన విషయములు, వ్యవహారిక విషయములు, మాట్లాడటానికి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. లలితా సహస్ర నామం చేయాలంటే మాత్రం మనస్సుకు సమయం దొరకదు. మూడు గంటలు సినిమాలు, సీరియల్స్ చూడటానికి సమయం దొరుకుతుంది కానీ నీముందు మోకరిల్లడానికి ఒక్క పది నిముషాలు దొరకదు గదా. టైమ్ లేదండీ అని అంటాము. వెదవది ఈ మనస్సు పట్టుకోదు గదా, అనవసరమైన బంధనాలలో చిక్కుకొని, కొన్నింటిని చేజేతులారా తగిలించుకొని మొహంతో, మాయతో తల్లడిల్లి పోయి, అదే శాశ్వతమని అల్లాడి పోతూ వుంటాము. ఏది శ్వాశ్వతం ఏది బంధం అని దీర్ఘంగా ఆలోచిస్తే నీ భార్యా భర్తలు, నీ తల్ల్లిదండ్రులు, మీ తాతా అమ్మమ్మలు, నీ సోదరీ సోదరులు, నీ వాళ్ళు, నీ ముఖ్య స్నేహితులు . వీళ్ళు నీ ముఖ్య బంధువులు. వీళ్ళను మించి మనము ఎక్కువ పెట్టుకోన్నామా అవి అన్నీ అనవసర బంధనాలు మాత్రమే, స్వార్ధ చింతనతో కూడిన అధర్మ బద్ద సాంగత్యాలు మాత్రమే. అవి కర్మ బంధనాలు. ఎంత తక్కువ చేసుకొంటే అంత మంచిది. కొన్ని మనము కోరి తెచ్చుకొంటాము, వాటితో అనవసరంగా బాధపడ్తూ ఉంటాము. విషయ బంధనాలు ఎంత తక్కువ చేసుకొంటే అంత మంచిది. బాహ్య ప్రపంచాన్ని చూసే వాడు లోపలికి చూడ లేడు, లోపలికి చూడడం నేర్చుకొన్నవాడు బయటకు చూడలేడు. అంటే బయట ప్రపంచం కనిపించదు. ప్రతి నిమిషం ఆ దేవ దేవుణ్ణి ఎలా స్మరించాలో ఇక్కడ గురువులు మనకు నేర్పిస్తున్నారు. ప్రతిది భగవత్ కైంకర్యముతో ముడి వేయాలి. సమర్పణ బుద్దితో చేయాలి అని చెప్పారు.

జపో జ

ల్పః శిల్పం సకలమపి ముద్రావిరచనా

జల్పము అంటే ఉపయుక్తము కాని మాటలు మాటలాడుట అంటే పనికి మాలిన మాటలు మాటలాడుట. వ్యర్ధ ప్రసంగము అని అర్ధము. అమ్మా భగవతీ, నిద్ర లేచి నప్పటి నుంచి పడుకొనే దాక నేను మాట్లాడే ప్రతి మాట, నీ జపం క్రింద లెక్క వేసుకో తల్లీ. నీ మంత్ర జపం చేస్తున్నాను అనుకో. అక్షర లక్షలు జపం చేసాడు ఈ నీ భక్తుడు అని వ్రాసుకో. నా మాటలు నీ మంత్ర జపము అగు గాక.
శిల్పం అంటే హస్త విన్యాసములు. అమ్మా నేను చేతులు అటు ఇటు త్రిప్పుతూ ఉంటా ఏమీ తోచక అవి అన్నీ నీ ముద్రలు అనుకో. శ్రీవిద్యలో శ్రీచక్రార్చన చేసేటప్పుడు దశ ముద్రలు ప్రదర్శించాలి. కాబట్టి అవి అన్నీ నాకు రావు, ఒకవేళ వచ్చినా ఓపిక లేదు. కాబట్టి నా హస్త క్రియాలాపములు అన్నింటిని నీ ముద్రలు క్రింద జమ కట్టుకొని సంతోషించు. ఏదోలే చిన్న పిల్లవాడు అని సర్దుకో. కోపగించకోకు నా పైన. నీ బిడ్డను అమ్మా నేను. (Navigation signals లాగ, తప్పకుండ శ్రీచక్రము ముందు ప్రదర్శించాలి.) మంత్రము లేకుండా దశ ముద్రలతో అమ్మను ఆవాహన, ఆసనాది క్రమములు చేయవచ్చును., పూజ పూర్తిచేయవచ్చును.

గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతి విధిః
అమ్మా భవానీ, నేను గతి తప్పి కాలు కాలిన పిల్లి లాగ అటు ఇటు నడిచే నా నడక నీకు ప్రదిక్షణం అగు గాక. నీకు పద్దతిగా, శాస్త్రీయముగా ముమ్మార్లు ప్రదిక్షణ చేశాను అని వ్రాసుకో తల్లీ. అశనము అంటే భోజనము అని అర్ధము. నేను తినే ఆహారము అంతయూ నీకు నివేదన అగుగాక, ఆహుతి అగు గాక. నా ఆకలి కోసం నేను తినే పదార్ధములన్నీ నీకు యజ్ఞ హవిస్సులు అగు గాక. నీకు సమర్పించాను అని అనుకో తల్లీ. ఎందుకంటే నా కడుపులో వుండి తింటున్నది నీవే కదా. జఠరాగ్ని రూపములో పచనము చేస్తున్నది నీవే కదా. అది లేక పోతే నేను తిన్నది నాకు అరగదు కదా. కాబట్టి నీకు సమర్పించాను అని అనుకో.

ప్రణామః సంవేశః సుఖమఖిలమాత్మార్పణదృశా
అమ్మా కాత్యాయనీ, నిద్ర పోయేటప్పుడు నాకు నేను వొళ్ళు తెలియకుండా అటు ఇటు దొర్లడం చేస్తూ ఉంటా, అవన్నీ నీకు నేను చేసే సాష్టాంగ దండ ప్రణామములు అని జమ కట్టుకో. మరలా నీ గుడికి వచ్చి నేను విడిగా చేయలేను, నీ చుట్టూ తిరగ లేను. సంవేశము అంటే నిద్ర పోవుట, పండుకొనుట.
అనుభవించమని, ఆనందించమని నీవు నాకు ప్రాసాదించిన సుఖ వస్తువులతో, పంచేంద్రియములతో నే జరుపు సరస కల్లాపము లన్నీ నీకు సమగ్రమైన, సంపూర్ణ మైన పూజ అగు గాక.
అలా అగునట్లు నీవు నన్ను అనుగ్రహించు అమ్మా. ఏదో తెలియని వాణ్ని, చేతకాని వాణ్ని, ఓపిక లేని వాడ్ని. బద్దకస్థుడ్ని.
కానీ అమ్మా నా మనసు మాత్రం నీ దగ్గరే వున్నది. నీ పాదాల చెంతనే వున్నది. నీ బిడ్డనమ్మా నేను. ఆత్మార్పణతో నే గావించే ఈ సమస్త క్రియలు నీ శ్రీచక్రార్చన అగుగాక తల్లిరో తల్లి.

నా మనస్సును, పంచేంద్రియములను, కర్మేంద్రియములను నీ ఎడల భక్తి భావముతో సమర్పణ దృష్టి తో వినియోగిస్తున్నాను తల్లీ, అలా కానినాడు నేను రెండు కాళ్ళ జంతువుతో సమానము.

జపో జల్పః శిల్పం..... జపము, జల్పము, శిల్పము అని గొప్ప రహస్యమును చెప్పుచున్నారు గురువు గారు. జపము మనస్సుతో చేసేది, జల్పము అంటే మాటలు వాచా, వాక్కుతో చేసేది.
శిల్పము అంటే చేష్టలు అంటే చేతులతో, కాళ్ళతో చేసేది, కర్మణా.
మనసా, వాచా, కర్మణా త్రికరణ శుద్దిగా అమ్మను ఆత్మార్పణ దృష్టితో ఆరాధించాలి అని చెబుతున్నారు. అప్పుడే పూజ సంపూర్ణము అవుతుంది అని దీని రహస్యము. ఈ శ్లోక రహస్యాన్ని మూడు ముక్కలలో ముందుగానే మనకు చెప్పినారు. మనసా, వాచా, కర్మణా, జపో జల్పః శిల్పం..... అని.

జపో ......అని శంకర భగవత్పాదులు ముందుగా అన్నారు. జపానికి కారణభూతమైనది మనస్సు. ఇంద్రియములకును విషయములకును అన్నింటికినీ మూల కారణము మనస్సే. మనోపాసన చేయవలెను. అంటే అమ్మ నామము గాని, మంత్రము గాని జపించవలెను. జపము వలెనే కర్మ క్షయము అవుతంది. ఆత్మను సమర్పించడం అంటే మనస్సు ను సమర్పించడం అన్నమాట. మనస్సు ఒక్కటి ఇస్తే చాలు అమ్మకు. కర్మ పరి పక్వం అవుతుంది. అంగాంగముల శుద్ధి అంటే ఇదే. వాచక శుద్ధి, కాయక శుద్ధి. నోటితో, చేతులతో, కళ్ళతో, కాళ్ళతో, చెవులతో, శరీరముతో చేసే పాపములు పోగొట్టుకోవాలి అంటే, నోటితో భగవన్నామము జపించాలి, చేతులతో పూజించాలి, కళ్ళతో భగవంతుని దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి, కాళ్ళతో ప్రదక్షిణ చేయాలి, చెవులతో నామం, కీర్తనలు వినాలి, శరీరముతో యజ్ఞము చేయాలి. అనవసర మైన వ్యర్ధ ప్రసంగములు మాని మనకు వున్న కొద్దిపాటి సమయాన్ని భగవంతుణ్ణి సేవలో గడపమని గురువు గారి హెచ్చరిక. అమ్మకు ముద్రలు అంటే చాలా చాలా ఇష్టం, ఆవాహనాది ముద్రలు చూపితే అమ్మ సంతోషిస్తుంది.
జల్పం ... వ్యర్ధ ప్రసంగములు. ఎన్ని ఏండ్లు వచ్చినా, ఎంత వయస్సు వచ్చినా, ఎంత మంది మొత్తుకొన్నా మనషులు మారరు. పనికి మాలిన విషయముల మీద అనవసరమైన చర్చ, ఎదుటి వారిని సూటి పోటీ మాటలతో కుళ్ళ పొడవడము, విమర్శించడం ఇదే అలవాటు. ఎంత చదువు చదివి ఏమి ప్రయోజనము? దీని వలన ఓరిగేది ఏమిటి? ఎవడి పుణ్యము వాడిది, ఎవడి కర్మ వాడిది. నీవు ఏమీ చేయలేవు. నీవు ఆపలేవు. జ్ఞానము అనంతము. ఎవడు మూట కట్టుకొన్నది వాడికే స్వంతము. వాడు స్వర్గానికి పోతాడు,

నీవు నరకానికి పోతావు చివరకి. డబ్బును దోచుకోవచ్చు కానీ జ్ఞానమును దోచుకోలేవు. ఎదుటి వాడిని విమర్శించడము, ఎగతాళి చేయడము. అవసరమా. చివరకు నీకు ఉపయోగము ఏమిటి? దొరికిన కాస్త సమయము కూడా భగవంతుని సేవలో ఉపయోగిస్తే, నలుగురికి నాలుగు మంచి మాటలు చెబితే. భాగవత కధలు గురించి చర్చిస్తే ఎంత మంచిది. ఇకనైనా మారు, కాలము మించి పోతున్నది దొరికిన పది నిమిషములు అయినా సరే కృష్ణా, గోవిందా అను, వ్యర్ధ ప్రసంగములు మాను అని వాత పెట్టి శ్రీ గురువులు మనకు చెబుతున్నారు.

Monday, October 15, 2018

ఏది స్వర్గం....? ఏది నరకం......?

