Tuesday, January 22, 2019

వేదములు వాటి ఆవిర్భావము

వేదమనగా – విద్ అను ధాతువు నుండి పుట్టినది. “వేద ఇతీతి వేదః” అనగా తెలియచేయునది వేదమని చెప్పబడును. “విదంతి యతో ధర్మాధర్మమితి వేదః” అనగా దేని సహాయము వలన ధర్మాధర్మములు తెలియబడుచున్నవో అదే వేదము.

శ్రుతి|| శౄయత ఇతి శ్రుతిః|| మరియు
శ్రుతిః|| ఆమ్నాయతే పరంపర ఏత్యామ్నాయః||

అనగా శ్రోత్రేంద్రియమునకు వినబడుటచే శ్రుతియనియూ, గురుశిష్య పరంపరగా తెలియబడునది అయినందున ఆమ్నాయమని చెప్పబడును. శ్రుతి గురువు నుంచి శిష్యుడు వినే దివ్యవాణి. ఆమ్నాయము ఆవృత్తి లేదా మననము ద్వారా నేర్చుకోబడే విద్య. వేదము మొదట్లో ఒక్కటిగానే వుండెను. కృష్ణ ద్వైపాయనుడు వేదమును నాలుగు భాగములుగా విభజించి మానవులకు సులభతరముగా అర్థమయ్యేటట్లు చేసిన మహాఋషి కావడముచేత వేదవ్యాసుడని పేరుగాంచెను. మహాఋషులైన మంత్ర ద్రష్టల శ్రోత్రేంద్రియములకు వినిపించిన వాక్కులే వేదములు. కనుకనే వాటిని అపౌరుషేయములని చెప్పబడినవి. వేదములకు కర్త అనేవాడు ఒకడు లేనందున అనగా పురుష నిర్మితము కానందున అవి అపౌరుషేయములనీ, అనాది అగుటచే ఒక కాలములో పుట్టెననుటకు వీలు కాదనియూ, నిత్యమగుటచే మార్పుచెందునవిగాని నశించునవిగాని కావనియూ, కనుక సర్వకాలములకు, సర్వులకు నిత్యమైన ప్రమాణ గ్రంథరాజములు వేదములు అని స్తుతింపబడుచున్నవి. పరమాత్మకు అన్యముగా వేదములు లేవు మరియు వేదములు పరమాత్మయందే నిక్షిప్తమై ప్రకటమగుచున్నందున ‘నిశ్వాసితం’ – ఈశ్వరుని యొక్క నిశ్వాసములే వేదములని బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పబడినది. వేదములను నిగమములని కూడా అంటారు.

వేదములు నాలుగు:

1) ఋగ్వేదము
2) యజుర్వేదము
3) సామ వేదము
4) అధర్వణ వేదము

వేదము బ్రాహ్మణములు, సంహితలు, అరణ్యకములు అని త్రివిధ భాగములుగా ఉండును.

బ్రాహ్మణములు కర్మ పద్ధతిని తెలియజేయునట్టివి. ఇది వివిధ ఆచారములు వాటిని పాటించే విధముల గురించి వివరించే భాగము.

సంహితలు అనగా భగవంతుని స్తుతించునట్టి స్తోత్రములు. ఇందులో ఇహలోక పరలోక లభ్ధికోసము వివిధ దేవతల గురించి ప్రార్థనలు ఉన్న భాగము. సంహితలలో భక్తి పద్ధతి బోధించబడినది.

అరణ్యకములు అనగా వేదాంతమును బోధించు ఉపనిషత్తులు. అరణ్యకములలోని ఉపనిషత్తులయందు జ్ఞాన పద్ధతి తెలియజేసి బ్రహ్మస్వరూపము ఉపదేశించబడినది. ఉపనిషత్తులనే వేదశిఖరములనియూ, వేదాంతములనియూ అంటారు. ఉపనిషత్తులు వేదములలోని సారాంశాన్ని వివరిస్తాయి.

