విశ్వచైతన్య శక్తి మానవశరీరములోనికి ఏడుచక్రాలు ద్వారా ప్రవహిస్తుంది. ఈ ఏడు దేవతా శక్తుల ఆధీనంలో పనిచేస్తున్నాయి. ఒక్కో శక్తిచక్రం ఒక్కోతత్త్వంతో సంబంధం కలిగియుంటుంది. ఈ చక్రాలు శారీరక వ్యవస్థలతోనూ, మానసిక స్థితులతోనూ సంబంధం కలిగియుంటాయి. అలానే ప్రతిచక్రానికీ శారీరక మానసిక లేక ఆధ్యాత్మిక విధులు ఉంటాయి. పూర్వజన్మలలోని పాపపుణ్యాలు(ప్రారబ్దాలు) బట్టి ఈ చక్ర, గ్రహ దేవతలు విశ్వచైతన్యశక్తిని ఆయాచక్రాల ద్వారా శరీరంలోనికి సరఫరా చేయడం జరుగుతుంది. పూర్వజన్మలోని పాపపుణ్యాలకు అనుగుణంగా జరిగే ఈ శక్తి పంపకంలోని హెచ్చుతగ్గులు వ్యక్తీ మనస్సు పైనా, శరీరం పైనా పనిచేస్తూ జీవితగతిని నిర్దేశిస్తుంది.
ముందుగా మూలాధారచక్రం గురించి తెలుసుకుందాం -
మూలాధారచక్రం :-
ఐం హ్రీం శ్రీం సాం హంసః మూలాధిష్టాన దేవతాయై సాకినీసహిత గణనాధ స్వరూపిణ్యైనమః
మూలాధారంబుడా రూఢ పంచవక్త్రాస్థి సంస్థితా
అంకుశాది ప్రహరణా వరదాది నిషేనితా
ముద్గౌదనా సక్త చిత్తా సాకిన్యం బాస్వరూపిణీ
ఈ కమలం 4 దళాలు కలది. పృధ్వీతత్త్వం కలది. రక్తవర్ణం కలది. అధిష్టానయోగిని దూమవర్ణం కలిగి పంచవక్రాలు త్రినేత్రాలు కలిగి సృణి,కమలం, పుస్తకం, జ్ఞానముద్ర ధరించి, ఆస్థిధాతువునాకు అధిపతియై యున్నది. ముద్గాన్నప్రీతి కలది. వ శ ష స అను యోగినీ శక్తులచే సేవించబడే ఈమె సాకినీశక్తిగా ఆరాధించబడుచున్నది. నల్లని ఏనుగు ఈమె వాహనం.
వెన్నెముక చివరిభాగంలో అంటే మలరంద్రానికి సుమారు రెండు అంగుళాల పైభాగాన విలసిల్లే మూలాధారచక్రం మనలో 7,776నాడులతో సంధానింపబడి వుంటుంది. భౌతిక శరీరానికి శక్తికేంద్రం మూలాధారచక్రం. ఇదే మొదటిచక్రం. కుండలినీ శక్తి దాగి వున్నది ఇందులోనే. ఇతర శక్తులన్నింటికి మూలం ఇదే. మూలమైన ఆధారం ఇదే కనుక మూలాదారకేంద్రమన్నారు. మూలాధారచక్రంకు పంచకోశాలలో అన్నమయకోశంతో సంబంధం. శ్వాసకోశవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం 'ముక్కు'. జన్మకూ, పునర్జన్మకు ఇది మూలస్థానం. ఈ మూలాధారంలోని శక్తి రెండు విధములుగా (సృష్టి, ప్రతిసృష్టి) పనిచేస్తుంది. అంటే మనిషి జన్మించేది ఈ శక్తివల్లనే. జన్మరాహిత్యం కలిగేది ఈ శక్తివల్లనే. ఒకటి జన్మతః కలిగే శక్తి. రెండవది యోగంతో ఆర్జించుకున్న శక్తి. ఇది సరిగ్గా పనిచేయకపోతే పునసృష్టి జరగదు. ఈ చక్రప్రేరణ వలెనే ప్రతిజీవి సృష్టికార్యం చేస్తుంది. రెండవశక్తి జన్మరాహిత్యం కలిగించే శక్తి. ఇది బ్రహ్మచర్యం వలన సాధ్యమౌతుంది. బ్రహ్మచర్యం అంటే సంసారజీవితమును త్యజించడం కాదు, సంభోగేచ్ఛను అణుచుకోవడం కాదు. బ్రహ్మత్వసిద్ధికి అవసరమైన శక్తిని ధ్యానయోగం ద్వారా సాధించడం. ఇందుకు నీతి, నియతి, నిగ్రహం పాటించాలి. బ్రహ్మచర్యం గురించి మరింత వివరణకై ఇక్కడ చూడండి.
ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
శారీరకంగా అర్ద్రైటిస్ వెన్నెముకకు సంబంధించిన సమస్యలు, ఎముకల బలహీనత, రక్తంలో మార్పుల వలన జనించే రుగ్మతలు, బోన్ కేన్సర్, లుకేమియా వంటి వ్యాధులు, ఎలర్జీ, రోగనిరోధకశక్తి లోపించడం, గాయాలు సరిగ్గా మానకుండా ఉండడం లాంటి రుగ్మతలకు కారణభూతమౌతుంది.
ఈ చక్ర మానసిక స్వభావం -
మూసుకుపోవడం వలన భయం, ఆందోళన, అభద్రతాభావం, ఆక్రమణతత్త్వం, అస్థిరత్వం, ఆత్మహత్య ప్రలోభం, స్వార్ధం. తమోగుణం. ప్రాపంచిక సౌఖ్యాలవైపు మోజు కలిగియుండి పరధ్యానస్థితిలో వుంటుంది.