ఒక శిష్యుడికి ఏది స్వర్గం? ఏది నరకం? అన్న విషయమై ఎప్పుడూ సందేహంగానే ఉండేది. తన సందేహం గురించి గురువుగారిని ఎప్పుడు అడిగినా కూడా ఆయన ఓ చిరునవ్వు నవ్వేసి ఊరుకునేవారు. చివరికి ఓ రోజు ‘గురువుగారూ! మీరు ఇవాళ నాకు స్వర్గ నరకాల గురించి చెప్పి తీరాల్సిందే!’ అంటూ పట్టుపట్టాడు శిష్యుడు. దానికి గురువుగారు ‘సరే! నీకు ఓ అనుభూతిని కలిగిస్తాను. దాన్ని బట్టి నీకు స్వర్గం అంటే ఏమిటో, నరకం అంటే ఏమిటో తేలిపోతుంది’ అన్నారు.

శిష్యుడు ఆ అనుభూతిని స్వీకరించేందుకు సిద్ధంగా తన కళ్లని మూసుకున్నాడు. శిష్యుడు కళ్లు మూసుకోగానే ఒక వింత దృశ్యం అతనికి కనిపించింది. ఆ దృశ్యంలో ఒక పెద్ద గది, ఆ గది మధ్యలో ఒక పెద్ద బల్ల ఉంది. ఆ బల్ల మీద రకరకాల ఆహార పదార్థాలు కనిపిస్తున్నాయి. తాజా పండ్లు, ఘుమఘుమలాడే కూరలు... ఇలా ఒకటీ రెండూ కాదు... మనిషి జిహ్వను రెచ్చగొట్టే సర్వపదార్థాలూ ఆ బల్ల మీద ఉన్నాయి. కానీ ఏం లాభం! ఆ బల్ల చుట్టూ ఉన్న జనాలకీ, బల్లకీ మధ్య అయిదేసి అడుగుల దూరం ఉంది. మనుషులు ఎంత గింజుకుంటున్నా ఆ బల్లని సమీపించలేకపోతున్నారు. అలాగని ఆ ఆహారపదార్థాలను అందుకునేందుకు ఏ ఉపాయమూ లేదా అంటే లేకనేం! ఒక అయిదు అడుగుల గరిటె వారికి అందుబాటులో ఉంది. కాకపోతే ఉన్న ఒకే ఒక్క గరిటె కోసం గదిలోని జనాలంతా కొట్టుకోవడమే సరిపోతోంది. ఒకవేళ ఎవరన్నా బలవంతుడు ఆ గరిటెను చేజిక్కించుకున్నా, దాంతో ఆహారాన్ని నోటి దాకా తెచ్చుకునేసరికి అందులోని పదార్థాలు నేలపాలై పోతున్నాయి.

 శిష్యుడు ఆశ్చర్యంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నంతలో అది మాయమైపోయి మరో దృశ్యం కనిపించింది. అందులోనూ ఇదే పరిస్థితి. గది మధ్యలో పెద్ద బల్ల. ఆ బల్ల చుట్టూ అయిదేసి అడుగుల దూరంలో జనం. ఆ జనాలందరికీ ఒకటే గరిటె. కానీ వాళ్లంతా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. వారి ఆకలి తీరినట్లే ఉంది. గదిలో ఎలాంటి కొట్లాటలూ లేవు. ఎలాంటి హడావుడీ లేదు. అదెలా సాధ్యమా అని ఆశ్చర్యంగా చూసిన శిష్యుడికి, ఆ ప్రశాంతత వెనుక ఉన్న విషయం బోధపడింది. గదిలో ఉన్న ఒకే ఒక్క గరిటెనీ ఒకరి తరువాత ఒకరు అందుకుంటున్నారు. దాంతో ఆహారాన్ని నింపుకుని అవతలివారికి పెడుతున్నారు. గరిటె తమదాకా వచ్చేదాకా, తమ ఆకలి తీరేదాకా అంతా సహనంతో ఉన్నారు.

తనకు కనిపించిన రెండు దృశ్యాలనూ తల్చుకుంటూ శిష్యుడు తన కళ్లని తెరిచాడు. కంటి ఎదురుగా గురువుగారు ఎప్పటిలాగే చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు. ‘ఇప్పుడు అర్థం అయ్యిందా స్వర్గానికీ, నరకానికీ ఉన్న తేడా ఏమిటో!’ అన్నారు గురువుగారు. శిష్యుడు తలవంచుకున్నాడు.


‘నీకు కనిపించిన రెండు దృశ్యాలలోనూ పరిస్థితి ఒక్కటే! కానీ ఒకదానిలో మనిషి తాను సుఖపడటం లేదు, ఎదుటివాడికీ అవకాశాన్ని ఇవ్వడం లేదు. ఎంతసేపూ తన కడుపే నిండాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి నరకమే ఏర్పడుతుంది. మనిషి సంఘజీవి అని తెలుసుకుని, ఒకరికొకరు సాయపడినప్పుడు.... ఎదుటివాడి ఆకలీ తీరుతుంది, మన కడుపూ నిండుతుంది. స్వర్గం, నరకం ఎక్కడో కాదు... మన దృక్పథాలలోనే ఉన్నాయని ఇప్పటికైనా బోధపడిందా!’ అన్నారు గురువుగారు.

" లోకా సమస్తా🚩 సుఖినో భవంతు..!! "

దేవీనవరాత్రులు - సరస్వతీదేవి

ఈ రోజు ఆ తల్లి స్వచ్ఛమైన తెల్లని రంగు వస్త్రాలు ధరించి హంస వాహనంలో తెల్లటి తామరపువ్వులో మనలను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న సరస్వతీదేవిని ఆరాధన చేస్తున్నాము.

ఈ సరస్వతీదేవి ఆరాధన తిథితో కలిసి కాకుండా నక్షత్ర యుక్తంగా ఉంటుంది. నవరాత్రులలో మూలా నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఈ తల్లి ఆరాధన చేస్తాము. శక్తి ఆరాధనకు మూల మంత్రము చాలా గొప్పదైనటువంటిది. ఈ తల్లి సర్వ విద్యాస్వరూపిణి. విద్య అనగానే ఒక్క చదువే కాదండి. మనకి రామచంద్రమూర్తి చెప్పాడు. ఈ లోకంలో ఎవరూ కూడా పనికిమాలిన వాడు అని లేడు. ప్రతి ఒక్కరిలోనూ ఎదో ఒక శక్తి దాగుకుని ఉంటుంది. విజ్ఞులైన వారికి దారి చూపిస్తే వారిలో దాగుకుని ఉన్న శక్తి ప్రకటమై వారు కీర్తిని, యశస్సుని పొందుతారు. అనగా ప్రతి ఒక్కరిలో దాగుకుని ఉన్న శక్తే ఆ సరస్వతీదేవి. ఉదాహరణకు కుటుంబం యొక్క ఆరోగ్యం అంతా కూడా ఆ ఇంటి గృహిణి వాడేటటువంటి గరిటెతో దాగుకుని ఉంటుంది. అందరిలో ఉన్న ఆ శక్తిస్వరూపిణికి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆరాధన చేసి తీరాలి.

పుస్తకం శాస్త్ర సంకేతం. ఈ తల్లి మాతృకావర్ణరూపంలో ఉంటుంది. కాబట్టి, ఈ రోజు మనము పుస్తకాలను పూజా ప్రదేశమందు క్రొత్త వస్త్రాన్ని పరిచి దానిపై కొంత బియ్యాన్ని పోసి ఈ మాతృకావర్ణ రూపిణిని ఆరాధన చేస్తూ ఒక్కసారి అయినా 'ఆ' నుంచి 'క్ష' వరకు ఉన్న అక్షరాలన్నింటిని మనసులో నెమరు వేసుకోవాలి. ఈ తల్లి పరావిద్యకు, అపరావిద్యకు ఆధారభూతమైనది. పరావిద్య అనగా ఆధ్యాత్మిక విద్య. అపరావిద్య అనగా లౌకిక విద్య. ఈ తల్లి ఆరాధన చేత వాక్శుద్ధి, బుద్ధి, విద్య, జ్ఞానసిద్ధి కలుగుతాయి. ఈ తల్లి ఆరాధన చేత కవిత్వం రాసే చాతుర్యం, వ్యాసాంగాలు, కధలు రాసే ప్రావీణ్యం, సంగీతంలో అపరిమితమైన జ్ఞానము కలుగుతాయి. అనగా ఈ తల్లి అంటే ప్రతి ఒక్కరిలో దాగుకుని ఉన్న ప్రతిభయే సరస్వతీ స్వరూపము. ఒక వ్యాసాన్ని గాని, కధ అంశాన్ని గాని చేసేటప్పుడు కొంతమంది కుండ బద్దలు కొట్టినట్లుగా సత్యాన్ని ఆవిష్కరిస్తారు. ఎదుటివారు ఎంతటి వారైనప్పటికీ సత్యాన్ని ప్రశ్నించే తత్వం ఈ తల్లి అనుగ్రహం చేత కలుగుతుంది.

ఒక విధంగా గాయత్రీమాతను ఏ విధంగా మనం ప్రాణశక్తిగా చెప్పామో ఈ తల్లి కూడా శ్వాస స్వరూపంలో ఉంది. ప్రాణ శక్తిగా ఉంటుంది. మనకి భారతంలో ఈ తల్లిని యజ్ఞ స్వరూపిణిగా తేలియచేశారు. అనగా శుద్ధ, సత్వ గుణాల కలయిక. ఈ సరస్వతీదేవి ప్రవహించే శక్తి ఉంటుంది. లక్ష్మీదేవి నిశ్చలంగా ఉంటుంది. మనం అలా ఉండాలనే కోరుకుంటాం కూడా. కాని, ఈ సరస్వతి ప్రవాహిని. అది ఒకరి నుండి మరొకరికి అంతం లేకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు ఈ వ్యాసాంగాన్ని చూడండి. ఇది ఒక్క దగ్గరే ఉంటుందా? లేదే! అది ఒకరి నుండి మరొకరికి కొన్ని వేల మందికి వివిధ ప్రసార సాధనాల ద్వారా వెళ్ళిపోతుంది.

ఈ తల్లి స్వచ్ఛమైన తెలుపు వస్త్రాన్ని ధరించి ఉంటుంది. తెలుపు అనగానే స్వచ్ఛతకు గుర్తు. కాబట్టి స్వచ్ఛమైన జ్ఞానాన్ని అనుగ్రహించడానికి ఈ తల్లి తెలుపు వస్త్రాలు ధరిస్తుంది. ఆ తల్లి ముత్యాలతో మరియు వజ్రాలు పొదిగి ఉన్న ఆభరణాలను ధరించి ఉంటుంది. ముత్యాలు కూడా మనసు మీద ప్రభావం చూపుతాయి. అలాగే తన నాలుగు చేతులలో రెండు చేతులతో వీణను మీటుతూ ఉంటుంది. ఈ వీణ పేరు మహతి. దీనికి 24 మెట్లు ఉంటాయి. అనగా గాయత్రీ మంత్రంలో ఉన్న ఒక్కొక్క అక్షరం ఈ వీణపై ఉన్న ఒక్కొక్క మెట్టు. మనము కూడా సాధన ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి అని ఆ తల్లి వీణను పట్టుకుంటుంది. అలాగే ఒక చేతిలో అక్షమాల పట్టుకుంటుంది. అన్ని శబ్దాలకు మూలం అక్షరాలే. ఆ అక్షరాలు కూర్పే తల్లి కాబట్టి అక్షమాల పట్టుకుంటుంది. ఒక చేతిలో పుస్తకం. సర్వ విజ్ఞాన గని ఈ పుస్తకంలో ఉంటుంది. కాబట్టి ఈ తల్లి ఒక చేతిలో పుస్తకం పట్టుకుని ఉంటుంది.

ఈ తల్లి తెల్ల వికసించిన తామరపువ్వుపై కూర్చుని హంస వాహినిగా ఉంటుంది. హంస అంటేనే శ్వాస. స్వచ్ఛత. హంసలకి పాలని, నీటిని వేరు చేసే శక్తి ఉంటుంది. ఒక రకంగా హంస కూడా జ్ఞాన ప్రదాయిని. కాబట్టి, హంస వాహినిగా ఉన్నటువంటి తల్లిని ఈ రోజు మనము ఆరాధన చేసి ఆ తల్లిని మనకు జ్ఞానాన్ని, యశస్సుని అనుగ్రహించమని వేడుకుందాము.

"అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే"

సర్వేజనా సుఖినోభవంతు

దసరానవరాత్రులు - వీణాశారదా అవతారము

శృంగేరి సంస్థానానికి చెందిన దేవాలయాలలో ఈరోజు అమ్మవారు వీణాశారదా రూపంలో అలంకరించుకుని ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా జ్ఞ్యానం అనే భిక్షను పెట్టమని వేడుకుంటూ ప్రార్ధనచేసి ఆ తల్లి కృపకు పాత్రులం కావడానికి ప్రతి ఒక్కరం ప్రయత్నం చెయ్యాల్సిందే. ఎందుకంటే జ్ఞ్యానం ప్రతి ఒక్కరికీ కావాల్సిందే కదా.

నిజానికి ఈ తల్లిని అనేక నామాలతో ఆరాధన చేసినప్పటికీ మూడు నామాలు మటుకు బహుప్రాచుర్యంలో ఉన్నాయి. 1) సరస్వతి....అనగా ప్రసరణము జ్ఞ్యానము. ఒక దగ్గర నిలిచిపోకుండా ఒక దీపంనుండి వెలుగు ఎంత అయితే ప్రసరణను పొందుతుందో అలాగే జ్ఞ్యానము కూడా అలా ప్రసరింపచేసేది కాబట్టి సరస్వతి. 2) భారతి....విభక్తేతి భారతి....అనగా పోషించేది భారతి....అనగా ఏ వృత్తిలో ఎవరు రాణించాలన్నా ఆ తల్లియొక్క అనుగ్రహం ఉండాల్సిందే. 3) శారద....తెల్లని పద్మంలో కూర్చుని ఉంది కాబట్టి శారద. శారద అనగా సత్వగుణమునకు చిహ్నం. తెల్లని పద్మం అనగా కూడా ఒక రకంగా ఆలోచిస్తే మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. సహస్రార చక్రం అనగా మాడు (తలపైన) స్థానంలో ఒక చక్రం ఉంటుంది. తెల్లని కాంతులు ఈనుతూ ఉంటుంది. ఎవరైతే నిరంతరం ఆ తల్లిని ధ్యానం చేస్తూ ఉంటారో వారికి శిరస్సుపై ఈ కమలం కనిపిస్తుంది.

నిజానికి శబ్దము అనేది రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి స్వరం మరియు రెండవది అక్షరం. ఈ స్వరానికి గుర్తుగా ఈ తల్లి తన ఒక చేతిలో వీణ పట్టుకుని ఉంటుంది. మరి అక్షర జ్ఞ్యానానికి గుర్తుగా పుస్తకాన్ని ఒక చేతిలో పట్టుకుని ఉంటుంది. అందుకనే లలితకళలలో రాణించాలన్నా ఈ తల్లియొక్క అనుగ్రహం ఉండాల్సిందే. మనకి తెలిసిన విషయాలను నలుగురికీ తెలియచెయ్యాలన్నా (వాక్కురూపంలో కాని వ్రాతరూపంలో కాని) ఈ తల్లియొక్క అనుగ్రహం ఉండాల్సిందే. లేని పక్షంలో ఏ పదం తరువాత ఏ పదం వాడినా ఆ వాక్యం పరిపూర్ణతను సంతరించుకోదు.

అందుకే ఈ శారదా ఆరాధనను పెద్దలైనావారు ఎందరో చేసి మనలను కూడా ఆ దారిలో నడవమని మనకు మార్గాన్ని శూచించారు. వ్యాసభగవానుడేమో గోదావరి తీరంలో ఆ తల్లి కోసం తపస్సు చేసి ఆ తల్లి అనుగ్రహం పొందిన తరువాత ఇంకా ఏం కావాలని ఆ తల్లి ప్రశ్నించగా నన్ను ఎలా అనుగ్రహించావో ఇక్కడికి వచ్చి నిన్ను వేడుకున్న వారిని అనుగ్రహించు అంటూ ఇసుకతో ఆ తల్లి విగ్రహాన్ని మనకు అనుగ్రహించారు.

మరి అదే  కోవకు చెందిన మహానుభావులు సాక్షాత్తు శంకరుల అవతారంగా చెప్పుకునే శంకరభగవత్పాదులవారు కూడా తాము పెట్టిన మొదటి పీఠానికి శారదాపీఠం అని పేరు పెడుతూనే ఆ తల్లిని కొయ్యతో (చెక్కతో) ఉంచి మనకు జ్ఞ్యానాన్ని అనుగ్రహించమని మనలను అనుగ్రహించి మనకు అందించారు.

ఈ రోజు ఆ తల్లిని ఆరాధన చేసి మనందరం ఆ తల్లి అనుగ్రాహం పొందెదముగాక.

"జయ జయ శంకర హర హర శంకర"

'అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే'

సర్వేజనా సుఖినోభవంతు

కాత్యాయిని తల్లి

ప్రధమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ!
తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చథుర్ధకమ్!
పంచమమ్ స్కంధమంతేతి షష్టం కాత్యాయనతిచ!
సప్తమం కాళరాత్రేతి మహాగౌరీతి అష్టమం!
నవమ సిధ్ధిధాత్రీచ నవదుర్గాః ప్రకీర్తితాః

ఆ తల్లి ఎంతమందికో కోరుకుంటే కూతురిగా వస్తుంది కాని, ఆవిడ మహా పతివ్రత కాబట్టి భర్తగా మాత్రం ఆ పరమశివుడినే వరిస్తుంది. ఒకప్పుడు కాత్యాయన మహర్షి తనకి బిడ్డలు కలగాలని పరమశివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. ఈయనని అనుగ్రహిద్దాం అనుకున్నాడు పరమశివుడు. అందులో అంతర్లీలనంగా ఒక చమత్కారం జరిగింది. ఒకప్పుడు కైలాస పర్వతం మీద కూర్చుని పరమశివుడు ఉంటే, ప్రణయ వినోదంగా భర్తతో ఆటలాడుతూ పార్వతీదేవి వెనకనుండి వచ్చి ఆయన రెండు కన్నులు మూసింది. ఆయన కళ్ళు సూర్యచంద్రులు. ఆయన కళ్ళు మూసేటప్పటికి లోకమంతా చీకటి అయింది. పరమశివుడు లోకాలను ఆదుకోవడం కోసం మూడవ కన్నుని తెరిచి అగ్ని సంబంధమైన కాంతిని వర్షించాడు. ఆమె అన్ని తెలిసిన తల్లే. అయినా ఏమీ తెలియని దానిలా భర్త వంక చూసి నేను ప్రణయానికి మీ కన్నులు మూసినప్పుడు లోకానికి జరిగిన ఇబ్బంది గమనించాను. ఇంత మంది ఇబ్బంది పడడానికి నేను కారణం అయ్యాను. నేను దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనగానే, పరమశివుడు భూమండలం మీదకి వెళ్లి తపస్సు చెయ్యమన్నాడు. తద్వారా ఆ కాత్యాయన మహర్షి కోరిక కూడా తీరుతుంది. ఆమె వెంటనే ఒక శివస్వరూపాన్ని పొంది బదరికాశ్రమంలో పడుకుని ఉన్నది. కాత్యాయన మహర్షి పిల్లల కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆయనను అనుగ్రహించి ఆ బిడ్డ కాత్యాయని మహర్షి కంటబడింది. ఆయన ఆ బిడ్డని తీసుకొని పెంచాడు కాబట్టి కాత్యాయిని అయింది. నీ భర్తని తెలుసుకోవలసిన సమర్ధత నీదే (ఆమె ఎంత మందికైనా కూతురిగా వస్తుంది కాని భర్త మటుకు ఆ పరమశివుడే) ఆ పరమశివుని భర్తగా పొందడానికి ఎక్కడ తపస్సు చేస్తే సిధ్ధిస్తుందో ఆ ప్రదేశం దక్షిణాన ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం. అక్కడికి వెళ్ళమని మహర్షి చెప్పాడు. నీవు కాంచీపురానికి వెళ్లావు అనడానికి గుర్తు నీకు కొన్ని వస్తువులను ఇస్తున్నాను. ఒక గొడుగు, వింజామర, గంగాతీర్ధం, గంగ ఒడ్డున ఉన్న ఇసుక, ఒక యోగదండము, ఒక పుస్తకము, వేయించిన పెసలు ఇస్తాను. ఈ వస్తువాలన్నీ నీవు కాంచీపురం చేరగానే మార్పు చెందుతాయి అని వివరించాడు. ఆమె రెండు చేతులతో కుప్ప చేసి సైకతలింగాన్ని పూజిస్తున్నది. ఏమి చేస్తుందో చూడాలని తన జటాజూటం నుంచి బ్రహ్మాండంగా గంగా ప్రవాహాన్ని వదిలిపెట్టాడు. ఆమె ప్రక్కనే ఉన్న దుర్గా స్వరూపాన్ని పిలిచి ఆ ప్రవాహాన్ని ఆపమన్నది. ఆమె జలప్రళయ బంధిని అనే పేరుతో తన దగ్గిర ఉన్న కపాలంలోకి గంగ అంతా పట్టేసింది. పరమశివుడు చూసి తన వద్ద ఉన్న చెలికత్తె సహాయంతో ప్రవాహాన్ని ఆపింది. భూమ్యాకాశాలు ఎకమయ్యేలా పరమశివుడు తిరిగి ప్రవాహాన్ని పంపాడు. ఆవిడ భయపడి అన్నగారు అయిన విష్ణుమూర్తిని పిలిచి శివలింగం కొట్టుకుపోతుందేమో అని మురిపెంగా భయంగా చెబితే ఆవిడ పతిభక్తి చూసి ఆశ్చర్యపోయిన విష్ణుమూర్తి ఆనందిస్తూ అమ్మా! నీకు, నీవు కొట్టుపోతావని బెంగకాదు. శివలింగం గురించి బెంగ. నీ భక్తిని ఆవిష్కరించు, బావగారు సంతోస్తారు. అనగానే వంగి ఆవిడ శివలింగాన్ని కౌగలించుకున్నది. ఇప్పటికీ ఏకాంబ్రేశ్వర శివలింగం మీద పార్వతీదేవి కుచముల ముద్రలు, ఆవిడ చేతి కంకణాల ముద్రలు ఉంటాయి. నీటితో అభిషేకం చేయకూడదు కాబట్టి మల్లెనూనేతో అభిషేకం. ఆమె భక్తిని చూసి పరమశివుడు పరవశించిపోయి, ఆయన గభాలున అవతరించి తాను వదిలిపెట్టిన గంగే కదా అని కాలితో ఒక్క తన్ను తన్నాడు. వెంటనే గంగ భూమిలోనికి అంతర్వాహినిగా వెళ్ళింది.

ఎప్పుడైతే నీటి ప్రవాహాన్ని చూసి అమ్మవారు భయపడి శివలింగం కొట్టుకు పోతుంది అని భయంతో కంప, కంప అన్నదో అది కంపానది అయింది. ఇక్కడ అమ్మవారు పరిమళ కుంతలాంబ. ఆవిడే తపోకామాక్షి. ఆ తపో కామాక్షియే కాత్యాయినీ స్వరూపం. లోకంలో ప్రేమ, భర్త యందు భక్తి, ఏకకాలంలో ఆవిష్కరించిన తల్లి కాబట్టి ఆ తల్లి నామస్మరణ చేత సువాసినుల పసుపుకుంకాలు పదికాలాలు నిలబడేటట్లు చేసి, ఎన్ని జన్మలు ఎత్తినా సువాసినులుగా ఉండేటట్లు అనుగ్రహించగల శక్తి ఉన్న తల్లి మన తల్లి కాత్యాయిని.

ఆ తల్లి కాత్యాయినిని అందరం భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లి కృపకు పాత్రులం అయ్యెదముగాక.