మొత్తము వేద విజ్ఞానమును ఒక మహావృక్షంగా భావిస్తే బ్రాహ్మణములను ఆ చెట్టు పూలుగా, సంహితలను పచ్చి కాయలుగా, ఉపనిషత్తులను పండ్లుగా వర్ణించవచ్చును. కృష్ణ ద్వైపాయనుడు వేదములను విభజించి తన శిష్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అనే వారికి బోధించాడు. వారు తమ శిష్యులకు బోధించారు. అలా గురుశిష్య పరంపరగా ఈ నాలుగు వేదములు వేల సంవత్సరాలుగా తరతరాలకూ సంక్రమిస్తూ వచ్చాయి. వేదములను ఉచ్ఛరించడములో స్వరానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. అన్ని వేదములు కలిపి 1,180 అధ్యాయాలు, లక్ష పైగా శ్లోకాలు ఉండాలని అంటారు. ఒక్కొక్క అధ్యాయమునకు ఒక్కటేసి చొప్పున 1,180 అధ్యాయాలకు 1,180 ఉపనిషత్తులు ఉండేవి. కాని ప్రస్తుతము మనకు లభించిన శ్లోకాలు 20,023 (ఈ సంఖ్య 20,379 అని కూడా అంటారు) కాగా, ఉపనిషత్తులు 108 మాత్రమే లభించినవి. మిగతావి కాలగర్భములో కలిసిపోయాయి.

1) ఋగ్వేదము

ఈ వేదము అన్ని వేదములలో ప్రాచీనమైనదిగా భావిస్తారు. ఈ వేదము మొట్టమొదటిసారిగా పైల మహర్షికి ప్రకటింపబడినది. అగ్ని దేవుడికి అంకితము చేయబడిన ఈ వేదమునకు అధిష్ఠాన దేవత గురువు. ఈ వేదము మొత్తము 10 మండలాలుగా విభజించబడి, 1028 సూక్తములతో 10,552 మంత్రాలతో అలరారుతూ ఉంది. ఈ వేదము మొదటిలో 21 శాఖలుగా విస్తరించి ఉండేది. కాని ఇప్పుడు 5 శాఖలు మాత్రమే దొరుకుతున్నాయి. దేవతా సూక్తములు, ఆత్మ సంబంధిత సూక్తములు, సామాన్య జీవన విధాన సూక్తములు ఇందులో పొందు పరచ బడినాయి.

2) యజుర్వేదము

వైశంపాయన మునికి మొదటి సారిగా ప్రకటించబడిన ఈ వేదము వాయు దేవునికి అంకితము చేయబడినది. అధిష్ఠాన దేవత శుక్రుడు. ఈ వేదము 40 స్కంధములుగా విభజించబడి, 1975 శ్లోకములతో అలరారుతుంది. ఈ వేదమును ‘శుక్ల’ యజుర్వేదము అని, ‘కృష్ణ’ యజుర్వేదము అని రెండు భాగములుగా విభజించారు. వీటిలో శుక్ల యజుర్వేదము ప్రాచీనమైనది. కృష్ణ యజుర్వేదము యాఙ్ఞవల్క్య మునికి ప్రకటించబడినది. యజుర్వేదము మొదట 102 శాఖలుగా ( 85 కృష్ణ, 17 శుక్ల) విస్తరించినప్పటికి, ప్రస్తుతానికి 4 కృష్ణ యజుర్వేద శాఖలు, రెండు శుక్ల యజుర్వేద శాఖలు మాత్రమే మనకు మిగిలాయి. ఈ వేదము ముఖ్యముగా సాంప్రదాయ పద్ధతులు, పూజా విధానములు, బలి మొదలైన వాటిని వివరిస్తుంది. కృష్ణ యజుర్వేదములో ‘తైతిరీయ’, ‘కఠ’ ఉపనిషత్తులు ఉండగా, శుక్ల యజుర్వేదములో ‘ఈశ’, ‘బృహదారణ్యక’ ఉపనిషత్తులున్నాయి.

3) సామ వేదము

ఈ వేదము మొట్టమొదటి సారిగా జైమిని మునికి ప్రకటించబడింది. ఈ వేదమునకు అధిష్ఠాన దేవత అంగారకుడు. ఈ వేదము ఆదిత్యునికి అంకితము చేయబడినది. ఈ వేదము రెండు భాగములుగా విభజించబడింది.

