Wednesday, January 23, 2019

1648లో జరిగిన అద్భుత సుబ్రహ్మణ్యుని లీల!

డచ్ వాళ్ళు దౌర్జన్యంగా తీసుకు వెళ్ళాలనుకున్న మన సుబ్రహ్మణ్యుని మూల విరాట్టు . ఎంతో మహిమాన్విత క్షేత్రం సునామీ కూడా సుబ్రహ్మణ్యుని ఆలయాన్ని ఏమి చేయలేకపోయింది.

ఆది దంపతులు పరమేశ్వరుడు, పార్వతీదేవిల రెండో తనయుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. దేవసేనానిగా వ్యవహరించి రాక్షసుడు శూరపద్ముడిని సంహరించాడు. ఈ సంహారం కోసం ఆయన పలు రణశిబిరాలను ఏర్పాటుచేశాడు. ఈ శిబిరాల్లో ముఖ్యమైనవి ఆరు. వాటిని ఆరు పడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రాలు తమిళనాడులోనే వున్నాయి. అవి స్వామిమలై, పళని, పళముదిర్చోళై, తిరుప్పరన్‌ కుండ్రం, తిరుచెందూర్, తిరుత్తణి. ప్రస్తుతం మనం తిరుచెందూర్ గురించి తెలుసుకుందాము.


తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది. ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, శూరపద్ముడు అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సముద్ర కెరటాలు తిన్నగా వచ్చి గుడిని తాకుతుంటాయి. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు.


స్థల పురాణము…

ఒకానొకప్పుడు, ఈ పవిత్ర స్థలంలో అసురుడైన శూరపద్ముడు తన సోదరులగు సింహముఖుడు మరియు తారకాసురుడితో ముల్లోకాలను ఏలుతుండేవాడు. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారు, తిరుచెందూరుకు అసుర సంహారమునకై వచ్చారు. తన శివారాధన నిమిత్తం, మయుడిని రప్పించి ఒక దేవాలయాన్ని నిర్మించమని ఆఙ్ఞాపించారు. ఆ తరువాత స్వామివారు అసురసంహారానికై పూనుకొని, వారితో ఆరు రోజులు ఎడతెఱిపి లేకుండా నేలపైన, సముద్రముపైన, ఆకాశములో యుద్ధం చేశారు. ఆ భీకర యుద్ధంలో శూరపద్ముడు మినహా అందరూ సంహరింపబడ్డారు. శూరపద్ముడు సముద్రానికి దగ్గిరలో ఒక మామిడి చెట్టు రూపంలో ఉద్భవించాడు. స్వామివారు ఇంద్రుడిని తన వాహనముగా చేసుకొని, తన శక్తి ఆయుధంతో రెండు ముక్కలుగా చీల్చి సంహరించారు. కానీ ఆ రెండు ముక్కలు కోడిపుంజు, మగ నెమలి స్వామివారిచే క్షమింపబడి, ఆయన విశ్వరూప దర్శన భాగ్యాన్ని పొందాడు. ఇంద్రుడి బదులు ఆ మగ నెమలిని తన వాహనంగా చేసుకొని, కోడిపుంజును తన పతాక చిహ్నముగా చేసుకున్నారు.


స్కాంద పురాణంలో…

ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒకసారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్టు రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.


ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే ….. అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.


స్వామివారి రూపం…

తిరుచెందూర్ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపంతో పాటు పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో శక్తివంతమైన, సుందరమైన దివ్య క్షేత్రం యిది.ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ క్షేత్రములో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది.


విభూది మహిమ…

ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి.