సర్వేజనా సుఖినోభవంతు

పురాణ కథలు - కుండలినీ సమన్వయం - శ్రీమద్రామాయణం

శ్రీ మద్రామాయణం ఓ గొప్ప కావ్యం మాత్రమే కాదు. అదో మహత్తర యోగ గ్రంథమని కూడా పరిశీలకులు తెలిచెప్పారు.

రామాయణాన్ని గురించి ఎంత చెప్పినా సమయం సరిపోదు. దాన్ని కుదించి చెప్పడానికి కట్టె, కొట్టె, తెచ్చె అనే మూడు మాటల్లో కూడా చెప్పుకొనే వీలుంది. అంతలా అన్నికోణాల్లో అన్ని రకాలుగా ఉన్న విశేష ఇతిహాసం కాబట్టే భారతీయుల నరనరాల్లో ఈ కావ్యకథ ఇతివృత్తం జీర్ణించుకొని ఉంది.

రామాయణాన్ని అలా కథారూపంలో కాక కుండలినీ యోగంతో సమన్వయించి కూడా చెబుతుంటారు. కుండలినీ యోగ చక్రాలకు రామాయణంలోని కాండలకు సమన్వయం చెప్పి రామాయణం అచ్చం యోగరామాయణమే అని ఎందరో పండితులు నిరూపించారు.

కుండలినీ యోగంలో సహస్రారంతో కలిపి చెబితే ఏడు చక్రాలు ఉన్నట్లే రామాయణంలో ఉత్తరకాండతో కలిపి చెబితే ఏడు కాండలవుతాయి. కుండలినిలో మూలాధారం, మణిపూరకం, స్వాధిష్టానం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనే ఏడు చక్రాలుంటాయి. ఏడు చక్రాలకు, ఏడు కాండలకు చక్కటి సమన్వయం కుదురుతుంది.

బాలకాండ మూలాధారం

రామాయణంలోని బాలకాండకు కుండలినిలోని మూలాధార చక్రానికి సమన్వయం చేసి చెబుతారు. కుండలినీ యోగంలో ప్రథమ చక్రమైన మూలాధార చక్రం దగ్గరకు సాధకుడి కుండలినీ శక్తి ఉద్బుద్ధమైనప్పుడు భౌతిక బలం అక్కడ సాధకుడిలో వ్యవస్థీకృతమవుతుంది. బాలకాండలో కూడా భౌతిక బలాల వ్యవస్థీకరణను గురించిన విషయాలే ఉంటాయి. శ్రీరాముడి పుట్టుపూర్వోత్తరాలు, శౌర్యసాహసాలు ఆత్మ సామ్రాజ్యానికి ప్రతీకలు. రావణాసురుడి పుట్టుపూర్వోత్తరాలు, శౌర్యసంపద ఇలాంటివన్నీ అహంకార సామ్రాజ్యానికి ప్రతీకలు. ఇలా రామాయణ కథకు ఒక ఆధారం ఈ కాండలో ఉంది. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే కథ మూలాధారం దగ్గర ఉద్బుద్ధమయ్యే శక్తి లాంటిది.

రెండో చక్రం మణిపూరకం.

ఇది బొడ్డు దగ్గర ఉంటుంది. ఈ చక్రం జలతత్త్వానికి సంబంధించింది. ఇక్కడ కుండలినీ శక్తి ఉద్బుద్ధమైనప్పుడు సాధకుడిలో ఈర్ష్య, అసూయ, రాగం, ద్వేషం, శోకం, మమకారం విజృంభిస్తాయి. జలాలలో ఉండే మొసళ్లు, తిమింగలాల వంటివి ఇవి. వీటిని సాధకుడు దాటి ముందుకు పోవటానికి చాలా కష్టించాలి. అయోధ్యకాండలో కూడా రాగం, ద్వేషం, అసూయ లాంటివాటికి సంబంధించిన మందర ప్రబోధం, కైకేయి వరాలు, దశరథుడి శోకం, దశరథ శ్రీరాముల వియోగం ఇలాంటివన్నీ కనిపిస్తాయి. దశరథాదులు వీటిని దాటి వెళ్లడానికి అసామాన్యమైన కష్టాన్నే అనుభవించారు.

మూడో చక్రం స్వాధిష్టానం.

ఇది అగ్నితత్వానికి సంబంధించినది. శరీరంలోని ఉష్ణోగ్రత సమత్వాన్ని, ఆహారపానీయాదుల జీర్ణశక్తిని ఇదే కట్టుదిట్టం చేస్తుంది. మూడోకాండ అయిన అరణ్యకాండలో విరాధుడు, జఠాయువు, కబంధుడులాంటి రాక్షసుల దహనక్రియలకు సంబంధించిన సన్నివేశాలు, అగ్నిశిఖలాంటి సీతను రావణుడు అపహరించిన సన్నివేశాలు దీనిలో కనిపిస్తాయి.

నాలుగో చక్రం అనాహతం.

రామాయణంలో నాలుగోకాండ కిష్కంధకాండ. అనాహత చక్రం వాయుతత్వానికి సంబంధించినది. ఈ చక్రానికి స్థానం హృదయం. ఈ చక్రం దగ్గరకు కుండలినీ శక్తి ఉద్బుద్ధమైనప్పుడు సాధకుడిలో వాత్సల్యం, స్నేహం, భక్తి లాంటి ఆత్మగుణాలు ఉత్తేజితమౌతాయి. కిష్కంధకాండలో శ్రీరాముడు సుగ్రీవహనుమంతాదులతో కలిసే సన్నివేశాలు, వారి స్నేహంతో రాముడు ముందుకు వెళ్లే సంఘటనలు ఉన్నాయి. ఈ కాండ రామాయణానికి హృదయంలా అంటే కేంద్రస్థానంలా ఉంటుంది.
ఉత్తర కాండే సహస్రారం

విశుద్ది చక్రం

ఆ తర్వాత కనిపించే సుందరకాండ కంఠప్రదేశం లాంటిది. కంఠం శబ్ద ఉత్పత్తికి స్థానం. విశుద్ధిచక్రం ఆకాశతత్వానికి సంబంధించినది. ఆకాశమనేది శబ్ద గుణకం. కంఠంలో ఉద్భవించే శబ్దం మెదడుకు (బుద్ధికి), హృదయానికి (ఆత్మ) అనుసంధానంగా ఉంటుంది. బుద్ధి సీతకు ప్రతీక అయితే హృదయం రాముడికి ప్రతీక. ఈ ఇద్దరి మధ్యన కంఠస్థానంలా హనుమంతుడు సంధానకర్తగా కనిపించే సన్నివేశం అయిదో కాండ అయిన సుందరకాండలో ఉంది. హనుమంతుడి ఆకాశగమనం కూడా ఇక్కడే వర్ణితమైంది.

*ఇక ఆజ్ఞాచక్రం ఆరోది.

ఈ చక్రానికి స్థానం నుదురు భాగం. ఇది మనస్తత్వానికి సంబంధించినది. ఇక్కడే జ్ఞాననేత్రం ఉందంటారు. రామాయణంలో ఆరోకాండ అయిన యుద్ధకాండలో అహంకార సామ్రాజ్యానికి సంబంధించిన మనస్సు అనే రావణాసురుడు ఆత్మ సామ్రాజ్యానికి సంబంధించిన ఆత్మ అనే రాముడిలోకి లీనం కావడం, బుద్ధి అనే సీతను జ్ఞానం అనే అగ్నిలో పరీక్షించటంగా సమన్వియించుకొంటే రామాయణం కుండలినీ యోగ సదృశ్యమని అర్థమవుతుంది.

**ఏడో చక్రం సహస్రారం.

ఈ చక్రస్థానం బ్రహ్మరంధ్ర ప్రాంతం. బ్రహ్మరంద్ర స్థానం ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఈ విషయాన్ని రామాయణంతో సమన్వయిస్తే ఏడో కాండ ఉత్తరకాండ. ఈ కాండను కొంతమంది లెక్కలోకి తీసుకోరు. అందుకనే రామాయణం ఆరు కాండలేనని అంటారు. అలాగే చక్రాలలో సహస్రారాన్ని లెక్కించకుండా షట్చక్రాలను మాత్రమే కొంతమంది చెబుతుంటారు. ఇలా కుండలినీ యోగంతో రామాయణ మహాకావ్యాన్ని సమన్వయించి చెప్పటం కనిపిస్తుంది.

నాద బిందు కళలు - నిర్వికల్ప సమాధి : సాధకుడు ఎడతెగని నిష్ట తో సాధనలో ఉన్నప్పుడు ...కుండలినీ శక్తి మేల్కొని ...అనాహత చక్రం చైతన్య వంతమైతే దశవిధ నాదాలు అనుభూతానికి వస్తాయి. క్రమేణా దీర్ఘ ఘంటానాదం అనుభూతం అవుతుంది. నిరంతరం ఓంకార నాదం అనుభూతికి వస్తుంది. కుండలినీ శక్తి "ఆజ్ఞా" చక్రంలో స్థిరపడితే రకరకాల కాంతులు వెదజల్లును. కొంత కాలానికి శతకోటి సూర్య ప్రభా సమానమైన ఆత్మ చైతన్యం...అనుభూతికి వస్తుంది. ఈ రక రకాల కాంతులను చిత్కళలు అంటారు. కూటస్థ చైతన్యమునే బిందువు అంటారు. ఇవన్నీ లయం కావలసిందే. అప్పుడు నిర్వికల్ప సమాధి సిద్ధించును.

శ్రీ చక్రం


శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం (Sri Chakra or Shri Yantra) కాశ్మీరీ హైందవము ఆధారితమైన తంత్రము లో ఒక పవిత్రమైన యంత్రం. దీని జ్యామితీయ నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము శక్తి స్వరూపిణులైన శ్రీ విద్య, లలితా దేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతను సూచిస్తాయి. దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని నవయోని చక్రం (Navayoni Chakra) అని లేదా నవ చక్రం (Nava Chakra) అని కూడా పిలుస్తారు.[1]

రకాలు
భూప్రస్తారం: రేఖాచిత్రం వలె ద్విమితీయం (two-dimensional)గా ఉంటుంది.
మేరు ప్రస్తారం: పిరమిడ్ వలె త్రిమీతీయంగా (three-dimensional)గా నిర్మాణించబడితే, (మేరు పర్వతాన్ని సూచించే) మహా మేరు అని అంటారు.
సరియైన బీజాలు, మంత్రాలు లేనిదే శ్రీ యంత్రము నిరుపయోగము. ప్రాణప్రతిష్ఠ, పూజలు చేయకున్నచో యంత్రము మరణించినట్లు సమానం.

భూప్రస్తారం

మేరు ప్రస్తారం

శ్రీ చక్ర భాగాలు
శ్రీ చక్రం లోని ఒక్కొక్క భాగం త్రిపుర సుందరి యొక్క సూచికగా భావిస్తారు. బయటి నుండి లోపలికి వెళ్ళే దిశలో శ్రీ చక్ర భాగాలు-

మూడు సమాంతర రేఖలతో కూడుకుని ఉన్న చతురస్రాకారము - త్రైలోక్య్య మోహనం లేదా భూపం
పదహారు రేకులు గల వృత్తము - సర్వ ఆశా పరిపూరకము
ఎనిమిది రేకులు గల వృత్తము - సర్వ సంక్షోభనము
పధ్నాలుగు చిన్న త్రిభుజాలు - సర్వ సౌభాగ్యదాయకము
పది చిన్న త్రిభుజాలు - సర్వ అర్థసాధకాలు
పది చిన్న త్రిభుజాలు - సర్వ రక్షకాలు
ఎనిమిది చిన్న త్రిభుజాలు - సర్వ రోగహరింపులు
మధ్యనున్న ఒక త్రిభుజం - సర్వ సిద్ధిప్రద
బిందువు - సర్వ ఆనందమయి
వివరణ
కుయ్పర్ కే అనే రచయిత, Understanding India: The Culture of India అనే తన పుస్తకం లో శ్రీ చక్రం గురించి ఈ విధంగా తెలిపాడు.