(1) పూర్వార్సిక: 4 స్కంధములలో 585 మంత్రములు కలిగి ఉంది.

(2) ఉత్తరార్సిక: 21 స్కంధములలో 964 మంత్రములను కలిగి ఉంది.

మొత్తం 1564 మంత్రములలో 75 మంత్రాలు ఋగ్వేదము నుంచి గ్రహించబడినాయి. మొదట్లో 1000 శాఖలుగా విస్తరించిననూ ప్రస్తుతానికి 3 శాఖలు మాత్రమే నిలిచి ఉన్నాయి. దైవ ప్రార్థనలు, సంగీతము, శాంతి ప్రార్థనలు ఈ వేదములో మనకు కనపడే విశేషములు.

4) అధర్వణ వేదము

ఈ వేదము మొదటి సారిగా సుమంతు మహామునికి ప్రకటించబడినది. ఆదిత్యునికి అంకితమైన ఈ వేదమునకు బుధుడు అధిష్ఠాన దేవత. ఈ వేదము రెండు భాగములుగా విభజించబడినది.

(1) పూర్వార్థ: అనేక విషయముల పై చర్చ.
(2) ఉత్తరార్థ: వివిధ ఆచారముల పై కూలంకష చర్చ.

అధర్వణ వేదము నాలుగు భాగములుగా విభజించబడి 20 స్కంధములతో 6,077 మంత్రములతో అలరారుతున్నది. మొదట తొమ్మిది శాఖలతో ఉన్న ఈ వేదములో ప్రస్తుతము 2 శాఖలు మాత్రమే లభ్యమవుతున్నాయి. ఈ వేదములో దైవ ప్రార్థనలతో పాటు సృష్టి పరిణామము గురించిన కథలు, భూత, పిశాచ, దుష్ట శక్తులను నివారించటానికి మంత్రములు, మంత్ర విద్య, తంత్ర విద్యలకు సంబంధించిన విషయములు కూడా పొందుపరిచారు. ఇందులో 93 ఉపనిషత్తులు పొందుపరుచబడి ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ‘ప్రశ్న’, ‘మాండూక’, మరియు “మాండుక్య” ఉపనిషత్తులు.

ఈ నాలుగు వేదములు త్రిగుణాత్మకమైనవి. అనగా సత్వరజస్తమోగుణములతో కూడుకొని కర్మ, భక్తి, జ్ఞాన సంబంధమైన పద్ధతులనే బోధించును, కాని వాటికి అతీతమైన పద్ధతిని తెలియచేసి జననమరణ భ్రాంతిరహితమును సూచించు మార్గమును తెలియ చేయలేవని భావము. కనుకనే శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతయందు ఈ క్రింది విధముగా వక్కాణించి వున్నారు.

“శ్లో || త్రైగుణ్య విషయా వేదా | నిస్త్రైగుణ్యో భవార్జున |
నిర్ద్వంద్వో నిత్య సత్త్వస్థో | నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ||”

ఉపవేదములు:

ఉపవేదములు మహామునులచే లిఖించబడినవి. వేదములలో ఉన్న ప్రాథమిక జ్ఞాన సంబంధమైన విషయములను ఉపవేదములలో లౌకిక సంబంధమైన ఆచరణాత్మకమైన వ్యాఖ్యానముల ద్వార వివరించుటయే కాక సంపూర్ణమైన లౌకిక అభివృద్ధికి కావలసిన విధివిధానములు ఇందులో పొందుపరచ బడినాయి. వీటిని స్మృతులని కూడా అంటారు. వేదమునకు ఒక్కటేసి చొప్పున నాలుగు వేదములకు నాలుగు ఉపవేదములు కలవు. అవి ఏవి అనగా

(1)  ఆయుర్వేదము
(2)  ధనుర్వేదము
(3)  గంధర్వవేదము
(4)  అర్థవేదము

1) ఆయుర్వేదము (Health):

ఇది ఋగ్వేదమునకు ఉపవేదము. ఇది బ్రహ్మా, అశ్వినీ దేవతలు, ధన్వంతరిలచే రచించబడినది. ఇందులో ఆరోగ్యముగా జీవించుటకు మానవుడు అనుసరించవలసిన విధానములు తెలుపబడినాయి. అవి 4 పద్ధతులు. అవి

1. చరక సంహిత: మహాముని చరకునిచే రచించబడిన గ్రంథము.
2. శుశ్రుత సంహిత: మహాముని శుశ్రుతుని రచన.
3. వాగ్భట్ట సంహిత: మహాముని వాగ్భట్టుని రచన.
4. కామ సూత్రములు: మహాముని వాత్సాయనుని రచన.