ఆలయశోభ…

సమీపిస్తున్న కొద్దీ, భవ్యమైన తొమ్మిదంతస్తుల రాజగోపురం, దాని పైని శూలం కొట్టొచ్చినట్లుగా కనబడుతాయి. దీనిని 300 ఏళ్ళ క్రితమే నిర్మించడం జరిగింది. తిరువాదుథురై మఠ మహాసన్నిధానానికి చెందిన దేశికమూర్తిస్వామివారికి కలలో ఈ నిర్మాణం చేపట్టవలసినదిగా ప్రచోదనమయ్యింది. అయితే అతడు పేదవాడు కావడంవల్ల, గోపుర నిర్మాణానికై వచ్చిన కూలీలకు కూలీ డబ్బులకు బదులుగా స్వామివారి విభూతిని ఇచ్చాడట. ఆ కూలీలు తుండుక్కై వినాయక ఆలయం వద్దనుండి వెళుతున్నపుడు, ఎవరి శ్రమకు తగినట్టుగా వారికి ఆ విభూతి బంగారంగా మారిపోయేదట. ఆరవ అంతస్థు పూర్తికాగానే, ఈ అద్భుతం ఆగిపోయిందట. మరలా సుబ్రహ్మణ్యస్వామివారు కలలో కనిపించి, కల్యాణ పట్టణానికి చెందిన సీతాపతి మరైక్కార్ అను పోషకుడి వద్దనుండి ఒక బుట్ట ఉప్పును పొందమని ఆదేశించారట. ఆ బుట్టతో తిరుచెందూర్ చేరుకోగానే, ఉప్పు కాస్తా బంగారు నాణాలుగా మారి మిగతా మూడంతస్థుల నిర్మాణం పూర్తిగావించడానికి తోడ్పడిందట. అనంతరంతర కాలంలో ఈ ఆలయం అనేక మార్పులకు, చేర్పులకూ గురవుతూ వచ్చింది. ప్రస్తుతమున్న ఈ ఆలయం వంద సంవత్సరాలకు పూర్వం నిర్మించబడినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది.


షణ్ముఖ విలాసం…

దేవాలయ ప్రధాన మంటపం 124 స్థంబాలతో శోభిస్తూ, దక్షిణాభిముఖంగా ఉంటుంది. దీనిని షణ్ముఖ విలాసం అని పిలుస్తారు. మొదటి ప్రాకారపు దక్షిణ ప్రవేశమార్గానికి పడమటివైపు దక్షిణామూర్తి (శివుడు) కనిపిస్తారు. ఇక్కడే మరో మండపం ఉంది. ఈ మండపంలో ఉత్సవ దేవతా విగ్రహాలు దర్శనమిస్తారు. ఫల్గుణీ మాసంలో ప్రతి ఏటా ఈ మంటపంలో వల్లీ అమ్మవారి కళ్యాణాన్ని నిర్వహిస్తారు. పడమటి ద్వారానికి ఉత్తరాన శూరపద్మునితో పోరాటానికి సిద్ధంగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామివారు, నెమలిపై కూర్చొన్న విగ్రహం కనిపిస్తుంది. అక్కడక్కడా శివలింగాలు కనిపిస్తాయి. ఆ తరువాత, అరుణగిరి నాథర్ ముని విగ్రహం ఉంటుంది. ఈయన స్వామివారిని స్తుతిస్తూ తిరుప్పుగయ్ అనే రచన చేశారు. దీనికి సమీపంలో గణపతిస్వామి మూర్తి ఉంది. ఈయనను ఇక్కడ ‘ముక్కురిణి పిళ్లయర్’అని పిల్వడం జరుగుతోంది. ఉత్తర ద్వారం వద్ద వేంకటేశ్వరస్వామివారి విగ్రహం కనిపిస్తుంది. ఆనుకొనున్న గుహలో గజలక్ష్మి, పరుండిన రంగనాథుడు, శ్రీదేవీ, భూదేవీ, నీలాదేవి దర్శనమిస్తారు.