వివిధ పరిమాణాలలో ఉన్న ఈ తొమ్మిది త్రిభుజాలు, ఒకదానితో ఒకటి కలుస్తాయి. వీటి మధ్యలో మానవ నేత్రానికి అందనంత, అత్యున్నత స్థానం కలిగిన, అనంతమైన కేంద్రంలో బిందువు రూపంలో శక్తి ఉంటుంది. ఈ కేంద్రము నుండే సమస్త విశ్వము వ్యాపిస్తుంది. ఈ త్రికోణాల చుట్టూ ముందు సృష్టిని సూచించే ఎనిమిది రేకులు గల వృత్తము, దాని తర్వాత పునరుత్పత్తిని సూచించే పదహారు రేకులు గల వృత్తములు ఉంటాయి. వీటి చుట్టూ నాలుగు దిశలలో పవిత్ర స్థలానికి ద్వారలు ఉంటాయి.
బిందువు అంతరాలలో కామకళ నిగూఢమై ఉంటుంది. దీనికి మూడు రకాల శక్తులు ఉంటాయి. అవి

ఎరుపు - అండము
తెలుపు - వీర్యము
రెండిటి కలయిక - శివశక్తుల సంగమము. ఈ సంగమమే శ్రీ చక్ర కారకము.
వామకేశ్వర తంత్రము
వామకేశ్వర తంత్రము రెండవ భాగమైన యోగినీ హృదయ లో శ్రీ చక్రం గురించి ఈ విధంగా చెప్పబడినది.

స్త్రీ శక్తి నుండి సృజనాత్మకం పురుష శక్తి నుండి అగ్ని వెలువడతాయి. వీటి సంయోగము తోనే చక్రము ఆవిర్భవిస్తుంది. ఇదే చక్రము యొక్క మూలము
మహోన్నతమైన స్త్రీ శక్తి స్వేచ్ఛగా సృష్టి అనే రూపాంతరము పొందినది. దీనికి ప్రతిస్పందనగా చక్రము యొక్క సృష్టి కూడా జరిగినది. ఈ ప్రకంపనలతో శూన్యముని పోలిన విసర్గ (:) వలె చైతన్య స్థితిలో బిందువు ఉద్భవించినది. దివ్య శక్తి యొక్క ఈ స్థిర ప్రవాహంలో సంపూర్ణమైన వ్యవస్థ అనే సముద్రము అవతరించినది. ఇదే ముగ్గురు అమ్మల మూలపుటమ్మ
చక్రం లో బైందవము (బిందువు)కి మూడు రూపాలు కలవు. ధర్మము, అధర్మము మరియు ఆత్మ. మాత్రి, మేయము మరియు ప్రమము. నవయోని చక్రము చైతన్యానికి, అనంత సౌఖ్యానికి సూచిక. మంత్రము యొక్క తొమ్మిది విభాగాలు కలది.
స్తోత్రము
ఇది శ్రీ చక్రాన్ని వర్ణించే శ్లోకము. శ్రీ చక్రం అమ్మ నివాస స్దానమ్.శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నవి. ఈ తొమ్మిది ఆవరణలను అర్చించుటయె శ్రీ చక్రనవావరణార్చన. ఇది అమ్మకు చాలా ప్రియమైన అర్చన

Sunday, October 14, 2018

ఫలాలు ఫలహారాలు - తెలుగు పేర్లు


1. చూతఫలం=మామిడిపండు
2. ఖర్జూర= ఖర్జూరం.             
3. నింబ=నిమ్మపండు
4.  నారింగ=నారింజ
5. భల్లాతకీ=జీడిపప్పు
6. బదరీ=రేగు
7. అమలక=ఉసిరికాయ
8. శుష్కద్రాక్ష=కిస్మిస్
9. అమృత లేక బీజాపూరం= జామపండు
10.  ఇక్షుఖండం=చెఱకుముక్క
11. కధలీఫలం. రంభా ఫలం=అరటిపండు
12. నారికేలం=కొబ్బరికాయ
13.  జంభీర= కమలాఫలం
14. దాడిమీ=దానిమ్మపండు
15. సీతాఫలం= సీతాఫలం
16. రామఫలం= రామఫలము
17. కపిత్త=వెలగ పండు
18. శ్రీ ఫలం.  బిల్వఫలం= మారేడు
19.  మాధీ ఫలం=మారడి  పళ్లు
20.  జంభూఫలం=నేరేడు ప్రసాధములు. 
===================================
1. కుశలాన్నం =పులగం
2.  చిత్రాన్నం=పులిహోర
3. క్షీరాన్నం=పరమాన్నం
4. పాయసం=పాయసం లేదా తిమ్మణం
5.  శర్కరాన్నం= చక్రపొంగలి
6. మరీచ్యన్నాం= కట్ లేదా మిరియాలపొంగలి
7. ధద్యోజనం= పెరుగు అన్నము
8. తిలాన్నం=నువ్వులపొడితో చేసిన అన్నం
9. షాకమిశ్రీతాన్నం=కిచ్చిడీ
10.  గుడాన్నం = బెల్లపు పరమాన్నం
11.  సపాదభక్ష్యం= గోధుమనూకతో చేసిన ప్రసాదం
 (గోధుమ నూక చీనీ నెయ్యి సమపాళ్ళలో వేసి చేసిందిగాన ఆపేరు)
12.  గుడమిశ్రిత ముద్గ సూపమ్= వడపప్పు
13.  గుడమిశ్రీత తండులపిష్టం= చనివిడి
14. మధురపానీయ=పానకం
15. పృథక్=అటుకులు
16. పృథకాపాయస=అటుకుల పాయసం
17.  లాజ=పేలాలు
18.  భక్ష్యం= పిండివంటలు
19. భోజ్యం= అన్నము మొదలగునవి
20. వ్యంజనం=పచ్చడి
21. అపూపం=అరిసెలు లేదా అప్పములు
22.  మాషచక్రం= గారెలు
23.  లడ్డుక. = లాడూలు
24. మొదకం=ఉండ్రాళ్ళు

Saturday, October 13, 2018

బంధాలు అనుబంధాల


ఏప్రిల్ 2009లో జరిగిన యదార్థ సంఘటన, ఇది...

_నేను ఢిల్లీ నుంచి విమానంలో తిరిగి వస్తున్నాను. నా పక్కనే రామకృష్ణ మఠానికి చెందిన ఒక స్వామీజీ కూర్చుని ఉన్నారు. అటుపక్కన అమెరికాకు చెందిన ఒక విలేకరి ఉన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం స్వామి పక్కన ఉన్న విలేకరి ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు...

విలేకరి :  “స్వామీజీ ఇంతకుముందు మీరు ఇచ్చిన ఉపన్యాసంలో బంధాలు అనుబంధాల గురించి వివరించారు. నాకు సరిగా అర్థం కాలేదు మళ్ళీ వివరించగలరా ?”_

దానికి స్వామీజీ నవ్వుతూ ప్రశ్నను దాటవేస్తూ విలేకరిని తిరిగి ఇలా ప్రశ్నించారు “మీరు న్యూయార్క్ నుంచి వస్తున్నారా ?”

విలేకరి : “అవును.”

స్వామీజీ :  “మీ ఇంటిలో ఎవరుంటారు ?”

ఈ ప్రశ్న పూర్తిగా వ్యక్తిగతము మరియు అసంబద్ధం కావడంతో, విలేకరి స్వామీజీ తన ప్రశ్నను దాటవేస్తున్నారు అనుకున్నారు. అయినప్పటికీ విలేకరి చెప్పసాగాడు... “అమ్మ చనిపోయారు. నాన్న అక్కడే ఉంటున్నారు. ఇంకా నాకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. అందరికీ వివాహం అయింది..."

ముఖంలో చిరునవ్వు చెదిరిపోకుండా స్వామీజీ గారు మళ్లీ ఇలా అడిగారు  “నీవు మీ నాన్నగారితో మాట్లాడుతున్నావా ?”

విలేకరి ముఖకవళికలు మారటం మొదలైంది...

స్వామీజీ : “ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడావు ?”

జేవురించిన ముఖంతో విలేకరి ఇలా చెప్పాడు  “సుమారు ఒక నెల అయి ఉండొచ్చు...”

స్వామి గారి ప్రశ్నల పరంపర కొనసాగింది... “మీ అన్న చెల్లెళ్ళ ను ఎంత తరచుగా కలుసుకుంటారు? ఆఖరిసారిగా కుటుంబమంతా ఎప్పుడు కలిసి ఉన్నారు ?”

ఆ సమయంలో విలేకరి నుదుట నుంచి చెమట  కారణం స్పష్టంగా కనిపించింది. అక్కడ ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. స్వామీజీ నా ? లేక విలేకరా ?? నాకైతే స్వామీజీ విలేకరిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా అనిపించింది...

ఒక నిట్టూర్పు తో విలేకరి చెప్పాడు  “సుమారు రెండు సంవత్సరాల క్రితం… క్రిస్మస్ సందర్భంలో మేమందరము కలిశాము.”

స్వామీజీ : “మీరందరూ కలిసి ఎన్ని రోజులు ఉన్నారు ?”

నుదుటన స్వేదబిందువులు తుడుచుకుంటూ విలేకరి అన్నాడు “మూడురోజులు...”

స్వామీజీ : “ఎంతకాలం మీ నాన్నగారితో గడిపావు ? ఆయన పక్కనే ఎంతకాలం కూర్చున్నావు ?”

ముఖం కందగడ్డలా మారిన విలేకరి, కాగితంపై పిచ్చిగీతలు గీయడం మొదలుపెట్టాడు...

స్వామీజీ : “నీవు ఎప్పుడైనా మీ నాన్నగారితో కలిసి భోజనంచేసావా ? ఆయన ఎలా ఉన్నారని ఎప్పుడైనా అడిగావా ? మీ తల్లి చనిపోయిన తర్వాత ఆయన రోజులు ఎలా గడుపుతున్నారో అడిగావా ?” విలేకరి కంటినుంచి కన్నీరు కారటం స్పష్టంగా కనిపించింది...

అప్పుడు స్వామీజీ విలేకరి చేతిని ప్రేమతో అందుకని ఇలా అన్నారు  “బాధపడకు. నిన్ను తెలియకుండా బాధించి ఉంటే క్షమించు. కానీ, నీవడిగిన బంధం అనుబంధాలకు సమాధానం ఇదే. మీ నాన్నగారితో నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు. అనుబంధం అంటే హృదయానికి హృదయం కలిసిపోవడం.. కలిసి ఉండడం... కలిసి భోజనం చేయడం.. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించడం... స్పర్శించటం.. చేతులు కలపడం… కళ్ళలోకి సూటిగా చూడగలగటం… కలిసి సమయాన్ని గడపడం... మీ సోదరులందరితో కూడా నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు...”

ఆ విలేకరి కన్నీళ్ళు తుడుచుకుంటూ స్వామీజీతో అన్నారు “బంధం అనుబంధాల గురించి ఇంత అద్భుతమైన బోధన చేసినందుకు ధన్యవాదాలు...”

ఇదీ నేటి వాస్తవికత !!!

సమాజంలో గానీ, ఇంటిలోగానీ, అందరికీ బోలెడు బంధాలు ఉన్నాయి. కానీ అనుబంధాలు కనుమరుగయ్యాయి. ఎవరితో ఎవరికీ సంబంధం లేకుండా, ఎవరి ప్రపంచంలో వారు జీవిస్తున్నారు...

మనం కూడా బంధాలకు కాకుండా అనుబంధాలకు ప్రాముఖ్యతను ఇద్దాం...

పరస్పర ఆప్యాయతలతో కలిసి మెలిసి ఉందాం... !!!

ఇది మీ అందరి కోసం చేసిన...
ఒక ఆంగ్ల సందేశానికి తెలుగు అనువాదం...

చదివి, ఆలోచించి... ఆత్మశోధన చేసుకొని, ఒకరిద్దరమైనా అలవరుచుకుంటే  ( నాతోనూ కలిపి... ), నా ఈ చిన్ని శ్రమకు తగిన ఫలితం దొరికినట్టే... 😌

- మీ స్నేహితుడు (సేకరణ)

అష్టాదశ శక్తిపీఠాల ధ్యానము

ఈ అష్టాదశ శక్తిపీఠాల ధ్యానమును  ఏవరైతే  ప్రతిరోజు పఠిస్తారో వారికి సకల పాపములు నసించి,  అష్టఐశ్వర్యములు,  ఆయురారోగ్యములు  , సర్వ సిద్ధులు , సకల శుభాలు కలుగును.

1) శాంకరీదేవి  ( ట్రింకోమలి ) :
శ్రీ సతి శాంకరీ దేవి త్రింకోమలి పురస్థితా !
ఉత్తమాంగ ప్రభాగౌరీ భక్తకామ ఫలప్రదా !!

2) శ్రీ కామాక్షీ దేవి  (కంచి ) :
కాంచీపురాశ్రితే దేవి కామాక్షీ సర్వమంగళా  !
చింతాతన్మాత్ర సంతుష్టా చింతితార్థ ఫల ప్రదా !!

3) శ్రీ శృంఖలాదేవి  ( ప్రద్యుమ్నం ) :
ప్రద్యుమ్నే వంగ రాజ్యాయాం శృఖలా నామ భూషితే !
విశ్వవిమోహితే దేవీ శృంఖలా బంధనాశనీ !!

4) శ్రీ చాముండేశ్వరీ దేవి  ( మైసూరు  ) :
క్రౌంచపుర స్థితా మాతా చాముండా దుష్టనాశనీ !
సర్వసిద్ధి ప్రదాదేవీ భక్తపాలన దీక్షితా  !!

5) శ్రీ జోగులాంబ దేవి  ( ఆలంపురం ) :
జోగులాంబ మహాదేవీ రౌద్ర వీక్షణ లోచన  !
అలంపురీ స్థతా మాతా సర్వార్థ ఫల సిద్థిదా  !!

6) శ్రీ భ్రమరాంబా దేవి  (శ్రీశైలం) :
శివపార్శ్వస్థితా మాతా శ్రీ శైలే శుభ పీఠకే  !
భ్రమరాంబా మహాదేవీ కరుణారస వీక్షణా  !!

7) శ్రీ మహాలక్ష్మీ దేవీ  ( కొల్హపూర్   )  :
మహాలక్ష్మ్యభిదా దేవీ కరవీర పుర స్థితా  !
పురుషార్థ ప్రదామాతా మహాశక్తి  మాహుగ్రామ !!

8 ) శ్రీ ఏకవీరా దేవి  ( నాందేడ్  ) :
ఏకవీరా మహాశక్తి  మాహుగ్రామ గుహాస్థితా !
పురుషార్థ ప్రదామాతా  సంపూర్ణామృత  వర్షిణీ  !!

9) శ్రీ మహాకాళీ దేవి ( ఉజ్జయిని  ) :
ఉజ్జయిన్యాం మహాకాళీ మహాకాళేశ్వరీ!
క్షిప్రా  తీరస్థితామాతా  వాంఛితార్థ ప్రదాయిని  !!

10 ) శ్రీ  పురుహూతికా దేవి  ( పిఠాపురం ) :
పురుహూతీ సతీమాతా పీఠికాపుర సంస్థితా  !
పుత్రవత్పాలితా దేవీ భక్తానుగ్రహ  దాయినీ  !!

11) శ్రీ గిరిజా దేవి ( కటక్ ) :
ఓఢ్రదేశే భువనేశీ గిరిజానామ సంస్థితా  !
పాలికాఖిల లోకానాం  పల్లవారుణ పాణినా  !!

12) శ్రీ మాణిక్యాంబా దేవి  ( ద్రాక్షారామం   ) :
దక్షావాటీస్థితా శక్తీః  విఖ్యాతా మాణిక్యాంబికా  !
వరదా శుభదాదేవీ  భక్తమోక్ష ప్రదాయిని !!

13) శ్రీ కామరూపిణీ దేవి  (  గౌహతి  ) :
కామరూపిణి విఖ్యాతా హరిక్షేత్రే  సనాతనీ !
 యోనిముద్రాత్రిఖండేశీ మాసే మాసే నిదర్శితా  !!

14) శ్రీ మధావేశ్వరీ దేవి  (  ప్రయాగ   ) :
మాధవేశ్వరీ మాంగళ్య ప్రయాగ స్థల వాసినీ  !
త్రివేణీ సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయినీ  !!

15 ) శ్రీ వైష్ణవీ దేవి  ( జ్వాలాకేతం  ) :
తుహినాద్రి స్థితా మాతా  జ్వాలా ముఖీవిశ్రుతా  !
జ్వాలా మాలా  ప్రభాదేవీ జ్ఞాన వైరాగ్య వర్థినీ  !!

16 ) శ్రీ మాంగల్య గౌరీదేవి  (  గయ   ) :
సర్వ మంగళ  మాంగళ్యా  గయా మాంగల్య గౌరికా  !
అర్థదా మోక్షదాదేవీ అక్షయ్య  ఫలప్రదాయినీ  !!

17 )శ్రీ విశాలాక్షీ  దేవి  (  వారణాసి   ) :
విశాలాక్షీదేవి విఖ్యాత వారణాస్యాం శివాంతికే  !
నిరతాన్న  ప్రదాత్రీచ నిర్భగ్య జనతోషిణీ  !!

18 ) శ్రీ సరస్వతీ దేవి   ( జమ్మూ కాశ్మీర్ ) :
జ్ఞాన ప్రదా సతీమాతా  కాశ్మీరేతు సరస్వతీ  !
మహావిద్యా  మహామాయా  భుక్తి  ముక్తి  ప్రదాయినీ !!

ఓం శ్రీ  మత్రే నమః

Friday, October 12, 2018

కనకధారా స్తవము - తాత్పర్యము 

ఇది శ్రీఆదిశంకరులచే విరచితము. ఆయన ఒక పేదరాలి ఇంటికి బిక్షకై వెడలినపుడు ఆమె వద్ద ఆ సమయమున ఏమి  కపోవుట వలన జగద్గురువును రిక్త హస్తములతో పంపుటకు మనస్కరించక ఒక ఉసిరికాయను భక్తితో బిక్షాపాత్రలో ఉంచెను. ఆచార్యులు ఆమె పరిస్థితిని దివ్యదృష్టితో గమనించి ఆమె పేదరికమును తొలగించుటకు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధారాస్తవము పఠించినారు. అంతట లక్ష్మీదేవి సాక్షాత్కరించి బంగారు ఉసిరికాయలను కురిపించి ఆమె పేదరికమును పోగొట్టినది.


శ్లో॥ లక్ష్మీమ్ క్షీర సముద్రరాజ తనయాం | శ్రీరంగ ధామేశ్వరీమ్

దాసీభూత సమస్త దేవ వనితాం | లోకైక దీపాంకురామ్ |

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ | బ్రహ్మేంద్ర గంగాధరామ్

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం | వందే ముకుంద ప్రియామ్॥


శ్రీ కనకధారా స్తవ ప్రారంభ:

హయగ్రీవ స్తుతి :


శ్లో॥ వందే వందారు మందార మిందిరానంద కందళమ్ ।

అమందానంద సందోహ బంధురం సింధురాననమ్ ॥1

 తాత్పర్యము : నమస్కరించువారి కోరికలు తీర్చు (మందారమను) దేవతావృక్షము వంటివాఁడును, తన పత్నియైన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆనందమునకు మొలక వంటివాఁడును, పండితులు (జ్ఞానులు) అనుభవించు బ్రహ్మానందమునకు కిరీటము వంటివాఁడును అగు భగవాన్ శ్రీశ్రీశ్రీ హయగ్రీవ దేవునికి సాష్టాంగ నమస్కారము సేయుచున్నాను.


శ్రీ కనకధారా స్తోత్రమ్


శ్లో॥ అంగం హరే: పులక భూషణ మాశ్రయంతీ

భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।

అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా

మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా: ॥2


 తాత్పర్యము : ఆఁడు తుమ్మెద నల్లని తమాల వృక్షముపై వాలినట్లుగా ఏ మంగళదేవత యొక్క ఓరచూపు నీలమేఘశ్యాముఁడైన భగవాన్ విష్ణుమూర్తిపై ప్రసరించినప్పుడు ఆ వృక్షము తొడిగిన మొగ్గలవలె ఆయన శరీరముపై పులకాంకురములు పొడమినవో, అష్టసిద్ధులను వశీకరించుకొన్న ఆ శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క కృపా కటాక్షము నాకు సమస్త సన్మంగళములను సంతరించును గాక !


శ్లో॥ ముగ్ధా ముహుర్ విదధతీ వదనే మురారే:

ప్రేమ ప్రపాత ప్రణిహితాని గతాగతాని ।

మాలా దృశోర్ మధుకరీవ మహోత్పలే యా

సా మే శ్రియం దిశతు సాగర సంభవాయా: ॥3

తాత్పర్యము : ఒక పెద్ద కమలము చుట్టుత ఆగి-ఆగి పరిభ్రమించు తుమ్మెద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు గాక !


శ్లో॥ విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షమ్

ఆనంద కంద మనిమేష మనంగ తంత్రమ్ ।

ఆకేకర స్థిర కనీనిక పద్మనేత్రమ్

భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయా: ॥4

తాత్పర్యము : తనను భజించువారికి దేవేంద్ర పదవిని సైతమివ్వజాలినవియు, మానవుఁ డనుభవింపఁగోరు ఎల్ల ఆనందములకును మూలమైనవియు, (దేవత యగుటచే) ఱెప్పపాటు లేనివియు, భగవాన్ విష్ణుమూర్తికి సైతము మన్మథ బాధను కలిగింపఁగలవియు, అర్ధ నిమీలితము (మాఁగన్ను) గా చూచునవియు నైన శ్రీ మహాలక్ష్మీ మాత యొక్క నేత్ర కమలములు నాకు సంపదలను కటాక్షించు గాక !


శ్లో॥ కాలాంబుదాళి లలితోరసి కైటభారేర్

ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।

మాతస్ సమస్త జగతామ్ మహనీయ మూర్తిర్

భద్రాణి మే దిశతు భార్గవ నందనాయా: ॥5

తాత్పర్యము : మబ్బు మధ్యలో మెఱయు మెఱుపు వలె విష్ణుమూర్తి యొక్క (వెంట్రుకలతో వల్లనై) నీలమేఘ సన్నిభమైన వక్ష:స్థలమునందు విలసిల్లు మహనీయ మూర్తి, సకల జగన్మాత, శ్రీ మహాలక్ష్మీ భగవతి నాకు సమస్త శుభములను గూర్చు గాక !


వివరణము :- భార్యానురాగాతిశయముచే భగవాన్ శ్రీ మహావిష్ణువు ఆమెను తన వక్ష:స్థలమునందు దాఁచుకొన్నారని పురాణ వచనము.


శ్లో॥ బాహ్యాంతరే మురజిత: శ్రితకౌస్తుభే యా

హారావళీవ హరినీలమయీ విభాతి ।

కామప్రదా భగవతో౭పి కటాక్ష మాలా

కల్యాణ మావహతు మే కమలాలయాయా: ॥6

తాత్పర్యము : శ్రీ మహావిష్ణువు యొక్క వక్ష: స్థలమునందలి కౌస్తుభ మణి నాశ్రయించి దాని లోపల, వెలుపల కూడ ఇంద్రనీల మణిహారములవంటి ఓరచూపులను ప్రసరింప జేయుచు కోరికలను తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సును చేకూర్చు గాక !


శ్లో॥ ప్రాప్తమ్ పదమ్ ప్రథమత: ఖలు యత్ ప్రభావాత్

మాంగల్య భాజి మధుమర్దిని మన్మథేన ।

మయ్యాపతేత్ తదిహ మంథర మీక్షణార్ధమ్

మందాలసం చ మకరాలయ కన్యకాయా: ॥7

తాత్పర్యము : దేని ప్రభావముచేత మన్మథుఁడు సమస్త కల్యాణ గుణాభిరాముఁడైన శ్రీ విష్ణుమూర్తి యొక్క మనస్సునందు (ఆయనను మన్మథబాధకు గుఱిచేయుట ద్వారా) మొదటి సారిగా స్థానము సంపాదించుకొన్నాడో, ఆ లక్ష్మీదేవి యొక్క నెమ్మదైన మఱియు ప్రసన్నమైన ఓరచూపు నా మీద ప్రసరించు గాక !


శ్లో॥ నుద్యాద్ దయానుపవనో ద్రవిణాంబుధారామ్

అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే ।

దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం

నారాయణ ప్రణయినీ నయనాంబువాహ: ॥8

తాత్పర్యము : లక్ష్మీదేవి యొక్క నీలమేఘముల వంటి నల్లని కనులు, ఈ దరిద్రుఁడనెడి విచారగ్రస్త పక్షి పిల్లపై దయ అనెడి చల్లని గాలితో కూడుకొని వీచి, ఈ దారిద్ర్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను శాశ్వతముగా, దూరముగా తొలగద్రోసి, నా మీద ధనమనెడి వానసోనలను ధారాళముగా కురియించు గాక !


విశేషార్థము : రెండవ పాదమునందలి "అకించన" శబ్దమునకు 'దరిద్రుఁ' డనియు, 'పాపములు లేనివాఁ'డనియు రెండర్థములు.


శ్లో॥ ఇష్టా విశిష్ట మతయో౭పి నరా యయా౭౭ర్ద్ర

దృష్టాస్ త్రివిష్టప పదం సులభం భజంతే ।

దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టామ్

పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా: ॥9

తాత్పర్యము : ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన పండితులు (జ్ఞానులు) తేలికగా స్వర్గధామమున సుఖించెదరో, విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను పొనరించు గాక !


శ్లో॥ గీర్ దేవతేతి గరుడధ్వజ సుందరీతి

శాకంభరీతి శశిశేఖర వల్లభేతి ।

సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితా యా

తస్యై నమస్ త్రిభువనైక గురోస్ తరుణ్యై ॥10

తాత్పర్యము : విష్ణుమూర్తికి భార్యయైన లక్ష్మిగా, బ్రహ్మదేవుని పత్నియైన సరస్వతిగా, సదాశివుని అర్ధాంగియైన అపరాజితగా, శాకంభరీదేవిగా - ఇట్లనేక రూపములతో ఏ విశ్వమాత సృష్టి, స్థితి, ప్రళయ లీలను సాగించుచున్నదో, ఆ విశ్వాత్మకుడైన పరమ పురుషుని ఏకైక ప్రియురాలికి నమోన్నమహ.


శ్లో॥ శ్రుత్యై నమో౭స్తు శుభకర్మ ఫల ప్రసూత్యై

రత్యై నమో౭స్తు రమణీయ గుణార్ణవాయై ।

శక్త్యై నమో౭స్తు శతపత్ర నికేతనాయై

పుష్ట్యై నమో౭స్తు పురుషోత్తమ వల్లభాయై ॥ 11

తాత్పర్యము : శుభములైన శ్రౌత, స్మార్త కర్మలకు సముచిత ఫలముల నొసంగు వేదమాతృ స్వరూపురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. ఆనందపఱచు గుణములకు సముద్రము వంటిదగు రతీదేవి స్వరూపురాలైన భార్గవీమాతకు ప్రణామము. నూఱు దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తిస్వరూపురాలికి వందనము. విష్ణుమూర్తికి ప్రియురాలైన పుష్టిస్వరూపురాలగు ఇందిరాదేవికి దండములు.


శ్లో॥ నమో౭స్తు నాళీక నిభాననాయై

నమో౭స్తు దుగ్ధోదధి జన్మభూమ్యై ।

నమో౭స్తు సోమామృత సోదరాయై

నమో౭స్తు నారాయణ వల్లభాయై ॥12

తాత్పర్యము : పద్మము వంటి ముఖము గలిగిన మంగళదేవతకు నమస్కారము. పాల కడలిని తన జన్మస్థానముగా గల శ్రీ పద్మాలయా దేవికి వందనము. అమృతమునకును, దానితో పాటుగా ఉద్భవించిన చంద్రునికిని తోబుట్టువైన మాదేవికి ప్రణామము. భగవాన్ విష్ణుమూర్తికి ప్రేమాస్పదురాలైన లోకమాతకు దండములు.


శ్లో॥ నమో౭స్తు హేమాంబుజ పీఠికాయై

నమో౭స్తు భూమండల నాయికాయై ।

నమో౭స్తు దేవాది దయాపరాయై

నమో౭స్తు శార్ఙ్గాయుధ వల్లభాయై ॥13

తాత్పర్యము : బంగారు పద్మమునే తన పీఠముగా అధివసించి యున్న శ్రీమన్మహాలక్ష్మీ భగవతికి నమస్కారము. సమస్త భూమండలమునకున్ను ప్రభుత్వము వహించి యున్న శ్రీ భార్గవీమాతకు వందనము. దేవ, దానవ, మనుష్యాదులందఱి పట్లను దయఁ జూపఁజాలిన ఆ మహాశక్తి సంపన్నురాలికి ప్రణామము. శార్ఞ్గమను ధనుస్సును ధరించిన భగవాన్ విష్ణుమూర్తికి మిక్కిలి కూర్చునదైన శ్రీ కమలాదేవికి దండములు.


శ్లో॥ నమో౭స్తు దేవ్యై భృగు నందనాయై

నమో౭స్తు విష్ణో రురసి స్థితాయై ।

నమో౭స్తు లక్ష్మ్యై కమలాలయాయై

నమో౭స్తు దామోదర వల్లభాయై ॥14

తాత్పర్యము : బ్రహ్మ యొక్క మానస పుత్త్రులలో ఒక్కడైన భృగువను ఋషి యొక్క వంశమునం దుద్భవించినదియు, లోకోత్తరమైన భర్తృ వాల్లభ్యమును చూఱగొన్న మహిమాతిశయముచే తన భర్తయైన భగవాన్ విష్ణుమూర్తి యొక్క వక్ష:స్థలము నధివసించి యున్నదియు, కమలములే తన ఆలయములుగా గలదియు నగు శ్రీ ముకుందప్రియాదేవికి నమస్కారము.


శ్లో॥ నమో౭స్తు కాంత్యై కమలేక్షణాయై

నమో౭స్తు భూత్యై భువన ప్రసూత్యై ।

నమో౭స్తు దేవాదిభి రర్చితాయై

నమో౭స్తు నందాత్మజ వల్లభాయై ॥15

తాత్పర్యము : కమలముల వంటి కన్నులు గల కాంతిస్వరూపురాలికి నమస్కారము. ప్రపంచములను గన్న తల్లియగు అష్టసిద్ధి స్వరూపురాలికి వందనము. దేవ, దానవ, మనుష్యాదులచే పూజింపఁబడు లోకైక శరణ్యురాలికి ప్రణామము. నందకుమారుడైన శ్రీకృష్ణ పరమాత్ముని చెలికత్తె యగు శ్రీదేవికి దండములు.


విశేషార్థము : ఇచ్చట "కమలముల వంటి కన్ను" లనఁగా 'కమలముల వలె అందమైన కన్ను' లని లోకానబోధము. పూర్వవ్యాఖ్యాతలందఱును అట్లే వ్యాఖ్యానించి యున్నారు. కాని, దీని నిజమైన అర్థము వేఱు. దేవతల కన్నులు మనుష్యుల కన్నుల వలె తెల్లగా కాక కమలముల వలె ఎఱ్ఱగా నుండును.


శ్లో॥ సంపత్కరాణి సకలేంద్రియ నందనాని

సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షి ।

త్వద్ వందనాని దురితాహరణోద్యతాని

మామేవ మాత రనిశం కలయంతు మాన్యే ॥16

తాత్పర్యము : దేవతలందఱిలోను మాన్యురాలవైన ఓ మహాలక్ష్మీ ! మేము నీకుఁ జేయు వందనములు మాకు సంపదలను గలిగించునవి. మా యొక్క సమస్త ఇంద్రియములను సుఖపెట్టునవి. అవి రాజాధిరాజత్వమును సైతము ప్రసాదింపఁ జాలినవి. పాపములను పోకార్చుటకు సదా సన్నద్ధమైనట్టివి. అవి నన్నెల్లప్పుడును (పసిబిడ్డను వలె) పట్టుకొని యుండు గాక !


శ్లో॥ యత్కటాక్ష సముపాసనా విధి:

సేవకస్య సకలార్థ సంపద: ।

సంతనోతి వచనాంగ మానసైస్

త్వామ్ మురారి హృదయేశ్వరీమ్ భజే ॥17

తాత్పర్యము : హే మహాలక్ష్మీ ! ఎవరి కటాక్షమును గోరుచు మనసా, వాచా, కర్మణా ఉపాసించిన భక్తులకు అష్టైశ్వర్యములు సమకూడునో, అట్టి హరిప్రియవైన నిన్ను శ్రద్ధతో భజించుచున్నాను.


శ్లో॥ సరసిజ నయనే సరోజ హస్తే

ధవళ తరాంశుక గంధమాల్యశోభే ।

భగవతి హరివల్లభే మనోజ్ఞే

త్రిభువన భూతికరి ప్రసీద మహ్యమ్ ॥18

తాత్పర్యము : అందమైనదానా ! కమలములవంటి కన్నులును, చేతులును గలదానా ! మిక్కిలి తెల్లనైన దువ్వలువల తోడను, గంధపు పూత తోడను, పూల దండల తోడను ప్రకాశించుదానా ! విష్ణుమూర్తికి ప్రేయసివైనదానా ! ముల్లోకములకున్ను సంపదల ననుగ్రహించుదానా ! హే భగవతీ ! శ్రీ మహాలక్ష్మీ ! నాయందు సంప్రీతురాలవు కమ్ము !


శ్లో॥ దిగ్ దంతిభి: కనక కుంభ ముఖావసృష్ట

స్వర్ వాహినీ విమల చారు జలప్లుతాంగీమ్ ।

ప్రాతర్ నమామి జగతాం జననీ మశేష

లోకాధినాథ గృహిణీ మమృతాబ్ధి పుత్రీమ్ ॥19

తాత్పర్యము : అభ్రము, కపిలా, పింగళాదులైన దిగ్గజముల భార్యలు (ఆఁడేనుఁగులు) బంగారు కలశముల యందు పవిత్రమైన ఆకాశగంగ నుండి పట్టి తేరఁగా, ఆ పరిశుద్ధమగు జలములతో అనునిత్యమున్ను స్నానము చేయు జగజ్జననియు, లోకేశ్వరుడైన శ్రీ మహావిష్ణుని యిల్లాలును, పాల కడలి యొక్క కూఁతురును అగు శ్రీశ్రీ మహాలక్ష్మీ భగవతిని ప్రొద్దుననే లేచి భక్తితో స్మరించెదను.


శ్లో॥ కమలే కమలాక్ష వల్లభే త్వం

కరుణా పూర తరంగితై రపాంగైర్ ।

అవలోకయ మా మకించినానామ్

ప్రథమం పాత్ర మకృత్రిమం దయాయా: ॥

20

తాత్పర్యము : అమ్మా ! కమలాదేవీ ! దరిద్రులలోకెల్ల దరిద్రుడను నేనే. అందుచేత నీ కృపకు అందఱి కంటె ముందు పాత్రుడనైనవాఁడను నేనే. నా మాటలలో నటన (కృత్రిమత్వము) లేదు. కనుక నీ కరుణాపూరిత కటాక్షముల (ఓరచూపుల) తో నన్నొకమారు చూడుము తల్లీ ! దేవీ ! ముకుందప్రియా !శ్లో॥ బిల్వాటవీ మధ్య లసత్ సరోజే

సహస్ర పత్రే సుఖ సన్నివిష్టామ్ ।

అష్టాపదాంభోరుహ పాణిపద్మాం

సువర్ణ వర్ణామ్ ప్రణమామి లక్ష్మీమ్ ॥

21

తాత్పర్యము : మారేడు చెట్ల తోఁట మధ్యలో వేయి దళముల పద్మమునందు సుఖముగా ఆసీనురాలైనదియు, బంగారు వన్నెతో ప్రకాశించునదియు, బంగారు కమలములను తన చేతినుండి జారవిడచుచున్నదియు నైన శ్రీ మహాలక్ష్మీ భగవతికి భక్తితో ప్రణమిల్లుచున్నాను.

వివరణము :

౧."అష్టాపదమ్" అనఁగా బంగారము.

౨. "సంవిష్ట" అనఁగా 'నిదురించినది' అని అర్థము. కానీ ఆ అర్థమిచ్చట పొసఁగదు. "నివిష్ట" ప్రయోగమును బట్టి 'ఇమిడినది' అని చెప్పికొనవలసి యుండును.


శ్లో॥ కమలాసన పాణినా లలాటే

లిఖితామక్షర పంక్తి మస్య జంతో: ।

పరిమార్జయ మాతరంఘ్రిణా తే

ధనిక ద్వార నివాస దు:ఖ దోగ్ధ్రీమ్ ॥22

తాత్పర్యము : ధనికుల యిళ్ళ ముంగిట పడికాపులు కాచుమని ఆ బ్రహ్మదేవుఁడు ఈ హీనజీవి యొక్క నుదుట వ్రాసిన వ్రాతను దయచేసి నీ కాలితో తుడిచి వేయుమమ్మా ! తల్లీ ! శ్రీ మహాలక్ష్మీ !


విశేషార్థము : శ్రీ మహాలక్ష్మీ భగవతి యొక్క ఎడమకాలి తన్నులు కూడా ఎవరికిని అంత సులభముగా లభింపవని భావము.


శ్లో॥ అంభోరుహం జన్మగృహం భవత్యా:

వక్ష:స్థలం భర్తృ గృహం మురారే: ।

కారుణ్యత: కల్పయ పద్మవాసే

లీలాగృహమ్ మే హృదయారవిందమ్ ॥23

తాత్పర్యము : హే పద్మాలయా దేవీ ! నీ పుట్టినిల్లు కమలము. మెట్టినిల్లు నీ పతి విష్ణుమూర్తి యొక్క వక్ష:స్థలమే. పరిశుద్ధమైన నా హృదయము సహితము పద్మమే. కనుక కృపతో నా హృదయమునందు స్థిర నివాసమేర్పఱచుకొని దానిని నీ కేళీగృహముగాఁ జేసికొనుము.


విశేషార్థము : ఇచ్చట ఆదిశంకరులు కేవలము "నా యింటికి వచ్చి యుండు"మనుట లేదు. "నా హృదయమునందే నిలుకడగా ఉండు"మనుచున్నారు. ఇంటికి భౌతికముగా వచ్చిన లక్ష్మి సహజ చాంచల్యముచే ఎప్పుడైనను వెడలిపోవచ్చును. కాని హృదయమునందు నిలిపికొన్న లక్ష్మి మట్టుకు భక్త పరాధీనురాలు గనుక తన చాంచల్యమును వీడి భక్తునితో ఉండిపోవునని భావము.


లక్ష్మీదేవిని సంపదల కొఱకు ఉపాసించుటొక్కటే చాలదు, సంపదలు సిద్ధించిన పిమ్మట కూడ ఆమె చేసిన మేలు మఱువక ఆమెను తరతరములుగా అర్చించినప్పుడే ఆ సంపదలు కలకాలము నిలబడునని తాత్పర్యము.


శ్లో॥ స్తువంతి యే స్తుతిభి రమూభి రన్వహం

త్రయీమయీం త్రిభువన మాతరం రమామ్ ।

గుణాధికా గురుతర భాగ్య భాజినో

భవంతి తే బుధ భావితాశయా: ॥24

తాత్పర్యము : ఎవరైతే ఈ స్తుతిపూర్వములైన శ్లోకములతో వేదమాతయు, జగజ్జననియు అయిన శ్రీ మహాలక్ష్మీ భగవతిని ప్రతి దినమున్ను స్తోత్రము సేయుదురో, వారు తమ సద్గుణములచేత ఇతరుల కంటె అధికులై, విద్వాంసుల చేత గౌరవింపఁబడుచు మిక్కిలి విస్తారములైన సౌభాగ్య భాగ్యములతో విలసిల్లగలరు.


విశేషార్థము : విద్వాంసుల చేత గౌరవింపబడుటయే లౌకిక జీవన పరమార్థము. అది విజ్ఞాన సముపార్జనము వలననే సిద్ధించును. అనఁగా ధనమునకు సహితము విజ్ఞాన సముపార్జనమే ధ్యేయము.

ఫలశ్రుతి:

శ్లో॥ కనకధారా స్తవం యత్ శంకరాచార్య నిర్మితమ్ ।

త్రిసంధ్యం య: పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్ ॥25

తాత్పర్యము : జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులవారు కూర్చిన ఈ కనకధారా స్తవమును దినమునకు మూఁడుసారులు - అనఁగా ఉదయ, మధ్యాహ్న, సాయం సంధ్యలలో - పారాయణము చేసినవారు కుబేరునితో సమానమైన సంపదలను పొందగలరు.

దేవాలయమున చేయకూడని 32 దోషములు


🌸🌾🌸🌾🌸🌾🌸🌾🌸🌾🌸🌾🌸🌾🌸🌾
పూర్వము భగవద్రామానుజులు పరమపదించు సమయమున శిష్యులు దరి చేరి తాము సుకరముగా తరించు మార్గము సెలవివ్వమని వేడుకొనిరి.

అప్పుడు భగవద్రామానుజులు
శ్రీభాష్యము - భగవద్విషయాది గ్రంథ కాలక్షేపము చేయమని చెప్పి, ఒకవేళ చేయలేని పక్షమున అంతటి ఫలమును ఇచ్చునది అయినది

  "శ్రీశస్థలేష్వన్వహం కైంకర్యం " అనిరి.

అనగా అర్థం, పెరుమాళ్ళు వేంచేసి ఉన్న దివ్య క్షేత్రములలో శక్తి కొలది కైంకర్యము చేయుట అని.

ఆలయమున మన శక్తి కొలది చేయు కైంకర్యములు - ప్రదక్షిణలు చేయుట, ఆలయ ప్రాంగణము తుడుచుట, నీటితో కడిగి కళ్ళాపి చల్లి ముగ్గులు వేయుట, దీపారాధన చేయుట, పూమాలికలు అల్లి స్వామికి సమర్పించుట, ఉత్సవ సమయాలలో తోచిన సహాయము చేయుట ఇత్యాదివి.

ఆలయానికి వెళ్ళినపుడు కొన్ని అపచారములు జరగకుండా జాగ్రత్తపడాలి.

వరాహ పురాణములో ఆలయములో చేయకూడని ముప్పైరెండు కార్యములు తెలుపబడి ఉన్నవి :

1. యానైర్వా పాదుకైర్వాపి  గమనం భగవద్గృహం ।
    దేవోత్సవాత్ అసేవా చ  అప్రణామ స్తదగ్రతః ॥

2. ఏక హస్త ప్రణామశ్చ  పురస్స్వాత్మ ప్రదక్షిణమ్ ।
   ఉచ్ఛిష్టే  చైవ చాశౌచే   భగవద్ వన్దనాదికమ్  ॥

3. పాద ప్రసరణం చాగ్రే   తథా పర్యంక బన్ధనమ్ ।
   శయనమ్ భోజనం చైవ   మిథ్యో  భాషణ మేవచ ॥

4. ఉచ్ఛైర్ భాషా వృధా జల్పో  రోదనం చైవ విగ్రహః ।
   నిగ్రహానుగ్రహౌ చైవ  స్త్రీషు సాకూతభాషణమ్ ॥

5. అశ్లీల కథనమ్ చైవ అప్యథో వాయువిసర్జనమ్ ।
   కమ్బలావరణమ్ చైవ పరనిన్దా పరస్తుతి: ॥

6. శక్తౌ గౌణోపచారశ్చ అప్యనివేదిత భక్షణమ్ ।
   తత్తత్కాలోద్భవానామ్ చ  ఫలాదీనామ్ అనర్పణమ్ ॥

7. వినియుక్తావశిష్టస్య ప్రదానం వ్యంజనాదిషు ।
   పృష్టీకృత్యాసనం చైవ  పరేషామభివాదనమ్ ॥

8. గురౌ మౌనం నిజస్తొత్రమ్ దేవతా నిన్దనమ్ తథా ।
   అపచారాస్తథా విష్ణో: ద్వాత్రింశత్ త్పరికీర్తితాః ॥         

అనువాదము:

1. ఏదైనా వాహనమునెక్కి , పాదుకలను ధరించి ఆలయమునకు వెళ్ళుట .

2. ఉత్సవము జరుగుచున్నచో సేవించక తిరిగి వచ్చుట.

3. భగవంతునికి నమస్కరించకుండుట.

4. ఒక చేతితో నమస్కరించుట.

5. భగవంతుని ఎదుట ఆత్మ ప్రదక్షిణము చేయుట.

6. ఎంగిలి చేతితో ఆశౌచముతో నమస్కరించుట.

7. పెరుమాళ్ళకెదురుగా వీపుకు, మోకాళ్ళకు బట్ట చుట్టుకుని ఊగుచూ కూర్చుండుట.

8. ఆలయములో భగవంతుని ఎదురుగా పడుకొనుట.

9. భగవంతుని ఎదురు మండపములో విస్తరి పరుచుకుని భుజించుట.

10. ఆలయమున లౌకిక విషయముల గురించి ఒకరితోనొకరు మాట్లాడుకొనుట.

11. గట్టిగా అనవసర మాటలు మాట్లాడుట.

12. లౌకిక విషయములపై ప్రసంగములు చేయుట.

13. గట్టిగా ఏడ్చుట .

14. ఒకరితోనొకరు పోట్లాడుట.

15. నిగ్రహము కోల్పోయి పక్కవారిని బెదిరించటం వంటి దాష్టిక చేష్టలు చేయుట.

16. ఒకరికి "నీకు ఈ ఉపకారము చేస్తాను", అని ప్రతిజ్ఞ చేయుట.

17. స్త్రీలతో భావగర్భితముగా పరిహాసము ఆడుట.

18. ఆడరాని మాటలాడుట.

19. అపాన వాయువు విడుచుట. (ఆ అవసరము వస్తే ముందుగానే బయటికి వెళ్ళాలి.)

20. కంబళి - శాలువ మొదలగు వానితో శరీరమంతయు కప్పుకొనుట. చలి అధికముగా ఉన్నచో  పై వస్త్రమును యజ్ఞోపవీతము వలే కప్పుకుని కుడిచేయి బయటకు ఉంచవలెను.

21. సన్నిధిలో ఇతరులను నిందించుట.

22. ఇతరులను పొగుడుట.

23. శక్తి ఉన్నా భగవంతునికి అల్పముగా సమర్పించుట.

24. పెరుమాళ్ళకు ఆరగింపు కాని పదార్థములు సన్నిధిలో కుర్చుని భుజించుట.

25. ఆయా సమయాలలో తన ఇంటిలో గానీ తోటలో గానీ పండిన పండ్లను, కూరలను, పూచిన పూలను పెరుమాళ్ళకు సమర్పించకుండా తాను ఉపయోగించుకొనుట.

26. తాను ఉపయోగించగా మిగిలిన పుష్పాలను, ఫలాలను పెరుమాళ్ళకు వినియోగించుట.

27. పెరుమాళ్ళవైపు వీపు పెట్టి కూర్చొనుట.

28. సన్నిధిలో పెరుమాళ్ళ ఎదుట ఇతరులకు నమస్కరించుట.

29. తన ఆచార్యుల ప్రసంగము వచ్చినపుడు వారిని ప్రశంసిన్చకుండుట.   

30. ఎట్టి సందర్భములలో అయినను తనను తాను పొగడుకొనుట.

31. భగవంతుని నిందించుట.

32. కాళ్ళు చాపుకుని కూర్చొనుట.

ఈ తప్పులను దేవాలయములో చేసినచో సంపాదించుకున్నపుణ్యము హరించుకుపోతాయని వరాహ పురాణములో చెప్పబడియున్నది.

ఎంబెరుమానార్ దివ్య తిరువడిగళే శరణం

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...