2) ధనుర్వేదము (Military Science):

ఇది యజుర్వేదమునకు ఉపవేదము. బ్రహ్మా, శివులచే బోధించబడగా విశ్వామిత్రునిచే ఇది రచించబడినది. ఇది ముఖ్యముగా సైన్య శాస్త్రమునకు సంబంధించినది. మొత్తము నాలుగు భాగములలో ఈ శాస్త్రము యుద్ధములకు సంబంధించిన అన్ని విషయములను చర్చిస్తుంది. ఇందులో వివిధ మారణాయుధములు, మంత్ర యుద్ధ పద్ధతులు, యుద్ధ వ్యూహముల గురించి విపులముగా చర్చించబడినది.

3) గంధర్వ వేదము (Music and Arts):

ఇది సామ వేదమునకు సంబంధించిన ఉపవేదము. దీనిని భరత ముని రచించినాడు. ఈ ఉపవేదము ముఖ్యముగా కళలకు, సంగీతానికి సంబంధించిన శాస్త్రము.

4) అర్థ వేదము (Statecraft):

ఇది అధర్వణ వేదమునకు సంబంధించిన ఉపవేదము. ఇందులో రాజకీయ మరియు అర్థశాస్త్ర సంబంధమైన విషయములు విపులీకరించబడినాయి. అంతేగాక ఇందులో నీతిశాస్త్రము, శిల్పశాస్త్రము మొదలగు చతుష్షష్టి (అరవైనాలుగు) కళలు మరియు ఇంకా అనేక భౌతిక , ప్రాపంచిక విషయములను గూర్చి కూలంకుషముగా చర్చించినారు.

వేదాంగములు (Limbs of the Vedas):
వేదముల అర్ధాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఆరు అంగములను వేదాంగములు అంటారు. ఈ ఆరు అంగములను పూర్తిగా అర్థము చేసికొన్నవారే వేదములను పూర్ణముగా అర్థము చేసికొనగలరు. కనుక వేద సాంప్రదాయము ప్రకారము వేదాభ్యాసానికి ముందుగా ఈ వేదాంగములని నేర్చుకోవాలి. వేదాంగములు ఏవి అనగా?

శ్లో || శిక్షా వ్యాకరణం ఛందో | నిరుక్తం జ్యోతిషం తథా |
కల్పశ్చేతి షడంగాని | వేదస్యాహుర్మనీషిణః ||

శిక్ష
వ్యాకరణము
ఛందస్సు
నిరుక్తము
జ్యోతిషము
కల్పము
ఇవి ఆరు వేదాంగములు అని నిర్ణయము. వీటిని సంక్షిప్తముగా ఈ క్రింది విధముగా చెప్పవచ్చును.

1. శిక్ష: పాణిని శిక్షా శాస్త్రమును రచించెను. ఇది వేదమును ఉచ్ఛరింపవలసిన పద్ధతిని బోధిస్తుంది. వేదములలో స్వరము చాలా ముఖ్యము.

2. వ్యాకరణము: వ్యాకరణ శాస్త్రమును కూడ సూత్ర రూపమున పాణినియే రచించెను. ఇందులో 8 అధ్యాయములు ఉన్నాయి. దోషరహితమైన పదప్రయోగమునకు సంబంధించిన నియమములు అన్నీ ఇందులో చెప్పబడినవి.

3. ఛందస్సు: పింగళుడు “ఛందోవిచితి” అనే 8 అధ్యాయముల ఛందశ్శాస్త్రమును రచించెను. వేద మంత్రములకు సంబంధించిన ఛందస్సులే కాక, లౌకిక ఛందస్సులు కూడ ఇందులో చెప్పబడినవి.