ఇక్కడే రాతిలో చెక్కిన పన్నెండు ఆళ్వారుల (వైష్ణవ భక్తాగ్రేసరులు) మూర్తులు కూడా దర్శనమిస్తాయి. తూర్పువాకిలి మధ్య భాగాన, తూర్పుగోపురం హద్దుగా తామ్రంతో నిర్మితమైన ధ్వజస్తంభం ఉంది. రెండవ ప్రాకారంలో, కుమార పీటంకార, ఆయన భార్యలు, షణ్ముఖుని ఉత్సవ విగ్రహాలూ ఉంటాయి. దగ్గిరలో 63 నాయన్మార్లు (శైవ భక్తాగ్రేసరులు) వరుసగా దర్శనమిస్తారు. ఉత్తరపు వాకిలిలో, శివాలయాలలో ఉన్నట్టు చిటికెల చండీశ్వరమూర్తి కనిపిస్తారు. అలాగే, తూర్పున నటరాజస్వామి, శనీశ్వరుడు, భైరవ మూర్తులు దర్శనమిస్తాయి. తూర్పు వాకిలి మధ్య భాగంలో, బంగారు ధ్వజ స్థంభం ఉన్నది.


మూల విరాఠ్ – పవిత్ర పూజ్య పీఠం…
పూజ్య పీఠ ప్రవేశ ద్వారం వద్ద వీర బాహు, వీర మహేంద్రులనబడే ద్వార పాలకులు, స్వామివారి రక్షక భటులుగా నిలబడి కనిపిస్తారు. ఒకే ముఖముతో, చతుర్భుజుడై మూలవర్‌ (మూల విరాఠ్) బాల సుబ్రహ్మణ్య స్వామివారిగా దర్శనం ఇస్తారు. ఇది బ్రహ్మచారి స్వరూపం.


 ఈ క్షేత్ర ప్రాశస్త్యం, వైభవాలు ఎంతగా ప్రభావితం చేసినా, స్వామివారి దర్శనం చేసినపుడు మాత్రం ఒక వింత అనుభవం కలుగకమానదు. భయంకరమైన రక్కసులను సంహరించినా, స్వామివారి సుందర విగ్రహం, ఒక బాలకుడిలా ఎంతో ముద్దుగొలుపుతూ ఉంటుంది. రెండు చేతులు జోడించి దణ్ణం పెట్టాలనే వాంఛకన్నా, దగ్గిరకెళ్ళి బుగ్గగిల్లాలనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటారీ స్వామివారు.

ఉత్తరపు దిక్కున ఒక మూలలోగల శివలింగమే, శూరపద్ముని సంహారం తరువాత, సుబ్రహ్మణ్య స్వామివారు పూజించినదని చెబుతారు. స్వామివారి ప్రసాదం విభూతి. ప్రధాన పీఠానికి ఎడమవైపున ఉత్తరాన ఉత్సవ విగ్రహాలైన శెంథిల్ నాయకన్‌, తన భార్యలతో కూడి దర్శనమిస్తారు. ఈ ఉత్సవ మూర్తులకు ఎడమ వైపు బొక్కసం (ఆభరణాలు భద్రపరుచు స్థలం) ఉంటుంది.

మరొక ప్రత్యేక స్థానంలో, దక్షిణాభిముఖంగా షణ్ముఖస్వామి తన భార్యలగు వల్లి, దేవసేనలతో వేంచేసి ఉన్నారు. ఈ అందమైన రాగి విగ్రహం అద్భుతమైన ఆభరణాలతో సుశోభితంగా ఉంటుంది. స్వామివారు పన్నెండు చేతులతో అనేకమైనట్టి ఆయుధాలు చేతబూని ఉంటారు.

పురాణ విగ్రహం…

షణ్ముఖ విగ్రహానికి సంభందించిన చారిత్రక గాధ ఒకటి ఉన్నది. క్రీ.శ. 1648 లో డచ్ దేశస్తులు ఆలయంపై దాడి చేసి, మూలవిరాఠ్, నటరాజ విగ్రహాలను, సంపదనూ దొంగిలించి సముద్ర మార్గంగుండా పారిపోయారు. కానీ ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకొని, భయానికిలోనయి ఆ విగ్రహాలను అక్కడే సముద్రంలో జారవిడిచి తోక ముడిచారు. దొంగతనం గురించి తెలుసుకున్న వడమలయప్ప పిల్లయన్, వెంటనే పంచలోహాలతో మునుపటి విగ్రహంలాంటిదే మరొకటి తయారు చేయించారట.

