Thursday, January 17, 2019

నవగ్రహాలు- అంగారకుడు- ధ్యానం- గ్రహమైత్రి -శాంతి

ఓం శ్రీ గురుభ్యోనమః

✨ అంగారకుడు- భూమిపుత్రుడు- తేజోవంతుడు- అరుణుడు- అగ్నితత్త్వం కలిగినవాడు- ఋణవిమోచనుడు- శుభకార్యాలను ఇష్టపడనివాడు! ఎనర్జీ మాస్టర్!

✨ అగ్ని, అంగారకుడు, కుమారస్వామి, ఆంజనేయుడు, అర్జునుడు, షిర్డీబాబా... వీరంతా మంగళవారం జన్మించినవారు-అమిత తేజోవంతులు-మణిపూరక చక్రం వీరి స్థానం మరి పాలనాస్థానం. అంగారకుడి వాహనం.. మేక. మంగళవారానికి అధిపతి కనుక మంగళుడు అని, భూమి పుత్రుడు కనుక భౌమ్యుడు అని పిలువబడతాడు.

✨ చండ్రకర్ర వీరికి ప్రీతి. చాలా స్థిరమైన గ్రహరాజు అంగారకుడు. కఠినమైనవాడు. చండ్రకర్ర చాలా కఠినం. ఇనుము లాగా అత్యంత గట్టిది. అందుకే గృహ నిర్మాణాలు ప్రారంభించినప్పుడు శంఖుస్థాపనకు "చండ్రకర్ర" తో శంఖువు తయారు చేయించి,శంకుస్థాపన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఆ చండ్రకర్ర  ఎంతకాలం పాడుకాకుండా భద్రంగా ఉంటుందో అంత కాలం ఆ నిర్మాణం స్థిరంగా ఉంటుందని పెద్దలు అంటారు.

✨ఏదైనా శంఖువుస్థాపన చేసే ముందు ఖచ్చితంగా ఆ శంఖువును చండ్రకర్రతో చేయించి శంఖుస్థాపనకు నిర్ణయించుకున్న రోజుకు ముందు వచ్చే "మంగళవారం" ఆ నిర్మాణ స్థలంలో, మిట్టమధ్యాహ్నం సూర్యుని ఎదుట కూర్చుని ఆ 'శంఖువు' ను అరచేతులలో పట్టుకుని ఒక ఘడియ కాలం (48 నిమిషాలు) తగ్గకుండా ధ్యానం చేసి ఆ తర్వాత నిర్ణయించుకున్న రోజున స్థాపించుకోవడం వల్ల విశేష లబ్ధి కలుగుతుంది- నిర్మాణం నిరాటంకంగా, ఆర్థిక పరిపుష్టి తో చక్కగా సాగిపోతుంది.

✨ "అంగారకుడు" 'ఋణ విమోచకుడు'! ఆర్థిక ఋణాలతో అప్పుల భారంతో ఎన్నో కోట్ల మంది ఎంతో పీడించబడుతుంటారు. ఎవరైతే మంగళవారం రోజు (ఏడు వారాల పాటు) త్రిసంధ్యలలో ఒకొక్క గంట తక్కువ లేకుండా ధ్యానం... అంగారకుడికి సంకల్పం చేసి ధ్యానం చేస్తారో వారికి ఏడు మంగళవారాలు అలా చేసిన తర్వాత.. క్రమంగా ఆర్థిక ఋణాలు విమోచనమవుతూ వస్తాయి.

✨ అంగారకుడు భూమి పుత్రుడు కనుక ఏదైనా భూమికి సంబంధించిన లేదా నిర్మాణానికి సంబంధించిన వివాదం ఉన్నట్లు అయితే.. ఆ స్థలంలో మంగళవారంనాడు మిట్టమధ్యాహ్నం కూర్చొని ఒక గంట తక్కువ లేకుండా ఏడువారాలు ధ్యానం చేస్తే ఆ వివాదం తొలగి శాంతి కలుగుతుంది.