4. నిరుక్తము: నిరుక్త శాస్త్రమునకు కర్త యాస్కుడు రచించెను.  వేద మంత్రములలోని పదముల వ్యుత్పత్తి ఇందులో చెప్పబడినది. పదములన్నీ ధాతువుల నుండి పుట్టినవని యాస్కుని అభిప్రాయము.

5. జ్యోతిషము: వేదములలో చెప్పిన యజ్ఞములు చేయడానికి కాల నిర్ణయము చాలా ముఖ్యము. ఆ కాల నియమములు జ్యోతిషములో ఉంటాయి. లగధుడు, గర్గుడు మున్నగువారు ఈ జ్యోతిష శాస్త్ర గ్రంథములను రచించారు.

6. కల్పము: కల్పశాస్త్రములో యజ్ఞయాగాదుల విధానము, వాటిలోని భేదములు చెప్పబడినవి. అశ్వలాయనుడు, సాలంఖ్యాయనుడు ఈ శాస్త్ర సూత్రములను రచించారు. ఇందులో మూడు భాగములు ఉన్నాయి.

శుశ్రుత కల్ప: భగవంతునికి ఇచ్చే బలి, నైవేద్య పద్దతులు.
శులభ కల్ప : కొలతలు మొదలైన విషయాలను తెలిపే కల్పము.
ధర్మ కల్ప    : నీతి, ధర్మ విషయములకు సంబంధించినది. ధర్మ కల్పములో మొత్తం 18 విభాగములు వున్నాయి. వాటిలో ప్రముఖమైనవి మూడు.
మను స్మృతి: ఈ ధర్మసూత్రములు త్రేతా యుగానికై నిర్దేశించబడినవి.
యాఙ్ఞవల్క్య స్మృతి: ఈ ధర్మసూత్రములు త్రేతా యుగానికై నిర్దేశించబడినవి.
పరాశర స్మృతి: ఈ ధర్మసూత్రములు కలి యుగానికై నిర్దేశించబడినవి.
వైదిక సాంప్రదాయకులు:
మంత్రద్రష్టలైన ఋషులు వేదములలో మానవ సౌభ్రాతృత్వము, అన్యోన్య సహకారము, వసుధయే ఏకైక కుటుంబమను భావములను లోక కళ్యాణము కొరకు బోధించి పురుషార్థములను సాధించు పద్ధతులను తెలియజేస్తే, వారి శృతులయందలి శబ్ద, శబ్దార్థ, లక్ష్య, లక్ష్యార్థములను ఉన్నదున్నట్లుగా గ్రహించలేని వారలు నానా విధముల మతములను తమ తమ బుద్ధి నిశ్చయానుసారముగా ఏర్పరచుకొన్నారు. వైదిక మత సాంప్రదాయకులు వైదిక కర్మలైన యజ్ఞయాగాదులను తు.చ. తప్పకుండా ఆచరిస్తే మోక్షము లభించుననీ, మంత్రాక్షరాలలో గర్భితముగా గొప్ప శక్తి ఉన్నదనీ, ఆ మంత్రోచ్ఛారణతో పుణ్యము చేకూరుననీ, ఆ ఫలితమును మరణానంతరము అనుభవించ వచ్చుననియూ ప్రగాఢంగా విశ్వసిస్తారు. కర్మకాండకు మూలమైన మంత్రములు సర్వశక్తి సంపన్నములని వీరి అభిప్రాయము. ఈ పద్ధతి దేవుని అస్తిత్వమును, విగ్రహారాధనను నిరాకరించినప్పటికినీ ఆనాటి రాజులు, చక్రవర్తులు వైదికులకు అమిత ప్రోత్సాహమును ఇచ్చేవారు. అశ్వమేధ రాజసూయ యాగాదులనే గాక, నరమేధ యాగములను కూడా ప్రోత్సహించేవారు. వేదములను కంఠస్తము చేయడములో, వైదిక మంత్రములను పఠించుటలో ప్రావీణ్యముగల పండితులను విశేషముగా గౌరవించి అగ్రహారములను ఇచ్చి సత్కరించుటయేగాక జీవితాంతము పోషించేవారు. స్వార్థపరులైన కొందరు వైదికులు కర్మకాండకు వక్రభాష్యములను చెప్పుచూ సమాజమును తమ ఆధీనములో ఉండేటట్టు చేయడముతో వేద సంప్రదాయము యొక్క లక్ష్యము నెరవేరకుండా పోయింది. గ్రుడ్డిగా వైదిక మత కర్మలను ఆచరించడమే పరమ లక్ష్యముగా పెట్టుకొన్న ఈ వైదిక పద్ధతులయందు విశ్వాసము లేకపోవుటచే పాశుపత, కాపాలిక, శాక్తేయ, గాణాపత్యాది సాంప్రదాయములు ఎన్నియో క్రమశః శైవ మతము పేరుతో విశేషవ్యాప్తిలోనికి వచ్చినవి. అంతియే గాక వేద ఋషుల భావములతో విభేదించిన వారు నాస్తిక, భౌతిక, శూన్యాది వాదములను వేదకాలము నాటికే లేవనెత్తిరి.