తెరుచుకుంటే ధైర్యం, స్థిర సంకల్ఫం, పవిత్రత, నిస్వార్ధం, జీవితం మీద మమకారం, పారమార్ధికజ్ఞానం కల్గుతాయి.
అలానే ఈ నాడీ కేంద్రం నేను నాది అనే అహంకారానికి వేదిక.
మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రమునకు సాకిని దేవత. ఈ పరాశక్తి ఎముకలపుష్టిని అనుగ్రహిస్తుంది. ఈ దేవత 'ముద్గౌదనా సత్తా చిత్తా' అని వర్ణింపబడింది. అనగా ఈ దేవతకు పులగం ఇష్టమని చెప్పుదురు. దీనికర్ధమేమనగా శరీరం నందు ఎముకల పెరుగుదల చక్కగా లేనివారు ఆహారమందు ఈ పులగంను ప్రధానాహారంగా స్వీకరించినచో సర్దుబాటగును. వ్యాదులనుబట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ, బీజాక్షరం "లం" ధ్యానించువారికి ఈ బాధలు నివారణ కాగలవు.
శారీరక వ్యాధి కానివ్వండీ, మానసిక వ్యాధి కానివ్వండీ అవన్నీ పుట్టుకొచ్చేవి మన లోపల్నుంచే. మనకు బయటసంఘటనలకంటే మన అపవిత్రత వలెనే దుఃఖం వస్తుంది. మన బాధలన్నింటికీ సృష్టికర్తలం మనమే. బాధలు రెండు రకాలు. ఒకటి సముచితమైనవి. ఇవి ప్రారబ్ధవశాత్తు వచ్చేవి. రెండవది అసంగతమైనవి. పరిస్థితికి ఎంతమాత్రం పొంతన లేని ఆలోచనలు. ఊహలు ఇవే అసంగతమైన బాధలు.
చాలావరకు మనబాధలకు కారణం - మనలో మనకే తెలియని, తెలుసుకోలేని నెగిటివ్ నెస్. అందుకే మన పూర్వీకులు అంటుంటారు - 'మంచిగా ఆలోచించు, ఆనందంగా వుండు'. 'మన ఆలోచనలే మన జీవితం'. 'శుభాన్ని కోరుకో, సుఖంగా జీవించు'. 'మన ఆలోచనలే మన అనుభవాలు'. 'మతి బట్టే గతి'... అని! అలానే చెడు, కీడుల గురించి మాట్లాడటాన్ని వారెప్పుడూ వారిస్తుంటారు. అలాగే మానవాళి శ్రేయస్సుకై పెద్దలు ఎన్నో సూక్ష్మ సరళ పద్ధతులను బోధించారు. మనిషిని శారీరకంగా, మానసికంగా, సుఖవంతంగా, ప్రశాంతంగా ఉంచడంకోసం ఎన్నో చిట్కాలను ప్రతిపాదించారు. వారు సూచించిన పద్ధతులు ఏమిటంటే -
మూలాధారచక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
నేలపై కూర్చోవడం, భూమిని తాకడం, చెప్పులు లేకుండా నడవడం, మొక్కలు చెట్లును కౌగిలించుకోవడం, కన్నతల్లితో కలసి వుండడం, ధ్యానం చేయడం.
మూలాధారచక్రంనకు అధిపతి గ్రహం శనిమహాత్ముడు. ఈ దేవతతో సరైన సంబంధం లేకుంటే బ్రతుకుకు ఆధారమే లేదు. కష్టించి పనిచేసే విధానానికి, శ్రమశక్తికి ప్రతినిధి శని. అలానే ముసలివాళ్ళకు రోగులకు ఆకలిగొన్నవాళ్ళకు ఈయనే ప్రతినిధి. బద్ధకస్తులను ముదుసలివారిపట్ల, రోగులపట్ల, ఆకలిగొన్నవారియందు అలక్షంగా వున్నవారిని తీవ్రంగా దండిస్తాడు. కాబట్టి కష్టించి పనిచేసే తత్త్వం, సేవాతత్వం అలవర్చుకోవడం వలన శనిమహాత్ముని అనుగ్రహం పొందవచ్చు. ఈ చర్యలతో మూలాధారంను జాగృతి పరచవచ్చు.
ధ్యానం, సేవ అనేవి రెండు శక్తివంతమైన సాధనములు. ధ్యానం లేని సేవ, సేవ లేని ధ్యానం పూర్ణజ్ఞానసిద్ధిని కల్గించలేవు. సేవ, ధ్యానం రెండు కూడా మనోశుద్ధి ప్రక్రియలు, పాపనాశన సాధనములు. (పాప ప్రక్షాళన సాధనములు) సేవ స్థూలంగా మనస్సుని శుద్ధి చేస్తే, ధ్యానం సూక్ష్మంగా మనస్సును శుద్ధి చేస్తుంది. సేవ చేస్తేగాని ధ్యానం చేసే శక్తి కలగదు, ధ్యానం చేస్తేగాని సేవ పవిత్రంగా జరగదు. చక్కగా ధ్యానం చేస్తే, చేసే సేవ పవిత్రంగా వుంటుంది. చక్కగా సేవ చేస్తే చేసే ధ్యానం నిశ్చలంగా వుంటుంది. ప్రశాంతంగా వుంటుంది.
సేవ వలన చిత్తశుద్ధి చేకూరుతుంది. అహంకార నిర్మూలన జరుగుతుంది. అహంకారాన్ని జయించటమే ఈ చక్రాన్ని జయించటమౌతుంది.