✨ మంగళవారం నాడు అంగారకుడు శుభకార్యాలను చేయటానికి ఇష్టపడడు.. అందుకే సాధారణంగా మంగళవారం నాడు శుభకార్యాలు చేయరు.

✨ అంగారకుడు ప్రీతి అయితే, నాగదోషాలు తొలగిపోతాయి!అంగారకుడు, అగ్ని, సుబ్రహ్మణ్యస్వామి- ఈ ముగ్గురి యొక్క శక్తి ఒకటే! అగ్నిప్రీతి కలిగితే.. ఐశ్వర్య వృద్ధి కలుగుతుందని అందుకే అంటారు. మంగళవారం త్రిసంధ్యలలో ధ్యానం చేయడం వల్ల అగ్నిదేవుడు, అంగారకుడు, సుబ్రమణ్యస్వామి-ఈ మువ్వురు దేవతల యొక్క మైత్రి కలుగుతుంది-తేజోవంతంగా ఉంటారు- ఎనర్జీతో తొణికిసలాడుతారు.

✨మంగళవారం నాడు కందులతో, కందిబ్యాళ్ళతో చేసిన పదార్థాలను- కందిగుగ్గిళ్ళను లేదా కంది కుడుములను లేదా కంది బ్యాళ్ళు- బెల్లం కలిపి చేసిన పరమాన్నాన్ని 750గ్రా||తక్కువ లేకుండా పంచితే, ముఖ్యంగా బాలలకు, వృద్ధులకు మరియు ఆకలిగొన్న వారికి మిట్టమధ్యాహ్నం పంచడం చేయలి. అలాగే మేకలకు మంగళవారం అవి తినే ఆహారం పొలంలో పెట్టాలి. ఇలా ఏడు వారాలు చెయ్యాలి! ఆరోజు త్రిసంధ్యలలో ఒక్కొక్కగంట తగ్గకుండా 'ధ్యానం' చేయాలి!

✨ ఇలా చేయడం వల్ల 'అంగారక గ్రహ శాంతి' కలుగుతుంది- అంగారకునితో మైత్రి కలుగుతుంది- ఋణవిమోచనం కలుగుతుంది! (ఏడు వారాలు తప్పక చేయాలి)
ఈ చేసిన పదార్థాన్ని కొంత భూమిపైన మరి చెట్ల వద్ద పెట్టడం వల్ల ఆ పదార్థాన్ని చీమలలాంటి జీవులు భుజించడం వల్ల భూమాత (అంగారకుడి తల్లి) సంతోషిస్తుంది.
పూజ కంటే, స్తోత్రం కంటే, మంత్రజపం కంటే, ధ్యానం కోట్ల రెట్లు గొప్పది కనుక సత్వరఫలితాలకై ధ్యానమే చేయాలి!

✨ ధ్యానమొక్కటే రాజమార్గం- ధ్యానం ఒక్కటే రాజయోగం! ధ్యానం చేసే వారే దేవతలు! గ్రహమైత్రి, గృహసౌఖ్యం కలగాలంటే 'ధ్యానం' చేయడమే అత్యంత శ్రేయోదాయకమైన సులభమార్గం" మంగళవారం ధ్యానం చేయడం వల్ల అంగారక ప్రీతి- మైత్రి కలుగు గాక!

No comments:

Post a Comment

శ్రీ ఆదిశంకరాచార్య విరచితం శ్రీ కాలభైరవాష్టకం

*1) దేవరాజసేవ్య మానపావనాఙ్ఘ్రిపఙ్కజం!వ్యాలయజ్ఞ సూత్రమిన్దుశేఖరం కృపాకరమ్!* *నారదాదియోగివృన్దవన్దితం దిగమ్బరం!కాశికాపురాధినాథకాలభైరవం భజే!!* ...