ప్రస్థానత్రయము:
ఉపనిషత్తులు.
భగవద్గీత.
బ్రహ్మ సూత్రములు
ఇవి మూడు ప్రస్థానత్రయము అని చెప్పబడును.

1. ఉపనిషత్తులు:

ఉపనిషత్తులు జ్ఞాన పద్ధతిని తెలియజేసి బ్రహ్మ స్వరూపమును ఉపదేశించు పవిత్ర గ్రంథములని నిర్ణయము. అవి 1180. అనేక ఋషి పుంగవుల తత్వవిచారణలు అనేక కోణములలో ఉపనిషత్తులందు చెప్పబడినవి. వారి ఆలోచనా విధానములు భిన్న భిన్నములుగా వుండుటచే అనేక మతములు ప్రవర్తిల్లినవి. ఆయామతముల వారు కొన్ని ఉపనిషత్తులనే ప్రామాణికముగా తీసుకొందురు. ఎందుకనగా? మిగతా వాటిలో వారి మత సిద్ధాంతమునకు వ్యతిరిక్తమగు శృతులు ఉండుటయే కారణము. ప్రస్తుతము 108 ఉపనిషత్తులే లభించుచున్నవి. మిగతా ఉపనిషత్తులు కాలగర్భములో కలిసిపోయినవి.

2. భగవద్గీత:

శ్రీ కృష్ణ పరమాత్మ వేదోపనిషత్తుల పూర్ణ సారమును అర్జునునికి భగవద్గీత రూపములో ప్రబోధించెను. ఇందులో శ్రీ కృష్ణ పరమాత్మ కర్మ, జ్ఞాన పద్ధతులను సమన్వయ పరచి దాని యొక్క ఏక రూపమే భక్తియని నిర్ణయించి ‘నిష్కామ కర్మ’ను ప్రతిపాదించెను. జ్ఞానమును విడిచి కర్మము, కర్మమును విడిచి జ్ఞానము లేదని, జ్ఞానమే కర్మమని మరియు కర్మమే జ్ఞానమని తెలిపి, జన్మ రహిత విధానమునకు కర్తృత్వరహిత కర్మాచరణ పద్ధతియే ముఖ్యమని తెలియపరచెను. పదునెనిమిది అధ్యాయములలోఈ పదునెనిమిది యోగముల ద్వారా అఖండరూప అధిష్ఠాన బ్రహ్మమునకు సంయోగము చేసి, జడచేతనములచే నరుకబడని అచల పరిపూర్ణ పరబాహ్యమును తెలిపి, కర్తృత్వరహిత కర్మాచరణయను అస్పర్శయోగమును బోధించి, అంత్యమునందు మోక్ష సన్యాసమును ప్రతిపాదించి, స్థితప్రజ్ఞత్వమును కలుగ చేసెను. “అహం పదార్థ రహిత”మే జననమరణ భ్రాంతి రహితమని సిద్ధాంతీకరించెను. త్రిగుణస్వామ్యమైన బ్రహ్మమునకు అతీతమైన అచల పరిపూర్ణ పరబ్రహ్మమే నిత్యమై సత్యమై ఉన్నదని, అట్టి పరమ రహస్యమును అచల పరిపూర్ణ గురువులచే గ్రహించినచో జన్మ రహితము కాగలదని నిర్ణయించినారు. ఇదే రాజఋషుల సాంప్రదాయము. ఇదే గుహ్యాతిగుహ్యమైన రాజయోగ సిద్ధాంతము.