స్వాధిష్టానచక్రం :-
ఐం హ్రీం శ్రీం కాం సోహం స్వాధిష్టానదేవతాయై కాకినీ సహిత బ్రహ్మస్వరూపిణ్యైనమః
ఈ కమలం ఆరు దళాలుగల అగ్నితత్త్వం కలది. అధిదేవత కాకిని. ఈమె బ, భ, మ, య, ర, ల అను యోగినులచే సేవించబడుతున్నది. వాహనం మొసలి. 'మేధోనిష్టా మధుప్రీతా బందిన్యాది సమన్వితా / దధ్యాన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణీ // మేధోదాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి.
స్వాధిష్టానం (స్వ + అధిష్టానం) తనను తానుగా సమాజంలో నిరూపించుకోవడానికి అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. అనేకజన్మలనుండి వెంటతెచ్చుకునే పాపపుణ్యాలను అనుభవంనకు తీసుకొచ్చే చక్రమిది.
జననేంద్రియము వెనుకభాగమున వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 11,664 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఇది స్త్రీలల్లో ఓవరీస్ కు, పురుషులలో టెస్టిస్ కు ప్రాణశక్తినిస్తుంది. గర్భస్థశిశువుకు ప్రాణశక్తినిచ్చే చక్రమిదే. జీవునకు తల్లి గర్భమునందు స్థానమేర్పడుటకు మూలాధారచక్రం కారణం కాగా, అటు తర్వాత పిండం భౌతిక శరీరంగా ఏర్పడుటకు కావాల్సిన ప్రాణశక్తిని ఈ చక్రమే ఇచ్చుచున్నది.
ఈ ప్రాణశక్తి వలనే శరీరవ్యాపారాదులు నడుచుచున్నవి. శరీరంలోని ఉష్ణోగ్రత ఈ చక్రంనకు సంబంధించినదే. జీర్ణశక్తి అధికమవ్వడానికి తోడ్పడుతుంది. ప్రాణవాయువు ఊపిరితిత్తులనిండా వ్యాపించటానికి ఈ చక్రం సహాయకారి అవుతుంది. ఈ చక్రంకు పంచకోశాలలో ప్రాణమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని విసర్జక వ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం కన్ను. రాజస తామస గుణాలతో వుంటుంది. పునరుత్పత్తి కు సహాయకారి. దీనిలోశక్తి చైతన్యరూపంలో మనిషిలో ప్రవహిస్తూ ప్రాణమయ కోశానికి శక్తినందిస్తుంది
ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
శారీరకంగా పాండురోగం, కంటిజబ్బులు, గర్భకోశ వ్యాదులు, జ్వరాలు లాంటి రుగ్మతలకు కారణమౌతుంది.
ఈ చక్ర మానసిక స్వభావం -
మూసుకుపోవడం వలన మితిమీరిన కామవాంఛ. విషయసుఖాలపై ఆసక్తి, అపరాధభావన, దురాశ, క్రోధం, అనుమానం, ఉద్రేకం జూదరితనం, వివాదాస్పదతత్త్వం, నిరాశనిస్పృహలు.
స్వాధిష్టానం తెరుచుకుంటే సత్యం అవగాహన అవుతుంది. జీవియందలి 'నేను' అను వ్యక్తిగత ప్రజ్ఞయే అహంకారం. అట్టి అహంకారంవలన జీవుడు తనను తానూ పరమాత్మ నుండి వేరుచేసుకొనుచున్నాడు. ఇది జీవియందు నేనున్నాను అను సంకల్పంగా పనిచేయుచున్నది. తానేమిటో మర్చిపోయిన మనిషి ఆ మరిచిపోయిన సత్యానికై బయట దొరుకుతుందని వెదుకులాడుతూ తపన చెందుతున్నాడు, బాహ్యంగా గోచరిస్తుందని భ్రమిస్తున్నాడు, బయట నుండి సంపాదించవచ్చని ఆరాటపడుతున్నాడు, బాహ్యంగా దర్శించవచ్చని తాపత్రయపడుతున్నాడు. ఓ చర్యలో, సంఘటనలో, సన్నివేశంలో, పరిచయంలో ఈ సత్యం లేదని, అది బయటనుండి రాదనీ, మనలోనుండే రావాలని, అంటే తనలో తానై ఈ సత్యం వుందన్న అవగాహనయ్యేది ఈ చక్రశుద్ధి వలనే .
ప్రాణశక్తి చక్కగా ఆవిర్భవిస్తుంది. ఈ చక్రాన్నిఅధిగమిస్తే ఇంద్రియాలన్నింటిపైన నియంత్రణ కల్గుతుంది.
అలానే ఈ నాడీకేంద్రం అంతర్గత సంస్కారానికి వేదిక.
మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం ???
శాస్త్ర ప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు కాకిని దేవత. మేధోదాతువునకు అధిష్టానదేవతయైన ఈమెకు పెరుగన్నం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా ఉంటే పెరుగన్నంను బలం కలుగుటకు స్వీకరించాలి. కాచిన పాలలో అన్నం వేసి తోడుపెట్టి ఉదయముననే ఆ పెరుగన్నం తినవలెను.వ్యాదులనుబట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ, బీజాక్షరం "వం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు.
ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
కరుణ, వాత్సల్యం, ప్రేమ, అనురాగం, మైత్రిల్లాంటి సద్గుణాలను అలవర్చుకోవాలి. అలాగే అహింసా వ్రతం(ఏ ఒక్కర్నీ మాటలతోగానీ, చేతలతోగాని నొప్పించి,బాధించే ప్రవృత్తి లేకుండా వుండడమే అహింస) ఆచరించాలి.