 ఈయన నాయకన్లచే నియమింపబడిన జమిందారు. కానీ, క్రీ.శ. 1653 లో ఈ నూతన పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టించే సమయానికి, ఒకనాడు స్వామివారు ఆయనకు కలలో దర్శనమిచ్చి, సముద్రంలో జారవిడిచిన తన నిజ విగ్రహాన్ని వెతికి తెచ్చి, తిరిగి ప్రతిష్టించమని ఆఙ్ఞాపించారు. సముద్రంలో నిమ్మపండు తేలియాడుతున్నచోట, దానిపై గరుడపక్షి వలయాకారంలో తిరుగుతూ కనిపిస్తుందని ఆనవాళ్ళు తెలిపారు. నిర్దేశం ప్రకారం వెతికి, స్వామివారి నిజమూర్తిని కనుగొని, పునః ప్రతిష్ట గావించారు. కొత్తగా చేయించిన పంచలోహ విగ్రహాన్ని, మురుగన్ కురుచిలో తిరుప్పిరంటీశ్వరాలయంలో ప్రతిష్టించారు. ఇదేదో కట్టు కథ అనుకునేరు!


 M.Raffel అనే ఫ్రెంచ్ దేశస్తుడు, 1785లో తను ప్రచురించిన పుస్తకంలో, డచ్ సైనికుడు ఒకడు తెలిపిన వివరాలను పొందుపరిచాడు.


నాయిక్కనర్ వింత బావి…

షణ్ముఖ విలాస్ ఎదురుగా, ఒక దారి కనబడుతుంది. ఆ దారిగుండా వెళితే, చివరన ప్రవేశ రుసుము చెల్లించి బావిలోకి దిగే మార్గంగుండా వెళితే, ఈ నాయిక్కనర్ చేరుకుంటాము. సాధారణంగా భక్తులు మొదట సముద్రంలో స్నానం చేసిన తరువాత, ఈ బావిలో స్నానమాచరించి, పొడి బట్టలు ధరించి, స్వామివారి దర్శనానికి వెళుతుంటారు. ఈ కుండాన్ని, తన వేలాయుధంతో సుబ్రహ్మణ్యస్వామివారు స్వయంగా సృష్టించారని ప్రతీతి.


సముద్రాన్ని ఆనుకొని ఉన్నా, నీరు తాగడానికి అనువుగా ఉంటుంది. అంతే కాదు, ఈ బావిలో నీరు – రెండు రకాలుగా ఉంటుంది. మొత్తంగా వ్యాపించి ఉన్న నీరు గంధకం వాసనతో, కాస్తంత ఉప్పగా మురికిగా కనిపిస్తుంది. ఒక మూలకు ఉన్న మరో చిన్ని కుండం 7 అడుగుల లోతు, ఒక అడుగు వేడల్పు కొలతలతో ఉంటుంది. దీనినుండి ఊరే జలం ఉప్పగా ఉండదు. దీనినే నాయిక్కనర్ అంటారు. సరైన నామం స్కంద పుష్కరిణి. ఇందులో స్నానం ముఖ్యంగా పిల్లల స్నానం ఎంతో ప్రసిద్ధి. ఆ చిన్న కుండం నుండి నీరు తోడి భక్తుల స్నానానికి సహాయంగా, ఒక దేవస్థాన ఉద్యోగి ఉంటాడు.

ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ

ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
 ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ
ఓం శరవణభవ

No comments:

Post a Comment

పరమ శివుని స్వరూపం - శ్రీ దక్షిణామూర్తి

విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషుల...