Sunday, April 21, 2019

శివానుగ్రహం

నమక చమకాలను రుద్రాధ్యాయమంటారు.
సమస్త జ్ఞానానికీ మూలమైనవాడు శివుడు. ఆయనే దక్షిణామూర్తి. అమ్మవారితో కలిసి సాంబసదాశివుడు. పదకొండు రుద్రులుగా దేవతలను రక్షించే మహారుద్రుడు. భక్తకింకరుడైన శంకరుడు. దేవతలందరికీ ఆరాధ్యుడైన మహాదేవుడు.

శ్రీమహావిష్ణువు దశావతారాలు ధరిస్తే, పరమశివుడు నూట ఎనిమిది రుద్రావతార లీలల్ని ప్రదర్శించి లోకాలకు శుభాలను ప్రసాదించాడు. జీవుల కర్మదోషాలకు శిక్షలు విధించే నవగ్రహాలకు శివుడే అధిపతి. అందుకే గ్రహబాధల నుంచి రక్షణకు శివారాధన చెయ్యాలంటారు.

పూజ, అర్చన, ఆరాధనలు- వివిధ స్థాయులకు చెందినవి. శివుడికి సంబంధించి అర్చన, ఆరాధన అనే మాటలు ఉపయోగిస్తారు. రుద్రార్చనలో నమక చమక మంత్రాభిషేకం, బిల్వార్చనలు ఉంటాయి. ఆరాధనలో ‘యత్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం’ అనే సంపూర్ణ శరణాగతి ఉంటుంది. ప్రతి చర్యా ఆయన సేవే అనుకోవాలి.
శివశరణం లభించడమంటే రుద్ర కవచం మనకు దక్కినట్లే. త్రిశూలపాణి మనకు అండగా ఉన్నట్లే. అయితే, వీటిని పొందగల అర్హత మనం ఆర్జించుకోవాలి.

అలా ఆర్జించుకోవాలంటే, రుద్ర నమక మంత్రం ‘సౌమనసశ్చమే’ అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. రుద్ర మంత్రాల ద్వారా మనం అనేక మహత్తరమైన ఆకాంక్షలను శివుడికి విన్నవించుకుంటాం. వాటిని మనకు అనుగ్రహించమని అర్థిస్తాం. అలాంటిదే ‘సౌమనసశ్చమే’. ‘మంచి మనసును నాకు ప్రసాదించు శివా!’ అనేది ఈ మంత్రార్థం.

మనిషి కష్టాలన్నీ మంచి మనసు లేకపోవటం వల్లనే కలుగుతున్నాయి. స్వార్థం, అసూయ, ద్వేషం లాంటి మహాపాషాణ విషాలు మన మనసులో తిష్ఠవేసుకుని ఉంటాయి. క్షీరసాగర మధన వేళ ఉద్భవించిన లోకభీకరమైన మహా వినాశనకారి అయిన హాలాహలాన్ని స్వీకరించిన పరమశివుడు మన మనసులోని పాషాణ విషాలను సైతం హరించివేయాలని మన ప్రార్థన, అభ్యర్థన. అవి తొలగిపోతే కానీ మనసు అమృతీకరణం చెందదు.
అమృతీకరణం చెందిన మనసు అందరి క్షేమాన్నీ కోరుతుంది. ఉదారంగా, సౌమ్యంగా, సర్వజన ప్రియంగా వ్యవహరిస్తుంది. అప్పుడిక శత్రువులంటూ ఉండరు. శత్రుబాధలు లేనప్పుడు అశాంతి ఉండదు. ఇదే ఆనంద రహస్యం.

భగవంతుడు మనపట్ల ఉదారంగా ఉండాలనుకుంటాం. కానీ మనం ఎవరి పట్లా ఉదారత చూపం. ఆర్తితో అలమటిస్తున్నవారి పట్ల ఉదాసీనంగా ఉంటాం. ఉదారంగా ఉండేందుకు మనస్కరించదు. ఎవరికైనా దానం చేసేటప్పుడు మన దగ్గర ఉన్న అతి చిన్న నాణేన్ని వెతికి వెతికి తీసి మరీ వేస్తాం. అలా ఉంటుంది లోభత్వం.

మూడు రకాల మనుషుల్ని మనం చూస్తుంటాం. శక్తి ఉన్నా పైసా కూడా దానం చెయ్యని పరమ పీనాసులు ఉంటారు. తమ శక్తికి లోబడి సాయం చేసే జాగ్రత్తపరులు కనిపిస్తారు. తమ శక్తికి మించి ఆదుకునే అమృత హృదయులూ ఉంటారు.
భగవంతుడు అలాంటి అమృత హృదయుల్ని అక్కున చేర్చుకుంటాడు. ఎందుకంటే, దయగలవారే దైవ సమానులు. దయామూర్తులే దైవ పరివార సభ్యులు. దీనులకు దైవపరివారమే బంధువులు.
జన్మతః భగవంతుడు అందరికీ మంచి మనసునే ఇస్తాడు. ప్రాపంచిక ప్రలోభాలతో మనసు కలుషితమైపోతుంది. నిత్యం పాత్రలను శుభ్రం చేసుకున్నట్లే మనసునూ శుభ్రం చేసుకోవాలి. అందుకు శివారాధన అత్యుత్తమం.
శివప్రీతికరమైన మాస శివరాత్రులు, సోమవారాలు, కార్తిక మాసంలో ప్రతి రోజును మనం శివారాధనలో సద్వినియోగం చేసుకుంటే, సౌమనస్కులుగా ఉండగలుగుతాం!

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...