అలాగే ఈ చక్రమునకు అధిపతి శుక్రుడు. ఉల్లాసానికీ, మర్మాంగాలకు, కామప్రకోపానికీ అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు విశేషించి స్త్రీల జబ్బులకు కారణభూతుడు. ఈ గ్రహం సానుకూలంగా వుండాలంటే -
హాయిగా నవ్వాలి. ఆనందంగా సంతోషంగా వుండాలి. సంగీతం, నాట్యం, రచన, హాస్యచతురత ఈ గ్రహపరిధిలోనివే. అందుచే యాంత్రికతకు భిన్నంగా మనస్సును రంజింపజేసే వినోదకార్యక్రమాలు, లలిత కళలలో పాల్గొంటూ, ఒకింత కళాపోషణ అలవర్చుకోవాలి. గాయత్రీ మంత్రాన్ని జపించడం, తాను నొవ్వక ఎదుటివార్ని నొప్పించక జీవించడం, మన భావాలు మరొకరికి భారం కాకుండా, బాధ కల్గించకుండా చూసుకోవడం లాంటివి ఆచరించగలిగితే శుక్రగ్రహం అనుగ్రహంతో స్వాధిష్టానం అనుకూలించి జాగృతి అవుతుంది.
మణిపూరకచక్రం :-
ఐం హ్రీం శ్రీం వాం హం సస్సోహం మణిపూరాధిష్టానదేవతాయై లాకినీ సహిత వైష్ణవ స్వరూపిణ్యాంబాయై నమః
ఈ కమలం పది దళములు గల జలతత్త్వం కలది. అధిదేవత లాకిని. ఈమె డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ అను యోగినులచే ఆరాధింపబడుచున్నది. వాహనం పొట్టేలు. 'గుడాన్నప్రీతిమానసా /సమస్త భక్తసుఖదా లాకిన్యాంబ స్వరూపిణీ/ సర్వజనులకు సుఖాలు ఇచ్చే ఈ అధిదేవతకు బెల్లపు పొంగలి ప్రీతి.
బొడ్డునకు మూలంలో వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 4,536 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది.ఈ చక్రమందు ఉద్భవించే శక్తి మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణం చేసి సారాన్ని శరీరంనకు అందిస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో ప్రాణామయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని జీర్ణవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం నాలుక. పుట్టుట, జీవించుట, మరణించుట అను మూడు బిందువులతో కూడిన త్రికోణమే జీవసృష్టి. అట్లే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం అను మూడు కేంద్రాలతో ఒక త్రికోణం ఏర్పడుచున్నది. ఈ త్రికోణమే భౌతికసృష్టికాధారం. ఈ మూడు చక్రాలు భౌతిక జీవితం సజావుగా సాగడానికి సహకరిస్తాయి.
ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
అవయవములయందు నీరు చేరుట, నోటికి సంబందినవ్యాదులుకు కారణమౌతుంది. నియమాలు లేని ఆహారపు అలవాట్లువలన జీర్ణశక్తి మందగించి అజీర్తి, గాస్ట్రిక్ సమస్యలు కల్గుతాయి. ఉదరకోశ వ్యాధులు, గుండె బలహీనత, నిద్రలేమి, తలబరువు, కాలేయవ్యాధులు, అతిమూత్రవ్యాధి, రక్తక్షీణత, నేత్రవ్యాధులు కల్గుతాయి.
ఈ చక్ర మానసిక స్వభావం -
మూసుకుపోవడం వలన కీర్తికండూతి, పెత్తనం చెలాయించాలనే అహం, అసూయ, అసహనం, దుడుకుతనం, క్రూరత్వం, కటుత్వం, స్వలాభపరులు, స్వార్ధపరులు. తనను గురించి తాను తక్కువగా ఆలోచిస్తూ కుంగిపోవడం.
తెరుచుకుంటే లక్ష్యసాధన, ఆశయసిద్ధి, వ్యవహార దక్షత, ఉత్సాహం, ధనాపేక్ష, తన్ను తాను గౌరవించుకోవడం, ఆత్మవిశ్వాసం కల్గివుండడం, జీవితంలో అన్నింటా ముందడుగు.
ఇక్కడే మనిషికి ఆలోచన ఏర్పడుతుంది. అనుమానాల్ని నివృత్తి చేసుకుంటూ, చక్కగా ఆలోచిస్తూ, అన్నింటినీ అవగాహనతో విశ్లేషించుకుంటూ, విశ్వాస, వివేక జ్ఞానంలను అలవర్చుకుంటూ ముందుకు సాగాలి. మనలో విశ్వాసం, అవిశ్వాసం, నమ్మకం, అపనమ్మకం రెండూ ఏర్పడేది దీనివలనే.
లక్ష్యసాధనకు ఉపయోగపడే చక్రం. లక్ష్యసాధనలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వుంటాయి. పరాజయాలు పలకరిస్తుంటాయి. ఇది సహజం. సాధిస్తాం, తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ఆశావాదం పెంచుకొని, నిరాశావాదాన్ని మదినుండి తరిమివెయ్యాలి, చిన్న చిన్న అనారోగ్యాలని, అవరోధాల్ని, అవమానాల్ని కుంటిసాకులుగా చెప్పుకొని ఆగిపోక ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. ఓటమి అన్నది గుణపాఠమే గానీ, అంతిమతీర్పు కాదని గ్రహించాలి.
మరి ఈ చక్రంను ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రమునకు లాకిని దేవత. సర్వజనులకు సుఖాలునిచ్చే ఈ దేవతకు బెల్లపు పులగం ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే బెల్లపు పులగంను స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "రం" ధ్యానించువారికి ఈ నాడీకేంద్రం వలన వచ్చే బాధలు నివారణ కాగలవు.
ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
అనుభూతులను (ఆనందంగానీ, విచారం గానీ, దుఃఖం గానీ, ఆవేశం గానీ... ) లోపల దాచుకోకుండా సహజంగా బయటకు వెళ్లనీయాలి. దీర్ఘంగా శ్వాసించడం చేయాలి.
అలాగే ఈ చక్రంకు అధిపతి గురుడు. ఆరోగ్యంగా వుండాలన్న, సంపదలు కలిగి వుండాలన్న, సుఖంగా వుండాలన్నా, ఈ చక్రం బలంగా వుండాలి. సప్తచక్రాలలో ఈ చక్రం ప్రత్యేకంగా ప్రతిపత్తి కలది. అదే మాదిరిగా నవగ్రహాలలో గురుగ్రహం ఓ ప్రత్యేకమైన శుభగ్రహం. బ్యాంక్ బాలెన్సు నుండి మెంటల్ బాలెన్సు వరకూ ఆధిపత్యం ఈ గురుగ్రహనిదే.
చెడు అలవాట్లు జోలికి పోకుండా, ముందొకటి వెనుకొకటి మాట్లాడక, నాస్తికత్వం వదిలి, చక్కటి వ్యక్తిత్త్వంను అలవర్చుకుంటే ఈ గ్రహం, చక్రం సక్రమంగా పనిచేస్తాయి.
తటిత్వం తం శక్త్యాతిమిర పరిపంథి స్పురణయా
స్పురన్నానారత్నాభరణ పరినద్ధేంద్రధనుషమ్
తమశ్యామం మేఘం కమపి మణిపూరైక శరణమ్
నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనమ్
మణిపూరకమందున్న మేఘం శ్యామవర్ణము కలది. అనిర్వాచ్యమైనది. అంధకారంను పోగొట్టు మెరుపుతో గూడినది. నానావిధ రత్నాభరణములచేత చేయబడిన ఇంద్రధనస్సు కలది. ప్రళయాగ్నిచే తప్తంలైన ముల్లోకములను చల్లపరుచును.
అనాహతచక్రం :-
ఐం హ్రీం శ్రీం శం హం సశ్శివస్శోహం అనాహతాదిష్టాన దేవతాయై రాకినీ సహిత సదాశివ స్వరూపిణ్యాంబాయైనమః
ఈ కమలం 12 దళాలు కలది. వాయుతత్త్వం. అధిదేవత రాకిని. ఈమె క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమె 'స్నిగ్ధోదన ప్రియా' అంటే స్నిగ్ధాన్నమందు ప్రీతి గలది. జింక వాహనం.
హృదయం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 19,440 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. అనాహతమంటే జీవశక్తిని నిరంతరం నిలిపి వుంచే స్థానం. ఆగని శబ్దబ్రహ్మం ఈ ప్రదేశంలో నినదిస్తూ వుంటుంది. ఈ శబ్దం రెండు వస్తువుల వల్ల ఉత్పన్నమైనది కాదు. అది అనాది శబ్దం. ఓంకార శబ్దం. ఈ చక్రాన్ని జయిస్తే సకలజీవరాసుల యెడల నిస్వార్ధమైన ప్రేమ ఉదయిస్తుంది. ప్రేమ ఓ దివ్యమైనశక్తిగా, విశ్వశక్తిగా నిరూపితమౌతుంది. ప్రేమ, దయ, కృతజ్ఞత, క్షమ అనేవి ఈ చక్రానికి సంబంధించిన అంశాలు. దిగువనున్న మూలాధారాది మూడుచక్రాలకు, ఎగువనున్న విశుద్ధాది మూడుచక్రాలకు ఈ అనాహతచక్రం ఇరుసుగా ఉండి రెండింటిని అనుసంధానిస్తూ పరిపూర్ణత్త్వంను కల్గించడానికి సూత్రదారిలా దోహదం చేస్తుంది. ఈ చక్రంనకు పంచకోశాలలో మనోమయకోశంతో సంబంధం. శారీరకవ్యవస్థలోని శ్వాసకోశవ్యవస్థతో సంబంధం. జ్ఞానేంద్రియం చర్మం.
ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
చర్మవ్యాధులు, రక్తంనకు సంబంధిన వ్యాధులు, శ్వాసకోశవ్యాధులు, రక్తహీనత, గుండెజబ్బులు, న్యూమోనియా మొదలగు రుగ్మతలు కల్గుతాయి. వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది.
ఈ చక్ర మానసిక స్వభావం :-
మూసుకుపోవడం వలన ప్రేమరాహిత్యం, కఠినత్వం, ఒంటరితనం, వ్యర్ధ ప్రలాపనలు, మానసిక ఒత్తిళ్ళు.
తెరుచుకుంటే ప్రేమ, దయ, కృతజ్ఞత, సకల జీవరాసుల యెడ నిస్వార్ధప్రేమ, ఇంద్రియవిజయం, నిర్మాణాత్మక ఆలోచనలు , విశ్వజనీనత వికసించటం.
మనోమయకోశంతో సంబంధం ఉన్న ఈ చక్రమందే ఆశయాలు, భావాలు, లక్ష్యాలు, స్వప్నాలు ఏర్పడుతుంటాయి. ఆలోచనలు సమగ్రముగా, సక్రమముగా వుంటే ఇచ్చాశక్తి (విల్ ఫవర్) పెరుగుతుంది. సంకల్పబలం చేకూరుతుంది. వాక్శుద్ధి కలుగుతుంది.
మరి ఈ చక్రమును ఎలా శుద్ధి చేసుకోవడం???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు రాకినిఅధిష్టానదేవత. ఈమెకు స్నిగ్ధాన్నం నందు ప్రీతి. స్నిగ్ధాన్నం అనగా నేతితో కలిపిన అన్నం. ఈ చక్రం బలహీనంగా వున్నప్పుడు ఈ స్నిగ్ధాన్నం స్వీకరిస్తూ, వ్యాధులబట్టి అవసరమైనచో తగు ఔషదములను వినియోగిస్తూ, బీజాక్షరం "యం" ధ్యానించువారికి ఈ నాడీమండలం వలన వచ్చేబాధలు నివారణ కాగలవు.
ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
ఇతరులకు హాని చేయకుండా వుండటం మాత్రమే కాదు, ఇతరులకు క్షేమం కల్గించటం అంటే ఇతరులకు మంచి చేయడం, అలాగే ఇతరులపట్ల ప్రేమానురాగాలు, ఆత్మీయత చూపాలి. అతిగా స్పందించడం ఈ చక్ర లక్షణం కాబట్టి సంపూర్ణ ఎరుకతో ధ్యానం చేయాలి. హాయి గొలిపే సంగీతం వినాలి. సేవాతత్పరత, క్షమాగుణం అలవర్చుకోవాలి.
ఇక ఈ చక్రంనకు అధిపతి బుధుడు. ప్రతి ఆలోచననకు, ప్రతీ సంఘటనకు, ప్రతీ మాటకు అతిగా చలించడం, రకరకాల ప్రకంపనాలకు గురికావడంనకు కారణం ఈ బుధుడే. అతిగా చలించే స్వభావం బుధునిది. తీవ్ర ప్రతిస్పందన ఈ గ్రహ లక్షణమే. అందుచే అతి ఆలోచనలును, అతి తెలివిని తగ్గించుకొని, క్రమం తప్పని ధ్యానాబ్యాసం చేస్తూ, స్థిరంగా ఉండగలిగితే ఈ గ్రహం మనకు సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా ఈ చక్రం సక్రమముగా పనిచేస్తుంది.
విశుద్ధిచక్రం : -
ఐం హ్రీం శ్రీం రాం సోహం హంసశ్శివం: విశుధ్యధిష్టానదేవతాయై డాకినీ సహిత జీవేశ్వర స్వరూపిణ్యాంబాయై నమః
ఈ కమలం 16 దళాలుతో ఉంటుంది. ఆకాశతత్త్వం. అధిదేవత డాకిని. ఈమె అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ౠ, ఌ, ౡ, ఎ, ఏ , ఓ, ఔ , అం ,అః అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పాయసాన్నమందు ప్రీతి. తెల్లని ఏనుగు (ఐరావతం) వాహనం.
కంఠప్రదేశం వెనుక వెన్నెముకలో విలసిల్లే ఈ చక్రం మనలో 25,344 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. విశుద్ధి అంటే పవిత్రం (శుద్ధి) చేసేది అని అర్ధం. ఈ చక్రాన్ని సాధిస్తే పరమ పవిత్రులై, ఆత్మదర్శనానికి వున్న అడ్డంకులు తొలగించుకున్నవారై, తాము తెలుసుకున్నదానిని ఇతరులకు చక్కగా బోధించగలరు. ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞానమయకోశంతో సంబంధం. జ్ఞానేంద్రియం చెవి.
ప్రతీ మనిషికి వాక్కు చాలా ముఖ్యమైనది. తనని తాను వ్యక్తపరుచుకోవటానికి వాక్కు చాలా అవసరం. మన సంస్కారమును తెలిపేది వాక్కే. అందుకే పెద్దలంటారు - 'బుర్ర(తల) విలువ నోరు చెప్తుంది' అని! ఊరికే మాట్లాడడం కాదు, చక్కగా మాట్లాడగలగాలి. మృదుభాషణం చక్కటి సంబంధ భాంధవ్యాలను నెలకొల్పుతుంది. పరుషవాక్కులు, వక్రభాషణం ఎన్నో అనర్ధాలను అంటగడుతుంది. మంచి స్నేహాలను, మంచి బంధాలను, సామరస్యవాతవరణం నుంచి దూరం చేస్తుంది. అలానే మాట్లాడకూడని సమయంలో మాట్లాడినా, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోయినా పొందవలసిన జీవితం చేజారిపోయినట్లే. ఇంత ముఖ్యమైన వాక్కుకు కారణం కంఠభాగంలో ఉన్న ఈ విశుద్ధచక్రమే.
ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
ముక్కు, నోరు, గొంతు, చెవులు మున్నగు భాగములకు సంబంధించిన వ్యాధులన్నియూ ఈ చక్రం పరిధిలోనికే వచ్చును. థైరాయిడ్ సమస్యలు వచ్చును. మాటలు సరిగ్గా రాకపోవడం, ఎలర్జీ, ఆస్తమ, టాన్సిల్స్ మొదలైన వ్యాధులు కలుగుతాయి. సంతానలేమికి కూడా ఈ చక్రం కొంత కారణం.
ఈ చక్ర మానసిక స్వభావం:-
మూసుకుపోవడం వలన భావవ్యక్తీకరణలో లోపం. వాక్కులో అనేక అపసవ్యాలు. ఊహాశక్తి లోపిస్తుంది.
తెరుచుకుంటే వాక్సుద్ధి. కవితాశక్తి, స్వర విజ్ఞానం, శాంతచిత్తం, శోకం లేకపోవడం, దీర్ఘాయువు.
విజ్ఞానమయకోశంతో సంబంధం ఉన్న ఈ విశుద్ధచక్రం ద్వంద్వాతీత చక్రం. చైతన్యపూరిత చక్రం. ఇక్కడకు చేరిన సాధకుడు ఆనందస్థితిని పొందుతాడు. ఈ ఆనందపారవశ్యంలో తదుపరి గమ్యాన్ని మరిచిపోకుండా ముందుకు సాగాలి. ఇక్కడే ఆత్మజ్ఞానం కల్గుతుంది. అహం నశిస్తుంది. నేను అనే తత్త్వం పూర్తిగా నశించి, నేను 'ఆత్మ'పరమై నా ఆత్మ అన్న భావం నుండి విశ్వాత్మ భావన లోనికి మారి, సాధకుడు కవి, వాగ్మి, బ్రహ్మజ్ఞాని అవుతాడు. భూత, భవిష్యత్తు, వర్తమానములను దర్శింపగలుగుతారు. జీవించుట తనకోసంకాక సృష్టి యందలి సకల జీవుల రూపంలలో నున్న పరమాత్మకొరకని తెలుసుకొని తదనుగుణంగా జీవిస్తాడు. విశ్వశ్రేయస్సును సాధించువాడగుటచే శోకం గానీ, రోగంగాని లేక చిరంజీవియై యుందురు. ఈ చక్రం శుభమును కోరువారికి, ఇంద్రియనిగ్రహం గలవారికి మోక్షద్వారం.
ఈ చక్రమందు పదహారు దళాల యందు అ నుండి అః వరకు గల పదహారు అక్షరములు పదహారు కళలు. అమావాస్య నుండి పౌర్ణమి వరకు గల చంద్రుని పదహారు కళలే ఈ పదహారు రూపములు. చంద్రుడు మాతృత్వమునకు, గర్భధారణకు అధిపతి. అమావాస్య సృష్టి లయమై యున్న స్థితిని, పౌర్ణమి సృష్టి పూర్తిగా వ్యక్తమైయున్న స్థితిని తెలియజేయును.
మరి ఈ చక్రమును ఎలా శుద్ధిచేసుకోవడం???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు డాకిని అధిష్టానదేవత. ఈమెకు పాయసాన్నం నందు ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే పాయసాన్నం స్వీకరించుచూ, వ్యాధులను బట్టి అవసరమైనచో కొన్ని ఔషదములను ఉపయోగిస్తూ, 'హం' అను బీజాక్షరంను ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు.
ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
నిర్మలమైన నీలాకాశాన్ని చూడాలి. ఈ చక్రంపై మనస్సును నిలిపి ధ్యానం చేస్తూ ఉంటే మనస్సు ఆకాశంవలె పరిశుద్ధం అవుతుంది. నిర్మలమౌతుంది.
ఈ చక్రంనకు అధిపతి కుజుడు. ధైర్య సాహసాలకు సంబంధించిన గ్రహమిది. కుజుడు బాగా వేగం వున్నవాడు. పటుత్వం వున్నవాడు. అగ్నికి, ఆయుధాలకు సంబంధించినవాడు. ఎక్కడ స్థిరత్వముందో, ఎక్కడ కాళ్ళ క్రింద భూమి కృంగిపోతున్నా చలించని ఆత్మవిశ్వాసముందో, ఎక్కడ సూటిదనముందో, ఎక్కడ సమానత్వముందో అక్కడ కుజుని శక్తి అపారంగా వున్నట్లు అర్ధం. మనలో ఈ లక్షణములను అభివృద్ధి పరుచుకుంటే ఈ చక్రం సానుకూలంగా పనిచేస్తుంది. తద్వారా విశుద్ధి చక్రం సానుకూలం.
ఆజ్ఞాచక్రం :-
ఈ కమలం రెండు దళాలుతో వుంటుంది. మనోతత్త్వం. అధిదేవత హాకీని. ఈమె హ, క్ష అను యోగినులచే సేవించబడుచున్నది. ఈమెకు పులిహార ప్రీతి. ఈమె మజ్జాధాతువునకు అధిపతి.
భ్రూమధ్యమందు విలసిల్లే ఈ చక్రం మనలో 3,240 నాడులతో అనుసంధానింపబడి వుంటుంది. ఈ స్థానం మనస్సుకు మనకు సంధానం చేస్తుంది. ఇది ఈ శరీర మనే ఆలయానికి గర్భగుడి ద్వారం లాంటిది.
ధ్యానమను స్థితిచేత ప్రకాశించు ఈ చక్ర కమలమందు రెండు దళాలు కలవని తెలుసుకున్నాం. ధ్యానమనగా ధ్యానింపబడు విషయం, ధ్యానించువాడు అను రెండు మాత్రమే కలిగిన స్థితి. 'హ'కారం, 'క్ష'కారం అను రెండు దళాలతో కూడిన ఈ పద్మం అదే స్థితిని సూచిస్తుంది. ద్యానింపబడు పరమాత్మ, ధ్యానించే జీవాత్మ మాత్రమే వుండే స్థితి. ఈ ధ్యానంను సాధన చేస్తే జ్ఞాననేత్రం తెరుచుకొని ఆత్మదర్శనం అవుతుంది. ఇది సంపూర్ణత్వాన్ని సిద్ధింపజేసే చక్రం. తద్వారా పొందే స్థితి బ్రహ్మత్వపు స్థితి. బ్రహ్మమే తానని తెలుసుకునే స్థితి. ఇక్కడ అన్నింటిని పరిత్యజించి జీవుడు బ్రహ్మభూతుడవుతాడు . సాధకుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు.
'శ్వాస' ప్రక్రియకూ, ఆధ్యాత్మిక శక్తికీ చాలా సంబంధముంది. స్థూలశరీరానికి సంబంధించి లంగ్స్, తద్వారా హార్ట్, బ్లడ్ లో ఆక్సిజన్ సరిపడినంతగా సరఫరా చేయటానికి ఈ శ్వాస ప్రక్రియే ఆధారం. అందులోని వొడిదుడుకులు సరిచెయ్యటానికి, దాని శక్తి యింకా పెంచటానికి ప్రాణాయామం ఎంతో తోడ్పడుతుంది. ఈ శ్వాస వలన వచ్చేశక్తి స్థూలశరీరానికి ఎంత అవసరమో, సూక్ష్మశరీరానికి కూడా అంతే అవసరం. మనం లోపలకు తీసుకునే గాలి మూలాధారం వరకు వెళ్ళి, తిరిగి పైకి వస్తూ స్వాధిష్టాన చక్రంలో చైతన్యం పొంది ప్రాణశక్తిగా, జీవశక్తిగా మారుతుంది. తద్వారా ఇడా పింగళ సుషుమ్నా నాడుల ద్వారా ఆజ్ఞాచక్రంకు చేరుతుంది. ఈ చక్రమే శ్వాస చంచలగతిని అదుపుచేసి క్రమక్రమంగా నిశ్శలం చేసి కైవల్యానికీ, మోక్షానికీ, జీవన్ముక్తికీ కారణమౌతుంది. ఈ చక్రాన్నే దివ్యనేత్రమనీ, జ్ఞానచక్షువనీ అంటారు. అలానే ఈ స్థానాన్నే త్రివేణీసంగమం అంటారు. 'త్రివేణిసంగమం' గురించి మరికొంత వివరణకై ఇక్కడ చూడండి.
ఈ చక్రంనకు పంచకోశాలలో విజ్ఞానమయకోశంతో సంబంధం. శారీరక వ్యవస్థలోని రక్తప్రసరణవ్యవస్థతో సంబంధం.
ఈ చక్రం శక్తివంతంగా లేకపోతే -
రక్తక్షీణత, రక్తస్రావం అను వ్యాధులు సంభవించును. వినాళ గ్రంధులవ్యాధులు, అధిక రక్తపోటు, ప్రేగులలో పుండ్లు లాంటి వ్యాధులు కలుగును.
ఈ చక్ర మానసిక స్వభావం
మూసుకుపోవడం వలన మానసిక స్థిరత్వం లేకపోవటం, కనులలో లోపాలు,క్షమాగుణం లేకపోవటం, నిరాశ నిస్పృహలతో కూడిన అలసట, అన్ని విషయాలయందు సందేహస్పదులు.
తెరుచుకుంటే మనసులో, దృష్టిలో స్థిరత్వం, ఏకాగ్రత వుంటుంది. సూక్ష్మ బుద్ధి అలవడుతుంది. వివేకానికి మూలమై సత్యాన్ని గ్రహించమని నిర్దేశిస్తుంది. ఆధ్యాత్మికమైన శక్తి, ఆలోచన, అంతరదృష్టిలను పెంపొందిస్తుంది. నీటియందు మంచుగడ్డ కరిగిపోయినట్లు 'నేన'ను అహం అంతర్యామి యందు కరిగిపోవును.
ఈ చక్రమును శుద్ధిచేసుకోవడం ఎలా???
శాస్త్రప్రకారం పరిశీలిస్తే -
ఈ చక్రంనకు హాకీని అధిష్టానదేవత. ఈమెకు పులిహార మందు ప్రీతి. ఈ చక్రం బలహీనంగా వుంటే పులిహారను స్వీకరించుచూ, వ్యాధులను బట్టి అవసరమైనచో తగు ఔషదములను ఉపయోగిస్తూ 'ఓం' అను బీజాక్షరమును ధ్యానించువారికి ఈ వ్యాధులు నివారణ కాగలవు. ఓంకారం వేదమునకు మొట్టమొదటి బీజం.
ఈ చక్రంలో జాగృతి తీసుకురావాలంటే -
నియంత్రణతో కూడిన భావనలు చేయడం అవసరం. ధారణ, ధ్యానం ఇందుకు ఉపకరిస్తుంది.
ఈ చక్రమునకు అధిపతి గ్రహం చంద్రుడు. మనిషి మానసిక స్థితికి, ధన సంపాదనకు చంద్రుడు కారకుడు. చంద్రుడు ఎప్పుడూ ఒకేలా వుండడు. వృద్ధి క్షయాలు కలిగినవాడు. అందుకే జాతకంనందు చంద్రుడు సరిగ్గా లేకుంటే చంచల స్వభావం కలిగి వుంటారు. చంద్రుడు నీటికి కారకుడు. అందువల్ల మంచినీరు ఎక్కువగా త్రాగాలి. అలాగే చంద్రుడు తెలుపువర్ణమునకు సంకేతం కావున సాధ్యమైనంతవరకు తెలుపురంగు వస్త్రాలు ధరించడం, ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు వుండేలా అభ్యాసం చేయడం, మృదువుగా మసులుకోవడం చేస్తే చంద్రానుగ్రహం సాధించినట్లే. తత్ఫలితంగా ఆజ్ఞాచక్రం సానుకూలంగా పనిచేస్తుంది.
చక్ర విజ్ఞానము - విశ్లేషణ :ఆజ్ఞా విశుద్ధి చక్రములు సత్వగుణమునూ, అనాహతం మణిపూరక చక్రములు రజోగుణమునూ, స్వాధిష్టానం, మూలాధార చక్రములు తమోగుణమును వ్యక్తం చేయును.
తమోగుణం దేహధాతువుల నిర్మాణమునకు, వానియందలి రసాయనిక మార్పులకు ఆధిపత్యం వహించడమే కాకుండా భౌతికదేహ నిర్మాణం కూడా దీని ప్రవృత్తియే.
రజస్సు వలన శరీరం నందలి వివిధ అవయములు పనిచేయుచున్నవి. ఇక సత్వం వలన గ్రహణశక్తి, వివేకం, విచక్షణ, విమర్శన మున్నగు లక్షణములు మేల్కొనును. ఈ మూడును మూడు లోకములుగా అంటే, భూలోకం (తమస్సు), భువర్లోకం (రజస్సు), సువర్లోకం (సత్వం)లుగా మనదేహంనందునూ, సౌరమండలం నందునూ ఏర్పడుచున్నవి.