3. బ్రహ్మసూత్రములు:

వివిధ ఉపనిషత్తులను బోధించిన ఋషి సాంప్రదాయముల బోధనా విధానములు వేరు వేరుగా వున్నందున వాటిని సమన్వయము చేయుట కొరకు వ్యాస మహర్షి ‘ఉత్తర మీమాంస’ అనబడు ‘బ్రహ్మసూత్రముల’ను రచించెను. వేదోపనిషత్తుల సారమును తనకు తెలిసిన బాణిలో “జన్మాద్యస్య యతః” అని చెప్పి సృష్టికి కారణము బ్రహ్మమేనని సూత్రీకరించెను. “ఆత్మకృతే పరిణామాత్” అనగా జగత్తు ఆత్మ యొక్క పరిణామమేననియూ “అదృశ్యత్వాది గుణకో ధర్మోక్తేః” అనగా అదృశ్వత్వాది గుణములుగల సకల సృష్టికి కారణము బ్రహ్మమేనని సూచించెను. కాని బ్రహ్మ సూత్రముల యందు అచల పరిపూర్ణ బ్రహ్మమును గూర్చి ఎందుకు చెప్పబడలేదనగా? వ్యాసుడు బ్రహ్మ ఋషి సాంప్రదాయ ప్రవర్తకుడు, కనుక వ్యాసుడు బ్రహ్మము వరకు తెలిసికొని ఉన్నాడుగాని అచల పరిపూర్ణ బ్రహ్మము గూర్చి తెలిసికొనలేదు. అచల పరిపూర్ణ బ్రహ్మమును గూర్చి బోధించు పూర్ణ బోధ రాజ ఋషుల వద్ద ఉన్నది. కనుకనే తన కొడుకైన శ్రీ శుకుడికి కలిగిన సందేహమును తీర్చుటకు అతడిని జనక రాజర్షి దగ్గరికి పంపించెను. జన్మతః విరాగియైన శ్రీ శుకుడు తన తండ్రి వ్యాసునిచే రచించిబడిన అన్ని గ్రంథములను చదివిననూ, తండ్రిగారి బోధలను విన్ననూ ఆత్మ స్వరూపము సంపూర్తిగా అవగతము కాకపోవుటచే జనక రాజర్షిని ఆశ్రయించి పూర్ణబోధను గ్రహించి చిత్త విశ్రాంతిని పొంది జననమరణ భ్రాంతి రహితము చేసికొనుటయేగాక, గురువాజ్ఞచే సృష్టికి విరుద్ధముగాని గృహస్థాశ్రమమును స్వీకరించి లోకమంతటికి ఆదర్శప్రాయమైన జీవితమును గడిపెనని దేవీ భాగవతము మొదటి కాండమునందు తెలుపబడివున్నది.

దర్శనములు:
వేదభాగములయందు న్యాయాన్యాయములు, సార్థకనర్థములు, మారణ మోహన స్థంబన ఉచ్చాటన క్రియలు మరియు యజ్ఞదానాది క్రియలు గలవు. వేదమునందలి విషయాదులను పునస్కరించుకొని

అక్షపాదమనే న్యాయ దర్శనము
వైశేషికమనే అణువాద దర్శనము
సాంఖ్యమనే తత్వ దర్శనము
యోగ యోగాంగముల నిర్మితమగు యోగ దర్శనము
సత్వరజస్తమో గుణముల ఆచరణ విధానముగల కర్మ సూత్ర దర్శనము
బ్రహ్మనిర్మాణమునకు బ్రహ్మ సూత్రములచే బ్రహ్మ తత్వ దర్శనము
నిర్ణయింపబడినవి. వీటికే షడ్దర్శనములని పేరు. వేదమునందలి ఆర్ష విద్యలకు దేశ, కాల, పద్ధతులననుసరించి మార్పులు చెందుచుండును. కనుకనే వేద నిర్మితములు ఇన్నియని లెక్కించి నిర్మించుటకు విధి లేక వేద ధర్మములు అనంతములని చెప్పబడును.

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...